ఉదయ రాగం-1

3
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”పై[/dropcap]న కరెంట్ పోయినట్లు లేదూ ఆకాశం లో? గజ దొంగలు భుజాన మూటలేసుకొని పారిపోతున్నట్లు లేదూ? వారిపై పోలీసులు కాల్పులు జరుపుతున్నట్లు లేదూ? ఆ… మనిషన్నాక కాస్త కళాపోషణ ఉండాల. ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది” అంటూ నడుమ్మీద చెయ్యి పెట్టుకొని ఆకాశం వైపు చూస్తున్నది రవళి.

“మేఘాలు, ఉరుములు, మెరుపులు, పెద్ద గాలి వాన వచ్చేట్లుందని నేను ఆలోచిస్తుంటే నువ్వు తాపీగా సినిమా డైలాగులు చెప్తావా? చూడు! ఇందాకట్నుంచీ ఒక్క బస్సు, ఆటో కూడా రాలేదు. అయినా ఈ రాగిణి ఇంత దూరం వచ్చి ఈ షామీర్ పేట రిసార్ట్స్‌లో బర్త్‌డే పార్టీ చేసుకోకపోతే సిటీలో ఎన్ని హోటల్స్ లేవు? ప్చ్! ఇప్పుడేం చెయ్యాలో” అంటూ చిరాకు పడుతోం ది అరుణ.

“ఇందాక బస్సులో వచ్చాంగా! ఇప్పుడు క్యాబ్‌లో వెళదాం” అంటూ మొబైల్ తీసి క్యాబ్ కోసం ప్రయత్నించింది రవళి. కానీ దొరక లేదు.

“పోనీ వెనక్కి రిసార్ట్స్ లోకి వెళ్ళిపోదామా? పార్టీ అయ్యాక వాళ్ళతో కలిసి వెళదాం. ఎవరో ఒకరు మనకి లిఫ్ట్ ఇస్తార్లే” అన్నది రవళి.

“వద్దొద్దు, అసలు ఫంక్షన్ అయిపోయిందిగా, వీళ్ళ పాటలు డ్యాన్సులు అయ్యేసరికి అర్ధరాత్రి దాటుతుంది. మా నాన్న పది గంటలకు ఫోన్ చేస్తాడు. ఈలోగా హాస్టల్‌కి చేరిపోవాలి” అంటూ కాస్త అసహనంగా అటుఇటూ చూస్తున్నది అరుణ.

“దానికేముంది? ఇక్కడ నుంచే హాస్టల్‌లో ఉన్నట్లు మాట్లాడు” అన్నది కనుబొమ్మలు ఎగరేస్తూ.

“మా నాన్న దగ్గర ఏదైనా దాచడం, అబద్ధం చెప్పడం అనేది చెయ్యలేను. నేనే హాస్టల్ ల్యాండ్ లైన్‌కి ఫోన్ చెయ్యమని చెబుతుంటాను, ఆయన సంతృప్తి కోసం. నాన్న కూడా ఎక్కవుగా అక్కడికే చేస్తాడు. కాస్త తాపీగా మాట్లాడుకోవచ్చని.

నాన్న మా పల్లెలో తన పనులేవో చేసుకుంటున్నా ఆలోచనంతా నామీదే ఉంటుంది. రోజుకొక్కసారైనా నా గొంతు వినకపోతే ఆయనకు బెంగ. నాకు ఏరోజైనా మాట్లడటం కుదరకపోతే ముందురోజే చెప్పి ఒప్పిస్తాను. ఇవాళ అనుకోకుండా ఈ పార్టీకొచ్చాం. నాన్నకు చెప్పలేదు. ఇలాంటి హైక్లాస్ పార్టీలకు వెళ్ళడం ఆయనకు అసలు ఇష్టం ఉండదు. నాన్నకు ఇష్టం లేదిని ఏదైనా చెయ్యటం నాకూ ఇష్టం ఉండదు. కానీ ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతుంటుంది. ఇవాళ రాగిణి మాట కాదనలేక, నీ ఉత్సాహాన్ని పాడుచెయ్యలేక వచ్చాను. ఇప్పుడు ఇలా అయింది” అంటూ నిట్టూర్చింది.

రవళి అరుణ భుజం పై చెయ్యి వేసి “సరదాకి అన్నాలేవే, నీ సంగతి నాకు తెలీదు? అయినా ఇప్పుడేమైంది? టైమ్ తొమ్మిదేగా! చూద్దాం ఏదో ఒక మార్గం దొరక్కపోదు. ఇటుగా ఎవరి కారైనా వస్తుంటే లిఫ్ట్ అడుగుదాం” అన్నది రవళి.

“కారా? వద్దు, ఈ టైములో అందులో ఏ తాగుబోతులో ఉండొచ్చు” అన్నది అరుణ.

“బస్సులు రావట్లేదు, ఆటోలు క్యాబులు దొరకటం లేదు, త్వరగా వెళ్ళాలి, మరెట్లా? ఏం ఫరవాలేదు. ఇద్దరం ఉన్నాం. నా బ్యాగులో పెప్పర్ పౌడర్ కూడా రెడీ” అంటూ రోడ్డు వైపు చూసింది.

ఏ వాహనమూ రాలేదు సరికదా చిన్నగా చినుకులు మొదలైనాయి. చూస్తుండగానే వాన ఊపందుకుంది.

బస్ షెల్టర్ లోపల సగం వరకూ వాన పడుతోంది. వీధి లైట్ల వెలుగులో వాన వయ్యారం వలకబోస్తూ క్రిందకి దిగుతోంది. ఆ దృశ్యం ఆహ్లాద పరుస్తున్నా వాన పెరుగుతుండటం వల్ల వాళ్ళలో కాస్త అలజడి కూడా మొదలైంది.

ఒక వ్యాను, తరువాత ఒక కారు రవళి ఆపుతున్నా ఆగకుండా వేగంగా వెళ్ళిపోయాయి. మరి కాసేపటికి ఒక కారు వీళ్ళను దాటుకొని ముందుకెళ్ళి రివర్స్ చేసుకొని వచ్చి ఆగింది. డ్రైవింగ్ సీటులోని వ్యక్తి డోర్ అద్దం క్రిందకు దింపి చూశాడు. రవళి పరుగున వెళ్ళి “సిటీలోకి లిఫ్ట్ ఇవ్వగలరా ప్లీజ్!” అనడిగింది. అతను ఎక్కమన్నట్లుగా సైగ చేశాడు. ఇద్దరూ కారు ఎక్కి వెనుక సీట్లో కూర్చుని థ్యాంక్స్ చెప్పారు.

అతను లైటు వేశాడు. ఆ కారులో ఆ యువకుడు తప్ప మరెవరూ లేరు. “ఎక్కడిదాకా వెళ్ళాలి?” అడిగాడతను.

“మేము పద్మారావు నగర్ వెళ్ళాలి. మరి మీరెటు వెళుతున్నారు?” అతని ముఖం పరీక్షగా చూస్తూ అడిగింది రవళి.

“నేను హిమాయత్ నగర్ వెళుతున్నాను. దారిలోనేగా మిమ్మల్ని డ్రాప్ చేసి వెళతాను” అంటూ లైట్ ఆఫ్ చేశాడు.

కాసేపు నిశ్శబ్దం. అతను కారు వేగం కాస్త పెంచాడు.

“ఇతను పాత సినిమాల్లో హీరోలా ఉన్నాడే! కానీ పైకి చూసింది ఏదీ నమ్మలేం, అక్కినేని నాగేశ్వర్రావో ఆర్ నాగేశ్వర్రావో!” అన్నది రవళి, అరుణ చెవి దగ్గర రహస్యంగా.

“కార్లో మరొకరుం టే బావుండేది” అన్నది అరుణ కాస్త విచారంగా.

“అది మరీ డేంజర్! ఏదైనా తేడా వస్తే ఒక్కణ్ణైతే మేనేజ్ చెయ్యొచ్చు” అన్నది రవళి గొణుగుతున్నట్లు.

“మీరు ఇంత దూరం ఏ పనిమీద వచ్చారో తెలుసుకోవచ్చా? అఫ్కోర్స్ క్యాజువల్‌గా అడిగాను. మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. ఓ గంటకు పైగా ప్రయాణం కదా, ఏదో ఒకటి మాట్లాడుతుంటే మనకు బోరు కొట్టకుండా ఉంటుందని” అన్నాడతను.

“ఇక్కడ రిసార్ట్స్‌లో బర్త్‌డే పార్టీకొచ్చాం. పార్టీ ఇంకా నడుస్తున్నది. బోర్ కొడుతుంటే వెళుతున్నాం. ఇప్పుడు మీకు బోర్ కొడుతుంటే ఏవైనా పాటలు పెట్టొచ్చుగా” అన్నది రవళి.

అతను అప్పటిదాకా వింటూ వీళ్ళు కారెక్కాక ఆపేసిన మ్యూజిక్ సిస్టమ్‌ని మళ్ళీ పెట్టాడు కొద్దిపాటి సౌండ్‌తో.

“ఎదుట నిలిచింది చూడు.. జలతారు వెన్నెలేమో.. ఎదను తడిపింది నేడు చినుకంటి చిన్నదేమో.. మైమరిచిపోయా మాయలో” పాట వస్తోంది.

అద్దం మీద పడుతున్న చినుకులను వైపర్స్ సుతారంగా ప్రక్కకు నెడుతున్నాయి. ఎదురుగా వస్తున్న వాహనాల లైట్లు వీళ్ళ ముఖాలపై పడి మాయమౌతున్నాయి. అతను మెల్లగా అదే పాట ఈల వేస్తూ కారు నడుపుతున్నాడు.

“ఇతగాడు ఈపాట మనకోసమే పెట్టినట్టున్నాడు. లైటు పడ్డపుడల్లా మిర్రర్‌లో మనల్నే గమనిస్తూ ఎదురుగా వచ్చే వాహనాలను గుద్దేస్తాడో ఏమిటో” మళ్లీ నసిగింది రవళి.

“వెనుక వచ్చే వాహనాలను చూస్తూన్నాడేమోలేవే! నువ్వు భయపడుతున్నావా? నన్ను భయ పెడుతున్నావా?” అన్నది అరుణ అంతే లోస్వరంలో.

అతను మళ్ళీ మొదలు పెట్టాడు. “బైదీబై నా పేరు ఉదయ్. మరి మీ పేర్లు తెలుసుకోవచ్చా? మళ్ళీ అభ్యంతరం లేకపోతేనేనండోయ్” అడిగాడు చిన్నగా నవ్వుతూ.

“నా పేరు రవళి, దీని పేరు అరుణ”

“స్టూడెంట్సా?”

“అవును. మెడిసిన్ ఫైనలియర్” అన్నది రవళి.

“బాబోయ్ మీరు కాబోయే డాక్టర్లన్నమాట. మీతో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏ ఇంజెక్షనో చేసేస్తారు” అన్నాడు.

“భయపడకండి! అలాంటిదేమీ జరుగదు. పైగా మీరు చాలా బుద్ధిమంతుడిలా, కలివిడిగా ఉన్నారు”. మందహాసంతో చెప్పింది రవళి.

“మీరూ, గారూ ఏంటండీ! వుయార్ ఆల్మోస్ట్ ఆఫ్ ద సేమ్ ఏజ్ గ్రూప్, ఉదయ్ అనండి చాలు!” అన్నాడు.

“మరి ఈ అండీ కుండీ ఏమిటో?” అన్నది రవళి.

ముగ్గురూ నవ్వుకున్నారు.

“ఇంతకీ మీరేం చేస్తుం టారు? సారీ చేస్తుంటావు మిష్టర్ ఉదయ్!”

“యం.కాం చేశాను. ఉద్యోగం చెయ్యటం ఇష్టం లేదు. మా నాన్న బిజినెస్ పనులు కొన్ని చూస్తున్నాను. ఆ పని మీదే ఇప్పుడు వెళ్ళి వస్తున్నాను”

“ఏం బిజినెస్సో తెలుసుకోవచ్చా? అభ్యంతరం లేకపోతేనే! బోర్ కొట్టకుండా ఉండాలని అడుగుతున్నా”

“కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్ట్స్ అండ్ రియల్ ఎస్టేట్”

“అబ్బో! పలకటానికే కాదు చెయ్యటానికి కూడా కష్టమైన వ్యాపారాలే కదూ”

“కఠోర సత్యం పలికారు”

“తెలుగులో క్లాస్ టాపరా?”

“అంతలేదు”

మళ్ళీ ముగ్గురూ నవ్వుకున్నారు.

కాసేపు పాటలు వింటూ కూర్చున్నారు.

“మీ అరుణ గారు అసలు ఇందాకట్నుంచీ మాట్లాడట్లేదు?”

“మిత బాషి”

“కనీసం మీ పేరైనా మీ నోటితో చెప్పండి అరుణ గారు” అడిగాడు బ్రతిమాలుతున్నట్లు.

“మీ ఇద్దరూ మాట్లాడుతున్నారు. విషయాలు తెలుస్తున్నాయి. పైగా పాటలు కూడా పెట్టారు. మధ్యలో మాట్లాడాలని అనిపించలేదు అంతే! మిష్టర్ ఉదయ్” అన్నది అరుణ.

“హమ్మయ్య! థ్యాంక్యు, మీరు మాట్లాడకుండానే కారు దిగిపోతే చాలా బ్యాడ్‌గా ఫీలయ్యేవాణ్ణి. మీరిద్దరిలో ఒకరు మాటకారి మరొకరు మితభాషి. ఎలా స్నేహితులయ్యరో ఆశ్చర్యంగా ఉంది”

“ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. అది ఒక్క మాట మాట్లాడినా క్లుప్తంగా అర్ధవంతంగా మాట్లాడుతుంది. అది నాకు నచ్చుతుంది. నా వాగుడు అది ఇష్టం గానే భరిస్తుంది.. అంతే” అన్నది రవళి.

“ఓ గ్రేట్ కాంబినేషన్” అన్నాడతను మెచ్చుకోలుగా.

అంతలోనే వస్తున్న పాట అయిపోయి “గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం” అనే పాట మొదలైంది.

“ఓమ్మో! అన్నీ వానపాటలు లోడు చేసుకొచ్చావేంటి ఉదయ్”

“అవి రేడియోలో వస్తున్నాయి, సందర్భోచితంగా ఉన్నాయి కదూ?”

“కాదు, సందర్భం చూసుకొని ఉచితంగా భయపెడుతున్నాయి. పోనీ నేను పాడనా?” గొంతు సవరించుకుంది రవళి.

అతను రేడియో ఆపేశాడు.

“ఏంటే నువ్వు పాడేదీ? అన్నీ చెత్త పాటలు. వాటికంటే గాలివాన పాటే నయం” అన్నది అరుణ.

“పోనీ మీరు పాడండి” అన్నాడతను అరుణను ఉద్దేశించి.

“దానికి సినిమా పాటలు రావు. భగద్గీత శ్లోకాలు, వివేకానంద సూక్తులు కావాలంటే చెబుతుంది” అంటూ దీర్ఘాలు తీసింది రవళి.

“వావ్ గ్రేట్! మా నానమ్మ పోయాక మా ఇంట్లో భగవద్గీతే వినపడట్లేదు. ఇంత చిన్న వయసులో అంతటి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉన్నారంటే నాకు ఆశ్చర్యంగా, సంతోషంగా కూడా ఉంది” అన్నాడతను మెచ్చుకోలుగా.

“భగవద్గీత నానమ్మలు తాతయ్యలు మాత్రమే చదివేది కాదు. నన్నడిగితే యువతకే దాని అవసరం ఈ రోజుల్లో ఎక్కువ. అది మన కర్తవ్యాన్ని బోధిస్తుంది. ఒడిదుడుకులు తట్టుకునేట్లు చేస్తుంది. జీవితం పట్ల సరైన అవగాహన కలిగిస్తుంది. ముందుకు నడిపిస్తుంది.

అయినా నేను మీరనుకునట్లు ఆధ్యాత్మికవేత్తనేమీ కాదు. మా ఊర్లో మా ఇంటెదురుగా పూజారిగారి ఇల్లుంది. తరచు వెళ్ళడం. అప్పుడప్పుడు ఆయన నన్నూ వాళ్ళమ్మాయినీ కూర్చోబెట్టి పురాణ కథలో భగవద్గీత శ్లోకాలో చెబుతుండేవారు. అలా ఆ భావాలు కాసిని అబ్బాయి అంతే” చెప్పింది అరుణ.

“మీరిద్దరితో ఈవిధంగా పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ కాస్త పరిచయానికే మీ ఫోన్ నంబర్ అడగటం సబబు కాదనుకుంటాను. నాకైతే మరెప్పుడైనా మరోసారి మీతో మాట్లాడాలనిపిస్తున్నది. ఇదుగోండి మా బిజినెస్ విజిటింగ్ కార్డ్, నా పేరు మొబైల్ నెంబరు కూడా ఇందులో ఉన్నాయి. మీకెప్పుడైనా గుర్తొచ్చి మాట్లాడాలనిపిస్తే కాల్ చెయ్యండి!” అన్నాడు కార్డ్ ఇస్తూ.

రవళి కార్డు తీసుకొని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంది.

కాసేపటికి తిరుమలగిరి చౌరాస్తా వచ్చింది. అతను కారు ప్రక్కకు ఆపాడు. “ఇక్కడ వాన పడట్లేదు. చాయ్ తాగొద్దాం వస్తారా?” అడిగాడు.

రవళి అరుణ వైపు చూసింది.

“ఇందాకే మేమిద్దరం డిన్నర్ చేశాం, ఇప్పుడు కాఫీలు టీలు ఎందుకు? మీరు వెళ్ళిరండి ప్లీజ్” అన్నది అరుణ.

అతను ప్రక్కనే ఉన్న హోటల్ వైపుకు వెళ్ళాడు.

“డిన్నర్ చేసి గంటపైనే అయింది కదా! మనమూ టీకి వెళితే బాగుండేమో! అతను ఏమైనా అనుకుంటాడేమో” అన్నది రవళి. అరుణ ఏమీ మాట్లాడ లేదు.

అతను త్వరగానే వచ్చేశాడు. సమయం పది కావస్తున్నా ట్రాఫిక్ బాగనే ఉంది. పద్మారావు నగర్ చేరడానికి మరో ఇరవై నిమిషాలు పట్టింది. కౌతా కళ్యాణ మండపం దగ్గరకు రాగానే “ఇక్కడ ఆపండి ఉదయ్” అన్నది అరుణ. ఇద్దరూ కారు దిగారు.

“ప్రక్కనేలెండి, మేము వెళతాం” అన్నది.

“ఓకె” అన్నాడతను.

ఇప్పుడతన్ని పరీక్షగా చూసింది అరుణ.

“వుర్ ఆర్ వెరీమచ్ థ్యాంక్‌ఫుల్ టు యు మిష్టర్ ఉదయ్, లిఫ్ట్ ఇచ్చి చాలా ఇబ్బంది తప్పించారు” అన్నది అరుణ.

“నోనో ఇట్స్ మై ప్లెజర్, గుడ్ నైట్” అని ఇద్దరి వైపు చూసి చెయ్యూపుతూ అతను కారు ముందుకు పోనిచ్చాడు.

“నైస్ గై” అన్నది రవళి.

“అవును, అలాగే కనపడుతున్నాడు” అన్నది అరుణ మందహాసంగా.

“విజిటింగ్ కార్డు ఇచ్చాడు ఎప్పుడైనా మాట్లాడమని” అంటూ బయటకు తీసింది రవళి. అది తీసుకుని చూసి “రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా, అవసరమైనవారికి ఎవరికైనా పనికొస్తుంది” అంటూ దాన్ని రోడ్డు ప్రక్కనే ఉన్న పార్కు గోడ మీద పెట్టి ముందుకు నడిచింది అరుణ. రవళి రెండు చెతులెత్తి అరుణకు నమస్కారం పెట్టింది.

రవళి తన ఇంటివైపుకి, అరుణ తన హాస్టల్ వైపుకి నడిచారు.

కాస్త దూరం నడిచాక వెనక్కు తిరిగి అరుణను చూసి నవ్వుకుంటూ వెళ్ళింది రవళి.

అరుణ హాస్టల్ చేరుకుంది. గంట పదిన్నర దాటింది. వార్డెన్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నది. “మా నాన్న ఫోన్ చేశాడా నాగమణిగారు?” అడిగింది. ఆమె లేదన్నట్లు తలూపి తన సంభాషణలో నిమగ్నమైంది.

అరుణ తన గదికొచ్చి మంచం పై వాలింది.

తన మొబైల్ తీసి వాళ్ళ నాన్నకు కాల్ చేసింది. కాసేపటికి రాఘవరావు గొంతు వినిపించింది. “ఇవాళ ఫోన్ చెయ్యలేదేంటి నాన్నా, ఒంట్లో బాగా లేదా?” అడిగింది.

“అదేం లేదమ్మా! రోజూ అదేపనిగా చేస్తే నీకూ చిరాకు కదా అని” అన్నాడు.

“అట్లా అనకు నాన్న! నిజానికి నీ ఫోనుకి నేను అలవాటుపడిపోయాను. రాత్రి ఫోను చెయ్యడం వద్దనిపించిన రోజు ఉదయాన్నే చేసి చెప్పు, నాలాగా” అన్నది.

“అలాగే” అన్నడతను.

“నాన్న! ఇవాళ ఒక పుట్టినరోజు పార్టికి వెళ్ళాల్సొచ్చింది. నీకు చెప్పడానికి కుదరలేదు. మధ్యలో చేసి చెబుదామనుకున్నాను. అలా చేస్తే నేను హాస్టల్ చేరిందాకా నువ్వు గాభరా పడతావు. అందుకే చేరాక చేస్తున్నాను” అన్నది.

“నీకు స్నేహితులుంటారు. ఇలా ఎక్కడికైనా వెళ్ళాల్సి రావచ్చు, కాదనను. కానీ రోజులు బాగలేవమ్మా! సిటీలో ఎవరేంటో తెలియదు. అందరూ మంచి వాళ్ళుగానే కనబడతారు. మీ అమ్మే కనక బ్రతికుంటే ఆమెకుండే బెంగ, నాకుండే భయం రెండూ ఇప్పుడు నాకే ఉన్నాయి” అన్నాడు.

“నేను జాగ్రత్తగానే ఉన్నాను నాన్నా! నా గురించి ఏమీ భయపడకు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో, బరువు పన్లు చేయకు” అన్నది.

“సరేనమ్మా! బాగా పొద్దుపోయింది పడుకో!” అని ఫోన్ పెట్టేశాడు. అరుణకు అమ్మ కళ్ళలో మెదిలింది. అమ్మ గురించిన ఆలోచనలే ఆమెను నెమ్మదిగా నిద్రబుచ్చాయి.

అరుణ తన రోజువారీ విషయాల్లో నిమగ్నమైంది. మధ్యాహ్నం వరకూ హాస్పిటల్ విజిట్, అక్కణ్ణుంచి సాయంత్రం వరకూ క్లాసెస్. శని,ఆదివారాలు ఉదయం నుండి సాయంత్రం వరకూ పీ.జీ. ఎంట్రన్స్ కోచింగ్ క్లాసెస్.

చెక్కు చెదరని శ్రద్ధతో ఆమె చదువు కొనసాగిస్తున్నది. చివరి సెమిష్టర్ అయిపోతే ఇక ఇంటర్న్‌షిప్ మొదలౌతుంది.

తన పల్లె ఆత్మకూరులో రాఘవరావు కూడా పొలం పనులకు పోవడం, అప్పుడప్పుడూ విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు తేవడానికి ట్రాక్టర్ మీద వరంగల్ వెళ్ళిరావడం, అలసటగా ఇంటికి చేరడం, కాస్త వండుకొని తినడం, గాఢంగా నిద్రపోవడం అతని దినచర్య.

***

శుక్రవారం ఉదయం. అలవాటు ప్రకారం అరుణ మెడికల్ కాలేజీకి ఎదురుగా ఉన్న సరస్వతీదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని హస్పిటల్ ఆవరణలోకి వస్తున్నది. ఆమె ప్రక్కనుండి పోయిన కారు కాస్త ముందుకెళ్ళి ఆగింది. అందులోంచి దిగిన వ్యక్తిని ఉదయ్‌గా అరుణ గుర్తించింది. కారును కూడా గుర్తుపట్టి ఇక అతను ఉదయేనని నిర్ధారించుకుంది. ఎవరో ఎదురొచ్చి అతనితో మాట్లాడుతున్నాడు.

కాసేపు ఆలోచిస్తూ నిలబడింది. చకచకా నడుచుకుంటూ వెళ్ళి అతన్ని “హలో మిస్టర్ ఉదయ్” అంటూ పలకరించింది. అరుణను చూసి అతను కొన్ని క్షణాలు తరువాత గుర్తుపట్టాడు.

“మీరేంటిక్కడ?” అడిగింది వెంటనే.

“మా దగ్గర పనిచేసే సతీష్ అనే వర్కర్ నిన్న బైకు మీదనుంచి పడి కాలు విరక్కొట్టుకున్నాడని తెలిసింది. ఫ్యాక్చర్ అయితే ఆపరేషన్ చేసి కట్టుకట్టారట. చాలా కాలం నుండి మా దగ్గర పనిచేస్తున్నాడు. చూసి పోదామని వచ్చాను. మీరెలా ఉన్నారు? మీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? నెల దాటిందనుకుంటా మనం కలిసి” అన్నాడు.

“వుయ్ ఆర్ ఫైన్ థ్యాంక్యూ!” అన్నది అరుణ.

“ఏ ఆదివారమో ఒకసారి ఫోన్ చేస్తారనుకున్నాను”

“ఎక్కడండీ! ఆరోజు కూడా మాకు ఏవో కోచింగ్ క్లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మీరిక్కడ ఎంతసేపు ఉంటారు?”

“కాసేపు మా సతీష్‌తో మాట్లాడి వెళతాను”

“పదండి నేనూ మీతో వస్తాను” అంటూ అతన్ని అనుసరించింది అరుణ. నడుస్తూనే రవళికి ఫోన్ చేసింది.

ఉదయ్, అరుణ, ఇందాక ఎదురొచ్చిన వ్యక్తి ముగ్గురూ సతీష్ ఉన్న వార్డ్‌కు వెళ్ళారు. ఉదయ్‌ని చూసి సతీష్ బంధువులందరూ లేచి నిలబడి నమస్కరించారు. ఉదయ్ సతీష్‌తో ప్రమాదం గురించి, ఆపరేషన్ గురించి కాసేపు మాట్లాడాడు.

అరుణ ప్రక్కనున్న నర్స్‌తో మాట్లాడి “మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తారుట” అని చెప్పింది.

ఉదయ్ సతీష్‌కి ధైర్యం చెప్పి, అతని భార్య చేతిలో కొంత డబ్బు పెట్టి, వాళ్ళకు వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరాడు.

అంతలో రవళి ఎదురొచ్చింది. అరుణ ద్వారా విషయం తెలుసుకున్నది.

ముగ్గురూ క్యాంటిన్‌కి వెళ్ళి కాసేపు కూర్చున్నారు. అప్పటి గాలివాన ప్రయాణం ఒకసారి నెమరు వేసుకున్నారు.

ఇందాకట్నుంచీ అక్కడ తారసపడుతున్న స్టాఫ్‌ని వీళ్ళిద్దరూ పలుకరిస్తూ రావడం గుర్తుచేసుకొని “ఇక్కడ మీకు బాగా పలుకుబడి ఉన్నట్లుంది. ఇక్కడ పేషెంట్‌గా చేరితే జాగ్రత్తగా చూసుకుంటారన్నమాట” అన్నాడు ఉదయ్ సరదాగా.

“మేము మెడికల్ స్టూడెంట్స్ అని అందరికీ తెలుసు, పలకరిస్తారు. అది నమ్ముకొని మీరు తొందరపడి పేషెంట్ అవకండి. మేమిప్పుడే ట్రీట్మెంట్లు చెయ్యకూడదు. ఇంకా ఇంటర్న్‌షిప్ చెయ్యాలి, తరువాత పీ.జీ, ఆ తరువాత ఒక ప్రత్యేక విభాగంలో అనుభవం సంపాదించాలి. చాలా ఉంది తతంగం” అన్నది రవళి నిట్టూరుస్తూ.

“మీరు కూడా ఫోన్ చెయ్యలేదు?” అన్నాడు రవళితో.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here