ఉదార చరితానాంతు..

0
2

[శ్రీమతి గాడేపల్లి పద్మజ రచించిన ‘ఉదార చరితానాంతు..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఉ[/dropcap]దయం పది గంటల వేళ. అది ఫిబ్రవరి నెల కావడంతో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. వరండాలో సోఫాలో కూర్చున్న బలరామయ్య అప్పుడే ఖాళీ చేసిన కాఫీ కప్పు టీపాయి మీద పెట్టాడు. ఆయన ఏదో దీర్ఘాలోచనలో ఉన్నట్లు పరిసరాలను గమనించడం లేదు. ఆయనకు ఎదురుగా నాలుగు పాతకాలపు ఫోటోలు. వాటి వంక ఆయన చాలా సేపటి నుండి చూస్తూనే ఉన్నాడు. అవి ఓ ప్రక్క ఫ్రేము ఊడిపోయి, మరో వైపు చెదలు పట్టి, ఇంకొక ప్రక్క ఫోటో కాగితం చినిగి చరమదశలో ఉన్నాయి. ఆ ఫోటోల వెనక లెక్కలేన్ని జ్ఞాపకాలు, కళ్ళముందు లీలగా కదులుతున్నాయి. తెరవెనక బొమ్మల్లా. నిన్న సాయంత్రం పోస్ట్‌మాన్ ఉత్తరం తెచ్చి ఇచ్చేంత వరకు ఈ జ్ఞాపకాలన్నీ మరుగున పడిపోయాయి. ఆ ఉత్తరం మర్చిపోయిన ఆయన బాధ్యతను గుర్తు చేసింది. డెభై ఏళ్ళ క్రితం జరిగిన చరిత్ర గురించి ఇన్నాళ్ళ తర్వాత ఆయన ఆలోచించాల్సి వస్తోంది.

ఇంతకీ ఆ ఉత్తరంలో ఏముంది? అది రెండు రాష్ట్రాల అవతల ‘పంచవటి’ అనే పల్లెటూరు నుండి వచ్చింది. ఆ ఉత్తరంలో “పూజ్యలైన బలరామయ్యగారికి నమస్కారం. నేను పంచవటి గ్రామానికి ఒకప్పటి మునసబును. మీ పూర్వీకులు ఒకప్పటి ఈ పంచవటి సంస్థానానికి అధిపతులని నేను ఎరుగుదును. ప్రస్తుతం పంచవటి ఓ చిన్న పల్లెటూరు. మీ వంశపరాక్రమానికి, దేశ భక్తికి చిహ్నంలా మిగిలిన కోట చాలా వరకు శిధిలమైపోయింది. నాలుగు తరాలకు చెందవలసిన ఈ కోట అన్యాక్రాంతమవుతోంది. ప్రభుత్వం దృష్టి దాని మీద పండిది. దాన్ని పూర్తిగా నేలమట్టం చేసి స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నం జరుగుతోంది. మీ కుటుంబం గురించి వాకబు చెయ్యగా మీ ఎడ్రస్ దొరికింది. మీకు ఈ విషయం తెలియజేయడం నా బాధ్యత అనిపించి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీరు ఒకసారి ఇక్కడకు వచ్చి పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలని కోరుతున్నాను” అని ఉన్నది ఆ ఉత్తరంలో. ‘తనది రాజవంశమనీ, తను ఒక సంస్థానీనికి వారసుడిన’నీ గుర్తు చేసింది ఆ ఉత్తరం ఆయనకు.

తాతలనాటి ఆ వైభవం అపూర్వం. పంచవటి సంస్థానం లోని వందల ఎకరాల భూములు, కోటలు, బంగారం అన్నిటికీ ముగ్గురు అన్నదమ్ములు వారసులుగా ఉండేవారు. ముగ్గురు ఎంతో అన్యోన్యంగా ప్రజల సుఖ, సంతోషాలే లక్ష్యంగా పరిపాలన చేసేవాళ్ళు. వాళ్ళ ధర్మనిరతికి ఎప్పుడూ ఓటమి లేదు. వీళ్ళ ధైర్య, సాహసాలకు ముచ్చటపడి ఇరుగు పొరుగు రాజులు బహుమానాలు పంపి తమ గౌరవాన్ని చాటుకునేవారు. పంచవటి మాగాణిలో రత్నాలు పండుతాయని చెప్పుకునేవాళ్ళు. ఆ పొలం మీద శత్రు రాజులకు ఆశ కలిగింది. దాన్ని పన్నుల రూపంలో కబళించాలని చూశారు. చిలికి, చిలికి గాలివానలా తయారైన ఆ గొడవ భయంకరమైన యుద్ధానికి దారి తీసింది. శత్రువుల మాయోపాయానికి సంస్థానం బలైపోయింది. యుద్ధంలో రారాజు నేలకూలాడు. తమ్ముళ్ళిద్దరు తమ సంపదనంతా అక్కడే వదిలేసి పిల్లలందరినీ తీసుకుని దూరంగా వెళ్ళిపోయారు. తర్వాత తరాలు మారాయి. సంస్థానాలు అంతరించాయి. దానికి వారసులుగా బలరామయ్య, కేశవులు, రామరాజు. గతానికి గుర్తుగా అన్నదమ్ములు ఉన్నారని తెలిసి పంచవటి మునసబు ఆ ఉత్తరం వ్రాశాడు. దాన్ని గురించే ఆలోచిస్తున్నాడు బలరామయ్య. మూడు తరాల బలగం అసలు ఎక్కడెక్కడ ఉన్నారో తెలీదు. పుట్టకొకరు, గుట్టకొకరుగా ఆమెరికాలో ఇద్దరు, ఐరోపాలో ఇద్దరు, ఆస్ట్రేలియాలో మగ్గురు ఇలా ప్రపంచంమంతా విస్తరించిన తన వాళ్ళందరినీ పంచవటికి చేర్చాలి అనుకున్నాడు. వెంటనే తన తమ్ముళ్ళు, రామరాజు, కేశవులు ఇద్దరికీ ఫోన్ కలిపాడు. విషయమంతా వివరించాడు. వాళ్ళు “చాలా సంతోషం అన్నయ్యా. మన వాళ్ళందరికీ జరిగింది చెప్పి, అందరము కలిసి ఈసారి వెళ్ళద్దాము” అన్నారు. “ఆ ప్రాంతమంతా విపరీతమైన అనావృష్టికి లోనైందనీ, రైతులంతా ఊరు వదిలి వెళ్ళిపోతున్నారనీ, సగానికి పైగా పంచవటి ఖాళీ అయిందనీ ఆ మధ్య పేపర్లో చదివాను. త్రాగునీరు రెండు కిలోమీటర్ల దూరం నుండి తెచ్చుకోవాలిట. నువ్వు అన్నట్లు ఓసారి వెళ్ళి చూసి వద్దాం అన్నయ్యా” అన్నాడు రామరాజు. ఫోన్ ద్వారా రెండు రోజుల్లో విషయం అందరికీ చేరుకుంది. తాము రాజవంశానికి చెందిన వాళ్ళమనే విషయం అందరికీ చాలా ఆసక్తిగా ఉంది. చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న కోటలు, రాజవంశాలు ఎలా ఉంటాయో చూడాలని ఆత్రుత అందరిలోనూ ఉంది. ఎక్కడ ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా తప్పకుండా అందరు రావాలని తాతయ్య చెప్పాడు. సరిగా, నెల తర్వాత అందరు పంచవటి చేరుకోవాలని నిర్ణయించుకున్నారు. “అంకుల్, తాతయ్య ఫోన్ చేశారు. మీరు వస్తున్నారా? అక్కా, మేము బయలుదేరుతున్నాం. మీరు ఎప్పుడు బయలుదేరుతున్నారు? అన్నయ్యా, అక్కడికి ఫ్లైట్‌లో రావచ్చా?” ఇలా ఒకరినొకరు ఆత్మీయులై పలకించుకున్నారు. తమకు ఆ ఆస్తిలో వాటా ఉంటుంది కదా! అనే అలోచన కాస్తో, కూస్తో అందరిలోనూ వచ్చింది.

నెల రోజుల తర్వాత ఆ రోజు, పంచవటి పరిసరాలన్నీ సందడిగా మారిపోయాయి. రకరకాల కార్లు, సూటు బూటు వేసుకున్న యువకులు, పెద్దలు, పిల్లలు అందిరిలోనూ కుతూహలం. ఏక్కడో చరిత్ర పుస్తకాల్లో చదువుకున్న దేశభక్తి, కోటలు, రాజ్యాభరణాలు, కొన్ని తరాల క్రిందట సమాధి అయిన సంపద గురించి తెలుసుకోవాలని అందరిలోనూ కుతూహలం కనిపిస్తోంది. ఆ ఊరు చాలా వెనుకబడి ఉంది. ఆ ఊరే కాదు, చుట్టు ప్రక్కల గ్రామాలన్నీ వెనుకబడి ఉన్నాయని మునసబుగారు చెప్పారు. అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలో ‘సువర్ణ రేఖ’ నది ఉంది. కానీ తాగడానికి సరియైన మంచినీరు లేక, గ్రామస్థులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. పశువులకు సరియైన దాణా దొరక్క కబేళాలకు తరలించే పరిస్థితి. దీని వల్ల చాలా మంది పట్టణాలకు వలసపోయి, అక్కడ రోజువారీ కూలీలుగా మారుతున్నట్లు తెలిసింది. పూర్వకాలపు వైభవం ఆనవాళ్ళు అయినా లేవు అక్కడ. ఒకప్పుడు రత్నాలు పండిన భూమి ఇదేనా? అని అనుమానం కలుగుతోంది. శిధిలమైన కోట బురుజులు, ప్రాకారాలు, వాటి మీద గుర్రాలు ఏనుగులు, సైనికుల బొమ్మలు, యుద్ధంలో వాడే, ఆయుధాలు, వాళ్ళ జీవన శైలిని తెలిపే చిత్రాలు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. “తాతయ్య, ఈ బొమ్మలన్నీ చేత్తోటే చెక్కారా? ఆశ్చర్యం కదా!” అడిగింది దీప్తి. “అవునమ్మా! ఆ రోజుల్లో కోట నిర్మాణంలో కొన్ని బలిదానాలు కూడా జరిగేవి. బాబాయి నీకు అంతా గుర్తు ఉందా? మీరు ఇక్కడ ఎలా గడిపేవారు?” అడిగాడు వినయ్. “నాకు అంతగా గుర్తు లేదు. నాకు ఎనిమిదేళ్ళ వయసులోనే సంస్థానం చెయ్యి దాటిపోయింది” అన్నాడు బలరామయ్య.

చిన్నపిల్లలంతా కోటలో గంతులు వేస్తున్నారు. “రాళ్ళు, రప్పలు గుచ్చుకుంటాయర్రా” అంటున్న పెద్దల వారింపులతో ఆ ప్రాంతమంతా మారుమ్రోగుతోంది. “మౌనికా, నువ్వు ఆర్కియాలాజీ రిసెర్చి చేస్తున్నావుగా. ఇది నీకు బాగా ఉపయోగపడుతుందేమో”. “అవును బాబాయి నేను దాన్ని గురించి ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తాను”. “అబ్బో, ఈ కోట చూడాలంటే మనకి రెండు రోజులు పడుతుందేమో కదా!” అన్నది రేణు. “అవును. అంత గొప్పగా కట్టారు కాబట్టే, నాలుగు తరాల తర్వాత కూడ ఇంత గొప్ప జ్ఞాపకాన్ని మనకు దాచి ఉంచింది” అన్నాడు కేశవులు.

“రండర్రా రండి. ఆ పైన ఎత్తుగా ఉంది చూశారా అది సంస్థాన వేదిక. అక్కడ నుండే అన్నదమ్ములు ముగ్గరు త్రిమూర్తుల్లా రాజ్యవ్యవహారాలు నడిపించారు. రామరాజ్యమంటు అందరు ప్రశంశించడం నాకు బాగా గుర్తు. ముక్కారు పంటలు పండేవి. దొంగల బెడద లేదు. వ్యాధుల బాధ లేదు. కోట చుట్టు ప్రక్కల జలాశయాలు ఉండేవి. పచ్చని ప్రకృతి పన్నులభారం లేదు. చాలా గొప్ప సంస్థానం మనది” అన్నాడు బలరామయ్య.

అందరు అలా నడుచుకుంటు కోట పైకి చేరుకున్నారు. చరిత్ర మిగిల్చిన ఆనవాళ్ళు అద్భుతంగా ఉన్నాయక్కడ. అక్కడి గోడల మీద శాసనాలు చెక్కి ఉన్నాయి. అవి చదవాలనే వాళ్ళ ప్రయత్న విఫలం అయింది. కోటలో నడుస్తుంటే విచిత్రమైన ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. ఉన్నట్లుండి వాళ్ళ అడుగుల క్రింద నుండి ‘ఖణేల్’ మని శబ్దం. అందరు ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ శబ్దం ఎక్కడ నుండి వచ్చిందో అర్థం కాలేదు. మరో సారి తట్టి చూశారు. మళ్ళీ అదే శబ్దం. పిల్లలంతా భయపడుతున్నారు.

“పాతళలోకపు దయ్యం అయుంటుంది తాతయ్యా. తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం” అన్నారు. “లేదు లేదు అలాంటిదేమీ లేదు. ఉండండి చూద్దాం” అంటూ రెండు, మూడు సార్లు తట్టి చూశాడు కేశవులు.

ఊళ్ళో నుండి పని వాళ్ళను పిలిపించి త్రవ్వి చూశారు. లోపల ఇనుప వస్తువు తగులుతున్న శబ్దం వినిపిస్తోంది. రెండు అడుగులు త్రవ్వగానే చిత్రంగా లోపల ఒక పెద్ద ఇనుప పెట్టె, దానికి పెద్ద తాళం ఉంది. చాలా కష్టం మీద తాళం పగులగొట్టారు. లోపల ఏముందో అనే ఉత్సుకత ఉంది అందరిలో. అందరు చుట్ట మూగారు. లోపల కళ్ళు మిరిమిట్లు గొలిపే వెండి, బంగారు ఆభరాణాలు. రత్నాలు, వజ్రాలు, పొదిగిన కిరీటాలు, వంకీలు, వడ్డాణాలు ఎప్పుడూ చూడనవి. “ఈ పెట్టెను భోషాణం పెట్టె అంటారు. ఇవన్నీ ముందు తరం నాటి ఆభరణాలు. ఇదంతా మన పెద్దల కష్టార్జితం. మన పూర్వీకుల సొత్తు.” అని చెప్పాడు బలరామయ్య. అవన్నీ ఎన్ని కోట్లు ఉండచ్చో అంచనా వెయ్యలేకపోతున్నారు. అందరికీ సమంగా పంచినా అందరూ కోటీశ్వరులవడం ఖాయం, అనుకున్నారు. సాయంత్రం వరకు కోటలో గడిపి బసకు చేరుకున్నరు. తర్వాత ఆ డబ్బుతో ఏం చేద్దాం? అనేది ప్రశ్న అందరిలోనూ.

విదేశాలకు వెళ్ళి చదువుకుంటానని ఒకరు, రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలు పెట్టాలనుకుంటున్నానని ఇంకొకరు, కోట్లు ఖరీదు చేసే ఇల్లు కొనుక్కుని జీవితమంతా విలాసవంతంగా గడుపుతానని మరొకరు. తమ కోరికలను బయటపెట్టారు యువకులు. వీళ్ల ఆలోచనలు, కోరికలు వింటూ మౌనంగా ఉండిపోయారు పెద్దలు.

వాళ్ళందరిలో ఒకటే ఆలోచన. కనీసం కడుపు నిండా తిండి, తాగడానికి నీళ్ళు కరువైన గ్రామస్థులు కనిపిస్తున్నారు. చదువుల బడిలో గడపవలసిన బాల్యాన్ని నిస్సారంగా పేదరికంతో వెళ్ళదీస్తున్నఆ ఊరి పసి పిల్లలు కనిపిస్తున్నారు. వాళ్ళకు నాగరికతకు దూరంగా, అలా సంస్థానం వెనుకబడి ఉంటే, పెద్దల ఆత్మ ఎంతలా బాధపడుతుందో? అనిపించింది.

దాంతో పిల్లలని ఉద్దేశించి మాట్లాడుతూ, “ఈ నిధి మీద మనకెలాంటి హక్కు ఉండదు. దీన్ని ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి. ఇక్కడి పరిస్థితులు మీ కర్తవ్యాన్ని మీకు గుర్తు చేసి మీ లక్ష్యాన్ని చూపిస్తున్నాయి. చదువులు, ఉద్యోగాల బాటలో మీరంతా ఒక స్థాయికి ఎలాగూ చేరుకున్నారు. మీ కోరికలను పక్కనబెట్టి, సంస్థానానికి వారసులుగా ఆలోచించండి. చేయవలసిందేమిటే అర్థం అవుతుంది. మీరంతా పూనుకుని ఎలాగైనా పంచవటికి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. అప్పుడే మీరు నిజమైన వారసులవుతారు” అంటూ వాళ్ళ బాధ్యతను గుర్తుచేశారు బలరామయ్య.

“మీ తెలివి తేటలు, మీలోని కార్యదీక్ష ఉపయోగించి, సంస్థానాన్ని రంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలి. మిమ్మల్ని చూసి మేము గర్వపడాలి” అంటూ మిగిలిన పెద్దలు కూడా ఆయన మాటలను సమర్థించారు.

త్రాగునీరు, స్కూల్, హాస్పటల్ లాంటి కనీస వసతులతో మొదలు పెట్టి వారసులు చేసిన కృషికి సంవత్సరం తిరిగే సరికి ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. ఆ యువకుల కృషి, పట్టుదల చూసి ప్రభుత్వంతో బాటు ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఆభివృద్ధిని చూసి వలస పోయిన వారంతా, బ్రతుకు తెరువు కోసం తిరిగి తమ ఊరు చేరుకున్నారు. పంచవటి సంస్థానాధీశుల ఔదార్యం వారసుల్లోనూ ఉందని గ్రహించిన ప్రభుత్వం, వారి ప్రయత్నాలకు సహకరించింది.

ఇంతటి గొప్ప లక్ష్యాన్ని సాధించి తమ వంశ చరిత్రను నిలబెట్టిన పిల్లలను చూసి పెద్దలంతా గర్వపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here