Site icon Sanchika

ఉదయ రాగం-4

[dropcap]”కా[/dropcap]ర్లో కాలేజీకి వచ్చేవాడివి, మా నాన్నిచ్చే పదివేలుతో తంటాలు పడాల్సొస్తుంది, ఎనీవే! నీ ఆశయం బాగుంది. కానీ ఈ నాన్నల దగ్గర పనిచెయ్యటం కష్టం ఉదయ్, అందుకే నేను ఎం.బి.ఏ చేసి చెన్నైలో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో దూరిపోయాను” అన్నాడు.

“చాల్లే ఊరుకోరా” అన్నాడు నవ్వుతూ దుర్గాప్రసాద్.

“ఏది ఏమైనా నువ్వు మీ తల్లిదండ్రుల గురించి కూడా అలోచించు బాబూ! చదువు అయిపోగానే ఎక్కడో ఉద్యోగమొస్తే అది వేరు. కానీ మనకు సొంత వ్యాపారం ఉండి, అది బాగా నడుస్తున్నప్పుడు మనమే చూసుకుంటే మంచిది. నాదైనా మీ నాన్నదైనా ఈ విషయంలో ఒకటే అభిప్రాయం ఉంటుంది. బయట వాళ్ళు ఎప్పుడూ బయటవాళ్ళే! ఎవర్నీ నమ్మి అధికారం చేతికివ్వలేం”

“మీరు చెప్పింది నిజమే అంకుల్! కానీ అన్ని విషయాలు అనుకూలంగా కూడా ఉండాలి కదా”

“సరే! మావాడికి బాగా తెలిసిన వాడివి కాబట్టి నీకు పని కల్పించడంలో ఏమాత్రం నాకు సంకోచం లేదు. మా కంపెనీలో ఉద్యోగం ఒక ఆసరాగా తీసుకొని తెలివిగల కుర్రాళ్ళు ఇంకా మంచి ఉద్యోగం చూసుకొని వెళ్ళిపోతుంటారు. మేము రెండు మూడేళ్ళకొకసారి ఇదుగో ఇలా ఇద్దరు ముగ్గుర్ని అపాయింట్ చేసుకుంటూ ఉంటాం. ఇక నీ ప్రతిభ, నీ అదృష్టం.

అలవెన్సులు అవీఇవీ కలిపి పదిహేను వేలు దాకా వస్తుంది. అన్నీ అందులో సర్దుకొని నీ ఆశయం కోసం ప్రయత్నం మొదలు పెడతానంటే నాకేమీ అభ్యంతరం లేదు. లేదా చేరినచోటే నైపుణ్యం చూపించి చకచకా పైకి ఎదగ్గలిగే అవకాశమున్న కొన్ని జాక్‌పాట్ ఉద్యోగాలుంటాయి, ముఖ్యంగా మర్కెటింగ్‌లో. అలాంటివి ఏవైనా ప్రయత్నిస్తే నీకు తగినట్లు ఉంటుందేమో. నాకూ కాస్త సమయం ఇస్తే వాకబు చేస్తాను. బాగా ఆలోచించుకొని ఒక వారంలో చెప్పు” అన్నాడు దుర్గాప్రసాద్.

“థ్యాంక్యూ అంకుల్! అసలు నా ఈ మొదటి ప్రయత్నమే తృప్తిగా ఉంది. నా చదువుకి, నాకున్న కాస్త అనుభవానికి మరీ మంచి ఉద్యోగం ఆశించడం అత్యాశే అవుతుంది. ఏదైనా క్రిందనుంచే మొదలుపెట్టాలి. మీరిచ్చే జీతంలో నేను సర్దుకోగలను. అందులో సగం జీతాలతో ఎందరో కుటుంబాలే నడుపుతున్నారు”

“మా వాడు అన్నట్లు నువ్వు మంచి బాలుడవే అని నీ మాటల్లో తెలుస్తున్నది. చాలా సంతోషం. నువ్వు ఒక వారంలో వచ్చేసి చేరిపోవచ్చు. మా సేల్స్ వాళ్ళతో ఒక వారం తిరిగావంటే నీకు అన్నీ తెలుస్తాయి”

“అలాగే అంకుల్! థ్యాంక్యూ”

“నాన్నా! నేను ఉదయ్‌ని ఇంటికి తీసుకెళ్తాను. చాలా కాలమైంది ఒక క్లాస్‌మేట్‌ని అంటూ కలిసి. రాత్రికి చెన్నై వెళ్లిపోవాలి. కాసేపు కబుర్లు చెప్పుకుంటాం” అన్నాడు మనోజ్ కుర్చీలోంచి పైకి లేస్తూ.

ఉదయ్ కూడా దుర్గాప్రసాదుకి నమస్కారం పెట్టి మనోజ్‌తో బయలుదేరాడు.

మనోజ్ కారు నడుపుతూ తను హైద్రాబాద్‌లో చదువుకున్న తరువాత చెన్నైలో ఎం.బీ.ఏ చెయ్యడం. అక్కడే ఉద్యోగంలో చేరడం వివరాలన్నీ చెప్పుకొచ్చాడు.

ఇరవై నిముషాల్లో ఇల్లొచ్చేసింది. వాళ్ళమ్మకు ఉదయ్‌ని పరిచయం చేశాడు. ఇద్దరూ మనోజ్ బెడ్ రూమ్ లోకెళ్ళి మళ్ళీ కబుర్లు మొదలు పెట్టారు.

“అన్నట్లు నీ జిగిరీ దోస్త్ శ్రీరాం ఎక్కడున్నాడిప్పుడు?” అడిగాడు మనోజ్.

“వాడు నీలాగే యం.బి.ఏ చేసి సింగపూర్‌లో ఏదో కంపెనీలో పనిచేస్తున్నాడు. పోయినసారి మాట్లాడినప్పుడు. త్వరలో హైద్రాబాద్ వచ్చి సెటిల్ అవుతానన్నాడు. వాడి కోసం ఎదురు చూస్తున్నాను”

“ఓ గ్రేట్! కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కూడా చాలా కాలంగా యు.ఎస్.లో ఉన్నవాళ్ళు ఇండియాలో ఉండాలనే కోరికతో వచ్చేస్తున్నారని అక్కడక్కడా వినిపిస్తున్నది. ఒక విధంగా మంచి ఆలోచనే కదూ?”

మాటలు రకరకాల టాపిక్స్ మీదకు పోతున్నాయి.

మధ్యలో సంభాషణను దారి మళ్ళిస్తూ “మీ నాన్న నిన్ను మీ సంస్థలోనే చేరమని చెప్పలేదా?” అడిగాడు ఉదయ్.

ఆ ప్రశ్నకి కాస్త ఆలోచించాడు మనోజ్.

“నిజానికి అలాంటిది చర్చగా ప్రత్యేకంగా ఏమీ జరగలేదు. చదువు అయిపోగానే ఉద్యోగమొచ్చింది. చేరతానన్నాను. సరే అన్నాడు. కాకపోతే ఆయనకు నువ్వు చెప్పిన ఆలోచన లేకపోలేదు. మా నాన్నతో సహా ఈ కంపెనీలో మరో ఐదుగురు పార్టనర్‌లు ఉన్నారు. ఎక్కువ పెట్టుబడి మా నాన్నదే కాబట్టి నన్ను ఇక్కడ చేర్చడం అంత కష్టం కాదు. పైగా మా సంస్థ ప్రెవేట్ లిమిటెడ్‌గా మారే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు అడుగుతాడేమో అని నేను అనుకుంటున్నాను. అందుకే బిజినెస్ విషయాలు నాకు చెబుతుంటాడు. ఇక అప్పటి సంగతి అప్పుడు. నాకు ఏది బావుందనిపిస్తే అదే చేస్తాను” అన్నాడు భుజాలెగరేస్తూ.

“నా పరిస్థితి కంటే నీది కొంత మెరుగు. పైగా నాకు కొన్ని ఇతర ఇబ్బందులు కూడా ఉన్నాయిలే!. సరేగానీ నిన్నొక ప్రశ్న అడగనా? ఏమీ అనుకోవుగా?”

“అదేంటి అలా అంటున్నావు? ఏం కావాలో అడుగు చెప్తాను”

“మీ వ్యాపార వ్యవహారాల్లో చేతులు తడపటాలు, నిబంధనలు ప్రక్కన పెట్టడాలు మొదలైనవి ఉంటాయా? నాకంటూ ఉద్యోగమిస్తే చేరేముందు మీ నాన్నను అడగగలిగే వాడినో లేదో, మధ్యలో నువ్వు ప్రత్యక్షమయ్యావు. నా పని సులువైంది”

మనోజ్ ఆ ప్రశ్నకు కాస్త ఆశ్చర్యపడి అందులోంచి చిన్న నవ్వును పుట్టించి “చూడు ఉదయ్! నీవు అవినీతి పనుల గురించి మాట్లాడుతున్నావని నాకు అర్థమైంది. ఏ కంపెనీలో పనిచేస్తున్నా మన ఉద్యోగ నిర్వహణలో అలాంటి పనులు చెయ్యాల్సి రావచ్చు, రాకపోవచ్చు. కానీ పై లెవల్లో జరగాల్సినవి కొన్ని జరిగిపోతుంటాయి. అలాగని అన్ని కంపెనీలు అంతే అని నేను చెప్పడం లేదు. అవినీతి మాటే లేకుండా నిజాయితీగా వ్యాపారం చేసేవాళ్ళూ ఉంటారు.

మా నాన్నవాళ్ళ సంస్థలో కూడా ఎంతో కొంత సర్దుబాట్లు జరుగుతుండొచ్చు. అన్ని విషయాలు మా నాన్న ఇష్టం ప్రకారం జరుగవు. అందరు పార్ట్‌నర్‌ల ఏకాభిప్రాయం మేరకు పనులు నడుస్తుంటాయి. నేను ఆ విషయాల్లోకి ఎప్పుడూ లోతుగా వెళ్ళలేదు.

ఉద్యోగాల విషయానికొస్తే ప్రతి యజమాని తన క్రింద పనిచేసేవాడు తనపట్ల చాలా నిజాయితీగా ఉండాలనుకుంటాడు. కానీ ఆ నిజాయితీని కంపెనీ కోసం అప్పుడప్పుడూ కాస్త ప్రక్కన పెట్టమంటాడు. ఇవి నీకు తెలియని విషయాలు అని నేను అనుకోను.

మా పెదనాన్న కొడుకు చాలా నిజాయితీపరుడు. ఎక్కడ ఉద్యోగంలో చేరినా పట్టుమని మూణ్ణెల్లు ఉండదు. “వాళ్ళు దొంగలు” అని మానేసి వస్తాడు. చాలా కాలం ఖాళీగా ఉండి ప్రస్తుతం కాస్త పొలం ఉంది కాబట్టి వ్యవసాయం చేస్తున్నాడు. ఎవరి ఇష్టానుసారం వాళ్ళు నడుచుకుంటూ ఉండటంలో తప్పులేదు. కాకపోతే కుదరాలి. అంతే!

ఈ చర్చ ఎవరితోనూ మనం చెయ్యలేం. ఎవరి కారణాలు, బాధలు వాళ్ళు చెబుతారు, సమర్థించుకుంటారు. ఎనీవే నీ సంశయాల గురించి నాన్నతో మాట్లాడతాను. నీ వరకూ నీకిచ్చిన ఉద్యోగంలో అలాంటి పనులు అప్పజెప్పకపోతే ఓకేనా? లేకుంటే అసలు సంస్థలో ఎక్కడా ఏ లొసుగులు ఉండకూడదా అనేది నువ్వు తేల్చుకో” చెప్పాడు.

“ఈ చర్చ నీతో కాబట్టి చేశాను మనోజ్! మీ నాన్నతో ఇలా మాట్లాడలేను కదా! వాస్తవానికి మా నాన్నతో కూడా గట్టిగా ఈ విషయాలు వాదించలేను. ఈ విషయంలో నేనొక సంకట స్థితిలో ఉన్నాను. చూద్దాం ఏంజరుగుతుందో! ఎనీవే ఇక నేను బయలుదేరతాను బస్ టైం అవుతున్నది. నీకు వారం రోజుల్లో ఫోన్ చేస్తాను. మనం టచ్‌లో ఉందాం. శ్రీరాం వస్తే నీతో మాట్లాడిస్తాను”.

“ఓకే. థ్యాంక్యూ! ఉదయ్!”

ఉదయ్ ని హైద్రాబాద్ బస్సెక్కించి వెళ్ళిపోయాడు మనోజ్.

***

కాలింగ్ బెల్ చప్పుడు విని వెళ్ళి తలుపు తీసింది శకుంతల.

“నువ్వా! రా అన్నయ్యా! వస్తున్నట్లు ఫోనన్నా చెయ్యలేదు, వదినను కూడా తీసుకరాకుడదు?”

“లేదమ్మా ఇటుగా వెళుతూ పలకరించిపోదామని వచ్చాను. బావ, ఉదయ్ ఇంట్లో లేరా?” అడిగాడు నాగరాజు.

“ఆయన క్లబ్బుకెళ్ళారు. వీడేదో పనుందని విజయవాడ వెళ్ళాడు. రాత్రికి వచ్చేస్తాడు”

అన్నా చెళ్ళెళ్ళు కాసేపు లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు.

ఎదురు సోఫాలో కూర్చున్న నాగరాజు వచ్చి చెల్లెలి ప్రక్కన కూర్చున్నాడు “చూడు శకుంతలా! నిజానికి నీ ఒక్కదానితో మాట్లాడదామనే వచ్చాను. మీ ఆయన, కొడుకూ ఉంటే నేను చెప్పవలసిన విషయాలు నీకు చెప్పలేను. అనుకోకుండా వాళ్ళిద్దరూ లేని సమయంలోనే వచ్చాను.

మీవాడి ప్రేమ విషయం మా అమ్మాయి ద్వారా తెలిసింది. మీ ఆయనతో అన్నానుగానీ నేనేమీ చర్చించలేదు. తోడబుట్టిన దానవు కాబట్టి నీకు చెబుతున్నాను. సంధ్య కూడా ప్రేమ గురించి పెళ్ళి గురించి వాళ్ళమ్మకి ఈమధ్య తన అభిప్రాయాలు చెప్పిందిట. మంచి అందమైన అబ్బాయిని సెలెక్ట్ చేసుకొని ప్రేమించి అతనితో కొన్నిరోజులు కలిసుండి, అప్పుడు అతను తగినవాడో కాదో తేల్చుకుంటుందిట. మీ వదిన చస్తానని బెదిరించి ప్రస్తుతానికి దాన్ని కట్టడి చేసింది. ఆ విషయాలు నాకు తెలుసని సంధ్యకు తెలియదు. ఒక్కగానొక్క కూతురు కావడం వల్ల మితీమీరిన గారాబం దాన్ని ఆ విధంగా చేసింది.

బయటవాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేరు, భరించలేరు. నువ్వైతే దాన్ని కడుపులో పెట్టుకొని చిన్నగా దార్లోకి తెస్తావని నా ఆశ. బావతో బిజినెస్ విషయాలు తప్ప ఈ పెళ్ళి మాటలు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నా ఉద్దేశం. అంతా నీ చేతుల్లో ఉంది. మన రెండు కుటుంబాలకూ మీవాడే వారసుడు. మా అమ్మాయి సంగతి నేను చూసుకుంటాను. ఎంత త్వరగా వాళ్ళ పెళ్ళి జరిగితే అంత మంచిది.

బావ కోసం గుజరాత్‌లో పెద్ద కాంట్రాక్టు సంపాదిస్తున్నాను. ఉదయ్ పెళ్ళి చేసుకొని వెళ్ళి అక్కడ కాపురం పెట్టి పనులు చూసుకోవచ్చు. వాళ్ళిద్దరు కొంత కాలం ఈ పరిసరాలకు దూరంగా ఉంటే దార్లోపడతారు. ఇదీ నేను నీతో చెప్పదలుచుకున్నది, ఏమంటావు?”

శకుంతల కాసేపు నోట మాట రాలేదు. నాగరాజు ఆతృతగా చెల్లెలి వైపు చూస్తున్నాడు.

“నాకు కాస్త సమయం కావలన్నయ్యా! ఇప్పుడు పిల్లలు పెద్దల్ని గౌరవిస్తూనే వాళ్ళ సొంత అభిప్రాయాల విషయంలో గట్టిగా ఉంటున్నారు. అవసరమైతే విభేదిస్తున్నారు కూడా. వాడి పెళ్ళి మాటలు ఇంట్లో మొదలైయ్యాయి. అబ్బాకొడుకులకు చాలా విషయాల్లో పొంతన కుదరదు. మధ్యలో నేను సతమతమౌతున్నాను.

నువ్వు ఉన్నవి ఉన్నట్లు అన్ని విషయాలు నాకు చెప్పావు. పరిస్థితి నాకర్థమైంది. మీ బావ ఈ విషయంలో గట్టిగానే ఉన్నాడు. నేను కూడా ఆయనతో చేరి వాణ్ణి ఒత్తిడి చేస్తే వాడు ఏమైపోతాడో అనే భయం. ఇప్పటి వరకూ వ్యాపార విషయాలు. ఇప్పుడు పెళ్ళి విషయం. ఏదిఏమైనా నా ప్రయత్నం నేను చేస్తాను, చెప్పానుగా నాకు కాస్త సమయం కావాలి”

“సరే శకుంతలా! నువ్వు పరిస్థితి సానుకూలం చేసి చెప్పినప్పుడు మీరందరూ ఉన్నపుడు మీ వదినను కూడా తీసుకొని వచ్చి మాట్లాడుతాను” అని చెప్పి వెళ్ళిపోయాడు.

అర్ధరాత్రి ఇంటికి చేరి ఆలస్యంగా పడుకున్న ఉదయ్ ప్రొద్దుట లేచేసరికి తొమ్మిదైంది. ముఖం కడుక్కొని కాఫీకోసం వంటగదిలోకొచ్చాడు.

“ఏరా! విజయవాడ వెళ్ళిన పనైందా? ఇంతకీ ఏమిటో ఆ పని చెప్పనే లేదు” అడిగింది శకుంతల కాఫీ కప్పు చేతికిస్తూ.

“ఏంటమ్మోవ్! ఎప్పుడు ఎక్కడికెళ్ళి వస్తున్నా ఏమీ అడగవు. ఇవాళేంటో కొత్తగా అడుగుతున్నావు”

“ఏమీ చెప్పపెట్టకుండా వెళితేను అడిగాన్లేరా! మన ఆఫీసు పనైతే కాదని తెలుస్తుంది. అలాంటిదైతే నాన్న రాత్రి నువ్వెక్కడకెళ్ళావు అని అడుగడుగా?”

“ఏం చెప్పావు?”

“విజయవాడ వెళ్ళి వెంటనే వస్తానన్నాడు, ఎవరైనా స్నేహితుడిని కలవాలనేమో అని చెప్పాను”

“కరెక్ట్ గానే ఊహించావు. స్నేహితుడి దగ్గరకే వెళ్ళొచ్చాను”

“ఉద్యోగ ప్రయత్నమా?”

“అలాంటిదేలే! ఏదైనా పని అయ్యాక ముందు నీకే చెబుతాలే”

“అలాంటి విషయాలైతే తరువాత చెప్పినా పర్లేదు”

“కాస్త డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నావ్? ఏ విషయాలైతే ముందే చెప్పాలి?”

“ఏముంది నాయనా, ఇంట్లో పెళ్ళి విషయంలో ఒత్తిడిగా ఉందని చెప్పాపెట్టకుండా ఆ బెంగుళూరు పిల్లతో దండలు మార్చేసుకొని వచ్చావనుకో, మీ నాన్న నన్ను కేకలతోనే కైలాసానికి పంపిస్తాడు. అదీ నా భయం”

“నీకు బాహుబలిలాంటి అన్నయ్య ఉన్నాడుగా! నాన్న ఆ పని చెయ్యడులే”

“ఏంట్రోయ్! కొంపదీసి ఆలాంటి ప్రయత్నాల్లో నిజంగా ఉన్నావేంటి”

“నాకు అలాంటి తెగింపు ఎక్కడిదే అమ్మా! నువ్వే చెప్పావుగా తాతలాగా నేను మెతకని”

“ప్రేమరా నాయనా! అది ఆవహిస్తే మెతకదనం పోయి మొండితనం వచ్చేస్తుంది”

“ఎప్పుడూ నీతో మాట్లాడుతుంటే ఫ్రెండుతో మాట్లాడినట్లుంటుంది. ఇప్పుడు ఒక పెద్దావిడలా కనపడుతున్నావు, ఎదైనా చర్చపెట్టబోతున్నావా, నాన్న మళ్ళీ ఏదైనా గడువు పెట్టాడా?”

“ఒరేయ్! నాన్నంటే గుర్తొచ్చింది నిన్ను నిద్ర లేవగానే ఫోన్ చెయ్యమన్నాడు, అదేదో చూడు మనం తరువాత మాట్లాడుకోవచ్చు.”

ఆమాట ఆమె చెబుతుండగానే ఆమె మొబైల్ కే కాలొచ్చింది

“ఏమే! లేచాడా నీ సుపుత్రుడు?”

ఫోను ఉదయ్‌కి ఇచ్చింది

“ఆ నాన్నా!”

“ఉదయ్! నువ్వు తయారయ్యి ఆఫీసుకొస్తే డబ్బు డ్రా చేసి పెడతాను. పట్టుకెళ్ళి చందానగర్ సైట్‌లో పేమెంట్స్ చేసి, అక్కణ్ణుంచి ఎ.యస్. రావు నగర్‍౬లో మనవి మిగిలిపోయిన రెండు ఫ్లాట్స్‌ని చూడానికి ఐదు గంటలకు కస్టమర్స్ వస్తారు. వాళ్ళకు చూపించి మాట్లాడి వచ్చెయ్యి. వాళ్ళకు నీ నంబరిచ్చాను”

“అలాగే వస్తున్నా”

ఉదయ్ తయారయ్యి అమీర్ పేటలోని తమ ఆఫీసుకెళ్ళే సరికి పదకొండు దాటింది. అందులో పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులు వారి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. అక్కడ ఎవరికీ డిజిగ్నేషన్లు ఉండవు. అందరూ అన్నీ పనులూ చెయ్యాల్సిందే. కాస్త పెద్ద తలకాయి అదినారాయణరావు “ఏం బాబూ మూణ్ణాలుగు రోజులనుంచీ ఇటు రావట్లేదే? ఎటైనా క్యాంపుకెళ్ళావా?” అని అడిగాడు.

“అవును రావు గారు. మీ ప్రవీణ్ ఎలా ఉన్నాడు? ఈ సంవత్సరంతో ఇంజనీరింగ్ అయిపోతుందిగా. పీ.జీ చేస్తాడా?”

“అదే ఏమీ తోచట్లేదు బాబూ, క్యాంపస్ సెలక్షన్లు ఈసారి జరగలేదు. ఇక పై చదువులు కష్టమే. సివిల్ ఇంజనీరింగే కాబట్టి నువ్వే మీ నాన్నగారితో మాట్లాడి ముందు ఎక్కడైనా పనిలో పెట్టాలి. తరువాత వాడి అదృష్టం”

“నేను చెప్పాల్సిన అవసరమేముందండీ! నాన్నకు కుడిభుజం మీరు. ముందు అతన్ని ఫైనలియర్ పరీక్షలు రాయనివ్వండి” అంటూ శంభుప్రసాద్ ఉండే గదిలోకెళ్ళాడు.

లోపలికి వెళుతుండగానే “రా ఉదయ్! విజయవాడ వెళ్ళావుట. కొంపదీసి ఉద్యోగ ప్రయత్నం కాదుకదా? నీకేం అవసరం రా, ఇప్పుడే నాగరాజు మామయ్య ఫోన్ చేశాడు ఆ గుజరాత్ రోడ్ కాంట్రాక్టు త్వరలోనే వస్తుందిట. మనల్ని సిద్ధంగా ఉండమన్నాడు. అక్కడ చగన్ పటేల్ అని మామయ్య స్నేహితుడున్నాడు. డబ్బు వ్యవహారాలన్నీ అతను చూసుకుంటాడు. కేవలం ఫీల్డ్ వర్కు మనం చూసుకోవడమే. సకాలంలో పని పూర్తి చేస్తే వేరే పనులు కూడా వస్తాయి అంటున్నాడు. ఇకపై అటుపక్క పనులన్నీ నువ్వు చూసుకోవచ్చు. ఏమంటావ్?”

“ఫీల్డ్ వర్క్ మాత్రం ఆ చగన్ పటేల్ చూసుకోలేరా?”

శంభుప్రసాద్ చూపులో కాస్త మార్పువచ్చింది “ఆయనకేం సంబంధం?” అన్నాడు కాస్త చిరాగ్గా.

“మనం దగ్గరుండి చూసుకోవాల్సిందే డబ్బు విషయం. అది చాలా తిరకాసుల్తో ఉంటుంది. ఆ పని నాకు అప్పజెప్పట్లేదు. మంచిదే. నాకర్ధమైంది. ఇక మిగిలిన పని ఆయనే చేయించొచ్చుకదా? లేబర్ కూడా ఎటూ అక్కడి వాళ్ళనే తీసుకోవాలిగా? స్థానికుడు కాబట్టి అదీ బహుశా ఆయనే చూస్తాడేమో”

“కాంట్రాక్టు మనది ఆయనకు ఏదో ఏర్పాటు ఉంటుంది అంతే! ఎవరు ఏమి చేసినా మనం అక్కడ ఉండాలి”

“ఏమో నాన్నా! ఒక్కణ్ణే పరాయి రాష్ట్రంలో అంత పెద్ద పని చూడగలనో లేదో. ఇక్కడే నువ్వూ, మూడు సైట్లలో ముగ్గురు సూపర్వైజర్లు, స్టాఫు ఉన్నారు కాబట్టి నాచేతనైన పని ఎంతో కొంత చేసుకపోతున్నాను. అసలు నా వల్ల ఈ బిజినెస్‌కి ఏమంత ఉపయోగమూ లేదని, నేను లేకపోయినా ఇక్కడ పనులు ఏవీ ఆగవని నా ఉద్దేశం. అలాంటిది అక్కడెక్కడికో వెళ్ళి ఒకేసారి అన్నీ మీదేసుకొని చెయ్యటం నావల్ల కాదు. పైగా రోడ్డు పనుల్లో నాకు అనుభవం అసలు లేదు. ముందు క్యాష్ ఇవ్వు నాన్నా! చందానగర్ వెళతాను” అన్నాడు.

ఉదయ్ ముఖంలో కాస్త అసహనం గమనించాడు శంభుప్రసాద్. ఇక సంభాషణ పొడిగించకుండా క్యాష్ బ్యాగ్ అతని చేతికిచ్చాడు.

ఉదయ్ తలుపు తీసుకొని వెళుతుంటే అతన్ని తీక్షణంగా చూస్తూ ఉండిపోయాడు శంభుప్రసాద్.

చందానగార్ సైట్లో పనులన్నీ పరిశీలించి పేమెంట్స్ చేసి అక్కణ్ణుంచి ఏ.యస్ రావు నగర్ వెళ్ళి ఆ కస్టమర్లకు ఫ్లాట్స్ చూపించే పని అయ్యేసరికి సాయంత్రం ఆరైంది.

ఇక ఇంటికి బయలుదేరాడు. దారిలో ఏదో గుర్తుకొచ్చినట్లుగా మొబైల్ తీసి అరుణకు కాల్ చేశాడు.

“హలో నేను రవళి”

“హాయ్! రవళి ఇది అరుణ ఫోన్ కదా?”

“అయితే? నేను తియ్యకూడదా?”

“అని కాదు”

“సరదాకు అన్నాలే! దానికి కాస్త నీరసంగా ఉంది. పడుకున్నది. అందుకే నేను తీసాను”

“ఓ సారి! డిస్టర్బ్ చేశానా? ఏంటి ప్రాబ్లం, ఒంట్లో బాగలేదా? నేను వచ్చి చూడొచ్చా?”

“ఆడపిల్లల హాస్టల్‌కు అబ్బాయిలు వచ్చి చూస్తారా?”

“అగైన్ సారీ! మరెలా?”

“హాస్టల్ రోడ్డుకి అవతల ప్రక్క ఉన్న బేకరీకి వచ్చెయ్యి. తనను తీసుకొస్తాను”

“థ్యాంక్యూ, కాసేపట్లో వచ్చేస్తున్నా” అంటూ ఫోన్ పెట్టేశాడు.

“పాపం ఎందుకే అతన్ని ఆట పట్టిస్తావు” అన్నది అరుణ

“లేకపోతే ఏంటే ఆ ప్రశ్నలు? అసలు ఇతను తెలివిగలవాడా? అమాయకుడా? పిరికివాడా? అసాధ్యుడా? లేక అన్నీ కాస్త కాస్త ఉన్నయ్యా? అర్థం కావట్లేదు”

“మనకు అర్థమవ్వాల్సిన అవసరం లేదు. ఏదో పరిచయమయ్యాడు. మంచివాడని అర్థమౌతున్నది. సభ్యతగా మాట్లాడుతున్నాడు. మన పరిధిలో ఉండి మనం మాట్లాడితే చాలు”

“నీకు నీరసం అని చెప్పానే, కాస్త నటించు”

“నీ అల్లరి అతనికి తెలుసులేవే, అతనూ అమాయకంగా నటిస్తున్నాడేమో చూడు”

“అదీ నిజమే సుమీ! అసలు ఈరోజు ఉదయ్‌కి ఒక ఝలక్ ఇస్తాను చూడు. నువ్వేం మాట్లాడొద్దు. వింటూ ఉండు అంతే”

ఉదయ్ వచ్చేలోగా ఇద్దరూ ఆ బేకరీకి చేరి ఓ ప్రక్కగా కూర్చున్నారు.

కాసేపటికే ఉదయ్ వచ్చేశాడు.

“హాయ్ ఉదయ్!” అంటూ కుర్చీ చూపించింది రవళి.

నవ్వుతూ కూర్చున్నాడు. “ఎలా ఉంది నీకు అరుణా? ఎదైనా వైరల్ ఫీవరా? అయినా మీరు మెడికోలు కదా? మిమ్మల్ని ఆరోగ్యం గురించి ప్రశ్నలెలా వెయ్యాలో నాకు తెలీదు”

“ఫరవాలేదు. నేను చెప్తాగా! ఇది టెన్షన్ వల్ల వచ్చిన కొత్తరకం జ్వరం” అన్నది రవళి విచారంగా ముఖం పెట్టి.

“అరుణకు టెన్షనేంటి. కూల్ అండ్ బోల్డ్ పర్సన్. నాలాంటి వాళ్ళకు ధైర్యం చెప్పగలది”

“నేనూ అలాగే అనుకున్నాను. అతనెవరో ఐ లవ్ యూ చెప్పగానే ఇలా అయిపోయింది” రహస్యంగా చెప్పింది ప్రక్కనే ఎవరూ లేకపోయినా.

ఒక్క క్షణం ఇటు ఉదయ్ అటు అరుణ కూడా ఆశ్చర్యపోయారు.

“ఏయ్! ఏం మాట్లాడుతున్నావే” అన్నది అరుణ.

“నువ్వు చెప్పు రవళి” అడిగాడు ఉదయ్.

“ఉదయ్! నువ్వు మరెవరితోనూ చెప్పకే! పీ.జీ. చేస్తున్న దినేష్ అనే అతను చాలా కాలంగా అరుణమీద మనసు పడి ఉన్నాడుట. నిన్న డైరెక్ట్‌గా అడిగేశాట్ట. ఇదేమో మా నాన్నా, మా ఊరు అని ఏదేదో మాట్లాడి దాటేసిందిట. అతను కాస్త సమయం తీసుకోనైనా సరే అని చెప్పమని బ్రతిమాలి వెళ్ళాడుట”

“అలానా? నాకు తెలిసినంతవరకు అరుణకి తన చదువే ప్రపంచం. అయినా మీ డాక్టర్లు డాక్టర్లనే పెళ్ళి చేసుకుంటారనుకుంటా. అతను చూడ్డానికి బాగుండి, బ్యాడ్ రిమార్క్స్ లేనివాడని తెలిస్తే అటుగా ఆలోచించడంలో తప్పులేదు. ఎప్పటికైనా పెళ్ళంటూ చేసుకోవాలిగా. అరుణ ఒకసారి వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే సరి. ముందు నిర్ణయించుకుంటే పెళ్ళి ఇప్పుడు కాకుంటే తరువాత చేసుకోవచ్చు. ఇందులో టెన్షన్ పడటానికేముంది?”

ఇద్దరూ ఉదయ్ వైపు మెచ్చుకోలుగా చూశారు.

“అదే నేనూ చెబుతున్నా ఉదయ్! అంతలో నువ్వొచ్చావు” అన్నది రవళి.

“అరుణ చక్కగా ఆలోచించగలదు. మంచి నిర్ణయం తీసుకోగలదు. మనం చెప్పక్కర్లేదు. ఈ విషయంలో నేనేం చెయ్యగలనో నాకు తెలీదుగానీ నా వల్ల ఏదైనా ఉపయోగం ఉందనిపిస్తే చెప్పండి చేస్తాను”

“దాని మాటలకేంగానీ ఉదయ్! ఎలా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు?” ఆడిగింది అరుణ.

“పని మీద ఎ.యస్. రావు నగర్ వెళ్ళి వస్తుంటే నువ్వు గుర్తొచ్చావు. పలకరించి వెళదామని వచ్చాను”

“అంతేనా ఏదైనా మాట్లాడాలని అనుకున్నావా?”

(సశేషం)

Exit mobile version