[ములుగు లక్ష్మీ మైథిలి గారు రచించిన ‘త్యాగమూర్తులు’ అనే కథ అందిస్తున్నాము.]
[dropcap]మ[/dropcap]ల్లిక చాలా సేపటి నుండి ఎదురు చూస్తోంది. ‘రమేష్ ఎప్పుడూ ఇంతే.. చెప్పిన టైంకి రాడు. ఒక్కదాన్ని రోడ్డుమీద నిలబడాలంటే విసుగ్గా ఉంది. ఎప్పుడైనా పదినిమిషాలు, పావుగంటలో వచ్చేవాడు. ఈరోజు అరగంట దాటుతున్న రావటం లేదు.’ అనుకుంటూ రమేష్ కోసం ఎదురు చూస్తోంది మల్లిక.
దారిలో వెళ్లే పోకిరీలు ‘హాయ్ డాళింగ్ ఎవరి కోసం.. నీ లవర్ కోసమా.. పోనీ వాడు వచ్చేదాకా మేం కంపెనీ ఇవ్వమంటావా’ అంటూ చేసే వెధవ కామెంట్లు, చెత్త డైలాగ్స్ విని, విని ఒళ్ళంతా కంపరం ఎత్తుతోంది. ఇక ఉండలేక రమేష్‌కు ఫోన్ చేసింది. “ఎక్కడ ఉన్నా రమేష్ ఎంతసేపు వెయిట్ చేయాలి? నేను వచ్చి గంట సేపు అయింది. ఇక నావల్ల కాదు. కాళ్లు లాగుతున్నాయి. ఇక్కడ ఆకతాయిల వేధింపులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడుతున్నారు. కొందరైతే నన్ను అదోలా చూస్తున్నారు. నువు రావటానికి ఇంకా ఎంతసేపు పడుతుంది?.” అంటూ దాదాపు అరుస్తున్నట్లు మాట్లాడింది మల్లిక.
“మల్లీ! సారీ రా నిన్ను వెయిట్ చేయించాలని నా కోరిక కాదు. ఉన్నట్లుండి అమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్‌కు తీసుకువచ్చాను. అందుకే లేటయ్యింది. ఈ రోజు నేను రాలేను. ఏమీ అనుకోవద్దు బంగారం. నువు ఇంటికి వెళ్ళు అమ్మ కోలుకుని ఇంటికి రాగానే నిన్ను కలుస్తాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో” అంటూ ఫోన్ పెట్టేసాడు రమేష్.
అప్పటివరకు ఎంతో ఆవేశంగా ఉన్న మల్లిక కోపం చప్పున చల్లారిపోయింది. ‘అయ్యో ఇంత ఇబ్బంది ఉంది కనుకనే నాకు ఫోన్ చేయలేదు. పాపం తను కూడా నా గురించి ఆలోచించి ఉంటాడు. అనవసరంగా కోప్పడ్డానేమో’ అనుకుంటూ ఇంటికి బయలుదేరింది మల్లిక.
ఇంటికి వచ్చింది అన్న మాటే కానీ, మనసంతా రమేష్ మీదే ఉంది. సరిగ్గా రెండేళ్ల క్రితం బిర్లా మందిర్ దగ్గర ఇదే రోజు కలిశారు. ఆ ఆనందం పంచుకోవాలని వెళ్ళింది. రమేష్ మొదటి సారి చూసింది అక్కడే. ఆ రోజు సాయంత్రం దర్శనం చేసుకొని దిగి వస్తూ మెట్ల మీద కాలు స్లిప్ అయి పడి పోతున్న సమయంలో.. అతను వచ్చి పట్టుకున్నాడు.
ఆ సమయంలో కలిసిన చూపులు మళ్లీ విడిపోలేదు. అతను ఎవరో.. ఏమో? ఎక్కడి నుంచి వచ్చాడో? కానీ.. ఆ రోజు నుంచి ప్రతిరోజు రమేష్ తో మాట్లాడందే తోచేది కాదు. నిజానికి ఏ ఆడపిల్లైనా ఎంతో ప్రేమగా చూసే మగవాడిని, బాధ్యతగా ప్రవర్తించే ప్రేమికుడినే కోరుకుంటుంది. అతనే తన భర్త అయితే ఇంకా సంతోషిస్తుంది. అలాంటిది ఈ రోజు రమేష్ మాట్లాడక పోయేసరికి మల్లికకు ఏదో దిగులు.
‘రమేష్ అమ్మగారు త్వరలో కోలుకుని ఇంటికి వస్తే పెళ్లి విషయం మాట్లాడాలి.’ అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది మల్లిక.
ఉదయం ఫోన్ కాల్ రావడంతో మెలకువ వచ్చింది. స్క్రీన్ మీద ‘రమేష్’ పేరు చూడగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసింది.
“మల్లికా! సారీ రా.. నిన్న రాలేకపోయాను. నిన్ను అనవసరంగా వెయిట్ చేయించాను. నీకు ఫోన్ చేసేటంత టైం లేకపోయింది.. నీకు తెలుసు కదా నాన్న చిన్నప్పుడే పోవటంతో అన్నీ అమ్మే చూసుకుంది. ..నన్ను పెంచి పెద్ద చేసింది. అక్కడా, ఇక్కడా పని చేసి చదివిస్తోంది. నేను తప్ప అమ్మకు ఎవరూ లేరు. అమ్మ ఇంటికి రాగానే నిన్ను కలుస్తాను. ఐ మిస్ యూ రా” చెప్పాడు దిగులుగా.
“ఇందులో సారీ చెప్పాల్సిన అవసరం లేదు రమేష్. అమ్మకు బాగా లేదు. ఆ పరిస్థితిలో నువ్వు అమ్మ దగ్గరే ఉండాలి. అమ్మకోసం నువ్వు ఎంత తల్లడిల్లి పోతున్నావో నాకు తెలుసు.
ఆమె ఆరోగ్యం గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే, నువ్వు ఎంత మంచివాడివో కూడా తెలుస్తోంది. అమ్మను గౌరవించేవాడే భార్యను ప్రేమిస్తాడు. ఐ మిస్ యూ టూ.. ఆవిడకి తగ్గాకే కలుద్దాం. సీ యూ బై” అంటూ ఫోన్ పెట్టేసింది మల్లిక.
***
వారం రోజుల తర్వాత ఒక రోజు మల్లికను కాలేజీ క్యాంపస్‌లో కలిసాడు రమేష్.
“మల్లికా! ఈ ఇయర్ మన ఇద్దరికీ బీ.టెక్. అయిపోతుంది కదా నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు?”
“ఊ.. పెళ్లి చేసుకుందాం.” అంది చిలిపిగా.
“అలాగే! కానీ.. ఈ విషయం ముందు మీ అమ్మ నాన్నలను అడుగు. నేను మా అమ్మను అడుగుతాను. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే ఒప్పించే పెళ్లి చేసుకుందాం. ఈలోగా నేను నా కాళ్ళ మీద నిలబడటానికి ఉద్యోగం సంపాదించుకుంటాను” చెప్పాడు రమేష్.
“ఓకే రమేష్.. మంచి మాట చెప్పావు. అదే ఇంకొకరైతే లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనేవారు. అయినా అమ్మ, నాన్న లను అడిగి చూస్తాను. నువు జాబ్ సెర్చింగ్‌లో ఉండు.. ఆల్ ది బెస్ట్.” అంటూ.. వెనుదిరిగి ఒకసారి రమేష్‌ను చూసి ఇంటికి వెళ్ళిపోయింది మల్లిక.
రమేష్ కూడా.. మల్లిక వెళ్లిన వైపు చూస్తూ నిలబడిపోయాడు.
***
“ఏంటీ.. కులం తక్కువ వాణ్ణి చేసుకుంటావా!? నీకు మతిపోయిందా?.. నిన్ను అమెరికాలో ఉన్న నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లిచేయాలనుకుంటున్నాను” ఆవేశంగా అంటున్నాడు మల్లిక తండ్రి.
అక్కడే నిలబడి ఉన్న తల్లి ఏమీ మాట్లాడలేకపోతుంది. భర్త గురించి తనకు తెలుసు. కానీ ఈ కాలం అందరూ కలిసి పోయారు. కులమేదైనా పిల్లలు అన్యోన్యంగా ఉంటే చాలనుకునే మనస్తత్వం ఆమెది.
మల్లిక ఈ విషయం వెంటనే రమేష్‌కు మెసేజ్ చేసింది.
“డోన్ట్ వర్రీ” అని తిరిగి రిప్లై ఇచ్చాడు రమేష్.
***
రెండు నెలల తర్వాత తర్వాత ఒక గుడిలో కలుసుకోవాలని మల్లికకు ఫోన్ చేసి అన్నీ వివరంగా చెప్పాడు రమేష్.
ఆరోజు సాయంత్రం వేంకటేశ్వర స్వామి వారి ఆలయానికి తన తల్లిని తీసుకుని వచ్చాడు రమేష్.
మల్లిక కూడా రమేష్ కోసం.. అమ్మ నాన్నలతో ఆ గుడిలో ఒక అరుగు మీద కూర్చుని ఉంది.
రమేష్.. మల్లిక తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు.
“నమస్తే! నా పేరు రమేష్. నేను మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుకున్నాం. నాలుగేళ్ళుగా ప్రేమించుకుంటున్నాం.. అయినా ఏనాడూ హద్దులు దాటలేదు. ఏ సినిమాలు , పార్కులకు వెళ్లలేదు. మా భవిష్యత్తు కోసం కష్టపడి చదివి డిస్టింక్షన్‌లో వచ్చాము. కావాలంటే మీరు మా కాలేజీలో ఎంక్వయిరీ చేసుకోవచ్చు.
మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాము. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాను.” అని రమేష్ చెపుతున్నా.. మల్లిక తండ్రి దగ్గర నుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో మల్లిక వైపు తిరిగి “వెళ్ళి వస్తాను మల్లికా. మీ నాన్న చూసిన సంబంధం చేసుకో” అంటూ వెనుదిరిగాడు రమేష్.
“బాబు రమేష్! ఒక్క క్షణం ఆగు. నీ గురించి కాలేజీలో ఎంక్వయిరీ చేసాను.. నువ్వు ఎంత మంచివాడివో, నీ ఫ్రెండ్స్, ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు చెప్పారు. మీరు ఇద్దరూ మెరిట్ స్టూడెంట్స్, బెస్ట్ రీడర్స్ అని కూడా చెప్పారు. మీరు కలిసి తిరగడం ఎక్కడా చూడలేదని చెప్పారు. నేను మూర్ఖుడిని.. నా మేనల్లుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నా. ఇంతలో మల్లికకు ఆక్సిడెంట్ అవటంతో కాలు విరిగింది. కొన్నాళ్ళకి నడిచినా కాలు వంకర ఉంటుందని డాక్టర్ చెప్పాడు. ఈ విషయం మా అల్లుడికి చెపితే ఈ అవిటిపిల్ల తనకు అక్కర్లేదు అని చెప్పాడు.” అని చెపుతున్నాడు.
అతను మాట పూర్తి చేసేలోగా.. రమేష్ మల్లిక దగ్గరకు పరుగెత్తుకుని వచ్చాడు.
“ఏమైంది మల్లిక! ..ఎలా జరిగింది?” అని అడుగుతున్న రమేష్‌ను చూసి.. మల్లిక తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇతను కూడా తన కూతురిని వద్దనుకుని వెళ్లిపోతాడనుకున్నాడు.
“కొన్నాళ్ళ క్రితం గుడి దగ్గర ఒకసారి పడిపోయాను. నువు జాబ్ రీసెర్చ్ లోనూ, అమ్మ ట్రీట్మెంట్ కోసం తిరుగుతూ ఉంటే నిన్ను టెన్షన్ పెట్టటం ఎందుకనీ ఇన్నాళ్లు నీకు చెప్పలేదు. పైగా నన్ను చూసుకోవటానికి అమ్మ నాన్న ఉన్నారు. కానీ మీ అమ్మకు నువ్వు తప్ప ఎవరూ లేరు కదా.”..అని చెపుతున్న కూతురిని చూసి..
తండ్రి కూతురి తలమీద చెయ్యేసి.. “మల్లీ! మీరు నిజమైన ప్రేమికులు. మీ తల్లితండ్రుల కోసం చిన్నావారైనా.. మీరు ఒకరికోసం ఒకరు త్యాగం చేసుకునే త్యాగమూర్తులు. ఇపుడు ప్రేమించలేదని ఒకరినొకరు చంపుకునే వాళ్ళు, పెద్దలకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళి పోయేవాళ్ళు ఉన్న ఈ కాలంలో, కన్నవారి కోసం.. ప్రేమించిన వారిని వదులుకునే నిస్వార్థ ప్రేమికులు. నేను ఇంకా కులం మతం అంటూ గిరిగీసుకుని బతుకుతున్నాను. మీ ఇద్దరికీ పెళ్లి చేసి నా బాధ్యత నెరవేరుస్తాను.” అంటూ ఇద్దరినీ దగ్గరకు ప్రేమగా తీసుకున్నాడు మల్లిక తండ్రి.
ఆ సంతోషకరమైన వార్త విని ఇద్దరు తల్లులు ఎంతగానో సంతోషించారు.