Site icon Sanchika

ఉదయ రాగం-11

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]కొ[/dropcap]న్ని రోజులు మైనింగ్ పనుల మీదనే ఎక్కువగా తిరగటం వల్ల ఉదయ్ ఎవరితోనూ ఫోన్లలో మట్లాడలేదు. ఒకరోజు ఉదయాన్నే అమెరికాలో ఉన్న తన అక్క స్పందన దగ్గర్నుంచి వెంటవెంటనే కాల్స్ వచ్చాయి. తయారై వెళ్ళబోతూ ఫోన్ తీశాడు.

“ఉదయ్! ఏంట్రా ఇందాకట్నుంచీ ఫోన్ చేస్తుంటే తియ్యట్లేదు. ఒంట్లో బాగోలేదా?”

“అదేం లేదక్కా, కాస్త పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. మరో రెండు రోజుల్లో కాస్త ఫ్రీ అవుతాను. ఏంటి చెప్పు విషయం”

“అంత పని ఒత్తిడిలో ఉన్న నీకు చెప్పాలో లేదో తెలీదు. కానీ తప్పదు. అక్కడ మామయ్య బాగా హడావిడి చేస్తున్నాట్ట. మాటల్లో కూడా తేడా వచ్చిందట. సంవత్సరం దాటిపోయింది. ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తారు అని నిష్ఠూరాలతో మాట్లాడుతున్నాడట. వెంటనే మీ వాణ్ణి పిలిపించి ఎదో ఒకటే తేల్చండి అని ఒత్తిడి చేస్తున్నాడట. అమ్మానాన్న బాగా టెన్షన్ పడిపోతున్నారు. నీకు ఫోన్ చేస్తే సిగ్నల్ దొరకటం లేదుట. దొరికినా నువ్వు ఏదో ఒకటి రెండు మాటలు క్లుప్తంగా మాట్లాడి పెట్టేస్తున్నావట. మెసేజ్ లకు కూడా బదులు లేదుట. నాకు మొన్నొకసారి చేస్తే చెప్పారు. నేను నిన్నట్నుంచీ వీలైనప్పుడల్లా నీకు కాల్ చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడు దొరికావు.”

“నాకు తెలుసక్కా! ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. అమ్మకు చెప్పు ఒక వారంలో హైద్రాబాద్ తప్పకుండా వచ్చి అన్ని మాట్లాడుతానని. క్వారీల దగ్గర సరిగ్గా సిగ్నల్స్ ఉండవు. నేనూ నాన్నకు ఇప్పుడే ఒక మెసేజ్ పెట్టి వెళతాను. నువ్వు బావ, పాప బాగున్నారనుకుంటాను. మరి ఉంటాను. బాయ్” అంటూ కాల్ కట్ చేసి తన పని మీద బయలుదేరాడు.

***

ఆ ఉదయం రోజూలాగానే సిటౌట్‌లో కూర్చొని పేపర్ చదువుతున్న శంభుప్రసాద్‌కి కాఫీ కప్పు తెచ్చి అందించింది శకుంతల.

“ఉదయ్ ఏమైనా ఫోన్ చేశాడా? నువ్వేమైనా చేశావా? బయలుదేరాడా?” అడిగాడు.

“మళ్ళీ ఏం చెయ్యలేదండీ! అర్జంటు పనిమీద ఖమ్మం వచ్చాను రేపు వస్తాను అని నిన్ననేగా చేసింది! ఇవాళ ఏదో టైంలో వచ్చేస్తాడులెండి. అస్తమానం వాడికి ఫోన్ చేసి విసిగించడం దేనికి?”

“మీ అన్న విశ్వరూపం చూపిస్తున్నాడు. చెల్లెలు భర్త అని విలువ కూడా లేకుండాపోయింది” చూపు రోజూలాగానే పైకి మళ్ళింది.

ఆమె ఏమీ మాట్లాడలేదు. కాసేపు మౌనం అక్కడ మకాం పెట్టింది.

దాన్ని ఖాళీ చేయిస్తూ ల్యాండ్‌లైన్ ఫోన్ మ్రోగటం ఆరంభించింది. ఇద్దరూ వెళ్ళి ఫోన్ తీసే మూడ్‌లో లేరు. అది మాత్రం ఓపిగ్గా పిలుస్తూనే ఉంది. చిన్నగా వెళ్ళి రీసివర్ తీసింది శకుంతల.

“ఉదయ్ వాళ్ళ అమ్మగారాండీ?”

“అవును మీరెవరు?”.

“నమస్కారం అత్తయ్యగారు! నేను మీ అబ్బాయిని ఇష్టపడుతున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటాను”

“అత్తయ్యగారా? ఎవరమ్మాయ్ నువ్వు, ఎక్కడనుంచి మాట్లాడుతున్నావు?”

“ఎక్కడ నుంచి అయితే ఏముందులెండి! ఉదయ్‌ని పెళ్ళి చేసుకోక తప్పదు”

“ఆ తప్పదా?” రిసీవర్‌కి చెయ్యడ్డుపెట్టి “ఏమండీ ఇట్రండి! ఇదిగో ఆ బెంగుళూరు పిల్లలాగుంది. ఏం మాట్లాడాలో నాకు అర్ధం కావడం లేదు” అంటూ ఫోన్ ఆయనకిచ్చింది.

“హలో” అన్నాడు శంభుప్రసాద్.

“నమస్కారం మామయ్యగారు! మీతో మాట్లాడాలంటే నాకు భయంమండీ”

“నీ పేరేంటి, మా ఉదయ్ నీకెలా తెలుసు?”

“ఎలా తెలిస్తే ఏముందండి! ఉదయ్ అంటే నాకు చాలా ఇష్టం. అతనికి వేరే సంబంధాలు చూడకండి ప్లీజ్… చూస్తే ఇక నా జీవితం…”

“ఆ.. మీది బెంగుళూరా?”

ఆమె మాట్లాడలేదు

“ఇదిగో అమ్మాయ్! నిన్నే, నువ్వు బెంగుళూరు అమ్మాయివేనా అని అడుగుతున్నాను”

కాస్త ఏడుపు స్వరంలో “అత్తయ్యగారికివ్వండి ప్లీజ్” అన్నది.

“ఇదేంటే ఈ గొడవ? ఇదుగో నువ్వే కావాలంట. అసలెవరో అడుగు” అంటూ రిసీవర్ ఆమెకిచ్చాడు.

“ఇంతకూ ఎవరంటే చెప్పకుండా ఏంటమ్మాయ్ నువ్వు?” శకుంతల కాస్త స్వరం పెంచింది.

“ఇలా పెద్దవాళ్ళు లేకుండా మాట్లాడటం పద్ధతి కాదని తెలుసు. కానీ ఏం చేసేది? ప్రేమలో పడ్డ ప్రతి అమ్మాయికీ ఈ పాట్లు తప్పవు. మీరూ ఒక స్త్రీ కదా! నా బాధ అర్థం చేసుకుంటారని మీకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను”.

“ఇదిగో అమ్మాయ్! నన్ను మాట్లాడనిస్తావా?”

“అయ్యయ్యో! మాట్లాడండి అత్తయ్య గారు! కానీ నాకు మాత్రం అన్యాయం చెయ్యకండి, ఉదయ్‌ని నాకు దక్కకుండా చెయ్యకండి”

“ఇక్కడ మా ఇంట్లో పరిస్థితులు నీకు తెలియడం లేదు. అసలే బుర్రలు వేడెక్కి కూర్చున్న మాకు ఎవరో ఏమిటో చెప్పకుండా, మనిషివి కనపడకుండా ఈ ఫోనేంటి? నీ బెదిరింపులేంటి?”

“అలా అనకండి! మీకు నేను కనపడాలి అంతేగా! సాయంత్రం ఆరు గంటలకల్లా మా వాళ్ళతో కలిసి మీ ఇంటికొస్తాను”

“ఆరు గంటలకొచ్చేదానివి ఇప్పుడు ఫోనెందుకు చేసినట్లు? ఒకేసారి వచ్చి మాట్లాడొచ్చుగా?” విసుగ్గా అన్నది.

“ఒక్కసారిగా వస్తే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లుంది. అందుకే ముందు ఫోన్ చేస్తున్నాను. మీరు రమ్మన్నారుగా! ఆనందంగా ఉంది. ఆరు అయ్యేసరికి వచ్చేస్తాను.”

శకుంతల మరి మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది. ఆ తరువాత ఒక గ్రాసు నీళ్ళు త్రాగేసింది.

“ఇదెక్కడి పిల్లండీ. అటుఇటూ చేసి నేను రమ్మన్నానట, వచ్చేస్తోందట”

“మూలిగే నక్కమీద తాటికాయ పడటం అంటే ఇదే” ఒకవిధంగా మూలుగుతూనే అన్నాడు శంభుప్రసాద్.

జైలులో ఉన్న ఖైదీలు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ దంపతులు ఉదయ్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు పదకొండు కావస్తుండగా హారన్ మ్రోగింది. జీపు లోపలకొచ్చింది. ఆ దంపతులు ఎదురెళ్ళారు.

“ఇదేంట్రా ఇలా అయిపోయావు… వేళకు తిండీ, నిద్రలేదా? ముఖమంతా మాడిపోయింది” అంటూ ఒళ్ళంతా తడిమి చెయ్యిపట్టుకొని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది. ఉదయ్ బ్యాగు లోపల పెట్టి, మంచినీళ్ళు, కాఫీ పట్టుకొచ్చింది.

“కాఫీ త్రాగి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోరా, ప్రయాణం చేసి వచ్చావు. తరువాత మాట్లాడుకుందాం” అన్నాడు శంభుప్రసాద్.

“పర్లేదు నాన్నా, ఆరింటికి బయలుదేరి వచ్చాను. పెద్ద అలసటగా ఏమీ లేదు” అన్నాడు.

ఇద్దరూ కాఫీలు త్రాగారు. కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు.

“నేను దార్లొ వచ్చేప్పుడు మామయ్యతో మాట్లాడాను. స్పీకర్ పెట్టి అత్తయ్యను, సంధ్యను కూడా వినేట్లు చెయ్యమన్నాను” అన్నాడు ఉదయ్ నిదానంగా.

ఇద్దరూ ఆశ్చర్యంగా ఉదయ్ వైపు చూశారు. మాట్లాడలేదు.

“నా ప్రస్తుత విషయాలు, భవిష్యత్తులో నా ప్రణాళికలు వివరించాను. అమెరికాకు మాత్రమే కాదు గుజరాత్, రాజస్తాన్, మరే ప్రదేశాలకు వెళ్ళలేనని చెప్పాను. నా నివాసం సాధ్యమైనంత వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక పట్టణంలో ఉంటుంది, లేదా మరో పట్టణానికి మారుతుంటుంది. అంతేగానీ సిటీల్లో ఉండటం కూడా జరుగకపోవచ్చు అని కూడా చెప్పాను.

సాయంత్రానికి ఇంటికొచ్చేసే లాంటి పని నాది అసలు కాదని, నేను ప్రస్తుతం చెప్పని అసౌకర్యాలు ఇంకా ఉండొచ్చని చెప్పాను. అంతే కాదు పెళ్ళికి నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని, రేపు వచ్చి మీతో మాట్లాడి ముహుర్తాలు పెట్టుకోమని చెప్పాను” అని చెప్పి శంభుప్రసాద్ వైపు కాసేపు చూశాడు.

ఆయన నోట ఇంకా మాట రాలేదు.

“అదేంట్రా! దారిలోనే మాట్లాడి రావలసినంత హడావిడి ఏముంది. ఇంటికొచ్చాక మాట్లాడుకోవచ్చు కదా?” అన్నది శకుంతల.

“లేదమ్మా! రేపు రాత్రికి వెళ్ళిపోవాలి. మీరందరూ మాట్లాడుకుని ముహూర్తాలు పెట్టుకుంటే పెళ్ళిరోజు వస్తాను. మీరందరికీ ఎంత త్వరగా కావలంటే అంత త్వరగా ముహూర్తం పెట్టేసెయ్యండి ఫరవాలేదు” అన్నాడు ప్రశాంతంగా.

ఈసారి అవాక్కైపోవడం శకుంతల వంతు అయింది.

మళ్ళీ కాసేపు నిశ్శబ్దం. ఉదయ్ వచ్చి శంభుప్రసాద్ ప్రక్కన కూర్చున్నాడు.

“నాన్నా! మీరేమీ కంగారు పడనవసరం లేదు. నేను ఆవేశంలోనో, నిరాశలోనో ఈ మాటలు చెప్పడం లేదు. నా ఉద్దేశంలో పెళ్ళి జీవితంలో ఒక భాగం మాత్రమే. మిగిలింది చాలా ఉంది. మనం సమాజానికి కొంతైనా చెయ్యాల్సిన బాధ్యత ఉంది. వీలైనంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని నా సంకల్పం. ఎన్నో కుటుంబాలు సజావుగా జీవిస్తాయి.

నీవు మామయ్య మీద అంతగా ఎందుకు ఆధారపడ్డావో నాకు తెలీదు. పిల్లలే పెద్దయ్యాక తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా జీవించాల్సి ఉంటుంది. అలాంటిది నీవు వ్యాపారం చేసినంత కాలం ఆయన చేయూత ఉండాలని ఎందుకనుకుంటున్నావో నాకు తెలియదు. అవినీతి, రాజకీయ పలుకుబడి లేకుండా వ్యాపారాలు చేసేవాళ్ళు లేరా? అలా అయితే ఎక్కువగా సంపాదించలేము అంటావా? సంపాదనకి హద్దెక్కడుంది? అలాంటి పరుగులో కొంచమైనా ప్రశాంతత ఉందా? నేను- నా కుటుంబం అనేది అవసరం. నేను- నా సమాజం అనేది ఆనందం.

నా గురించి మీరు ఎక్కువ సంపాదించాలని ఆరాటపడటం, దానికోసం ఎవరి దగ్గరో చేతులు కట్టుకొని నిలబడటం నాకు ఇష్టం లేదు. ఆదాయం తగ్గినా ఫరవాలేదు. నేను ప్రస్తుతానికి ఇక్కడ లేకున్నా కావలంటే మీ పని ఒత్తిడి సగం భరిస్తాను. దానికి తగ్గ నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుందాము. మన ఆదినారాయణ గారి అబ్బాయి ప్రవీణ్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నాడు. మనం ఏదైనా పని చూపిస్తామెమో అని ఆయన ఆశిస్తున్నారు. అతను ఇక్కడ మనకు బాగా ఉపయోగపడతాడు. మీరు పైపైన పనులు చూసుకుంటూ కాస్త విశ్రాంతి తీసుకోండి.

మామయ్యతో అవసరం అని కాకుండా ఆనందంగా సంబంధాన్ని కలుపుకోండి. వాళ్ళు సంప్రదించుకొని రేపు మీదగ్గరకు వచ్చేలోపు మీరిద్దరూ ఆలోచించుకుని మాటలు జరపండి. మీ నిర్ణయమే నా నిర్ణయం” అన్నాడు.

ఎట్టకేలకు శంభుప్రసాద్ గొంతు పెగిలింది.

“నువ్వొచ్చినట్లు తెలుసుకొని వాళ్ళూ వచ్చి ఇంట్లో పెద్ద యుద్ధం జరుగుతుందని టెన్షన్‌తో ఉన్నాము. ఇవాళ ఇంత సీరియస్ విషయాన్ని నువ్వు అంత ప్రశాంతంగా మాట్లాడటం చూస్తుంటే నువ్వు మా ఉదయ్ వేనా అనిపిస్తున్నది. నీ ఇష్టాయిష్టాలని మా కోసం ప్రక్కనపెట్టడం నాకు కాస్త అలజడి కూడా కలిగిస్తున్నది” అన్నాడు.

శకుంతల కలుగజేసుకుంటూ ”ఉదయ్! నీకు మరో విషయం చెప్పాలి. ఎవరో అమ్మాయి ఇందాక ఫోన్ చేసి నిన్ను తప్పితే మరెవర్నీ పెళ్ళిచేసుకోనని, నీకు తనను దూరం చెయ్యవద్దని మమ్మల్ని బ్రతిమాలుతున్నట్లు, బెదిరిస్తున్నట్లు కూడా అన్నది” చెప్పింది.

ఉదయ్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ”ఎవరట ఆమె పేరు? ఎవరి నంబరుకు చేసింది?”

“పేరు అడిగితే చెప్పలేదు. బహుశా నువ్వు చెప్పిన బెంగుళూరు అమ్మాయని అనుకున్నాం. ల్యాండ్‌లైన్‌కు చేసింది”

“బెంగుళూరు అమ్మాయి అంటూ ఎవరూ లేరమ్మా! అప్పుడు ఏమి చెప్పి విషయాన్ని దాటవేయాలో అర్థం కాక అలా చెప్పాను. ఇదేదో ప్రాంక్ కాల్ అయుంటుంది. కొందరు కాలక్షేపానికి అలా చేస్తుంటారు. వదిలెయ్యండి”

“అలా అనిపించడం లేదురా. సాయంత్రం ఆరింటికల్లా వాళ్ళ పెద్దవాళ్ళను తీసుకొని వస్తుందిట”

ఉదయ్ కాస్త ఆలోచనలో పడ్డాడు.

“అమ్మా! ఆమె ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినదానిలో ఏ మార్పు ఉండదు. మీరు మీ ఇష్టప్రకారం సంతోషంగా ప్రొసీడ్ అవ్వండి. నేను కొన్ని ఆఫీసు ఫోన్లు చేసుకోవాలి” అంటూ లోపలికెళ్లాడు.

కాసేపు ఫోన్ కాల్స్, మెయిల్స్ చూసుకొని శ్రీరాం దగ్గరకు బయలుదేరాడు.

“నువ్వు ఇప్పుడు బయటకు వెళుతున్నావేంట్రా? ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేస్తే ఎట్లా?”

“ఇదేంటమ్మా! బ్లాక్ మనీ దాచినవాడు ఇన్‍కమ్ టాక్స్ వాళ్లకు భయపడినట్లు ఆ అమ్మాయి ఫోన్ కు భయపడుతున్నావు? సాయంత్రం వస్తానన్నదిగా. ఇక ఫోన్ చెయ్యదులే. ఒకవేళ చేస్తే ఆమె నెంబరు అడుగు. లేదా నాకు చెయ్యమను” అంటూ వెళ్ళిపోయాడు.

***

బాల్కనీలో కూర్చుని ఉదయ్ చెప్పిందంతా విన్నాడు శ్రీరాం.

“నీ భాషలో చెప్పాలంటే ఎవరూ ఊహించని విధంగా ఒక బ్లాస్టింగ్ చేశావు ఉదయ్!. నువ్వు పాత ఉదయ్‌వి కానే కాదు. అసలు నిన్ను చూస్తుంటే నాకు కాస్త బెదురుగా కూడా ఉంది”

“కమాన్ శ్రీరాం! అలా అనకు. నిర్ణయాలు వాయిదాలు వేసేందుకు ఒక హద్దు ఉంటుంది. అంతే కాదు కొన్ని నిర్ణయాలు చెయ్యటానికి కుండలు బ్రద్దలు కొట్టాల్సిన అవసరమొస్తుంది. పర్యవసానాలకు సిద్ధపడితేనే నిర్ణయం బలంగా ఉంటుంది”

“ఏది ఏమైనా ఇష్టంలేని పెళ్ళి చేసుకోవడం సరైన నిర్ణయం అంటావా?”

“నిర్ణయాలు అన్నీ మనకు అనుకూలంగా ఉండాలని లేదు. చెప్పాగా సిద్ధపడాలని. అన్నట్లు నీకొక తమాషా విషయం చెప్పాలి. ఉదయం ఎవరో ఒకమ్మాయి ఫోన్ చేసి మీ అబ్బాయిని నేను ఇష్టపడుతున్నాను. అతన్ని తప్ప మరెవర్నీ చేసుకోను, అతన్ని నాకు దూరం చెయ్యొద్దు అని మా అమ్మావాళ్లకు చెప్పిందిట. నేను పట్టించుకోవద్దు వదిలెయ్యమని చెప్పొచ్చాను”

“వాట్! ఎవరో అమ్మాయి కరెక్ట్‌గా ఈ సందర్భంలో ఎందుకు అలా చేసింది. పట్టించుకోవద్దని ఎందుకు చెప్పావు?”

“మరేం చెయ్యాలి? మీ నిర్ణయమే నా నిర్ణయం అని మా వాళ్లకు చెప్పేశాను. మళ్ళీ ఆమె ఎవరూ అని ఇన్వెస్టిగేషన్ చెయ్యమంటావా?”

“చెయ్యాలనే అంటాను. ఆ అమ్మాయి ఎవరికి ఫోన్ చేసింది?”

“ఎవరికీ కాదు. మా ఇంటి ల్యాండ్‌లైన్‌కి చేసిందిట”

“ల్యాండ్‌లైన్‌కా. ఆ నంబరు బయటవాళ్ళకెలా తెలుసు?”

“ఎందుకు తెలియదు టెలిఫోన్ డిక్షనరీ చూస్తే సరిపోదా”

“అలా నెంబర్లు చూసి చేసేది సాధారణంగా మార్కెటింగ్ వాళ్ళు. ఒక అమ్మాయి ఎందుకు చేస్తుంది, అదీ పెళ్ళి గురించి?”

“అయితే ఇప్పుడేమంటావు?”

“అదే, మీ ఇంటి ల్యాండ్‌లైన్ నెంబర్ నా ఉద్దేశంలో మన పాత ఫ్రెండ్స్‌లో కొందమందికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. చాలా సంవత్సరాల నుండి ఉన్నది కాబట్టి. కానీ ఇప్పుడు అందరూ మొబైల్‌కే చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో నువ్వెవరికైనా ఆ నంబరు ఇచ్చావా?”

ఉదయ్ కాసేపు ఆలోచింది, “ఆ నెంబరుగా ప్రత్యేకంగా ఎవరికీ ఇవ్వలేదుగానీ మా బిజినెస్ కార్డ్ ఇచ్చాను కొందరికి. అందులో మా ఆఫీసు, ఇల్లు ల్యాండ్ లైన్ నెంబర్లు, మా నాన్నది నాది మొబైల్ నెంబర్లు ఉంటాయి”.

“ఈ మధ్య ఎవరెవరికి ఇచ్చావు?”

మళ్ళీ కాసేపు ఆలోచింది “కొత్తపట్నంలో సత్యం అనే అబ్బాయికిచ్చాను. మా బాస్ తిరుపతి స్వామికి అదే రోజు ఇచ్చాను. ఆ… నువ్వు మీ నాన్నగారి స్నేహితుడు శ్రీధర్ గారికి ఆ నెంబరు చెప్పానన్నావు. అంతకుముందెపుడో ఆ ఇద్దరు మెడికల్ స్టూడెంట్స్‌కి ఇచ్చాను. కానీ అది పోయిందని నా మొబైల్ నెంబరు ఫీడ్ చేసుకున్నారు. దానికే చేస్తుంటారెప్పుడూ. ఇంకెవరికిచ్చానో గుర్తురావడం లేదు” అని ముగించాడు ఉదయ్.

ఉదయ్ కుర్చీలోంచి లేచి బయటకు చూశాడు. కాస్త దూరంలో కనపడుతున్న బిర్లామందిరం వైపు చూస్తూ ఉన్నాడు.

“ఏంటి శ్రీరాం! ఎక్కడికో వెళ్ళిపోయావ్? ఏడుకొండల స్వామిని క్లూ అడుగుతున్నావా?”

“ఉదయ్! మొన్న చెన్నైలో నేను నీకొక మాట చెప్పాను గుర్తుందా? నీకోసం ఎక్కడో ఒకానొక అమ్మాయి ఎదురుచూస్తోందని, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. నా సిక్త్ సెన్స్ నిజమనిపిస్తున్నది”

“ఆరోజు అలాంటి పాట వింటున్నావు. అవే మాటలు మాట్లాడుకుంటున్నాం. అందుకే అలా అనిపించి ఉంటుంది. అయినా ఆమె మళ్ళీ ఫోన్ చెయ్యడమో, రావడమో చేస్తుందట. రానీ తెలిసిపోతుంది. అయినా ఎవరొచ్చినా నా మాట మారదు. మా మామయ్యవాళ్ళకు కూడా ఫోన్ చేసి నా అంగీకారం చెప్పేశాను. మా వాళ్ళూ ఎటూ ఇష్టపడుతున్నారు”

అంతలో ఉదయ్ మొబైల్ మ్రోగింది.

“ఆ.. అమ్మా! చెప్పు”

“ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసిందిరా”

“ఏం చెప్పింది?”

“మీ అబ్బాయి వచ్చాడా అని అడిగింది. వచ్చాడు అయితే ఏంటి అన్నాను. చెప్పినట్లు సాయంత్రం ఆరుకొట్టేసరికి వస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది”.

“సరే అమ్మా! నేను కాసేపాగి బయలుదేరి వచ్చేస్తాను” అంటూ ఫోన్ పెట్టేశాడు ఉదయ్.

“ఆ అమ్మాయి మళ్ళీ చేసి సాయంత్రం ఆరు గంటలకు వస్తానని చెప్పిందిట” చెప్పాడు నవ్వుతూ ఉదయ్.

“ఈ అమ్మాయెవరో గానీ చాలా స్మార్ట్”

“అవును శ్రీరాం! మా అమ్మకు ఇక ఫోన్ రాదనుకున్నాను. మళ్ళీ వచ్చిందంటే నాకూ కాస్త ఆసక్తికరంగా అనిపిస్తున్నది. ఎనీవే సాయంత్రం వస్తానంటుందిగా చూద్దాం”

“నేను ఆ సమయానికి మీ ఇంటికొచ్చేస్తాను” అన్నాడు శ్రీరాం ఉత్సాహంగా.

“బాబు శ్రీరాం! అసలు నాకు నీ మీద కూడా కాస్త అనుమానం ఉంది. మా మామ కూతురితో సంబంధాన్ని ఆపటానికి నువ్వే ఎవర్నో ప్రవేశపెడుతున్నావనిపిస్తున్నది.”

శ్రీరాం పెద్దగా నవ్వాడు. “చూద్దాం ఆమె ఎవరో. శకుంతల ఆంటీకైతే చెప్పు నాకు మిరపకాయ బజ్జీలు చేసిపెట్టమని” అన్నాడు ఉదయ్.

“సరే నేను వెళ్ళిరానా?” అంటూ లేచాడు ఉదయ్.

ఇద్దరూ బయటకొచ్చారు. ఉదయ్ బైక్ స్టార్ట్ చేశాడు. “ఆ అమ్మాయి ఎవరై ఉంటుందీ అని ఆలోచిస్తూ డ్రైవ్ చెయ్యకు” అన్నాడు భుజం మీద చెయ్యేస్తూ.

ఇద్దరూ నవ్వుకున్నారు. ఉదయ్ ఇంటికి బయలుదేరాడు.

***

ఇంట్లో కూడా కాసేపు ఆ అమ్మాయి ఎవరై ఉంటుది? అసలు వస్తుందా? రాదా? అనే విషయం పై కాసేపు చర్చ జరిగింది. మాటలకు ముగింపు చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు ఉదయ్.

సాయంత్రం ఐదు ఆయేసరికి శ్రీరాం వచ్చేశాడు. అందరూ కబుర్లు చెప్పుకుంటూ టీ వగైరాలు తీసుకోవడం ముగించారు.

గంట ఐదున్నర దాటింది. శకుంతల గేటు వైపు పదేపదే చూస్తున్నది. అది గమనించిన ఉదయ్, శ్రీరాం చిన్నగా నవ్వుకున్నారు.

“అంటీ! ఒక పని చేద్దాం. ఆ అమ్మాయి ఎవరో చూద్దామని అందరికీ కుతూహలంగా ఉంది కాబట్టి ఘట్టం మరికాస్త రక్తికట్టాలంటే తలుపు మూసి ఉంచుదాం. కాలింగ్ బెల్ కొట్టాక తీద్దాం. అప్పుడు చూస్తే బావుంటుంది. రోడ్డు మీద వస్తున్నప్పుడే చూస్తే చప్పగా ఉంటుంది. ఏమంటారు?”

“నాకు కుతూహలంగా లేదు బాబూ! కంగారుగా ఉంది. ఘట్టంగా లేదు. గండంలా ఉంది. ఆమె ఎవరో ఎందుకొస్తున్నదో, ఏమి గొడవ చేస్తుందో అని” అన్నది. ఆమె ముఖంలో కాస్త ఆందోళన కనబడుతూనే ఉంది.

“అలా ఏమీ జరగదాంటీ! మన ఉదయ్ ఏ తప్పుచేసేవాడు, ఎవరికీ అపకారం చేసేవాడు కాదు. ఇంక కంగారెందుకు? ముందు తలుపేద్దాం” అంటూ తనే తలుపు మూశాడు.

వింతైన నిశ్శబ్దం ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంది. శంభుప్రసాద్ ఇప్పుడు సీలింగ్ వైపు చూడ్డం లేదు. నిజానికి అతని ముఖంలో ప్రస్తుతం ఏ హావభావాలూ లేవు. ఒక యోగిలా కూర్చున్నాడు.

గంట సరిగ్గా ఆరైంది. ఎవరూ తలుపు కొట్టలేదు. బెల్ కూడా మ్రోగలేదు. మరో ఐదు నిముషాలు దాటాయి. అదే పరిస్థితి.

“నువ్వు చెప్పింది నిజమేరా ఉదయ్! అది ఎవరో ఆకతాయి పిల్ల ఫోను. ఆ మాటలు విని నాకు అప్పుడే అనుమానం వచ్చింది” అంటుండగానే కాలింగ్ బెల్ మ్రోగింది.

ఎవరూ వెళ్ళి తలుపు తియ్యలేదు. మళ్ళీ మ్రోగింది. ఈసారి ఉదయ్ వెళ్ళి తలుపు తీశాడు.

ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి స్తంభించిపోయాడు. అందరూ ఆమెనే చూస్తున్నారు. ఆ అమ్మాయి ఎవరో వీళ్ళెవరికీ తెలియదు.

“రవళీ నువ్వా? నువ్వా ఫోన్ చేసింది” అనగలిగాడు మాటలు కాస్త తడబడుతున్నా.

రవళి నవ్వుతూ “ఏం ఉదయ్ నేను ఫోన్ చెయ్యకూడదా? ఎప్పుడూ నీకు చెయ్యట్లేదా?”

“ఆ ఫోన్లు వేరు ఈ ఫోను……”

“ఎవర్రా ఉదయ్ ఈ అమ్మాయి?” అంటూ ముందుకొచ్చి నిలబడింది శకుంతల.

“నిజమే ఉదయ్ ఆ ఫోన్లు వేరు ఆ మాటలు వేరు. ఈ ఫోను వేరు, ఆ మనిషి వేరు”

“అర్థం కాలేదు రవళి”

“ఫోను కాల్ నాదే… కానీ…..”

“కానీ…. ఏంటో చెప్పు”

“మాట్లాడింది నాకోసం కాదు” అంటు వెనక్కి తిరిగింది.

అందరూ అటుగా చూశారు. అరుణ నిదానంగా లోపలికి అడుగు పెట్టింది.

ఆమెను చూస్తూనే “అరుణా” అని పెద్దగా అన్నాడు ఉదయ్.

క్షణాల్లో అతని కళ్ళు చెమర్చాయి. ఆమె కళ్ళు కూడా జత కలిశాయి.

“అమ్మా! అచ్చం నీలాగా మాట్లాడుతుందని చెప్పానే ఆ అమ్మాయే ఈ అరుణ” చెప్పాడు.

ఆమె ప్రక్కన అరుణ తండ్రి వచ్చి నిలబడ్డాడు.

“మా నాన్నగారు రాఘవరావు గారు” పరిచయం చేసింది.

కూర్చోమన్నట్లుగా చెయ్యి చూపాడు శంభుప్రసాద్. అందరూ కూర్చున్నారు. శంభుప్రసాద్, శకుంతల అరుణని చూస్తూ ఉన్నారు.

“ఏమిటిది రవళి! నాకు అర్థం కావడం లేదు” అన్నాడు ఉదయ్.

రవళి ఉదయ్ తల్లిదండ్రుల వైపు చూస్తూ “అరుణ ఉదయ్‌ని ఇష్టపడుతున్నది. నిజానికి ఉదయం ఫోన్ అరుణ చెయ్యాల్సింది. ఎన్నిసార్లు అడిగినా తను సందిగ్ధంలోనే ఉంది. సమాధానం లేదు. నా స్నేహితురాలి కోసం నేను ముందడుగు వెయ్యదలుచుకున్నాను. నేనే ఫోన్ చేశాను. నేను ఎవరితోనైనా ముందు బాగనే మాట్లాడటం మొదలు పెడతాను. అంతలోనే కాస్త చొరవ తీసేసుకుంటాను. పెద్దలు ఇద్దరూ నన్ను మీ అమ్మాయిగా భావించి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించమని కోరుతున్నాను” అంటూ నమస్కరించి అరుణ వైపు తిరిగి “నువ్వు మాట్లాడాల్సిన సమయం వచ్చింది అరుణ!” అన్నది.

అరుణ మాట్లాడటం మొదలు పెట్టింది. “పెద్దలకి నమస్కారం! రవళి చెప్పిన మాటలు నిజంమైనంత మాత్రాన ఒక ఆడపిల్ల ఇలా ఏకపక్షంగా ముందడుగు వెయ్యడం సమంజసం కాదేమో అని నాకు ఇప్పటికీ అనిపిస్తున్నది.

ఉదయ్ నేను డాక్టర్ని కాబట్టి డాక్టర్నే పెళ్ళి చేసుకుంటానని భావించాడు. కానీ తను నన్ను ఇష్టపడుతున్నాడని నేను గ్రహించాను. ఇద్దర్లో ఏ ఒక్కరమూ ముందడుగు వెయ్యలేకపోయాం. అందుకు నా చదువు, అతని ఉద్యోగ ప్రయత్నాలు కొంత కారణం కావచ్చు. అంతస్తుల్లో తేడా కూడా నాకు అడ్డు నిలుస్తుండేది. ఒక్కోసారి తనకు ఇష్టం లేకపోయినా పెద్దల మాట ప్రకారం తన మామ కూతుర్ని చేసుకుంటాడెమో అనే ఆలోచన కూడా నన్ను వెనక్కు లాగేది. ఏది ఏమైనా ఉదయ్ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఎప్పటికప్పుడు సరిపెట్టుకునేదాన్ని. ఇప్పుడు పరిస్థితి చెయ్యి జారిపోతున్నదని రవళి చూపిన చొరవకు నేను లోబడిపోయాను. అందుకు కారణం ఉదయ్ మీద నాకున్న ఇష్టం అని చెప్పదలుచుకున్నాను.

ఇప్పుడు ఈ విధంగా వచ్చి మీ ముందు నిలబడతాననుకోలేదు. నా వివరాలికొస్తే మా నాన్న ఒక చిన్న రైతు. కష్టపడి నన్ను చదివిస్తున్నాడు. నామీద ప్రేమ, నమ్మకం రవళి ప్రయత్నాన్ని విభేదించకుండా ఆయన్ను ఇక్కడికి తీసుకొచ్చాయి.

నాకు తొమ్మిదేళ్ళ వయసులో మా అమ్మ మా పల్లెలో సరైన వైద్య సదుపాయం లేక చనిపోయింది. కాబట్టి వీలైనంత మంది అమ్మల్ని కాపాడటమే లక్ష్యంగా జీవించాలని మెడిసిన్ చదివాను. ఆ క్రమంలో బ్రతకడానికి కావల్సినంత మాత్రమే సంపాదించదలిచాను. డాక్టరుగా వైద్యాన్ని వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలని నేను అనుకోవడం లేదు. నాకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు మీ ముందు ఉంచాను.

చిత్రమైన పరిస్థితి కల్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టటానికి కారణం ఉదయ్ మీద నాకున్న ఇష్టం. మీ అభిప్రాయం ఇప్పుడే చెప్పాలని లేదు. ఎప్పుడు చెప్పినా అది నాకు అనుకూలమా ప్రతికూలమా అనేది నేను ఆలోచించట్లేదు. అంతకు మించి ఇంకా చెప్పి మిమ్మల్ని విసిగించడమూ సమంజసం కాదు” అని చెప్పడం ఆపింది.

గంభీర వాతావరణం కాసేపు కొనసాగింది.

శకుంతల వెళ్ళి అరుణ ప్రక్కన కూర్చుంది. “నీ గురించి మావాడు అప్పుడప్పుడూ చెబుతుంటాడు. నీవు చక్కగా ఆలోచిస్తావని, సంకట స్థితిలో ఉన్నపుడు నీ సలహా తీసుకుంటానని చెబుతుంటాడు. నిన్ను చూడకపోయినా నువ్వంటే మాకు చాలా మంచి అభిప్రాయం ఉందమ్మా అరుణా! కానీ ఇప్పుడు పరిస్థితి చాలా అయోమయంగా ఉంది” అని ఆమె చెబుతుండగా శంభుప్రసాద్ తన మొబైల్ నుండి ఎవరికో ఫోన్ చేసి ”హలో” అన్నాడు కాస్త బిగ్గరగా. అందరి దృష్టి ఆయనవైపు మళ్ళింది.

“ఆ బావా! ఏం చేస్తున్నావు? నీకొక శుభవార్త చెబుదామని ఫోన్ చేశాను. మా ఉదయ్‌కి మంచి సంబంధం కుదిరింది. ఆ.. అరుణ అని వాడికి తెలిసినమ్మాయే. వాళ్ళూ వచ్చి మాట్లాడారు. నిశ్చయం కూడా అయిపోయింది. అంతా హడావిడిగా జరిగింది. నిన్ను పిలిచే సమయం కూడా దొరకలేదు. వచ్చే నెల పదో తారీఖు పెళ్ళి. నిన్ను స్వయంగా వచ్చి పిలుస్తాను. ఉంటాను మరి” అంటూ ఫోన్ పెట్టేశాడు.

ఉదయ్ శంభుప్రసాద్ వైపు ఆశ్చర్యంగా చూశాడు.

“అనూహ్యంగా మాట్లాడి అందర్నీ ఆశ్చర్యపరచడం నీకేకాదు నాకూ తెలుసు” అన్నాడు శంభుప్రసాద్.

“వావ్ అంకుల్ ఫెంటాస్టిక్! అంటూ ఒక మోస్తరు కేక పెట్టింది రవళి.

ఆనందమయ వాతావరణం అంతటా అలుముకుంది.

శ్రీరాం గొంతు సవరించుకుంటూ “ఇంకా నాకొక సందేహం వేధిస్తున్నది. అసలు ఈ ల్యాండ్‌లైన్ ఫోన్ నెంబరు మీకెలా తెలుసు. దానికే ఎందుకు చెయ్యటం జరిగింది?” అడిగాడు రవళి వైపు చూస్తూ.

“అదా! అందుకు పెద్ద కారణమంటూ ఏమీ లేదు. మొట్టమొదట ఉదయ్ మాకు పరిచయం అయినప్పుడు మాకు వీలైనప్పుడు ఫోన్ చెయ్యమని తన దగ్గర ఉన్న బిజినెస్ కార్డ్ ఇచ్చి వెళ్ళాడు. ఆ కార్డుతో మనకు అవసరం లేదంటూ అరుణ దాన్ని పార్క్ గోడ మీద పెట్టేసింది. మేమిద్దరం ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాం. కొద్ది దూరం వెళ్ళి వెనక్కి చూద్దును కదా అరుణ వచ్చి ఆ కార్డు తీసుకుంటూ కనపడింది. అక్కడే నాకు అరుణ మనసు అర్ధమైంది.

అయినా నేను అరుణని అడగలేదు. తన కారణాలవల్ల తను నిర్ధారించుకోలేక నాకు చెప్పలేదేమో అనుకుని ఊరకున్నాను. రానురాను ఉదయ్‌పై వస్తున్న ఒత్తిడి అతని ద్వారానే వింటుంటే, ఉదయ్ అరుణకు దక్కడేమో అనే ఆందోళన నాలో మొదలైంది. ఇక ఆలస్యం కూడదని ఈ మధ్యనే అరుణతో మాట్లాడి అతి కష్టం మీద ఆమె అంతరంగాన్ని తెలుసుకున్నాను. వెంటనే విషయాన్ని ఎలాగైనా ముందుకు తీసుకరావాలని నిర్ణయించుకున్నాను.

నేను మొదట ఉదయ్ అమ్మగారితో మాత్రమే మాట్లాడాలనుకున్నాను. ఆమె నంబరు ఆ కార్డులో లేదు. అందుకే ల్యాండ్‌లైన్‌కి చేశాను. ఆమెతో మాట్లాడాను. అంకుల్‌తో కూడా ధైర్యం చేసి మాట్లాడగలిగాను.

అనుకోకుండా ఒక ఉత్కంఠ భరితమైన వాతావరణం ఏర్పడింది. నేను కాస్త ఓవర్ యాక్షన్ కూడా చేశాననిపించింది. ఏమి చెయ్యబోయానో ఏమౌతుందో అని గాభరా పడ్డాను. చివరికి సుఖాంతమై బ్రతికి బయటపడ్డాను” అన్నది నమస్కారం పెట్టి పైకి చూస్తూ.

అందరూ నవ్వుకున్నారు.

సాయం సంధ్యలో సంభవించిన అరుణోదయానికి అందరి ముఖపద్మాలు వికసించాయి.

// సమాప్తం//

Exit mobile version