Site icon Sanchika

మామూలు అపరాధపరిశోధన నవలల కన్నా ఒక మెట్టు పైన ఉన్న నవల – ‘ఉచ్చు’

[box type=’note’ fontsize=’16’] స్వాతి వారపత్రిక నిర్వహించిన నవలలో పోటీలలో లక్షరూపాయల బహుమతి పొంది ధారావాహికగా ప్రచురితమైన కె. కె. భాగ్యశ్రీ నవల ‘ఉచ్చు’ను సమీక్షిస్తున్నారు నండూరి సుందరీ నాగమణి.[/box]

[dropcap]ఇ[/dropcap]టీవలి కాలంలో నేను చదివిన ఒక ఉత్కంఠాభరితమైన నవల ‘ఉచ్చు’. ఇదివరలో చాలా అపరాధపరిశోధక నవలలు చదివినా కానీ అప్పుడెప్పుడూ కలగని తృప్తి ఈ నవల చదివిన తరువాత కలిగింది నాకు.

సీరియల్‌గా వస్తున్నపుడు కొన్ని భాగాలు మిస్ అవటం వలన రెగ్యులర్‌గా చదవలేకపోవటం వలన అన్ని భాగాలూ ఒకేసారిగా నిన్న కూర్చుని చదివాను. ఆపకుండా చదవటానికి రెండున్నర గంటల సమయం పట్టింది. ఈ మధ్యకాలంలో ఇంతసేపు ఏకబిగిని నేను చదవలేదు. కానీ చదివిన తరువాత కలిగిన సంతృప్తి ముందు శ్రమ తెలియలేదు.

ఈ నవలంతా మీరు కూడా చదివే ఉంటారు కదా. అంచేత నేను కథంతా ప్రస్తావించకుండా ముఖ్యమైన కొన్ని అంశాలను మాత్రం స్పృశిస్తాను.

‘సత్యకుమార్’ అనే పేరుగల పారిశ్రామికవేత్త హత్య విషయంలో ఇన్స్పెక్టర్ ధనుంజయ్ అనే సబ్ ఇనస్పెక్టర్ మొదలుపెట్టిన దర్యాప్తుతో కథ ప్రారంభం అవుతుంది. ఈ కథలో ధనుంజయ్ పాత్ర చాలా చక్కని సంస్కారవంతమైన భాష, నడవడికతో సాగుతుంది. అతడికి స్త్రీలంటే ఎంతో గౌరవభావం. వారిని కించపరచేలా మాట్లాడటం కాదు కదా, ఆలోచన కూడా చేయడు. చివరికి హతుడైన సత్యకుమార్ ప్రియురాలు కాంతి పాత్రతో సహా… ఆమె మీద కూడా మనకు గౌరవభావమే కలుగుతుంది  (సాధారణంగా రక్షకభట ఉద్యోగులు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా). బహుశా రచయిత్రికున్న సంస్కారమే ఆమె నవలలోని ముఖ్యపాత్రకూ వచ్చి ఉంటుంది.

ఇక హతుడైన సత్యకుమార్ పాత్ర అతడు చనిపోయినా కానీ, నవల చదువుతున్నంతసేపూ మనతోనే ఉంటుంది. అతడి అలవాట్లు, మాటలు, అభిరుచులు, చివరికి బలహీనతలను కూడా రచయిత్రితో పాటుగా మనమూ ప్రేమిస్తాము. ఎందుకంటే అతడి బలహీనతలను రచయిత్రి తక్కువచేసి మాట్లాడలేదు. అది ఒక మానసిక దౌర్బల్యం అంటుంది. సౌందర్యారాధకులకు బలహీనతలు సహజమని మనమూ ఒప్పుకుని తీరతాము నవల చదువుతున్నంతసేపూ. అతడు తన ఫ్యాక్టరీ/ఆఫీసులో, గెస్ట్ హౌస్ చుట్టూ పెంచిన తోట అతడి సౌందర్యారాధనకు ప్రతీక అని రచయిత్రి చెప్పినపుడు మన మనో చక్షువులకు ఆ అందమైన తోట కనపడుతుంది.

వైశాలి పాత్ర. భర్తను ప్రాణప్రదంగా ప్రేమించిన ఒక భార్య. తన భర్త జీవితంలో మరొక స్త్రీ ఉన్నదని తెలిసినా దాన్ని స్వీకరించగలిగిన స్త్రీ, తన భర్త  హంతకుడిని/హంతకురాలిని కనిపెట్టి వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష పడాలని ఆరాటపడుతుంది. ఆ ఆరాటమే ఈ కథకు నాంది. సుహాసిని – అందానికి నిర్వచనం. భావుకురాలైన రచయిత్రి సుహాసినిని, వైశాలినీ, కాంతినీ వర్ణించిన తీరు అసామాన్యం. లెక్చరర్ ఉద్యోగం చేస్తూ, కూతుర్ని ఎంతో చక్కగా పెంచుతున్న సుహాసినికి భర్త తేజస్విపైన కల అనురాగం అపారం. దాన్ని రచయిత్రి ఎంతో బాగా చెప్పారు. అలాగే అంతటి ప్రేమమూర్తిని పోగొట్టుకున్న సుహాసిని దుఃఖాన్ని కూడా కళ్ళకు కట్టినట్టే తెలియజెప్పారు.

అభిజ్ఞకు తల్లి సుహాసిని పట్ల ఉన్న ప్రేమ, గారాబం, ఆత్మీయత అలాగే నేటి యువతకు ఉండే సహజసిద్ధమైన చిరాకు (తల్లిపై చికాకు పడటం) వంటివి చాలా సహజంగా వ్రాసారు. తన వలన తప్పు జరిగిందని, దాని వలన తల్లి దోషిగా నిలబడిందనీ గ్రహించిన అభిజ్ఞ మానసికంగా బాధ పడటం, తల్లిని క్షమాపణ అడగటం మనసుకు హత్తుకుపోతాయి, మన కను కొలకులలో నీటి బిందువులను నింపుతాయి. అలాగే స్నేహశీలియైన అభిజ్ఞ స్నేహితురాలి నయవంచనకు గురియై ఎంతో బాధకు, వేదనకూ లోనవుతుంది. అందరినీ గుడ్డిగా నమ్మి బ్యాంకు అకౌంట్ నంబర్లు ఇవ్వటం వంటి పెద్ద సహాయాలు చేయరాదని ఈ పాత్ర ద్వారా చెప్పకనే చెబుతారు రచయిత్రి.

సుష్మ, వినీత్ – స్నేహితులు, ప్రేమికులు. తన ప్రియుడి కోసమని చేయరాని తప్పుకు సిద్ధమౌతుంది సుష్మ. అవసరాల ముందు  నైతికసూత్రాలు, స్నేహం కనిపించవు, వాటికి విలువ ఇవ్వాల్సిన ఆవశ్యకతా కనిపించదు. స్వార్థమనే పిశాచి ఆవహించినపుడు నమ్మిన స్నేహితులను సైతం నట్టేట్లో ముంచేస్తారు కొందరు. సుష్మ పాత్ర అటువంటిదే. ప్రేమికుడిని గట్టెక్కించటానికి, తాను పైపైకి ఎదిగిపోవటానికీ స్నేహితురాలిని ముంచివేయటానికి సిద్ధమైంది. ఇక వినీత్ – తోటి కుర్రాళ్ళంతా ఎలాగో స్థిరపడిపోతున్నారు. తానూ సెటిల్ అవ్వాలి. ఇంట్లో తల్లి అనే మాటలు, సుష్మను పెళ్ళి చేసుకోవాలి… మరి ఎలా? అందుకే నేరానికి సుష్మను పురిగొల్పటం, సుష్మ ప్రేమను ఎన్‌కేష్ చేసుకోవటం. నైతికసూత్రాలు కనుమరుగైపోతున్నాయని వాపోయేది ఇటువంటి పరిస్థితులలోనే, ఇటువంటి యువత ప్రవర్తన వల్లనే.

సోమయాజులు, మణి, సుష్మ తల్లి కనకం, ఆమె భర్త శేషు, రామప్పడు, ఆదిలక్ష్మి, కాంతి భర్త  కొండబాబు, ధనుంజయ్ భార్య నందిత, గేటెడ్ కమ్యూనిటీ సెక్యూరిటీ గార్డ్ అప్పలకొండా   – ఇలా ఏదీ కథకు అనవసరమైన పాత్ర కాదు. ప్రతీదీ కీలకమైన పాత్రే. కథలో ఒక భాగమే.

ఇకపోతే ‘ఉచ్చు’ అనే మకుటం ఈ నవలకు అతికినట్టుగా సరిపోయింది. కత్తితో పండు కోసుకోవచ్చు, పీకల్నీ కోయవచ్చు అన్నట్టు సోషల్ మీడియా ఎంతో మంది స్నేహితులను కలిపింది, ఎన్నెన్నో సేవా సంస్థలకూ, సాహితీ సంస్థలకూ శ్రీకారం చుట్టింది, స్వచ్చమైన స్నేహబంధాలను, వివాహబంధాలనూ కలుపుతోంది. మనమంతా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాము, పంచుకుంటున్నాము, ఒకరికొకరం అన్న బలమైన బంధంలో జీవిస్తున్నాము కూడా.  కానీ అదే సోషల్ మీడియా ఎదుటివాడి బలహీనతను సొమ్ము చేసుకోవటానికి, ఎదుటివారి మంచితనాన్ని, సౌజన్యాన్ని అలుసుగా తీసుకుని వాడిని ముంచేయటానికీ వేదికగా కూడా తయారైంది. ఈ సమకాలీన ఇతివృత్తాన్ని తీసుకోవటం ద్వారా ఎంతో మందిని ఒక్కసారిగా అలర్ట్ చేసారు రచయిత్రి. నిజమే పేపర్లో ప్రతీరోజూ చదువుతున్నాము. కానీ ఈ నవలలాంటివి తీసుకువచ్చే ఇంపాక్ట్ వేరుగా ఉంటుంది. ఒక్కసారిగా నెటిజన్లు ఉలిక్కిపడి, తమ తమ స్నేహబృందాలను ఒకసారి మళ్ళీ పరిశీలించుకునే అవకాశాన్నీ, జాగ్రత్తనూ కలుగజేసింది ఈ అందమైన ‘ఉచ్చు’.

ఈ నవలలో  ఎప్పటికప్పుడే సుహాసిని మీద వైశాలికి, తద్వారా ధనుంజయ్‌కూ  అనుమానం రావటానికి కల కారణాలను చాలా సహేతుకంగా, ఎలాంటి అస్పష్టతకూ తావివ్వకుండా అల్లారు రచయిత్రి. ఆ అల్లిక జిగిబిగి మన మనసును ప్రేమగా హత్తుకుంటుంది. అలా తన రచనాశైలితో, అందమైన భాషా పటిమతో, సన్నివేశాల కూర్పుతో పాఠకుల మనసుకు ఉచ్చు వేసి దోచుకుంది ఈ రచయిత్రి. అందుకనే స్వాతివారు లక్ష రూపాయల బహుమతిని ఇచ్చారు. కానీ నా దృష్టిలో  అక్షర లక్షలకు అర్హురాలీ రచయిత్రి. ఎందుకంటే ఇందుకూః

ఈ నవల అపరాధపరిశోధక రచనే అయినా,  మనిషికీ మనిషికీ ఉన్న (ఉండాల్సిన) అనుబంధాన్ని ఎంతో అందంగా వివరించిన నవల ఇది.

కొత్తగా పెళ్ళి అయిన సోమయాజులు కూతురి సంసారంలో చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకుంటుంటే వాటిని సరిదిద్దటానికి వెళ్ళిన సోమయాజులు తన మాటతీరుతో వియ్యపురాలి ఆదరానికి పాత్రుడౌతాడు, తాను వృత్తి రీత్యా పోలీసే అయినా ప్రప్రథమంగా కన్న తండ్రి. తండ్రి యొక్క ప్రథమ కర్తవ్యం కూతురి కాపురం చల్లగా కొనసాగేటట్టు చూడటం తప్ప గొడవలతో (తన అధికారాన్ని ఉపయోగించి) విడిపోయేట్టు చూడటం కాదని చక్కగా చెబుతుంది రచయిత్రి.

వినీత్‌ని తల్లి కోపంతో తిడుతుంది. ఆ సందర్భంలో మణితో మాట్లాడాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలా చెబుతాడు ధనుంజయ్.

అసలే వ్యాపకం లేదన్న ఫ్రస్టేషన్‌లో ఉన్న మీ అబ్బాయిని అలా తిట్టవద్దని మీ ఆవిడకి చెప్పండి. ఎందుకంటే ఈనాటి యువత ఎలా ఉన్నారో మీకు తెలియనిది కాదు! నిరాశతో, సమాజం మీద కసితో ఏం చేసేందుకు కూడా వెనకాడడం లేదుఅసలే డిప్రెషన్‌లో ఉన్న మీ అబ్బాయి అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకునేందుకు తల్లిదండ్రులుగా మీరు కారణం కాకూడదుమీ అబ్బాయికి కూడా మంచి రోజులొస్తాయన్న నమ్మకంతో ఉండండి. ఆశావహ దృక్పధం మనిషిని ముందుకు నడిపిస్తుంది. బి పాజిటివ్అండ్ థింక్ పాజిటివ్ఎవ్రీ థింగ్ విల్ బి ఆల్ రైట్ మీ పర్సనల్స్‌లో కలుగజేసుకున్నానని తప్పుగా అనుకోవద్దు. చెప్పాలనిపించింది. చెప్పానుసారీ…’’ గంభీరంగా పలికి పార్కు బయటకి దారితీశాడు ధనుంజయ్.

ఎంత చక్కని మాటలివి! ఎంతో మంది తల్లిదండ్రులను ఆలోచింపజేసే మాటలో కదా… మనమందరం ఆ స్థితిలో ఉన్న మన పిల్లల మీద ఇలాగే విసుక్కుంటాము. కానీ వాళ్ళ మానసిక స్థితి ఏమిటో గమనించి కాస్త మానసిక బలాన్ని సమకూర్చినట్టైతే ఈనాడు హత్యలూ, ఆత్మహత్యలూ జరగవేమో.

అలాగే రామప్పడిని లాకప్‌లో వేసి తమ పద్ధతుల ద్వారా అతన్ని విచారించి నిజం చెప్పించాక, ‘భార్యను బాగా చూసుకుంటేనే మగవాడికి మేలు జరుగుతుంది’ అని చెప్పటం ద్వారా రచయిత్రి భర్తలందరికీ వారి బాధ్యతను గుర్తు చేసింది.

ఎవరి వల్ల అయితే తన భర్త బలహీనతలకు లోనై హత్యకు కూడా గురి అయ్యాడో ఆ సుష్మ, వినీత్‌ల ఆర్థికావసరాలను తీర్చటానికి ముందుకు రావటం వైశాలి సౌజన్యానికి ప్రతీక. అంతే కాకుండా ‘సత్య లేకపోయినా నీకు నేనున్నాను’ అని కాంతితో ఆమె చెప్పటం వైశాలి ఉన్నత వ్యక్తిత్వానికి మచ్చుతునక.

ఉన్నట్టుండి యుక్తవయసులో ఉన్న పిల్లలు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటే, మంచి ఖరీదైన బట్టలు, మొబైల్ ఫోన్స్ వంటి అత్యాధునిక పరికరాలు వాడుతూ ఉంటే వాళ్ళకు డబ్బు ఎక్కడినుండి వచ్చిందో విచారించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదేననీ, తద్వారా విపరీత పరిస్థితులను అరికట్టగలమని కనకం పాత్ర చెబుతుంది (అనర్థం జరిగిపోయిన తరువాత ఆమె కళ్ళు తెరిచిన విషయం పక్కన పెడితే).

మన బలహీనతలే విషనాగులై మట్టుపెడతాయన్న కఠిన వాస్తవాన్ని సత్యకుమార్ పాత్ర ద్వారా తెలుసుకోగలుగుతాము.

మన తప్పు లేనప్పుడు, నిప్పులాంటి నిజం నిరూపించే బాధ్యత మనల్ని నడిపించే సూపర్ పవర్‌దేనన్న ఆత్మవిశ్వాసం సుహాసినిది. అబ్బురపడే వ్యక్తిత్వం కదూ?

ఇలా పైన పేర్కొన్న అంశాలన్నీ ‘ఉచ్చు’ నవలను మామూలు అపరాధపరిశోధన నవలల కన్నా ఒక మెట్టు పైన కూర్చోబెడతాయి పాఠకుల గుండెల్లో.

సాహితీ అభిమానులంతా తప్పకుండా చదవాల్సిన నవల ‘ఉచ్చు’

Exit mobile version