ఉదయ రాగం-10

1
3

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]సో[/dropcap]మవారం మధ్యాహ్నం చెన్నై చేరిన ఉదయ్‍ని మనోజ్ స్టేషన్‌కు వచ్చి తీసుకెళ్ళాడు. అప్పటికే అక్కడ నలుగురు స్నేహితులున్నారు. అందులో శ్రీరాం కూడా ఉన్నాడు. అపార్ట్మెంట్ బాగుందని అందరూ మెచ్చుకున్నారు. ఉత్సాహంగా కబుర్లు చెప్పుకుంటున్నారు.

“అయినా వర్కింగ్ డే రోజు గెట్ టుగెదర్ ఏంట్రా మనోజ్! నిన్న ఆదివారమో, వచ్చే ఆదివారమో పెట్టొచ్చుగా?” అడిగాడు శ్రీరాం.

“నిన్న మా అమ్మానాన్నా వచ్చి వెళ్ళారు. వచ్చే ఆదివారం అంటావా నేను విజయవాడ వెళ్ళాలి” అన్నాడు. అతని ముఖంలో కాస్త ఆనందం మరికాస్త చిరునవ్వు.

“ఆ నవ్వేంటి బాబూ! విజయవాడ ఎందుకు నాయనా?” అడిగాడొక బెంగుళూరు మిత్రుడు.

“పెళ్ళి చూపులు” అన్నాడు. చిరునవ్వు కొనసాగుతోంది.

“నీకా నువ్వు చూడబోయే అమ్మాయికా?” అదే బెంగుళూరు మిత్రుడు వెటకారం.

“నువ్వుండ్రా! అసలు ఈ తన్మయత్వానికి కారణమేంటి యువరాజా?”అడిగాడు శ్రీరాం.

“ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. ఉద్యోగం చెయ్యట్లేదు కానీ తను కూడా ఎం.బి.ఏ చేసింది. బోలెడంత ఆస్తి, ఒక్కతే కూతురు” అన్నాడు కళ్ళతో నవ్వుతూ.

“అందము ప్రాయము ఐశ్వర్యము గల సుందరి దొరకుట అరుదు కదా – పాత పాట గుర్తుకొస్తుందిరా” బెంగూళూరు వాయిస్.

“పెళ్ళి చూపులే కదరా? ఇంకా ఒకరికొకరు నచ్చే పని ఒకటుందిగా?” ఒక చెన్నై మిత్రుడు.

“అదంతా వీడియో కాల్ లోనే దాదాపూ అయిపోయింది. పైగా రెండు కుటుంబాల వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు. నేను వెళ్ళి చూడటం నామమాత్రమే. ఈసారి మనందరి కలయిక నా పెళ్ళిలోనే”

“శుభవార్త చెప్పావు మనోజ్! కంగ్రాట్యులేషన్స్” అన్నాడు ఉదయ్.

“ఇటు అపార్ట్మెంటు- అటు అటాచ్మెంటు” అన్నాడు బెంగుళూరు మిత్రుడు.

అందరూ చేతులు కలిపారు. తరువాత చప్పట్లు కొట్టారు.

“శ్రీరాంకి కూడా సంబంధం ఖాయమైంది. ఇక మనలో మిగిలిందెవరూ” అంటూ “ఇదిగో ఉదయరాముడు ఒక్కడే ఉన్నాడు” అన్నాడు చెన్నై మిత్రుడు.

“ఉదయ్‌కి త్వరలోనే సెటిల్ అవుతుంది, ఆ ప్రయత్నం మీదే ఉన్నాడు” అన్నాడు శ్రీరాం.

అతనివైపు కాస్త కోపంగా చూశాడు ఉదయ్. అతను మరో వైపు చూశాడు.

భోజనాల తరువాత అందరూ బెంగుళూరు, హైద్రాబాదు, చెన్నై, విజయవాడ, ఒంగోలు సంబంధమైన వారివారి విషయాలు చెప్పుకున్నారు. రాత్రికి అపార్ట్మెంట్ టెరేస్ మీద పార్టీ ఏర్పాటు చేయబడింది. మరో ఇద్దరు మనోజ్ ఆఫీస్ కొలిగ్స్ వచ్చారు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు.

అంతలో ఉదయ్ మొబైల్ మ్రోగింది.

“హాయ్ ఉదయ్! నేను స్వాతిని. మీరు చెన్నై వచ్చారటగా?”

ఉదయ్ లేచి కాస్త అవతలకెళ్ళి”ఎవరు చెప్పారు?” అడిగాడు.

“ప్రతి ఆదివారం ఇంటికి ఫోన్ చేస్తుంటాలే. నిన్న మాటల్లో డాడీ చెప్పారు”

“అవును. కొందరు ఫ్రెండ్స్‌ని కలవడానికి వచ్చాను”

“ఇప్పుడు మీరెక్కడున్నారు?”

“కోడంబాకం”

“ఓ.. నాకు కాస్త దగ్గరేలే”

“అయితే?”

“రేపు నా బర్త్ డే”

“మై బర్త్ డే విషెస్ టు యు ఇన్ అడ్వాన్స్”

“థ్యాంక్యూ! రేపు ఈవినింగ్ నా ఫ్రెండ్స్ నలుగురికి ట్రీట్ ఇస్తున్నాను. మీరు కూడా వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది”

“నోనో! నేను రేపు సాయంత్రం ట్రైన్‌కి బయలుదేరి రాత్రికి ఒంగోలు చేరిపోవాలి. అర్జుంటు పనులున్నాయి. అయినా మీ ఫ్రెండ్స్ మధ్య నేను ఆడ్ మ్యాన్ అవుట్‍లా ఉంటుంది”

“సరే, లంచ్ కి కలుద్దామా ఒక గంట పర్మిషన్ తీసుకుంటా”

“అంత హడావిడిగా ఎందుకు?”

“మరేం లేదు, ఒంగోలు నుండి వచ్చారు కదా. సమయానికి మనవాళ్ళు వచ్చారనే సంతోషం… ప్లీజ్.. ప్లీజ్”

“కాసేపాగి కాల్ చేస్తా”

“ఓకే… విల్ వెయిట్”

వచ్చి కూర్చున్నాడు ఉదయ్

“ఎవరు ఉదయ్” శ్రీరాం అడిగాడు

“మా బాస్ వాళ్ళమ్మాయి. ఇక్కడ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. రేపు తన పుట్టిన రోజట. లంచికి రావాలంటోంది” నీరసంగా చెప్పాడు.

మనోజ్ శ్రీరాంలు కాసేపు ఒకరినొకరు చూసుకుని పెద్దగా నవ్వారు.

“ఎందుకు నవ్వుతున్నారు?”

“ఇందాకనే అనుకున్నాం కదా, నువ్వొక్కడివే పెళ్ళికి మిగిలావని, అది ఎవరో తమిళ దేవతలు విని దీవించినట్లున్నారు” అన్నాడు శ్రీరాం.

“అట్లాంటిదేమీ లేదు. ఆ అమ్మాయి చిన్నపిల్లలా కాస్త ఎక్కువ హుషారుగా ఉంటుంది. బర్త్ డే రోజు ఒంగోలు నుంచి ఒకణ్ణి వచ్చానని సంతోషంగా ఉందిట. అందుకే పిలుస్తోంది”

“ఏదైతే ఏంటి, నాకైతే సముద్రపు గాలితో పాటు మరేదో సానుకూల సంకేతాలు వీస్తున్నాయనిపిస్తోంది.”

“ఆ అమ్మాయి మా బాస్ కూతురు” స్టేట్మెంట్ లాగా చెప్పాడు ఉదయ్.

“అయితే ఏంటట? ఈ అమ్మాయినే నువ్వు చెప్పిన బెంగుళూరు అమ్మాయిగా ప్రవేశపెట్టే ఛాన్స్ వస్తుందేమో… ప్రయత్నించు”

“మధ్యలో ఈ బెంగుళూరమ్మాయి ఎవరు” మనోజ్ కుతూహలం.

“ఉఫ్! అదొక ఇన్ సైడ్ స్టోరీ, తరువాత చెప్తాలే, నువ్వు పలకవేంటి ఉదయ్?” శ్రీరాంలో ఉత్సాహం.

“అలాంటి ప్రయత్నాలు నావల్ల కాదని నీకు చెప్పాగా!”

“అటువంటి ప్రయత్నం ఒకవేళ అటునుంచి వస్తే వెనక్కి తిరగవుగా?”

ఉదయ్ మౌనం వహించాడు.

“సరే డిన్నర్ చేద్దాం పదండి”.అంటూ లేచాడు మనోజ్.

“ఓ.కే. వుయ్ విల్ మీట్ టుమారో” అని స్వాతికి మెసేజ్ పెట్టాడు ఉదయ్.

వెంటనే రిప్లై వచ్చింది. “థ్యాంక్స్, హోటల్ నయాగారా, వనో క్లాక్” అని.

కబుర్లు, డిన్నరు, కబుర్లు – పది గంటలకి పార్టీ ముగిసింది. శ్రీరాం, మనోజ్, ఉదయ్ తప్ప మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. వీరి ముగ్గురి ముచ్చట్లు రాత్రి ఒంటిగంటకి ముగిశాయి.

ఉదయాన్నే ముగ్గురూ తయారయ్యారు

“నేను ఆఫీసుకెళ్ళి సాయంత్రం కాస్త త్వరగా వచ్చే ప్రయత్నం చేస్తాను. ఈలోగా మీరిద్దరూ మీమీ పనులు చూసుకొని ఫ్లాట్ కి వచ్చి రెస్ట్ తీసుకోండి” అని మనోజ్ వెళ్ళిపోయాడు.

“ఉదయ్! మా నాన్నగారి స్నేహితుడు శ్రీధర్ గారని ఇక్కడ అంబత్తూరులో ఉన్నారు. మా నాన్న ఆయన్ని కలిసి ఏవో డాక్యుమెంట్స్ ఇచ్చి రమ్మన్నారు. అక్కడ పనైపోగానే మనోజ్ ఫ్లాట్‌కి వచ్చేస్తాను” అన్నాడు శ్రీరాం.

ఇద్దరూ కాసేపు షాపులు తిరిగి కావలసినవి కొనుక్కున్నారు. ఆ తరువాత ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

***

నయాగారా హోటల్‌లో స్వాతి రిజర్వ్ చేసిన టేబుల్ దగ్గర మొబైల్ చూసుకుంటూ కూర్చొని ఉంది.

ఎదురుగా నిలబడి “హాయ్ స్వాతీ! మెనీమెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే” అని పలకరిస్తూ బోకేని చేతికి అందించాడు.

“థ్యాంక్యూ! రండి కూర్చోడి” అంటూ ఆహ్వానించింది.

కొద్దిసేపు ఒకరినొకరు చూస్తూ కూర్చున్నారు.

“నా కొత్త డ్రెస్ ఎలా ఉంది?” అడిగిందామె చిన్నపిల్లలా తనవైపు చూసుకుంటూ.

“చాలా బాగుంది”

“ఒంగోలు వచ్చినపుడు చుడీదార్స్ ఎక్కువగా వేసుకుంటాను. ఇక్కడ నా యిష్టం కదా!”

“కాదనగలిగే వాళ్ళెవరు? ప్రొసీడ్”

“మీ డ్రెస్ కూడా బాగుంది. పాత మిస్సమ్మ సినిమాలో ఎన్టీఆర్ వేసుకున్నట్లు చాలా సింపుల్ గా ఉంది”

“నా డ్రెస్ గురించి కాలేజీ టైం నుండీ చర్చ జరుగుతున్నది. అలా జరగడం నాకు ఇంతకుముందు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఎందుకనో సరదాగా అనిపిస్తున్నది”.

“సారీ, నా ఉద్దేశం….”

“రిలాక్స్ స్వాతీ, నేను కూడా ఏమీ అనుకోవడం లేదు”

“నేను నా పుట్టిన రోజు డ్రెస్ గురించి చెబుతూ మిమ్మల్నీ ఏదో అడగాలి కాబట్టి అలా అడిగాను. కానీ టాపిక్ మరెటో పోయింది. మళ్ళీ సారీ.. నాకు సరిగా మాట్లాడటం రాదు”

“నాకు మటుకు వచ్చనా? నేను మటుకు నా కాలేజీ విషయం నీకెందుకు చెప్పాలి. హాయిగా సీనియర్ ఎన్టీఆర్ లాగా ఫీలైపోతూ కాలర్ ఎగరేస్తే సరిపోయేదిగా”

ఆమెకు కాస్త నవ్వొచ్చింది.

“మీకు మాట్లాడటం రాదంటే నేను నమ్మను ఉదయ్”

“ఇద్దరం కలిసి బట్టల షాపుకెళ్ళి చెరొక జత బట్టలు తెచ్చుకుందామా? లేకపొతే ఫుడ్ ఆర్డర్ ఇద్దామా?”

“ఓ గాడ్.. మాటల్లో మర్చేపోయాను. ఇదిగోండి మెనూ కార్డ్”అంటూ చేతికిచ్చింది.

“ఇవాళ మీ ఇష్టం. మీరు ఏది పెట్టిస్తే అది తినేస్తాను. అసలే బాసు కూతురు… చెప్పినట్లు వినకపోతే నా జీతంలో సగం కోసెయ్యరూ!”

స్వాతి పెద్దగా నవ్వేసింది. “ఫ్యాక్టరీలో కలిసినప్పుడు ఇలా లేరు. ఇప్పుడు చాలా జోవియల్ గా ఉన్నారు”

“అక్కడ ఆ రోజు కార్యక్రమం వేరు ఇక్కడ ఈ సందర్భం వేరు. “

ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చింది. కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు.

“మీ గురించి నాన్న కొంత చెప్పారు. ఇప్పుడు కొంత తెలుసుకున్నాను. కానీ మరికొంత తెలుసుకోవాలి. మీకు పెళ్ళైనట్లు కనిపించడం లేదు. అయ్యుంటే చీమకుర్తిలో ఫ్యామిలీ పెట్టేసేవారు. లేక పెళ్ళై ఆమెను హైద్రాబాద్ లోనే ప్రస్తుతానికి ఉంచి వచ్చారా? అసలు చేసుకోలేదా? లేక కొంపదీసి ఏదైన లవ్ ఫెల్యూరా? నాకు తెలియాలి.”

“ఆ.. చివరిది కరెక్ట్. లవ్ ఫెల్యూర్, నాది కాదు ఒకామెది”

“అర్ధం కాలేదు”

“నన్ను శ్వేత అనే అమ్మాయి ప్రేమించబోయి ఆగిపోయింది”

“అదేంటి”

“నేను చామనచాయగా ఉన్నా జీన్స్ ప్యాంటు, టీ షర్టు వేసుకొని, నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని, కనీసం సిగిరెట్ తాగుతుంటే అక్షయ్ కుమార్ లాగా కనపడతానట”

“లేకపోతే?”

“ఉత్తర కుమారుడితో సమానమట”

“అదేంటి అర్థం లేని పోలిక?”

“అర్థమెందుకు లేదూ, ఆమెకు పురాణ పాండిత్యం ఎక్కువ. హిందీ సినిమాలంటే మక్కువ”

“ఓ మై గాడ్! తరువాత?”

“ఏముందీ, ఆమె ఇప్పటికీ అలానే ఉందిట, ఏదో బ్యాంక్ లో పని చేస్తూ, మా శ్రీరాం చెప్పాడు. నేనేమో ఇదిగో ఇలా ఉన్నాను”

“మరి మరోసారి కాంటాక్ట్ చెయ్యొచ్చుగా?”

“నేనింకా ఉత్తర కుమారుణ్ణేగా?”

“ఇదంతా ఎప్పుడు జరిగింది?”

“సీనియర్ ఇంటర్లో”

“దేవుడా! ఇదంతా నిజమేనా? సరదాకి నన్ను ఎంటర్‌టైన్ చెయ్యటానికి చెబుతున్నారా”

“రెండూ నిజమే. అప్పట్లో గుమ్మడి, ఇప్పట్లో ప్రకాష్ రాజ్‌లు చిన్నవాళ్ళైనా పెద్ద పాత్రలు వేశారుట. నేను ఆ కోవకు చెందిన వాణ్ణిట మరొకడి కామెంట్.”

“ఇటీజ్ జస్ట్ క్రూయల్ కదా?”

“నోనో, అంతగా అనుకోవాల్సిన అవసరం లేదు. కాలేజీ రోజుల్లో ఇలాంటివి మామూలే కదా! లెక్చరర్లకే తప్పవు. కాకపోతే నా మీద కొంత ప్రభావం పడినమాట నిజం. అందులోనుంచి నేను బయటపడినమాట కూడా వాస్తవం. ఇవన్నీ ఇప్పుడు నిన్ను ఉల్లాసపర్చడానికే చెబుతున్నాననేది యథార్థం”

“మీరు పైకి చాలా కామ్‌గా కనపడినా మంచి మాటకారి”

“ఈ కాంప్లిమెంట్ ఏదో బాగనే ఉంది. తీసేసుకుంటే పోలా!”

“ఇవాళ మీతో ఇలా మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది”

“నేను నిన్ను నువ్వు అని పిలుస్తున్నాను. నువ్వు కూడా అలానే పిలిస్తే బాగుంటుంది. అండీ కుండీ అంటే నాకు సీనియర్ సిటిజన్ ఫీలింగ్ కలుగుతుంది”

“అలాగేనండీ… అదే మిస్టర్ ఉదయ్… నోనో ఉదయ్! ఇక నుండి ఉదయ్ అనే పిలుస్తాను. ఇప్పుడేంటి మీ అదే నీ ప్రోగ్రాం?”

“అందరూ స్నేహితులూ వెళ్ళిపోగా ముగ్గురం మిగిలాం. సాయంత్రానికి కలుస్తాం. పరిస్థితిని బట్టి రాత్రికి, లేకపోతే రేపు ఉదయం బయలుదేరి ఒంగోలు వెళ్ళిపోతాను.”

“వెళ్ళే ముందు ఫోన్ చేస్తావా? రా?”

 “చనువు మరీ ఎక్కువైనట్లు లేదూ?”

“అయ్యో అదేం కాదు రెండూ కలిసిపోతున్నాయి. ఈసారి మనం కలిసేలోగా ప్రాక్టీస్ చేస్తాలే”

“అలాగే, మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు” అన్నాడు.

“ఆమె కూడా చిరు నవ్వుతో “బై” చెప్పి వెళ్ళిపోయింది.

ఆమె క్యాబ్ వెళ్ళిన వైపు చూస్తూ కాసేపు నిలుచుండిపోయాడు ఉదయ్.

కొద్దిసేపటికి అతని మొబైల్ మ్రోగింది. అరుణ.

“ఉదయ్! ఎలా ఉన్నావు?”

“బాగున్నాను. ప్రస్తుతం చెన్నైలో ఉన్నాను. రేపు ఒంగోలు చేరుతాను.”

“ఈ మధ్య ఫోన్లో దొరకటం లేదు. బాగ బిజీగా ఉన్నట్లున్నావు.”

“కొంతవరకూ నిజమే. మిగిలింది నా అశ్రద్ధ అని కూడా చెప్పొచ్చు. అయినా విశేషాలుంటే చెప్తాగా?”

“మేము చెప్పాలంటే నీ ఫోన్ దొరకొద్దా?”

“నిజమా ఏంటి విశేషం?”

 “ఇంటర్న్‌షిప్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్”

“హార్టీ కంగ్రాట్యులేషన్స్, అయితే పూర్తి స్థాయి డాక్టర్లు అయిపోయారనమాట స్నేహితురాళ్ళిద్దరు. “

“డాక్టరు చదువుకి పూర్తి స్థాయి ఉండదు. చదవ గలిగితే, నేర్చుకోగలిగితే జీవితం మొత్తం సరిపోతుందేమో”

“అంత నేర్చుకోవాల్సిన అవసరముందా?”

“ఏం.డీ చెయ్యాలిగా? లేకపోతే విలువ తక్కువ”

“అవును. ఒకసారి చెప్పావుగా? మరి రవళి?”

“ఇదిగో మాట్లాడు”

“హాయ్ ఉదయ్! నీ వివరాలు ఎప్పటికప్పుడు తెలుస్తున్నా, నువ్వేదో విదేశాలకెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతున్నది నాకు”

“విదేశాలకు నేను వెళ్లనని చెప్పాగా! అయినా నిన్ను, అరుణా లాంటి ఫ్రెండ్స్ ని వదిలిపెట్టి నేను ఏ దేశానికైనా వెళ్లగలనా?”

“అయ్యబాబోయ్! అంత బలమైన డైలాగు కొట్టావంటే లంచ్‌లో ఏం తిన్నావేంటి?”

“లంచ్… ఆ ఇప్పుడే మా బాస్ కూతురితో లంచ్ చేశాను. ఆమె ఇక్కడే జాబ్ చేస్తున్నది. ఈరోజు ఆమె పుట్టినరోజు. నీలాగే హుషారు ఎక్కువ”

“అయితే నేను తక్కువా?” ప్రక్కనుండి అరుణ వాయిస్.

“ఆహా.. నీకంటే తక్కువే”

“ఉదయ్! ఆ అమ్మాయి బాగా అందంగా ఉంటుందా?” రవళి ప్రశ్న.

“నో సీరియస్ క్వశ్చన్స్ ప్లీజ్. అయినా ఎవరికి వాళ్ళు అందంగానే కనబడతారు”

“చిక్కకుండా మాట్లాడటం చక్కగా నేర్చుకున్నావు” రవళి.

“ఒక ఇంటి వాడవైతే చూద్దామనుకుందేమోలే!” అన్నది అరుణ

“అదేదో ఆవు కథ లాగా ఎవరితో ఏం మాట్లాడినా చివరికి నా పెళ్ళి దగ్గరకే వస్తుంది విషయం”

“మీ మరదలు సంధ్య విషయం ఏమైంది. ముహూర్తాలు పెట్టుకుంటున్నారా” రవళి.

“ఈసారి హైద్రాబాద్ వస్తే అదే పని చేసేట్లున్నారు. పరిస్థితి పీక్‌లో ఉంది”

“ఉదయ్! ఆర్ యూ సీరియస్? ఒకసారి వీడియోలో కనపడు” మళ్ళీ రవళి.

“మీ ఇద్దరితో సీరియస్‌గా ఉండలేనని మీకు తెలుసు. ఇప్పుడు వీడియోలో నన్ను చూశారంటే, ఫోన్ అవతల పడేసి పారిపోతారు. ఇక్కడ చెన్నై చెమటతో ఒక ట్రక్కు రాళ్ళు కొట్టిన వాడిలా ఉన్నాను”

“ఆవు కథలాగా మళ్ళీ రాళ్ళ దగ్గరకు నువ్వు రాలేదా?” రవళి.

“స్నేహితురాళ్ళిద్దరూ బాగా తీరికగా ఉన్నట్లున్నారు. పైగా లంచ్ కూడా ఇంకా చేసినట్లు లేరు.”

“హైద్రాబాద్ ఎప్పుడోస్తున్నావు?” అరుణ.

“టాపిక్ దారిలో పెట్టాలంటే నువ్వే అరుణా!. మీ ఇద్దరి దగ్గర ట్రీట్ తీసుకోవడానికి త్వరలో వచ్చేస్తాను”

“ఓకే వెరీ గుడ్.. బై ఉదయ్!” అంటూ ఫోన్ పెట్టేసింది.

నవ్వుకుంటూ బయలుదేరాడు ఉదయ్.

మనోజ్ ఫ్లాట్ కి వచ్చేసరికి శ్రీరాం టీవీ పెట్టుకొని తెలుగు పాటలు చూస్తున్నాడు. ఉదయ్ వెళ్ళి ప్రక్కన కూర్చున్నాడు

“మనసున ఉన్నది, చెప్పాలనున్నదీ, మాటలు రావె ఎలా

మాటున ఉన్నది, ఓ మంచి సంగతి, బయటికి రాదె ఎలా”

పాట వస్తున్నది. ఇద్దరూ ఆసాంతం చూశారు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

“నాకెందుకో ఎక్కడో నీ కోసం ఒకానొక అమ్మాయి ఆతృతగా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నదని నా సిక్త్ సెన్స్ సీరియస్‌గా చెబుతున్నది ఉదయ్!” అన్నాడు శ్రీరాం సీరియస్ గానే ముఖం పెట్టి.

“సీరియస్ జోక్ బాగుంది”

“జోక్?”

“కాకపోతే ఇందులో సిక్త్ సెన్స్ దాకా ఎందుకు? అక్కడ హైద్రాబాద్ లో కాచుకొని మా మామ కూతురు ఉందిగా?”

“అక్కడ ఆతృత ఆ అమ్మాయిది కాదు, ఆమె అమ్మానాన్నలది”

“మేక్స్ నో డిఫరెన్స్, కాచుకొనైతే కూర్చుందిగా?”

“లెటస్ ఛేంజ్ ది ఛానెల్” అంటూ టీవీ ఆపేశాడు శ్రీరాం.

ఉదయ్ ప్రశ్నార్థకంగా చూశాడు.

“ఇవాళ మా నాన్న స్నేహితుడు శ్రీధర్ గారింటికి వెళ్ళాను కదా. వాళ్ళింట్లో అందరూ చాలా బాగా మాట్లాడారు. చాలా కాలం క్రితం వాళ్ళు హైద్రాబాద్ నుండి చెన్నై వచ్చేశారు. అక్కడున్న అపార్ట్మెంటూ అమ్మేశారు. దానికి సంబంధించిన కాగితాలే ఇప్పుడు వాళ్ళకిచ్చి వచ్చాను.

ఏవేవో కబుర్లు మాట్లాడేప్పుడు. నా స్నేహితుడు ఒకడున్నాడని, చాలా మంచివాడు, తెలిసిన మంచి సంబంధం ఉంటే చూడమని చెప్పాను. నీ వివరాలు చెప్పాను. ఫొటో కావాలన్నాడు. మనిద్దరం తీసుకున్న ఒక ఫొటోని ఆయనకు ఫార్వర్డ్ చేశాను. అది చూస్తున్నప్పుడు ఆయన కళ్ళు మెరిశాయి. అంటే నువ్వు నచ్చావనుకుంటాను. ఫోన్ చెయ్యమని నీ మొబైల్ నెంబర్ ఇచ్చాను. మీ నాన్న నెంబరు అడిగాడు. మీ నాన్న మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు. మీ ల్యాండ్ లైన్ నెంబరు ఇచ్చాను.

కాసేపయ్యాక వాళ్ళ రెండో అమ్మాయిట వచ్చింది. పేరు స్వప్న. చాలా బాగుంది. ఫ్యాషన్ టెక్మాలజీలో డిగ్రీ చేసిందిట. పరిచయం చేశాడు. ఆ అమ్మాయికి ఇంకా పెళ్ళికాలేదని తెలిసింది. ఆమె గురించి డైరెక్ట్‌గా అడిగే సందర్భం కాదుగా. వాళ్ళకు విషయం చెప్పాను కదా అనుకొని ప్రస్తుతానికి వచ్చేశాను”

“మొత్తానికి ఎక్కడికిపోతే అక్కడ ఇదే పనిమీద ఉన్నావన్నమాట”

“బాధ్యత తీసుకున్నాక తప్పుతుందా నాయనా” అంటూ వెళ్ళి టీ కలుపుకొని వచ్చాడు శ్రీరాం.

ఇద్దరూ మౌనంగా టీ త్రాగారు.

“అవును ఉదయ్! అసలు విషయం మర్చిపోయాను, ఇంతకీ మీ బాస్ కూతురుతో లంచ్ విశేషాలేంటి?”అడిగాడు శ్రీరాం కుతూహలంగా.

“సౌత్ ఇండియన్ తాలీ. చాలా రుచిగా ఉంది. వంకాయ కూరైతే అదిరింది. పాయసం, నాలుగు రకాల స్వీట్లు, ఐస్ క్రీం వగైరా ఉన్నాయి. నిజంగానే విందు భోజనం”

శ్రీరాం రెండు పెదవులు బిగబట్టి అదోలా చూశాడు.

వెంటనే ఉదయ్ “అర్థమైంది, చెప్పాగా! ఆ అమ్మాయి మా బాస్ కూతురని. తిన్నింటి వాసాలు…..” అనబోయాడు.

“బాబూ! ఆపు. నేనే క్రిందకు మీదకు చేసి ఒక సంబంధం చూస్తా”

“వెరీ నైస్! ఆ పని మీద ఉండు. కాస్త ఆలస్యమైనా ఫరవాలేదు”

“ఇవాళ నాతో హైద్రాబాద్ రాకూడదూ?”

“ఇప్పుడే కాదు. ఒంగోలు మా క్వారీలో కొత్త పిట్స్ ఓపెన్ చెయ్యబోతున్నాం. ఆ తరువాత నేను ఖమ్మం, వరంగల్ జిల్లాలు క్వారీలు సర్వే చేసి రావాలి. నీకు తెలుసనుకుంటా ఒంగోలు బ్లాక్ గెలాక్సీ గ్రానైట్‌కి ఎంత పేరో ఖమ్మం ప్యూర్ బ్లాక్ గ్రానైట్‌కి అంత పేరు. అక్కడ ఒక క్వారీ సబ్ లీజుకి తీసుకునే ప్రయత్నం జరుగుతున్నది.”

“నువ్వు రాళ్లలో పూర్తిగా మునిగిపోయినట్లున్నావు”

“కనీసం రెండు మూడేళ్ళు తీవ్రమైన కృషి తప్పదు. అప్పుడే నాకు స్వంతంగా నిలబడ్డాను అనే నమ్మకం కలిగేది. ఆపై అవకాశాలను వినియోగించుకుంటూ మనకు కావలసినట్లు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు”

“మరి మీవాళ్ళు ఏమంటారో ఇలా తిరుగుతుంటే”

“అవును. రెండు వారాల్లో హైద్రాబాద్ రావడానికి ప్రయత్నం చేస్తాను. విషయాలన్నీ ఒక కొలిక్కి రావాలి. లేకుంటే నాకు పనిమీద ఏకాగ్రత ఉండదు”

ఇంతలో ఏదో కొత్తనంబరు నుండి కాల్ వచ్చింది. “హలో ఎవరు?” అడిగాడు ఉదయ్.

“నమస్తే సార్ నేను శా౦తని”

“శా౦తా బాగున్నావా? సారే౦టి సార్… పేరు పెట్టి పిలువు ఫరవాలేదు. ఇ౦తకీ ఏ౦టి విషయ౦, ఎలా ఉ౦ది శాస్త్రిగారి దగ్గర కొలువు?”

“అది చెబుదామనే ఫోన్ చేశాను. శాస్త్రిగారు, ఆయన స్టాఫ్ చాలా ఓపిగ్గా నాకు ట్రైని౦గ్ ఇస్తున్నారు. ఒక పూర్తి స్థాయి అకౌ౦టె౦ట్‌గా నేను త్వరలోనే తయారు కాగలను అనిపిస్తున్నది”

“వెరీ గుడ్.. నువ్వు తప్పక మ౦చి పొజిషన్‌కి వెళతావు. నేను చెయ్యగలిగి౦దేమి ఉన్నా స౦కోచ౦ లేకు౦డా నాకు కాల్ చెయ్యి, సరేనా?”

“అలాగే, చాలా చాలా థ్యా౦క్స్”

“ఓకే. ఉ౦డనా మరి”

“అలాగే.. ఇది ఇకపై నా మొబైల్ నె౦బర్”

“నైస్.. ఉ౦టాను” అని ఫోన్ పెట్టేశాడు.

“ఈ శా౦త ఎవరు?” శ్రీరా౦ సూటి ప్రశ్న.

“ఏది చెప్పినా నువ్వు ఎక్కడికి లాక్కొస్తావో నాకు తెలుసు. జస్ట్ మా ఆడిటర్ దగ్గర పని చేసే ఒక సాదాసీదా అమ్మాయి, సరేనా?”

“సాదాసీదానా? మ్యారీడ్?”

ఉదయ్ పళ్ళు పటపటమని కొరుకుదామని ప్రయత్నిస్తున్నాడు.

అ౦తలో మనోజ్ వచ్చాడు.

ముగ్గురు మిత్రులూ హుషారుగా కాసేపు బయట తిరిగి వచ్చారు.  రాత్రికి శ్రీరా౦, ఉదయ్‌లు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here