Site icon Sanchika

ఉదయ రాగం-3

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]కా[/dropcap]సేపు నిశ్శబ్దం తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది.

కానీ వెంటనే అందుకున్నాడు శంభుప్రసాద్ “ఏం మాట్లాడుతున్నావురా? మేనరికాలు ఎందుకు చేసుకోవట్లేదు? లక్షణంగా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ పిల్లను చిన్నప్పుడు నువ్వు ఆడిస్తే పెళ్ళి చేసుకోకూడదని ఉందా? అప్పుడు నువ్వు మటుకు చిన్నవాడివి కాదా? ఇక్కడ నీ నా ఉద్దేశాలకు తావులేదు. నీకు తెలుసు మామయ్య మనకు ఎంత మేలు చేశాడో. నేను ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈ మాత్రం స్థిరపడ్డానంటే మీ మామయ్య తన శక్తికి మించి ధనసాయం చెయ్యడమే కాదు తన పరపతిని కూడా పూర్తిగా వినియోగించాడు. అందుకు కారణం నేను తన చెల్లెలి భర్తనని మాత్రమే కాదు, తన కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చెయ్యాలని కూడా. మీ అమ్మకూ ఈ సంబంధం బాగా ఇష్టం. నువ్వు అడ్డం తిరుగుతావని మేమూ ఊహించలేదు” అన్నాడు కాస్త సీరియస్‌గా ముఖం పెట్టి.

“ఆయనకు ఇవ్వాల్సిన డబ్బు ఎప్పుడో తీర్చేశానన్నావు కదా?” అంటూ చిన్నగా నసిగాడు ఉదయ్.

“డబ్బుతోనే అంతా అయిపోతుందా?”

“ఆ అమ్మాయి వేషభాషలు కూడా నాకు నచ్చవు నాన్నా! మరీ టూమచ్‌గా ఉంటుంది”

“అవన్నీ తరువాత మెల్లగా సర్దుకుంటాయి. అసలు ఒక్కమాటరా ఉదయ్! మనం ఈ సంబంధం కాదనగలిగే అవకాశమే ఇక్కడ లేదు. ఎక్కువ చర్చించి ఉపయోగమూ లేదు. ఇందులో నువ్వు ఆలోచించుకొని చెప్పాల్సింది కూడా లేదు. కేవలం కూర్చొని నిన్ను నువ్వు సమాధాన పరుచుకొని మన కుటుంబ శ్రేయస్సు కోసం సరే అనడమే మిగిలింది. అది ఎంత త్వరగా చెబుతే అంత మంచిది. నాకు బైట పనుంది వెళ్ళొస్తా” అంటూ వెళ్ళిపోయాడు.

తల్లీ కొడుకులు విగ్రహాల్లా కాసేపు కూర్చుండిపోయారు.

శకుం తల ఉదయ్ బుజం మీద చెయ్యివేసి “బయటకెళ్లి ఊద్యోగం చేసే విషయం నాన్నకు చెప్పమని నన్ను చాలా సార్లు అడిగావు. కాదనటమే కాదు ఇల్లు పీకి పందిరేస్తాడని నాకు తెలుసు. అందుకే ధైర్యం చెయ్యలేదు. కానీ ఆశ్చర్యం! ఇప్పుడు ఒప్పుకున్నాడు. అదీ ఈ పెళ్ళి ప్రస్తావన కారణంగా అయుండొచ్చు. నీవు ఇప్పుడు ఇది కాదంటే ఆయన అది కాదంటాడు. నీ ఉద్దేశం చెప్పావు. బాగనే ఉంది. కానీ అది మార్చుకోలేనం తదేమీ కాదని నా అభిప్రాయం. అంతకు మించి నేను చెప్పగలిగిందీ ఏమీ లేదు” అన్నది నిట్టూరుస్తూ.

“నేను మరోసారి నాన్నతో మాట్లాడే ప్రయత్నం చేస్తా”

“అనవసరంగా రగడ చేసుకోకు. మీనాన్న ఎప్పుడూ వ్యాపార గొడవల్లో సతమతమౌతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో తెలియదు. ఇవాళ ఈ విషయం ఇంత ప్రశాంతంగా మాట్లాడాడంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. అన్నీ ఆలోచించే ఆయన చెబుతున్నాడని నాకూ అనిపిస్తున్నది. స్థిమితంగా కూర్చొని ఆలోచించు” అంటూ వంట గదివైపు వెళ్ళిపొయింది.

ఉదయ్ అసహనంగా వెళ్ళి బాల్కనీలో కూర్చున్నాడు. కాసేపు ఆగి అరుణకు ఫోన్ చేశాడు.

“హాయ్ ఉదయ్” బదులిచ్చింది అరుణ.

“అరుణా! రెండు నిముషాలు మాట్లాడొచ్చా?”

“చెప్పు ఉదయ్!”

“నువ్వు చెప్పినట్లు మా నాన్నతో ప్రశాంతం మాట్లాడాను. ఆయన కూడా అంతకంటే ప్రశాంతంగా మాట్లాడి సరే అంటూనే మరో మెలిక పెట్టాడు. నేను చెప్పలేదూ? మా నాన్నకు అటు చాణుక్యుని ఎత్తులు, ఇటు శకుని జిత్తులు రెండూ వెయ్యడం తెలుసు”.

అరుణకు కొద్దిగా నవ్వొచ్చినా ఆపుకొని “అసలేం జరిగిందో చెప్పు” అడిగింది.

జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు.

“మీ నాన్న చెప్పింది బాగనే ఉందిగా”

“ఏంటి బాగుండేది? నాకు ఆ పెళ్ళి అస్సలు ఇష్టం లేదు”

“ఉదయ్! నువ్వెవర్నైనా ప్రేమించావా?”

“నా మొహానికి అదొక్కటే తక్కువ. ఆట పట్టించకుండా ఇప్పుడేం చెయ్యాలో చెప్పు”

“ఇప్పటికిప్పుడు ఫోన్లో నేను మటుకు ఏం చెప్పేది? పైగా మీ కుటుంబ సభ్యులు, మీ మామయ్య, ఆ అమ్మాయి గురించి నాకేం తెలుసు? ఒక్కటి చెప్పగలను. ఈ విషయానికి సంబంధించిన మిగిలిన ముఖ్యమైన వాళ్ళతో కూడా మాట్లాడు. ఏదైనా దారి దొరకొచ్చు. అప్పుడు ఒక నిర్ణయానికి రావొచ్చు.”

“అలాగే అరుణా, ప్రస్తుతానికి నీకు చెప్పాలనిపించి కాల్ చేశాను. ఉంటాను”

ఆమె చిన్నగా నవ్వుకుంటు ఫోన్ పెట్టేసింది.

***

రాత్రి భోజనాలు దగ్గర ఎదురెదురుగా కూర్చున్నా ఏమీ జరగనట్లు తాపీగా భోజనం చేసి వెళ్ళిపోయాడు శంభుప్రసాద్. పదకొండు దాటినా ఉదయ్‌కి నిద్రపట్టలేదు. ఆలోచిస్తూ అటుఇటు పొర్లుతున్నవాడు కాస్త ఒక్కసారిగా లేచి మొబైల్ అందుకొని అమెరికాలో ఉన్న తన అక్క స్పందనకు ఫోన్ చేశాడు. కుశల ప్రశ్నలు తరువాత “నాకు నీ సపోర్ట్ కావాలక్కా” అంటూ విషయం మొదలు పెట్టాడు.

“అమ్మ ఫోన్ చేసి నాకు అం తా చెప్పిందిరా ఉదయ్! నాకూ కాస్త అయోమయం గానే ఉంది. ఇది నేనూ ఊహించని విషయం. నిన్ను ఒప్పిం చమని నాన్న చెప్పాడని కూడా అమ్మ నాతో చెప్పింది. మళ్ళీ వాళ్ళను అడగకు. నిన్ను ఒప్పించాలని నా ప్రయత్నం కాదుగానీ, నువ్వు కూడా కేవలం ఇష్టం లేదు అనే కారణం కాకుండా మరేదైనా చెప్పి చూడు. అది కన్విన్సింగ్‍గా ఉండేలా చూడు” అన్నది.

“అవన్నీ అయ్యాయక్కా! కానీ అన్నీ కొట్టిపారేస్తున్నారు. నేను బయటకెళ్ళి ఉద్యోగం చూసుకునే సంగతి కంటే ఈ పెళ్ళి విషయం ఒక పెద్ద సమస్యగా నాముందు పెట్టారిప్పుడు”.

“ప్రస్తుతం నేనూ ఏమీ చెప్పలేన్రా! ఏదైనా ఐడియా తడితే చెబుతాను. ఎనీవే టేక్ కేర్, ఉంటాను బై” అంటూ ఫోన్ పెట్టేసింది స్పందన.

తదేకంగా సీలింగ్ ఫ్యాన్ వైపు కళ్ళప్పగించి చూస్తూ పడుకున్నాడు ఉదయ్. అది హిప్నటైజ్ చేసినట్లుగా కాసేపటికి చిన్నగా నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయ్ ఉత్సాహంగా నిద్రలేచాడు. తొందరగా తయారయ్యి తొమ్మిది గంటలకల్లా నారాయణగూడలో ఒక డిగ్రీ కాలేజీ దగ్గరకు చేరాడు. కాసేపటికి తన మామ కూతురు సంధ్య కనపడింది. దగ్గరకెళ్ళి “హాయ్ సంధ్యా! నీతో కొద్దిగా మాట్లాడాలి” అడిగాడు. అతను హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షం కావడంతో కలిగిన ఆశ్చర్యాన్నుంచి తేరుకొని “సరే పద” అంటూ కాలేజీ ఆవరణలో మూలగా ఉన్న చెట్టు దగ్గరకు దారితీసింది సంధ్య.

తన నాన్నతో జరిగిన సంభాషణని చెప్పగలినంత వరకూ ఆమెకు చెప్పి “నిన్నొక మాట అడగొచ్చా?” అన్నాడు.

“అడుగు”

“నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకున్నావా? నీకు నిజంగా ఇష్టమేనా?”

“నిన్నెవరు ఇష్టపడరు?”

“నీ సంగతి చెప్పు”

“పప్పా అడిగితే సరేనన్నాను”

“సంధ్యా! నువ్వేమీ సంకోచించనవసరం లేదు. నీకేమాత్రం అసంతృప్తి ఉన్నా నాకు చెప్పు”

కొద్దిసేపు ఆగి నిదానంగా చెప్పింది “నువ్వు అడిగావు కాబట్టి చెబుతున్నాను. నాకైతే అమెరికా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని ఉంది. నువ్వు మీ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండేట్లు కనబడుతున్నావు. ఆ విషయమే మా పప్పాతో చెప్పాను. ‘అవన్నీ తరువాత నేను చూసుకుంటాలే’ అన్నాడు. బహుశా నిన్ను ఒప్పిస్తారేమో అనుకున్నాను”

“నాకు అమెరికాలో సెటిల్ అవ్వడమంటే అసలు ఇష్టం లేదు సంధ్యా! అది జరిగే పని కాదు. నీకున్నట్లే నాకు కొన్ని అభిప్రాయాలు, అసంతృప్తులు ఉన్నాయి. నిన్ను చిన్నప్పటినుంచీ ఎరుగుదును. మంచమ్మాయివి. కానీ నీతో పెళ్ళి ఆలోచనలు నాకెప్పుడూ కలగలేదు. ఈ విషయాలన్నీ పెద్దవాళ్ళతో గట్టిగా డిస్కస్ చెయ్యలేను. పెద్దవాళ్ళకోసం మన అభిప్రాయాలూ అభిరుచులు చంపుకోవడమేనా? అలా చేసి తరువాత మనం సుఖంగా ఉండగలమా అనేదే నా ఆలోచన”

“ఏం చెయ్యాలంటావ్? నాకైతే పప్పాతో మాట్లాడే ధైర్యం లేదు”

“ఒకవేళ ఈ పెళ్ళికి ఏదో విధంగా బ్రేకు పడితే మీ ఇంట్లో నువ్వూ దానికి అనుగుణంగా ప్రవర్తించగలవా?”

“అలాంటి పరిస్థితి వచ్చినపుడు ప్రయత్నిస్తాను. కానీ ఏ సంగతీ ప్రామిస్ చెయ్యలేను. చూడబోతే నువ్వెవరినో లవ్ చేసినట్లున్నావు, అవునా?”

అనుకోని ఆ ప్రశ్నకి అతను కాసేపు మౌనంగా ఉన్నా చిన్నగా నవ్వుతూ “అలాంటిదే అనుకో! ఎనీవే, థ్యాంక్యూ సంధ్యా! నేను అనుకున్నదానికంటే మెచ్యూర్డ్‌గా మాట్లాడావు. నేను ఇలా మాట్లాడుతున్నానని ఏమీ బ్యాడ్‌గా ఫీలవట్లేదుగా?”

“నోనో అలాంటిదేమీ లేదు. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. పైగా నాకూ ఈ విషయంలో పెద్దగా ఏ ఆలోచనలు, ఇష్టాయిష్టాలు లేవు”

ఆ మాటకి అతను కొద్ది క్షణాలు మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు.

“ఒకే సంధ్యా! నేను వెళ్ళిరానా? ఈ విషయంలో ఎవరికి అవసరమైనా ఫోన్ చేసుకుందాం”

“అలాగే బై!” అంటూ సంధ్య కాలేజీ లోపలకు వెళ్ళిపోయింది.

వెళుతున్న ఆమెవైపు చూస్తూ ఉండిపోయాడు. అతని పెదవులపై ఓ చిరునవ్వు చిగురించింది.

బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి బయలుదేరాడు.

ఆ రాత్రి భోజనాల సమయం. శంభుప్రసాద్ ఇంకా ఇంటికి రాలేదు. ఉదయ్‌కి భోజనం వడ్డించి లోపలికెళుతున్న శకుంతలతో “అమ్మా కాసేపు నీతో మాట్లాడాలి” అన్నాడు.

“ఒరేయ్! నువ్వు ఏదైనా మాట్లాడతానంటే నాకు భయమేస్తుందిరా!”

“నువ్వు కూడా అట్లా అంటే ఇక నేనెవరికి చెప్పుకోను?” ముఖం కాస్త విచారంగా పెట్టాడు.

“సరే, త్వరగా చెప్పు. మీ నాన్న వచ్చే టైమైంది”

“మరే నేను… నేను..”

“అసలే ఈ మధ్య ఇల్లు రణరంగంలా ఉందేంటి భగవంతుడా! అని భయపడి చస్తుంటే మధ్యలో అర్థం కాకుండా ఈ సిగ్గేమిట్రా? “

“ఇంతకాలం మీకెవ్వరికీ చెప్పలేదు. నేనొక అమ్మాయిని ప్రేమించాను” అన్నాడు.

శకుంతలకు కళ్ళు క్షణాల్లో బయర్లు కమ్మాయి. కాసేపటికి తేరుకొని ఒక గ్లాసు నీళ్ళు గటగటా త్రాగేసింది.

“ఏంట్రా? నువ్వు ఎవర్నో ప్రేమించావా?” ఎలాగో ఆ నాలుగు పదాలు అనగలిగింది.

“ఏంటమ్మా అట్లా అంటున్నావు. నేను అందుకు తగనా?”

“అని కాదురా, ఈ కాలం ఆడపిల్లలు ఎట్లా ఉన్నారు? చేసుకోబోయేవాడు సినిమా హీరోలా ఉండాలి. గడ్డాలు మీసాలు, తలమీద కొప్పులూ పెట్టుకొని అదేంటీ ఆ..ట్రెండీగా ఫ్యాషన్‌గా ఉండాలి. నీకేమో అన్నీ మీ తాత బుద్దులొచ్చాయి. సాదాసీదాగా ఉంటావాయె. అందుకు అడుగుతున్నాను”

“ఈలోకంలో ఎవరికి తగ్గవాళ్ళు వాళ్ళకు ఉంటారమ్మా!. నువ్వు ఎలాగైనా సరే నాన్నకు ఈ విషయం చెప్పి ఒప్పించాలి. ఆ పెళ్ళి ఆపించాలి”

“ఆ పెరుగు ఇటెయ్యి, తిన్న తరువాత ఈ ప్లేటు తీసి అటు సింకులో వెయ్యి అన్నంత సులభంగా చెప్పేశావేంట్రా? నాకిప్పుడే కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి”

చెయ్యి కడుక్కొని వచ్చి శకుంతల ప్రక్కన తనూ కుర్చీ జరుపుకొని కూర్చున్నాడు ఉదయ్.

“నువ్వు చెప్పేది నిజంగా నిజమేనంటావా? అమ్మని ఒక్కమాట కూడా చెప్పాలనిపించలేదురా ఇప్పటిదాకా?”

అతనేదో చెప్పబోయాడు. అంతలో ఇంట్లోకి అడుగు పెట్టాడు శంభుప్రసాద్.

***

శంభుప్రసాద్ వస్తూనే హాల్లో కూర్చున్న తల్లీకొడుకులను చూసి ఎదురు సోఫాలో కూర్చున్నాడు. కొడుకును చూసి ఒక చిరునవ్వు చిందించాడు. “ఇంతకీ ఎవర్రా ఆ అమ్మాయి? మనోళ్ళేనా? ఆస్తిపాస్తులు ఏమాత్రం ఉంటాయి? హైద్రాబాద్ లోనే ఉంటారా? వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడు?” ఒక్కొక్క ప్రశ్న నిదానంగా సున్నితంగా ఉదయ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు.

దిగ్భ్రమ నుంచి కోలుకోవడానికి ఉదయ్‌కి శకుంతలకి కాస్త సమయం పట్టింది.

ఉదయ్‍కి కాస్త కోపం, దాన్లోంచి కొద్దిగా ధైర్యం కూడా తోసుకొచ్చింది.

“అయితే సంధ్య వెంటనే మామయ్య వాళ్ళకు నేను తనని కలిసిన విషయం చెప్పేసిందన్నమాట. దీన్నిబట్టే అర్థమౌతున్నది కదా నాన్నా! ఆ అమ్మాయికి ఎదుటివాళ్ళ మనోభావాలు అసలు పట్టవని. నేను ఎంతో నిదానంగా మాట్లాడి వచ్చాను. సమయం తీసుకుందామని, అవసరమైతే ఫోన్లో మాట్లాడుకుందామనీ చెప్పాను. కానీ నిముషంలో కుండ బద్దలు కొట్టేసింది. ఆమెపై నాకున్న అభిప్రాయం మరోసారి నిజం చేసింది”

“అసలు సంధ్యని కలవాలని ఎందుకనిపించింది?” శంభుప్రసాద్ సహనం ప్రదర్శిస్తూనే ఉన్నాడు.

“కలిస్తే తప్పేముంది? ఆమె మనసూ తెలుసుకోవద్దా? మా ఇద్దరి అభిప్రాయాలు మీ ఇద్దరికీ తెలియొద్దా? విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి నేనూ చెబుతున్నాను. ఆమెకు నేనంటే ఇష్టం లేనే లేదు. పెళ్ళైతే నాతో సరిగా ఉంటుం దన్న నమ్మకం నాకు అసలే లేదు. నేను కలవడం వల్ల ముందే వదిలించుకునే ఛాన్స్ ఏర్పడిందనుకుంటా. వెంటనే ఉపయోగించుకుంది”

“ఆ పిల్ల సంగతి సరే, హఠాత్తుగా ఈ ప్రేమ వ్యవహారమేంటి? నాకైతే నమ్మకం కుదరట్లేదు” విషయం మళ్ళీ ఇటు తిప్పాడు శంభుప్రసాద్.

“అవును, ఆ అమ్మాయి నాకు డిగ్రీలో క్లాస్‌మేట్. ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం. డిగ్రీ తరువాత వాళ్ళు బెంగుళూరు వెళ్ళిపోయారు. ఈ మధ్యనే ఫోన్లో మాట్లాడుకున్నాం. తనే ప్రపోజ్ చేసింది. చాలా మంచమ్మాయి. వాళ్ళ ఆస్తిపాస్తులు గురించి నాకు తెలియదు. వాళ్ళ నాన్న స్కూల్ టీచర్ అని మాత్రం తెలుసు” తల కాస్త పైకి ఎత్తుతూ దింపుతూ నిదానంగా చెప్పాడు.

“మరి ఇన్నాళ్ళూ మాకెందుకు చెప్పలేదు?”

“పెళ్ళి ప్రసావన వచ్చినపుడు చెబుదామనుకున్నాను. కానీ ఈ విధంగా వస్తుందనుకోలేదు”

“ఇంతకీ మా అన్నయ్య ఏమన్నాడు? మీరు వాళ్ళింటికి వెళ్ళొచ్చారా?” నిదానంగా చర్చను మళ్ళీ అటు తిప్పింది శకుం తల.

“రిజిష్ట్రార్ ఆఫీసు దగ్గర కలిశాం. వాళ్ళమ్మాయి ఏం చెప్పిందో చెప్పలేదు. తను మాత్రం “మీవాడికేదో ప్రేమ వ్యవహారం ఉందిట కదా? నీకు తెలిస్తే నాతో చెప్పేవాడివేగా, కాబట్టి అంత దూరం రాలేదన్నమాట. ఇవన్నీ కాలేజీల్లో చదివేప్పుడు మామూలే. ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకొని ఎంతమంది సంవత్సరం తిరక్కముందే విడాకులంటూ కోర్టుల చుట్టూ తిరగుతున్నారో మనం చూడ్డం లేదూ? గట్టిగా మనమే పిల్లల్తో మాట్లాడి ఆ రొంపిలో పడకుండా వాళ్ళను దారిలో పెట్టాలి. ఇక్కడెందుకులే ఈ మాటలు, రెండుమూడు రోజుల్లో నేనే మీ ఇంటికొచ్చి మాట్లాడుతాను. ఈలోగా ఉదయ్‌కి నచ్చజెప్పండి అంటూ వెళ్ళిపోయాడు.”

“మీ అన్నయ్య ఈ విషయం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు లేదు. లేకపోతే అక్కడే గొడవచేసేవాడు. నువ్వే మీ అన్నయ్యతో ఒకసారి ఫోన్లో మాట్లాడి సముదాయించు, ఇక్కడ నీ కొడుకుని సమాధానపరుచు, అర్థమైందా?” అని చెప్పడం ముగించి తన గదిలోకి వెళ్ళిపోయాడు శంభుప్రసాద్.

“చూశావా అమ్మా! ఆ అమ్మాయి మామయ్యకు నేను మాట్లాడిందం చెప్పి తనకు ఇష్టం లేదని కూడా చెప్పే ఉంటుంది. ఇక్కడ నేను చెప్పవలసిందంతా నాన్నకు చెప్పేశాను. కానీ మా ఇద్దరి మాటలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదు”

“అవున్రా! నాకూ ఈ విషయం కాస్త గందరగోళంగా కనపడుతున్నది. రేపు మామయ్యకు ఒకసారి ఫోన్ చేస్తాలే. ఏది ఏమైనా నువ్వు ఉద్రేకపడకుండా ఉండరా. మీ నాన్నతో గొడవలు పెట్టుకోవద్దు.” అన్నది. ఆమె కళ్ళలో నీళ్ళు తిరగడం ఉదయ్ గమనించాడు.

“నువ్వు నా గురించి ఏమీ భయపడకమ్మా. ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాను. నాకు ఈ పెళ్ళి వద్దుగాక వద్దు. ఈ విషయంలో నువ్వు కూడా నాకు నచ్చచెప్పే ప్రయత్నం చెయ్యొద్దు. నాకు ముందు ఉద్యోగం కావాలి. నాన్నకు ఎటూ చెప్పాను కాబట్టి నా ప్రయత్నాలు చిన్నగా మొదలు పెడతాను. మరో విషయం, రేపు ఉదయాన్నే ఒక పనిమీద విజయవాడ వెళుతున్నాను. మళ్ళీ రాత్రికి వచ్చేస్తాను. నాన్న అడిగితే చెప్పు.”

శకుంతల ఒక నీరసపు నిట్టూర్పు విడిచింది.

***

తరువాత రోజు సాయంత్రం విజయవాడ ఏలూర్ రోడ్‌లో పద్మజా ఫార్మాస్యుటికల్స్ అనే బోర్డ్ చదువుతూ ఆ బిల్డింగ్ లోపలికి అడుగు పెట్టాడు ఉదయ్.

“వాళ్ళిద్దరి తరువాత మీరెళ్ళండి” అన్నాడు ప్యూన్, అక్కడున్న వాళ్ళను చూపిస్తూ.

ఆ గది బైట “దుర్గాప్రసాద్- మేనేజింగ్ పార్టనర్” అనే బోర్డు చుశాడు. అది బాగా పాతబడి ఉంది. సంస్థ సీనియారిటీని తెలియజేస్తూ.

ఇరవై నిముషాల తరువాత లోపలికి వెళ్ళే అవకాశం వచ్చింది.

“గుడీవినింగ్ సర్, నా పేరు ఉదయ్. ఇవిగోండి నా సర్టిఫికేట్స్” అంటూ ఒక కవరులోంచి అవి తీసి ఇవ్వబోయాడు.

ఉదయ్‌ని కాస్త పరిశీలనగా చూస్తూ “సర్టిఫికేట్స్ తరువాత చూడొచ్చులే! క్లుప్తంగా వివరాలు చెప్పు. ఏం చదివావు? ఎక్కడుంటావు? ఇప్పుడేం చేస్తున్నావు?” అడిగాడు దుర్గాప్రసాద్.

“యం.కాం చేశానండి, హైద్రాబాద్‌లో ఉంటాను, (కాస్త ఆలోచిస్తూ) మా నాన్న ఆఫీసు పనులు చూస్తుంటాను, ఉద్యోగమొస్తే ఇక్కడికి షిఫ్ట్ అవుతాను”

“హైద్రాబాదా? ఈ ఉద్యోగం కోసం ఇక్కడికొచ్చావా? మీ నాన్నగారేం చేస్తుంటారు?”

“కన్‌స్ట్రక్షన్ కాంట్రాక్టరండి”

“మరి హాయిగా సొంత పని చూసుకోక ఇంత దూరం వచ్చావెందుకు?”

“నా వ్యక్తిగత కారణాలు సార్”

“ఇంట్లో ఏదైనా గొడవపడి వచ్చావా?”

“అదేం లేదండీ! నాకు నేనుగా ఏదైనా చెయ్యాలని… అన్ని విషయాలూ తరువాత చెబుతాను”

“మరి ఈ ఉద్యోగమేదో అంత పెద్ద సిటీ హైద్రాబాద్ లోనే చూసుకోవచ్చుగా?”

“ప్రస్తుతానికి అక్కడ కాకుండా మరెక్కడైనా ఉండాలని”

“నాకేదో నీ విషయం కాస్త అనుమానస్పదంగా ఉందయ్యా”

“మీరంటూ ఉద్యోగమిస్తే మా వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇస్తాను మాట్లాడండి”

“సరే, ఎం.కాం చదివానంటున్నావు. ఎకౌంట్స్… అదే… టాలీ, ఫోకస్ వచ్చా? జి.యస్.టీ గురించి అవగాహన ఉందా?”

“నేను ఎకౌంట్స్ వైపు వెళ్ళలేదండీ. ఫీల్డ్ వర్కే నాకిష్టం. సూపర్‌విజన్, మెటీరియల్ కొనడం, లేబర్ పేమెంట్స్ పనుల్లో కొంత అనుభవం ఉంది. మీరు కూడా సేల్స్ ఎగ్జిక్యుటివ్స్ కోసం అడిగారు కదా. అందుకు తగ్గట్లు నన్ను నేను మలుచుకోగలననే అనుకుంటున్నాను”

“నువ్వు చెప్పింది బాగనే ఉంది. కానీ ఏదైనా ఇక్కడున్నవాళ్ళకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. ప్రకటనలో ఆ మాట కూడా ఉంది. ఎందుకంటే మేమిచ్చే జీతాలు మీ హైద్రాబాద్‌లో జీతాలంత ఉండవు. ఇక్కడ ఉన్నవాళ్ళైతే సర్దుకోగలరు. బయట వాళ్లైతే మళ్ళీ అద్దె ఇల్లు చూసుకోవడం, కొత్త ఊరు, కష్టంగా ఉంటుంది”

“చూశానండి! పైగా మీరు లోకల్ ఎడిషన్ లోనే ఇచ్చారు. కానే నేనే కావాలని విజయవాడ, వైజాగ్, తిరుపతి ఎడిషన్స్ ఆన్‌లైన్ పేపర్స్ చూస్తున్నాను. ఆ రెండు చోట్లా కూడా అప్లై చేశాను. ఈ మూడు ఊర్లలో ఏదో ఒకదానిలో ఉందామని నా ఉద్దేశం. మీది వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ముందు ఇక్కడికొచ్చాను”

అంతలో ఒకతను తలుపు తీసుకొని లోపలికొచ్చి “నాన్నా! ఇంటర్వ్యూలు అయిపోయినట్లేనా?” అంటూ ప్రక్కన కుర్చీలో కూర్చున్నాడు.

అతను, ఉదయ్ కొద్ది క్షణాలు ఒకరినొకరు పరీక్షగా చూసుకున్నారు.

అతను ఆశ్చర్యంగా చూస్తూ “నువ్వు ఉదయ్ కదూ? నువ్వెంటిక్కడ? నన్ను గుర్తుపట్టావా?” అడిగాడు.

“ఓ యా, మనోజ్! వాటె ప్లెజెంట్ సర్ప్రైజ్!” అంటూ అతనికి చేయి కలిపాడు.

“నీకెక్కడ పరిచయం రా మనోజ్” అడిగాడు దుర్గాప్రసాద్.

“డిగ్రీలో నా క్లాస్‌మేట్ నాన్నా! కాకపోతే ఇతని ఫ్రెండ్స్ గ్రూప్ వేరు. రాముడు మంచి బాలుడు టైపు ఉదయ్ అని అందరం అనుకునే వాళ్ళం. ఇదిగో ఇలా ఎప్పుడు వైట్ షర్ట్సే వేస్తాడు. అసలు నువ్విక్కడేంటి ఉదయ్? అది ముందు చెప్పు” అడిగాడు ఆతృతగా.

ఉదయ్ చెప్పేలోగా వివరాలు చెప్పాడు దుర్గాప్రసాద్.

(సశేషం)

Exit mobile version