ఉదయ రాగం-5

0
2

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”నీ[/dropcap]తో మాట్లాడటానికి ఎప్పుడు ఏవో విషయాలూ ఉంటూనే ఉంటాయి. అయినా ఇప్పుడు నువ్వు టెన్షన్‌తో కూడిన మంచి మూడ్‌లో ఉన్నావు. మీరిద్దరూ మంచి డిస్కషన్‌లో కూడా ఉన్నారనుకుంటా. ఇప్పుడు డిస్టర్బ్ చెయ్యడం అన్యాయం. మరెప్పుడైనా ఫోన్ చేస్తాలే. టేక్ కేర్, నేను బయలుదేరనా?”

“ఒక్క మాట చెప్పనా! నువ్వొచ్చినప్పట్నుంచీ రవళి చెప్పిన ప్రతి అక్షరం అబద్ధం” అన్నది అరుణ.

ఉదయ్ నోరెళ్ళబెట్టి రవళివైపు చూశాడు.

“చెప్పు ఉదయ్! అరుణను ఎవరో లవ్ చేస్తున్నాడంటే నీకేమనిపించింది?” అడిగింది రవళి అతన్ని పరిశీలనగా చూస్తూ.

“నిజంగానే ఆశ్చర్యం కలిగింది. తరువాత సంతోషం కలిగింది ఆ తరువాత బెంగ కూడా కలిగింది”

“మొదటి రెండూ అటుంచి బెంగ ఎందుకు కలిగిందో చెప్పగలవా?” మళ్ళీ రవళి ప్రశ్న.

“ఎందుకంటే ప్రస్తుతం నాకు అరుణ కన్సల్టెంట్. పెళ్ళి ఫిక్స్ అయితే ఇంత ఫ్రీగా ఆమెతో మాట్లాడలేనేమో కదా అని. అయితే మళ్ళీ నన్ను నేను సముదాయించుకున్నాలే. నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీరాం త్వరలో వస్తున్నాడు. ఇక వాడికి ఆ పోస్ట్ ఇవ్వొచ్చు అనుకున్నాను”

“నీకు ఎవరో ఒక కన్సల్టెంట్ తప్పదా ఉదయ్” నవ్వుతూ అడిగింది రవళి.

అరుణ ఆమె వైపు కోపంగా చూడటం, రవళి నాలిక కొరుక్కోవడం క్షణాల్లో జరిగిపోయాయి.

“సారీ ఉదయ్! కాస్త ఓవర్ అయ్యాను” నిదానంగా అన్నది రవళి.

“నోనో అలా ఏం లేదు. రవళి అనే అమ్మాయి అలా మాట్లాడితేనే బావుంటుంది. నువ్వు చెప్పేది నిజమే. నేను నా విషయాల్లో సరిగ్గా ఆలోచిస్తున్నాననే నమ్మకం నాకు గట్టిగా లేదని చెప్పొచ్చు. దానికి కారణం బహుశా చిన్నప్పట్నుంచీ నాన్న చెప్పింది చేస్తూ పోవడం కావచ్చు. నా స్వభావమూ కావచ్చు. కానీ ఓ ఏడాదిగా నాలో ఒక అలజడి, ఏదో కోల్పోతున్నాననే భావన పెరుగుతున్నాయి.

మీరిద్దరూ పరిచయం కాకపోతే నాకు తోచిన నిర్ణయాలు ఏవేవో తీసేసుకుంటూ ఉండేవాడిని. కానీ అరుణ మాటలు, చెప్పే విధానం నా మనసుకు తగ్గట్లున్నాయి. అందుకే మా నాన్న స్థానంలో ఆమెను పెట్టాను”

అరుణ రవళి కాసేపు మౌనంగా ఉండిపోయారు.

“ఉదయ్! నీకొక విషయం చెప్పాలి. నువ్వు నాతో చెబుతున్న విషయాలు నేను రవళికి చెబుతున్నాను. ఎందుకంటే మా ఇద్దరి మధ్య దాపరికాలు ఉండవు. మరొకటి నాకంటే తనేమన్నా మంచి సలహా ఇవ్వొచ్చు అనే ఉద్దేశం. నువ్వూ మాకు కొత్తగా పరిచయం అయినవాడివి కాబట్టి ఇందులో నీ ప్రైవసీని ప్రక్కన పెడుతున్నాననే ఆలోచన నాకు రాలేదు. ఇన్నిరోజులు లేనిది ఇప్పుడు ఎందుకో నీకు ఈ మాట చెప్పాలనిపిస్తున్నది”

“మీ ఇద్దరికీ నా విషయాలు తెలియడం వల్ల నాకే ఇబ్బంది లేదు. ఇద్దరూ నాకు ఒకేసారి పరిచయమయ్యారు. పైగా మావాళ్ళెవరూ మీకు తెలియదు. తెలిసినా మీరు వాళ్ళతో చెబుతారని నేననుకోను. మీరిద్దరూ నాకంటే కాస్త చిన్నవాళ్ళైనా నాకు గౌరవం ఇష్టం కూడా. అసలు మీరిద్దరూ అబ్బాయిలైతే నాకు మరీ సౌకర్యంగా ఉండేది”

ఇద్దరూ ఆ చివరి మాటకు ఆశ్చర్యపోయారు. పెద్దగా నవ్వుకున్నారు.

ఉదయ్ వచ్చినపుడు తెప్పించుకున్న మాజా బాటిల్స్ ఖాళీ అయ్యాయి.

రవళి లేచి నిలబడి “ఏవైనా పర్సనల్ మ్యాటర్స్ మాట్లాడేప్పుడు పర్సన్ టు పర్సన్ అయితే బావుంటుంది. మూడో వ్యక్తి ఉండే ఎట్లైనా తేడా ఉంటుంది. ఎటూ విషయాలు తరువాత అడిగి తెలుసుకుంటాగా! మా తమ్ముడు స్కూటీ కోసం ఎదురు చూస్తుంటాడు. నేను బయలుదేరుతాను” అన్నది.

“ఏం చదువుతున్నాడు మీ తమ్ముడు?” అడిగాడు ఉదయ్.

“బీ.టెక్ సెకండియర్”

“మీ నాన్నగారేంచేస్తుంటారు?”

“బ్యాంక్ మేనేజర్, ప్రస్తుతం నాగపూర్‌లో పనిచేస్తున్నారు. అమ్మ, నేను, తమ్ముడు ఇక్కడ ఉంటాం. నాన్న వీలైనప్పుడల్లా వచ్చి వెళుతుంటారు”

“ఓ అలాగా”

“ఓకె. బై టు బోత్ ఆఫ్ యూ” అంటు స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయింది రవళి.

ఉదయ్ అరుణ వైపు కొద్దిసేపు చూసి “అరుణా! ఇంతకుముందు మాటల మధ్యలో మీ అమ్మగారి గురించి తెలుసుకున్నాను. ఇప్పుడు మీ నాన్న, మీ కుటుంబ సభ్యుల గురించి చెప్తావా?”

“నాకు అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు లేరు. నా ముందు ఒక బాబు పుట్టిపోయాడట. మాది ఒకప్పుడు బాగా బ్రతికిన కుటుంబమే. పదెకరాల ఆసామి అయిన మా నాన్న మా అమ్మ గుండె జబ్బు నుంచి ఇప్పటి నా చదువు వరకూ ఖర్చులు, దానికి తోడు తరచూ పంట నష్టాలు కారణంగా ఇప్పుడు రెండెకరాల చిన్న రైతుగా ఉన్నాడు. అయినా నాన్న చెక్కుచెదరని మనోధైర్యం గలవాడు. నాకు ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడం వల్ల నన్ను డాక్టరు చెయ్యటానికి సిద్ధపడ్డాడు.

నాచేత పేదవారికి సేవ చేయించాలని ఆయన కోరిక. ముఖ్యంగా స్త్రీలకు. మా నాన్న కోరిక తీర్చడమే నా ఆశయంగా పెట్టుకున్నాను.

నీ గురించి అన్ని విషయాలు చెబుతున్నావు. నేను కనీసం మా ముఖ్య వివరాలు చెప్పటం సబబు అని చెబుతున్నాను. అంతవరకూ చాలు. ఎక్కువైతే ఇబ్బంది పడతావు” అని ముగించింది అరుణ.

“మీ ఇద్దరి కోరికా తప్పక నెరవేరుతుంది అరుణా! అసలు నువ్విప్పుడే నీ హాస్పిటల్లో పేషెంట్స్‌తో బిజీగా నాకు కనపడుతున్నావు”

“అంత తొందరొద్దుగానీ ఇంతకూ మీ నాన్నగారితో మాట్లాడి ఏమి పురోగతి సాధించావో చెప్పు”

ఉదయ్ అరుణకు తన మామ కూతురు సంధ్యను కలవడం, అమ్మతో నాన్నతో అక్కతో మాట్లాడటం, బెంగుళూరు అమ్మాయి ప్రేమ, విజయవాడ ఉద్యోగ ప్రయత్నం అన్నీ వివరంగా చెప్పాడు.

అరుణకి ఆశ్చర్యం కలిగింది. “ఉదయ్! నువ్వు ఆ ఉదయ్ వేనా? అందరూ అనుకునేంత మెతకేమీ కాదు, అలా కనిపిస్తావంతే!. సరే! బెంగుళూరు అమ్మాయి పేరేంటి?”

“ఏమో మావాళ్ళకేపేరు చెప్పానో గుర్తులేదు, ఏ పేరు చెప్పలేదనుకుంటా!”

“అదేంటి?” అడిగింది ఆశ్చర్యంగా

“ఎవరైనా ఉంటేగా చెప్పటానికి? ఇందాక నీ గురించి రవళి చెప్పిందే అలా అనమాట”

“ఓ గాడ్! రవళి నా గురించి చెప్పడం వేరు. నువ్వు మీ పేరెంట్స్‌కి చెప్పడం వేరు. అలా అబద్ధం ఎందుకు చెప్పావు?”

” ఏం చెయ్యాలో తోచలేదు. సంధ్యతో మాట్లాడుతున్నపుడు ఎవర్నైనా ప్రేమించావా? అనడిగింది. అనుకోకుండా అలాంటిదేలే అనేశాను. అప్పుడొచ్చింది ఐడియా. ప్రస్తుతానికి అలా ఈ హడావిడికి బ్రేకేశాను”

కాసేపు దీర్ఘంగా ఆలోచించి అంతే దీర్ఘంగా నిట్టుర్చింది అరుణ.

“సరే! ఉద్యోగం సంగతేంటి? చేరిపోతావా?”

అక్కడ మనోజ్‍ని అడిగిన సందేహాలు చెప్పాడు.

అరుణ నవ్వింది. “మీ వ్యాపారంలో మాదిరే అక్కడ కూడా అవినీతి ఉంటుందని నీ దిగులు. నీ వెనుక కొండంత అండ ఉంది. నిరుద్యోగులకుండే అవసరం, ఆర్థిక ఇబ్బందులు నీకు లేవు. కాబట్టే అలా మాట్లాడి, అయిష్టం కలిగి వద్దనుకుంటున్నావేమో. మరొకరైతే వెంటనే చేరిపోయేవాళ్ళు.

నీవు సొంతంగా బిజినెస్ పెట్టుకోగలిగిన నాడు ఏ సంశయాలూ ఉండవు. అప్పటిదాకా నీ ఉద్యోగం నిజాయితీగా చేసుకో. అంతేకానీ వాళ్ళలో ఏమేమి లోపాలున్నాయో అని వెతుకుతూ అక్కడ ఉద్యోగమే చెయ్యననటం సరికాదు. ఈ విషయంలో మీ స్నేహితుడు చెప్పింది నిజం.

ఎక్కడైనా ఒకటేలే అనుకుంటే మీ నాన్న బిజినెస్ లోనే కొనసాగుతూ నీకు తగ్గ సంస్థ దొరుకుతుందేమో చూసుకో. అంతకన్నా ఏమి చెప్పాలో నాకూ తెలియడం లేదు. అలాగే నీ బెంగుళూరు అమ్మాయి ప్రేమ విషయంలో ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ కథ ఎలా ఎటు తిరుగుతుందో కూడా ఇప్పుడు ఊహించలేం. పరిస్థితికి తగ్గట్లు జాగ్రత్తగా నువ్వు అడుగులు వెయ్యాలి.

నీకు ముందు ఉన్నది రెండే అంశాలు. ఒకటి నీ సంపాదన నిజాయితీగా ఉండాలనుకోవడం. రెండవది మీ మామయ్య కూతురుతో పెళ్ళి ఇష్టం లేకపోవడం. మొదటి విషయం నిదానంగా చూసుకోవచ్చు. పెళ్ళి విషయమే జాగ్రత్తగా ఆలోచించుకో. అంతా అయినవాళ్ళు. ఎవరినీ దూరం చేసుకునేలా వ్యవహరించొద్దు” అంటూ అతని కళ్ళలోకి చూసింది.

“ప్రస్తుతం నేను అలానే నడుచుకుంటున్నాను అరుణా! మా అమ్మ అమాయకురాలు. నాన్న ఎంత చెప్తే అంత. మా నాన్న అన్నా నాకిష్టమే. కాకపోతే ఆయన ఆలోచన, మామయ్య దగ్గర ఆయనకున్న అశక్తత పరిస్థితులను కాస్త టెన్స్‌గా తయారుచేస్తున్నాయి”.

“ఫరవాలేదు ఉదయ్! నువ్వు చక్కగా మేనేజ్ చెయ్యగలవు. మరో విషయం నేను రెండు వారాలు నీతో సావకాశంగా మాట్లాడలేను. మా లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి. తరువాత మా ఊరెళతాను. ఊరెళ్ళేముందు నీకు ఫోన్ చేస్తాను. టైం ఎనిమిది దాటింది. ఇక వెళదామా?”

“అలాగే అరుణా! దినేష్‌ని అడిగానని చెప్పు”

“ఏయ్”

“ఓకె బై” అంటూ బయలుదేరాడు ఉదయ్.

***

రోజులు గడుస్తున్నాయి. ఉదయ్ తన రోజువారీ పనులు చూసుకుంటూనే ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తున్నాడు. ఒకసారి అదిలాబాద్ వెళ్ళి అక్కడొక ఫ్యాక్టరీ వారిని కలిస్తే అవసరం వచ్చినపుడు కబురు పెడతామన్నారు. తెలిసిన వాళ్ళకి ఫోన్లు చేస్తున్నాడు. ఆ క్రమంలోనే ఆ సాయంత్రం చెన్నైలో ఉన్న స్నేహితుడు మనోజ్‌కి చేశాడు.

“హాలో ఉదయ్! నేనే నీకు ఫోన్ చేద్దామనుకుంటున్నాను. ఉదయం నాన్నతో మాట్లాడినప్పుడు నీ గురించి అడిగాడు. నేను చెప్పేకంటే నువ్వే ఒకసారి నాన్నతో మాట్లాడు. నేను ట్రాఫిక్‌లో ఉన్నాను. తరువాత మాట్లాడుతాను” అని ముగించాడు.

వెంటనే దుర్గాప్రసాద్‌కి ఫోన్ చేశాడు ఉదయ్.

“అంకుల్ నమస్తే! నేను ఉదయ్‌ని”

“ఆ ఉదయ్, ఎలా ఉన్నావ్?”

“బాగున్నాను, ఇప్పుడే మనోజ్‌కి ఫోన్ చేస్తే మీకు చెయ్యమన్నాడు”

“అవును! ఒంగోలులో నాకు మంచి మిత్రుడు తిరుపతి స్వామి అని గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. నీ గురించి చెప్పాను. నిన్నొకసారి వచ్చి మాట్లాడమన్నాడు. నీ అభిప్రాయాల గురించి మా మనోజ్ నాకు చెప్పాడు. ఆ విషయంలో నాకంటే స్వామి నీకు బాగా నచ్చుతాడనే నా ఉద్దేశం. అతని అడ్రసు, ఫోన్ నెంబర్ నీకు మెసేజ్ చేస్తున్నాను. వీలు చూసుకొని ఒకసారి వెళ్ళిరా”

“అలాగే అంకుల్, థ్యాంక్యూ” అని ఫోన్ పెట్టేశాడు.

ఉదయ్ వంట గదిలోకెళ్ళి “అమ్మా! రేపు ఉదయాన్నే ఊరెళ్ళాలి” చెప్పాడు.

“ఏ ఊరు? ఉద్యోగం కోసమేనా? అయినా నీకు ఇదేం పట్టుదలరా?”

“పట్టుదలే మరి! ఏ ఊరో ఏమిటో పని అయ్యాక చెబుతాన్లే ముందు టీ పెట్టు” అన్నాడు సంతోషంగా. ఆమె ఇచ్చిన టీ కప్పు అందుకొని ఈల వేస్తూ బాల్కనీలో కెళ్ళి కూర్చున్నాడు. టీ తాగుతూ మధ్యమధ్యలో ఈల వేస్తూనే ఉన్నాడు.

అంతలో సెల్ మోగింది

“హలో అరుణా!”

“ఏంటి ఉదయ్ ఇవాళ నీ గొంతు ఎంతో ఉత్సాహంగా కనబడుతున్నది?”

“కనిపెట్టేశావా? ఉత్సాహమే మరి. ఆ మధ్య విజయవాడ వెళ్ళొచ్చాను తెలుసుగా. ఆ అంకుల్ ఒంగోలులో మరో ఉద్యోగం గురించి చెప్పాడు. రెండ్రోజుల్లో వెళ్ళి రావాలి, ఎక్కడో ఒకచోట చేరిపోవాలి”

“ఓ కంగ్రాట్యులేషన్స్! నీవనుకున్నట్లే అన్నీ జరుగుతున్నాయి”

“ఏమో అక్కడ పరిస్థితులేంటో”

“ఊరకే అనుమానాలు పడకు. ఆత్మ విశ్వాసంతో అడుగు వేస్తే అనుమానాలు, భయాలు ప్రక్కకు తప్పుకుంటాయి. అసలు నీకు ఆ శక్తి లోపల కాచుకుని ఉంది. ముందు వెళ్ళిరా”

“నామీద నాకంటే నీకే ఎక్కువ నమ్మకం ఉన్నట్లుంది. థ్యాంక్యూ! ఇంతకీ నీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్సామ్స్ అయిపోయినట్లేనా?”

“అయిపోయాయి. బాగా రాశాను. ఇప్పుడు మా ఊరు వెళుతున్నాను. మా ఇంటెదురు వేణుగోపాల స్వామి గుళ్ళో స్వామివారి కళ్యాణం చేస్తున్నారు. మా నాన్న ప్రతి ఏటా చాలా వరకూ పనులూ తనే చేస్తుంటాడు. నేను పక్కనుంటే ఆయనకు మరీ సంతోషం.”

“ఎప్పుడెళుతున్నావు?”

“రైల్లో బయలుదేరాను కూడా. నాతో రవళిని కూడా తీసుకెళుతున్నాను. ఇదిగో నీతో మాట్లాడుతుందిట” అంటూ అమెకు ఫోన్ ఇచ్చింది. “హాయ్ ఉదయ్! ఆ! నేనూ ఎగ్జామ్స్ బాగనే రాసాను. నువ్వు కూడా గుడ్ న్యూస్ చెప్పావు. చాలా సంతోషంగా ఉంది. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఉదయ్” అంటూ ఫోన్ పెట్టేసింది.

అంతలో హాల్లో నుంచి “ఉదయ్” అని పిలుస్తూ శంభుప్రసాద్ గొంతు వినిపించింది.

ఉదయ్ హాల్లోకి వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళందర్నీ చూసి నోరెళ్ళబెట్టాడు. శంభుప్రసాద్‌తో పాటు నాగరాజు, అతని భార్య సులోచన, కూతురు సంధ్య ఉన్నారు. సంధ్యను చూసి మరీ విస్తుపోయాడు. చీర కట్టుకొని, కనపడేట్లు బొట్టు పెట్టుకొని, వినయం చిరునవ్వు చిందిస్తున్నది.

“బావా బాగున్నావా?” అని తనే ముందు పలకరించింది. ఉదయ్‌కి అంతా అయోమయంగా ఉంది. యాంత్రికంగా అడుగులు వేస్తున్నాడు.

నాగరాజు నవ్వుతూ “రా ఉదయ్ కూర్చో!” అని తను లేచి సంధ్య పక్కన చోటు చూపించి తను శంభుప్రసాద్ ప్రక్కన కూర్చున్నాడు. “కూర్చో రా!” అని వంత పాడాడు శంభుప్రసాద్.

కాసేపు నిశ్శబ్దం. పది కళ్ళూ తనని పట్టిపట్టి చూస్తున్నాయి. వెళ్ళి కూర్చున్నాడు. ఆ జంటను చూసి అందరి ముఖాల్లో వెలుగు. శకుంతల మాత్రం తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో తంటాలు పడుతున్నది.

నాగరాజు గొంతు సవరించుకొని “హఠాత్తుగా వచ్చామేమిటని ఆశ్చర్యపడుతున్నావా ఉదయ్!? ఏమీలేదు ఈ వీధి చివర్లో మన ఎం.ఎల్.ఎ తమ్ముడి మనవడి మొదటి పుట్టినరోజు పార్టీ. అవసరమైన వ్యక్తులు కదా! బయలుదేరాం. అయితే సంధ్య మాత్రం ఆ పార్టీకి రానన్నది. ‘మీరు వెళ్ళిరండి, మీరు తిరిగి వచ్చిందాకా నేను బావతో కబుర్లు చెబుతుంటాను. బావతో మాట్లాడి చాలా రోజులైంది’ అన్నది” అన్నాడు ఉదయ్ వైపు ఓరకంటితో చూస్తూ.

ఉదయ్ అసహనంగా అటు ఇటు చూశాడు. అది పట్టించుకునే స్థితిలో ఎవరూ లేరు.”మేము సాధ్యమైనంత త్వరగా వచ్చేస్తాం” అంటూ భార్యతో సహా బయలుదేరాడు. వాళ్ళను గేటుదాకా సాగనంపి తిరిగొచ్చి “ఇక్కడేం కూర్చుంటార్రా! నీ గదికెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి” అంటు తన గదిలోకి వెళ్ళిపోయాడు శంభుప్రసాద్. శకుంతల కాళ్ళు అలవాటు ప్రకారం వంటగదివైపు మళ్ళాయి.

సంధ్య తనే ముందు ఉదయ్ గదిలోకి నడిచింది. అతనికి ఆమెను అనుసరించక తప్పలేదు. ఆమె అతని గదిని పరీక్షగా చూస్తూ తిరుగుతోంది. గది చాలా శుభ్రంగా ఉంది. టేబుల్ మీద ఉన్న కొన్ని పుస్తకాలను తీసి చూసింది. పెదవి విరిచింది.

“నీ గది గోడలు తెల్లగా శుభ్రంగా ఉన్నాయి, నీ మనసు లాగే. అదే నా గది గోడలకున్న పెయింటింగ్స్ చూడాలంటే ఒక గంట పడుతుంది”

“నాకు పెయింటింగ్స్ గురించి ఏమీ తెలీదు అందుకే కొనలేదు”

“నాతో నాలుగురోజులు కలిసి తిరిగావంటే సిటీలో ఉన్న అన్ని ఆర్ట్స్ గ్యాలరీలూ చూపిస్తాను. అప్పుడు నీకూ అర్థమౌతాయి.”

మౌనం కూడా అసహనంగానే వాళ్ళిద్దరి మధ్య మెదిలింది.

“బావా! చీరలో నేనెలా ఉన్నాను? ఇలా ఉంటే నీకు ఇష్టమనుకుంటా!”

“నా యిష్టాయిష్టాలతో పనేముంది? నీకు ఎలాంటి దుస్తులు ఇష్టమో అవే వేసుకుంటావుగా!”

“ఇవాళ ఈ చీర మాత్రం నీ కోసమే కట్టుకున్నాను”

“నీ మాటలు నాకు అర్థం కావడం లేదు”

“ఆ సంగతి నాకు అర్థమౌతున్నది”

“ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా?”

“అవును, ఆ మధ్య కాలేజీలో నీతో మాట్లాడినప్పడి నుండీ నేను నీ గురించే ఆలోచిస్తున్నాను. రోజులు గడిచే కొద్దీ నీ మీద ఇష్టం పెరుగుతున్నది. నిన్ను చూడాలి, మాట్లాడాలి అనిపించింది. ఇవాళ కుదిరింది”

ఉదయ్ ఏమి మాట్లాడలేదు.

“మనం పెళ్ళి చేసుకుందామా బావా?” అన్నది ఆమె ఒక్కసారిగా.

“నేను అమెరికా రానని చెప్పాను. మరొకమ్మాయిని ఇష్టపడుతున్నాననీ చెప్పాను”

“చెప్పావు. కానీ నిన్ను బ్రతిమాలుకోవాలని, నీ మనసు నావైపు తిప్పుకొవాలని వచ్చాను. నీకు అమెరికా రావడం ఇష్టం లేకపోతే సరే. నువ్వెక్కడుంటే అదే నాకు అమెరికా అయినా మరేదైనా” అంటూ రుమాలుతో కళ్ళు తుడుచుకుని “ఇప్పటికిప్పుడే నీవు సరే అనవసరంలేదు బావా, రెండు మూడు రోజులు టైమ్ తీసుకోని సరే అని చెప్పు” అన్నది, అతని కళ్ళలోకి ఆరాధనగా చూస్తూ. అతను ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

అంతలో ఏదో శబ్దం అయ్యేసరికి ఇద్దరూ అటుగా చూశారు. శకుంతలు టీ కప్పుల ట్రే తో వస్తున్నది. సంధ్య ఒక్క ఉరుకున ఆమెకు ఎదురెళ్ళి “మీరెందుకు తెస్తున్నారత్తయ్యా! నన్ను పిలిస్తే వచ్చేదాన్నిగా? నాకు కాఫీలు, టీలు అలవాటు లేదు. పైగా బావతో మాట్లాడుతుంటే అసలు మంచినీళ్ళు కూడా అవసరం లేదనిపిస్తుంది” అంటూ ట్రేని అందుకుంది.

శకుంతల నోరెళ్ళబెట్టి ఉదయ్ వైపు చూసింది. అతనూ అదే భంగిమలో ఇందాకట్నుంచీ ఉన్నాడు.

సంధ్య అటు ఇటు తిరుగుతూ చిన్నచిన్న పనులు అతి శ్రద్ధగా చేస్తూ, అతి వినయం, ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నది. మరో గంట సమయం ఉదయ్‌కి చాలా భారంగా గడిచింది.

రాత్రి పది గంటల సమయంలో నాగరాజు దంపతులు వచ్చి సంధ్యను తీసుకొని బయలుదేరారు. అప్పటికే ఆలస్యం కావడం వల్ల వాళ్ళు మళ్ళీ కూర్చొని కబుర్లు పెట్టలేదు. వెళుతూ నాగరాజు వెనక్కు తిరిగి చూసి “ఆ బావా! గుజరాత్ కాంట్రాక్టు దాదాపూ వచ్చేసినట్లే, మరి అన్ని విషయాలు ఉదయ్‌తో మాట్లాడి సిద్ధం చెయ్యి” అంటూ వెళ్ళిపోయాడు.

శంభుప్రసాద్ ఉదయ్ వైపు చూస్తూ “నేను సంధ్యను ఈ మధ్య చూడలేదు. చక్కగా ఉంది. ఆ వినయం, కలుపుగోలుతనం. నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వేమంటావ్ శకుంతలా?” అన్నాడు కళ్ళు అటు తిప్పి. ఆమె చిరునవ్వులో రెండుమూడు రకాల భావ ప్రకటనలు తొంగి చూశాయి. అది అంగీకారంగా తీసుకొని హూషారుగా తన గది వైపు వెళుతున్నాడు శంభుప్రసాద్.

“రేపు ఉదయాన్నే నేను ఊరెళుతున్నాను నాన్నా. రెండ్రోజుల్లో వస్తాను” అన్నాడు ఉదయ్. శంభుప్రసాద్ అతని వైపు చూసి నవ్వుతూ “నీ పనుల్లో నువ్వుండరా, నాపనుల్లో నేనుంటాను” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఉదయ్‌కి ఆ మాటలు సరిగా అర్థం కాలేదు. “ఏంటమ్మా! ఏ పనులు గురించి నాన్న మాట్లాడేది?” అడిగాడు.

“ఏముంది నువ్వు నీ ఉద్యోగం గురించి, ఆయన నీ పెళ్ళి గురించి అని ఆయన ఉద్దేశం” అంటూ సోఫాలో కూలబడింది. ఉదయ్ ఆమె ప్రక్కన వెళ్ళి కూర్చొని మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టాడు.

“ఇదేంటమ్మా? నా గోడు ఎవరికీ పట్టినట్లు లేదు. వేరే ఊర్లో ఉద్యోగానికి వెళతానన్నాను. ఒకమ్మాయిని ఇష్టపడుతున్నానని చెప్పాను. అసలు అవేమీ పట్టించుకోవడం లేదంటే ఏదో పెద్ద గూడుపుఠానీ జరుగుతున్నదనిపిస్తున్నది”

“ఇందులో గూడుపుఠానీ ఏముంది? అంతా స్పష్టంగా కనిపిస్తుంటే? వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. నీకు ముందే చెప్పాడుగా ఈ సంబంధానికి సరే అనడం తప్ప వేరే మార్గం లేదని? నువ్వు దేనికీ ఎదురు చెప్పవని అందరికీ నమ్మకం.”

“మళ్ళీ చెబుతున్నాను, సంధ్యకు నేను తగిన వాణ్ణి కాదమ్మా! మూణ్ణెల్లు తిరక్కముందే ఆమె నన్నో నేను ఆమెనో వదిలేసి వెళ్ళడం ఖాయం. ఆమె లైఫ్ స్టైల్ నేను సహించలేను. నా మనస్తత్వం ఆమె భరించలేదు”.

“ఏమోరా! మనుషుల్లో మార్పు రావచ్చు. అయినవాళ్ళైతే జాగ్రత్తగా చూసుకుంటారని అమ్మాయి తల్లిదండ్రులకు ఆశపడటం సహజమే కదా?”

“చూడబోతే నువ్వు కూడా ఆమె కట్టూబొట్టూ, నటన చూసి అటే తిరిగిపోయినట్లున్నావు. సరే నేను వెళుతున్నాను. రేపు ఊరెళ్ళటానికి ఏర్పాట్లు చేసుకోవాలి” అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు.

ఉదయ్ గదిలో అసహనంగా అటూఇటూ తిరుగుతున్నాడు. అంతలో మొబైల్ మ్రోగింది. దానిమీద శ్రీరాం అని పేరు చూడగానే ఉదయ్‌కి పట్టరాని ఆనందం కలిగింది. వెంటనే “శ్రీరాం బావున్నావా? చాలా రోజులైంది నువ్వు పోన్ చేసి. ఇంతకీ ఎప్పుడొస్తున్నావు ఇండియాకి?”

“ఇండియా ఏమిట్రా! ఇవాళ ఉదయమే హైద్రాబాద్‌కి వచ్చేశాను. ఇక్కడ మా ఆఫీస్‌కు వెళ్ళి మాట్లాడి కొన్ని పనులు ముగించుకొనే సరికి సాయంత్రం అయింది. ఇప్పుడే తీరిక దొరికింది, నీకు ఫోన్ చేస్తున్నాను”

“అవునా? నాకు చాలా చాలా సంతోషంగా ఉంది శ్రీరామ్. సరిగ్గా సమయానికొచ్చావు. ఇప్పుడు గంట తొమ్మిది దాటింది. లేకుంటే వెంటనే వచ్చి నిన్ను కలిసేవాడిని”

“అయితే ఏంటి? నన్ను రమ్మంటావా మీ ఇంటికి?”

“వద్దు, నేనే బయలుదేరి వస్తున్నా”

“వెరీగుడ్! వచ్చేసెయ్, ఐ విల్ బి వెయిటింగ్”

ఐదు నిముషాల్లో తయారయ్యి “అమ్మా! శ్రీరామ్ సింగపూర్ నుండి వచ్చాడు. రేపు కలవడం కుదరదు. అందుకు ఇప్పుడే వెళ్ళి మాట్లాడి ఒక గంటలో వచ్చేస్తాను” అంటు బయటకొచ్చి బైక్ స్టార్ట్ చేశాడు ఉదయ్.

శ్రీరాం ఇంటికి చేరగానే అతను ఎదురొచ్చి ఉదయ్‌ని చుట్టేసుకున్నాడు. ఉదయ్ శ్రీరామ్ అమ్మా నాన్నలను పలకరించాక ఇద్దరూ శ్రీరాం బెడ్ రూమ్ వెనుక ఉన్న బాల్కనీలోకెళ్ళి కూర్చున్నారు.

ఉదయ్ తన విషయాలు వివరంగా ఇంతకాలం శ్రీరామ్‌కి చెప్పే అవకాశం దొరకలేదు. ఇప్పుడు పెళ్ళి మాటలు, ఉద్యోగ ప్రయత్నం లాంటి అన్ని విషయాలు, ఎవరెవరితో ఏమేమి మాట్లాడిందీ మొత్తం పూసగుచ్చినట్లు చెప్పేసరికి ఒక గంట సమయం గడిచింది. శ్రీరామ్ దీర్ఘంగా నిట్టూర్చాడు. ఆ తర్వాత కొద్దిగా నవ్వాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here