త్యాగం

9
4

[dropcap]“గు[/dropcap]రుమూర్తికి యాక్సిడెంటైతే ఆసుపత్రిలో చేర్పించి వచ్చానోయ్! అందుకే లేటయ్యింది. ఈ రోజు ఎలాగూ సినిమాకి వెళ్ళడం కుదర్లేదు. రేపు తప్పనిసరిగా వెళదాం లే!” అని వనజకు నచ్చచెబుతున్నాడు నర్సింగరావు.

“రోజూ.. ఇలాగే ఏదో సాకు చెప్పుకొని తప్పిస్తున్నారు” అని కొంగు విసరి చిరాగ్గా వంటింట్లోకి వెళ్ళింది వనజ.

నర్సింగరావు నిరుద్యోగి. నాన్నమాట కాదనలేక దగ్గర సంబంధం పిల్లని పెళ్ళి చేసున్నాడు. అప్పుడే ఇద్దరు పిల్లలు. పాపకు పోలియో వచ్చి అంగవైకల్యంతో బాధ పడుతోంది. బాబుకు 9 నెలలు. నర్సింగరావు వాళ్ళ నాన్న హయ్యర్ గ్రేడ్ టీచర్.

మే నెలలో మంచి ముహూర్తులున్నాయని బి.ఏ. ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాస్తున్న సమయంలోనే నర్సింగరావుకు పెళ్ళి చేసేసాడు అప్పన్న మాస్టార్. దానితో నర్సింగరావు పదేళ్ళైనా డిగ్రీ పాసవ్వకలేక పోయాడు. ఖాళీగా ఉండడమెందుకని ఓ చిన్న కంపెనీలో గుమస్తాగా చేరాడు నర్సింగరావు.

“మనకున్నది ఒకే ఒక్క కొడుకు కదండీ. వాడికా పెళ్ళి చేసేశాం. వాడికి 32 సంవత్సరాలు వచ్చేసాయి. ప్రభుత్వ ఉద్యోగాలు అప్పుడే రావాయె. అవి వచ్చేసరికి మన వాడికి ఏజ్ బారవ్వడం ఖాయం” అని ఆదిలక్ష్మి భర్త అప్పన్న మాస్టార్‌తో అంది.

“అలా అని మనమేం చెప్పగలం. వాడి నుదుట రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ముప్పై ఒక్క సంవత్సరం లోగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే యోగం వుంటే అలాగే వస్తుంది. ఆ యోగం ఎప్పుడుంటే అప్పుడే వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం” అని కర్మ సిద్ధాంతం చెప్పాడు అప్పన్న మాష్టార్.

గ్రంథాలయానికి వెళ్ళి తిరిగి ఇంటికొస్తూ లక్ష్మణరావుతో ఏవేవో కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నాడు అప్పన్న మాస్టార్. ఇంట్లో నర్సింగరావు – నాగేశ్వరరావు ఎదురెదురుగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు.

వీధిలో తిరిగి తిరిగి ఇంటికొచ్చాడు అప్పన్న మాస్టార్.

“నమస్కారం మాస్టారు” అంటూ చేతులు జోడించాడు నాగేశ్వరరావు.

“నువ్వూ.. రాఘవ మాస్టార్ గారి అబ్బాయివి కదూ?” అన్నాడు అప్పన్న మాస్టారు.

“అవునండీ..!”

“మీ నాన్నగారు బాగున్నారా?”

“ఆ.. ఏం బాగూ. బి.పీ., షుగర్ పెరుగుతున్నాయి. దానికితోడు పక్షవాతం కూడా వచ్చింది. పెద్ద డాక్టర్లుకు చూపించాం. మందులు వాడుతున్నారు. ఇప్పుడు ఫర్వాలేదు. బాగానే ఉన్నారు.”

మధ్యలో నర్సింగరావు జోక్యం చేసుకొని “వాళ్ళ నాన్నగారు రిటైర్ అవ్వడానికి ఐదేళ్ళు ముందుగానే వాలంటరీ రీటైర్మెంట్ తీసుకున్నారు. హాయిగా ఇప్పుడేమో నాగేశ్వరరావుకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది” అన్నాడు నర్సింగరావు.

“కాఫీ పట్రా లక్ష్మీ” అన్నాడు అప్పన్న మాస్టార్. “క్షణంలో తెస్తా” నంటూ వంటింట్లోకి వెళ్ళింది ఆదిలక్ష్మి.

కాఫీ త్రాగి వెళ్ళొస్తానంటూ వెళ్ళిపోయాడు నాగేశ్వరరావు. ప్రతి రాత్రి నిద్ర పోయే ముందు కొన్ని విషయాలు ముచ్చటించు కోవడం ఆదిలక్ష్మి – అప్పన్న మాస్టార్ దంపతులకు అలవాటు.

“ఆ రోజు రాఘవ మాస్టర్ గారబ్బాయి నాగేశ్వరరావు మనింటికొచ్చి వెళ్ళిన రోజు నుండి మన అబ్బాయిలో ఓ చిన్న మార్పు గమనించాను నేను.. నువ్వు గమనించావా లక్ష్మీ”

“ఏమో నేను గమనించనే లేదు.. ఏంటండి ఆ మార్పు?” అని భర్తని అడిగింది ఆదిలక్ష్మి.

“రాఘవ మాస్టారు గారు ఐదేళ్ళ ముందే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకుని ఏకైక పుత్రుడికి ఉద్యోగం వచ్చేలా చేసుకున్నారు. మరి నేను ఉద్యోగం పట్టుకొని ఊగులాడుతున్నానని వాడు అనుకుంటున్నాడేమోనని నేను అనుకుంటున్నాను” అని అప్పన్న మాస్టారు అన్నాడు.

“చాల్లేదురూ అన్నీ మీరు పెడర్థాలు తీసి మాట్లాడతారు” అంది ఆదిలక్ష్మి.

“ఓసీ వెర్రి మొహమా.. నీకు తెలీదే వాడి మనస్సులోని మాట”

“ఐతే మరిప్పుడేం చేస్తారు. సమయం దాటిపోయింది. నెల రోజుల్లోనే మీరు రిటైర్ అయిపోతారు. ఆ రిటైర్మెంటేదో ఐదేళ్ళు ముందే జాబ్ రిజైన్ చేసి వుండాల్సింది. జరిగిపోయిన దాని గురించి అంతగా ఆలోచించి బుర్రపాడు చేసుకోకండి. మాట్లాడకుండా నిద్రపొండి” అనేసి నిద్ర పోయింది ఆదిలక్ష్మి.

కానీ అప్పన్న మాస్టార్ గారికి మాత్రం నిద్రరాలేదు. తీవ్రంగా ఆలోచనలు మెదడుపై దాడిచేస్తున్నాయి.

***

“ఏమండీ శివరాత్రికి ఆడపిల్లని, అల్లుణ్ణి తప్పకుండా రమ్మని ఉత్తరాలు రాయండి” అని భర్తతో చెప్పింది ఆదిలక్ష్మి.

“అలాగే రాస్తానులే” అంటూ వీధిలోకి వెళ్ళిపోయారు అప్పన్న మాస్టారు.

“తాగిన మైకంలో తల్లినే చెరిచాడు, భార్యని నరికాడు, తాగిన మత్తులో పిల్లల్నే నరికాడు” అన్న వార్తలు చదవిన ప్రజలు మధ్య నిషేధం జరిగితే బాగుండేదని భావించారు. ఆ మేరకు ఉద్యమం లేవడం దాంతో మధ్య నిషేధం ప్రభుత్వం విధించింది. సంతోషించదగ్గ విషయమే” అన్నాడు సూర్యం.

“కానీ ప్రభుత్వం ఖజానా ఖాళీ అయ్యి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రభుత్వం కూరుకుపోతోంది కదా మరి అలాంటప్పుడు అధిక రాబడి వచ్చే.. సారాను నిషేధిస్తే.. ప్రభుత్వం నడపడం కష్ట, అందుకే.. సారా నిషేధం ఎత్తివేస్తే అధిక ఆదాయం వచ్చి ప్రభుత్వం నడపడం సాధ్యపడుతుంది” అని కిరణ్ అన్నాడు. (1995న సంపూర్ణ మధ్య నిషేధం అమలు) ప్రభుత్వం నిషేధించక పూర్వం ఆర్థిక ఇబ్బందుల్లో వుండేదని గత చరిత్ర రుజువు చేస్తుంది” అన్నాడు సూర్యం. ఆ మాటకు సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు కిరణ్.

***

“కాలింగ్ బెల్ కొట్టింది ఎవరు?” అంటూ తలుపులు తెరవడానికి వచ్చింది ఆదిలక్ష్మి.

అల్లుడు, కూతురు, ఇద్దరు మనవళ్ళు.. ఎదురుగా నిలబడ్డారు. అందర్నీ పకలరించి లోపలికి రమ్మని ఆహ్వానించింది. ఆదిలక్ష్మి.

“స్నానాలు చెయ్యండి భోజనాలు పెడతాను” అని వంటింట్లోకి వెళ్ళింది ఆదిలక్ష్మి, అప్పన్న మాస్టారు వీధిలోకి వెళ్ళి ఇంటికొస్తుండగా వాళ్ళ ముగ్గురు చెల్లెళ్ళు ఎదురైనారు. వాళ్ళని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకెళ్ళారు అప్పన్న మాష్టారు.

ఇంతలో నర్సింగరావు వాళ్ళ మామయ్య, అత్తయ్య వాళ్ళు, ముగ్గురు బావమర్దులు వచ్చారు. చుట్టాలంతా కల్సి డజను మందయ్యారు.

గ్రామంలో బాలనాగమ్మ బుర్రకథ ఒక రోజైతే, బొబ్బిలి యుద్ధం బుర్రకథ మరో రోజు. ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేశారు గ్రామ పెద్దలు. ప్రతీ ప్రోగ్రామ్‌కు తప్పకుండా వెళ్ళేవారు అప్పన్న మాస్టారు.

వచ్చిన చుట్టాలు అందరూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోదామని సిద్ధమవుతున్నారు.

ప్రతి రోజూ ఎవరూ లేవక ముందే వేకువజామున 4 గంటలకే లేచి ఆసనాలు వేసుకొని కాలకృత్యాలు తీర్చుకునేవారు అప్పన్న మాస్టారు.

నర్సింగరావు మరియు కుటుంబ సభ్యులు లేచి ఎవరు పనుల్లో వాళ్ళు నిగమ్నమైనారు. ఇంతలో “ఏవండీ..! లేవండీ.. బారెడు పొద్దెక్కింది ఇంకా నిద్ర లేవరేమి..!” అంది ఆదిలక్ష్మి. అప్పన్న మాస్టారు పలకలేదు ఉలకలేదు, కదలలేదు.

“ప్రతీ రోజూ.. నిద్రపోకుండా ప్రోగ్రామ్స్‌కు వెళ్ళడమెందుకు బారెడు పొద్దిక్కిన వరకూ పడుకోవడమెందుకో..” అంది ఆదిలక్ష్మి.

“అన్నయ్యా!.. అన్నయ్యా!.. వెళ్ళొస్తాం” అని పిలుస్తున్నారు అప్పన్న మాస్టారు చెల్లెళ్ళు. అయినా పలకలేదు.. అప్పన్న మాస్టారు.

కుటుంబ సభ్యులు, చుట్టాళ్ళు అందరూ అప్పన్న మాస్టారు నిద్రపోతున్న మంచాన్ని సమీపించి నిద్రపోతున్న అతన్ని లేపడానికి ప్రయత్నించారు. అయినా లేవలేదు అప్పన్నమేస్టారు.

నోటినుంచి నురగలు వస్తున్నాయి. అందరూ ఘోల్లుమని ఏడ్చారు. ఎదురింట్లో వున్న జగన్ గబగబా వచ్చి “ఏం జరిగింది” అడిగాడు.

“మా నాన్నగారు లేవలేదండి. నోట్లోంచి నురగలు, నీరు వస్తోంది” అని ఏడుస్తూ చెప్పాడు నర్సింగరావు. వెంటనే ఆటో డ్రైవర్‌కు కాల్ చేసి హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు.

డాక్టర్ వినయ్ వచ్చి “మీరంతా తప్పుకోండి..! ముందు మీరంతా ఏడుపులు ఆడండి. అందరూ బయటకి వెళ్ళండి” అని చెప్పారు.

అప్పన్న మాస్టార్‌ని తనిఖీ చేసిన డాక్టర్ ‘ఇతణ్ణి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళమ’ని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పన్న మాస్టార్‌ని ప్రభుత్వ ఆసుప్రతికి తీసుకెళ్ళారు.

డాక్టర్ తనిఖి చేస్తూ మరోవైపు “ఇతని భార్య ఎవరు” అడిగారు.

“నేనేనండీ అంటూ” ఏడుస్తూ డాక్టర్ ముందు నిలబడింది ఆదిలక్ష్మి.

“రాత్రి పడుకోబోయేముందు ఏం పెట్టావు? ఏమన్నా గొడవాడుకున్నారా!” అని అడిగాడు డాక్టర్.

“ఏ గొడవలూ పడలేదు”

“రాత్రి అన్నం ఎవరు పెట్టారు”

“నేనేనండీ”

“ఏంటి వడ్డించావు?”

“గారెలు, కోడిమాంసం తిన్నారు”

ఇంతలో అప్పన్న మాస్టార్ ఆసుప్రతి పైకప్పు ఎగిరి పోయేలా పెద్ద పెద్ద కేకలు పెడుతున్నారు. మతిభ్రమించిన వాడిలా ప్రవర్తిస్తూ, చుట్టుపక్కలవార్కి లెంపకాయలిస్తున్నాడు అప్పన్న మాస్టారు.

అదేదో ఇంజక్షన్ ఇచ్చారు డాక్టర్.. దాంతో ప్రశాంతంగా నిద్రపోయాడు అప్పన్న మాస్టార్. వాళ్ళ స్కూల్ హెడ్మాస్టార్ వచ్చారు. అప్పన్న మాస్టారు జేబు తడిమారు. ఏదో రాసి వుంచిన లెటర్ ఉంది. ‘నాకు గుండెలో నొప్పి వస్తూంది. అందువల్ల నేను స్కూల్‌కి రాలేను. 3 రోజులు సెలవ్ ఇప్పించ’మని లీవ్ లెటర్‌‌లో రాసి ఉంది. అందరూ చదివారు.

మూడు రోజుల్లో కోలుకున్నారు. ఇంటికి తీసుకొచ్చారు.

“నన్నెందుకు బ్రతికించారు.. నేను రిటైర్ అవడానికి కేవలం ఆరు రోజులే ఉంది. ఈలోగా నేను చనిపోతే నా కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చివుండేది. అందుకనే నేను స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నాను. కానీ మీరేమో నన్ను బ్రతికించారు. ఎంత దురదృష్టవంతుడు నా కొడుకు” అని ఏడ్డాడు అప్పన్న మాస్టార్.

“ఆపండి నాన్న ఆపండి. త్యాగానికి కూడా ఓ హద్దు ఉంటుంది” అన్నారు నర్సింగరావు. ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు.

“ఎంత పని చేశారండీ.. వాడికి ఉద్యోగం రాకపోతే ఏదో వ్యాపారం చేసుకొని వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. వాడి కోసమని నన్ను ఒంటరిదాన్ని చేసి మీరొక్కరే వెళ్ళిపోతారా.. నన్ను కూడా తీసుకుపొండి.. మీతోనే తీసుకుపొండి.” అని ఆవేశంగా ఏడ్చింది ఆదిలక్ష్మి,

‘ఇంకెప్పుడు ఇటువంటి పని చెయ్యనని నాకు మాటివ్వండి’ అని అప్పన్న మాస్టార్ కూతురు, కొడుకు అడిగారు. అప్పన్న మాస్టార్ చేతిని వాళ్ళ పిల్లల ఒక్కక్కరి చేతిలో చేయివేసి మాటిచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here