Site icon Sanchika

ఉదయ రాగం-7

[box type=’note’ fontsize=’16’] శ్రీ భీమరాజు వెంకటరమణ వ్రాసిన ‘ఉదయ రాగం’ అనే నవలని ధారావాహికగా పాఠకులకు అందిస్తున్నాము. [/box]

[dropcap]”అ[/dropcap]లాగేలే కానీ అప్పుడు నేనూ ఒక విషయం చెప్పా కదా దాని గురించి ఏమి ఆలోచించావు?”

ఉదయ్ మౌనంగా ఉన్నాడు.

“మీ మామయ్య పెళ్ళికి కాస్త తొందర పెడుతున్నాడు. నువ్వు నీ ఇష్టం వచ్చిన చోట ఉద్యోగంలో చేరు ఫరవాలేదు. కానీ వాళ్ళకి మనం ఖాయపరుస్తే ఇద్దరికీ అనుకూలంగా ఉండే ముహూర్తం చూస్తారు”

“ఒక సంవత్సరం మానకుండా పనిచేస్తానని అక్కడ మాట ఇచ్చాను”

ఇప్పుడు మౌనం కాసేపు శంభుప్రసాద్‌ని ఆవహించింది.

“ఆ కంపెనీ పేరేంటి, యజమాని ఎవరు?” ఓ రెండు నిముషాలు ఆగి అడిగాడు.

“ఎవరైతే ఏంటి నాన్నా. మన కుటుంబ వివరాలేవీ వాళ్ళకు చెప్పలేదు. నా సొంతంగా నేనేంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మీరూ సరే అన్నారనే నమ్మకంతోనే అక్కడ మాటిచ్చాను. ఒక్క సంవత్సరమేగా. ఈలోగా మునిగిపోయిందేముంది?”

“అయితే మీ మామయ్యకు ఏం చెప్పమంటావు?”

“సంవత్సరం పాటు పెళ్ళి వద్దన్నాడని చెప్పండి”

“సంవత్సరం తరువాత పెళ్ళికి సరే అన్నట్లేనా?”

ఉదయ్ ముఖంలో ఏ హావభావాలూ లేవు.

“ఆ బెంగుళూరు అమ్మాయి సంగతేంటి?”

“ఆ అమ్మాయితో మాట్లాడి చాలా రోజులైంది. ఏమైనా పెళ్ళి గురించి నేను సంవత్సరం పాటు ఆలోచించదలుచుకోలేదు”

“సంవత్సర కాలం అసలు పెళ్ళేచేసుకోవు. అంతేగా?”

ఉదయ్ తలూపాడు

“ఎప్పుడు వెళుతున్నావు ఒంగోలు?”

“ఒక వారం రోజుల్లో”

“నీలో చాలా మార్పు వచ్చిందిరా. ఎవరో మంచి సలహాలిచ్చే స్నేహితులున్నట్లున్నారు. ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం సులభం. వాటిని నేరవేర్చుకోవడమే… సరే! అక్కడ దేనికీ ఇబ్బంది పడవాకు. బ్యాంక్ కార్డ్స్ తీసుకెళ్ళు. మంచి ఇల్లు తీసుకో. కుదిరినప్పుడల్లా వస్తుండు”

“సరే” అంటూ మేడ మీద తన గదిలోకెళ్ళాడు ఉదయ్.

కొడుకు వైపే ఆలోచిస్తూ చూస్తున్నాడు శంభుప్రసాద్.

“అదేంటండీ! ఏదో ఒకటి తేల్చేస్తానన్నారు?. సామరస్యంగా వాయిదా వేసేశారేంటి? అడిగింది శకుంతల.

“చూడు! మనవాడు సంవత్సరం అక్కడ పని చెయ్యడం అనేది జరుగదు. మన పనులకంటే ఆ గ్రానైట్ వాళ్ళ పనులు కష్టంగా, హడావిడిగా ఉంటాయి. అక్కడా వీడికి నచ్చని విషయాలుంటాయి. కాబట్టి ఒక వారం తరువాత ఏరోజైనా వాడు వచ్చేస్తాడని నాకు గట్టి నమ్మకం. సంవత్సరం అక్కడ ఉంటానని భరోసాతో అప్పటిదాకా పెళ్ళి చేసుకోనన్నాడు. అయితే మధ్యలోనే వచ్చేస్తాడు కాబట్టి మనం అనుకున్నట్లు చేసేయ్యొచ్చు. ఒకసారి వాడి సొంత ప్రయత్నాలకి అవకాశం ఇస్తే, విఫలమై తిరిగి వచ్చాక అలాంటి ఆలోచన మళ్ళీ చెయ్యడు. మన పని సులువైపోతుంది. ఇక ఆ బెంగుళూరు అమ్మాయి సంగతి అప్పుడు తేలుద్దాం. మీ అన్నకి ఏదో ఒకటి చెప్పి ఒక నెలైనా గడువు పెట్టే విషయం ఆలోచించాలిప్పుడు. పోయి స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకరా. మెత్తగా మాట్లాడుతూ బుర్ర వేడిక్కించడం నీకూ నీ కొడుక్కీ బాగా తెలుసు”

శకుంతల అతనికి కనపడకుండా నవ్వుకుంటూ వెళ్ళింది.

***

ఎట్టకేలకు ఉదయ్ ఒంగోలులో ఆ ఉదయం కాలు మోపాడు. అద్దెకు మూడు గదుల ఇల్లు ఏర్పాటయ్యింది. ఫుల్లీ ఫర్నిష్డ్ ఇల్లు. అంటే ఒక పైపు మంచం, రెంటు ప్లాస్టిక్ కుర్చీలు. పైన లయబద్ధంగా శబ్దం చేస్తూ ఒక పాత ఫ్యాను. మూడు గదులూ కలిసి హైద్రాబాద్ లో తన బెడ్ రూమ్ అంత ఉండవు. తన సూట్‌కేస్ తెరిచి బట్టలు సర్దుకున్నాడు. ఇంటి యజమాని ప్రక్క పోర్షన్‌లో ఉన్నాడు. కాస్త అవతలగా రోడ్డు. దానిమీద వెళ్ళే లారీలు, బస్సులు, ఇతర భారీ వాహనాలు. అంతా శబ్దాలు, దుమ్ము.

రెండు వారాలు దాటింది. ఒక వారం రోజులు క్వారీకి వెళ్ళి అక్కడ పనులు, మిషనరీ, బ్లాస్టింగ్, రాయి తీయడం, వాటిని పరీక్షించడం, పనివాళ్ళు, వాళ్ళకి ఇస్తున్న వేతనాలు, అన్ని విషయాలూ దగ్గరుండి చూశాడు. ఫ్యాక్టరీలో స్లాబ్స్, టైల్స్ కట్ చెయ్యడం, వాటిని కొలిచే విధానం, ఇక్కడి పని వాళ్ళు, వాళ్ళ జీత భత్యాలు, ఆఫీసు అకౌంట్స్, వచ్చేపోయే కస్టమర్లు, వాళ్ళతో మాట్లాడేప్పుడు వీలైతే తిరుపతి స్వామి గదిలో కూర్చోవడం చేస్తున్నాడు.

తిరుపతి స్వామి కూడా ఉదయ్‍ని ఏమీ కదపదల్చుకోలేదు. అతని ఇష్టానికి అతన్ని వదిలేశాడు.

తరువాత రెండు వారాలూ మార్కెటింగ్ వాళ్ళతో తరచూ మాట్లాడి విషయాలు తెలుసుకోవడం, లేబర్ ఆఫీసు, మైన్స్, ఎక్స్‌ప్లోజివ్స్ ఆఫీసులు, అక్కడికి వెళుతున్న స్టాఫ్‌తో కలిసి వెళ్ళి పరిచయాలు చేసుకోవడం లాంటివి చేశాడు. రోజులు అతనికి చాలా చాలా బిజీగా గడిచిపోతున్నాయి.

ఒక రోజు తిరుపతి స్వామి ఫ్యాక్టరీ నుండి ఒక లారీలో టైల్స్ లోడ్ విజయవాడకి బయలుదేరబోతున్నది. ఆ విధంగా నెలకి కనీసం నాలుగైదు లోడ్స్ విజయవాడ ట్రేడర్‌కి వెళుతుంటాయి.

ఈసారి ఉదయ్ లారీ ఎక్కి ఆ టైల్స్‌ని లెక్కవేశాడు. డ్రైవర్ దగ్గర కాగితాలు తీసుకొని చెక్ చేశాడు. ఒక వంద చదరపు అడుగుల టైల్స్ తక్కువగా వ్రాసి ఉన్నాయి. అంటే అవి లెక్కలో లేకుండా బయటకు వెళ్ళిపోతున్నాయనమాట.

ఆ లోడింగ్ పని చూసే రమేష్‌ని పిలిచి “డెలివరీ చలాన్‍లో వ్రాసిన దానికంటే దాదాపు వంద అడుగుల టైల్స్ ఎక్కువ లోడ్ అయ్యాయి. ఒకసారి నువ్వూ లెక్కేస్తావా?” అడిగాడు.

అతను అదోలా చూస్తూ “అంతా సరిగానే ఉంటుంది. నీకు కొత్త కదా! లెక్కించడంలో తేడా వచ్చిందేమో” అన్నాడు చిరునవ్వుతో వెళ్ళిపోతూ.

“నువ్వూ ఒకసారి లెక్కేసి చూపించు. నేర్చుకుంటాను” అన్నాడు ఉదయ్. లోడింగ్ కూలీలు కూడా వచ్చి నిలబడ్డారు.

రమేష్ ముఖం చిరాగ్గా పెట్టి లారీ పైకెక్కి లెక్కేసి “నువ్వే కరెక్ట్ ఉదయ్! ఎక్కడో పొరపాటు జరిగింది. విడిగా పెట్టి ఉన్న కొన్ని టైల్స్ కూడా చూసుకోకుండా మనవాళ్ళు లోడు చేసినట్లున్నారు. చూస్తారేంట్రా? లారీలోనుంచి ఒక వంద అడుగులు దింపండి” అని “నువ్వు చెప్పబట్టి సరిపోయింది లేకపోతే సరుకు వెళ్ళిపోయేది” అంటూ, దగ్గరుండి అవి తీయించి వెళ్ళిపోయాడు.

ఉదయ్ మరేమీ మాట్లాడకుండా ఆఫీసు గదివైపు నడిచాడు.

ఆఫీసులో తిరుపతి స్వామితో రోజువారి పనుల గురించి మాట్లాడుతూ మధ్యలో “రమేష్ మీ బంధువౌతాడని ఎవరో చెప్పారు, నిజమాండి?” అడిగాడు.

“అవును ఉదయ్, నా భార్య వైపు నుండి కాస్త దూరపు బంధువు. చదువు అంతగా వంటపట్టలేదు. డిగ్రీ మధ్యలో ఆగిపోయిందిట. ఎక్కడెక్కడో చాలా రకాల ఉద్యోగాలు చేశాడు. అతను స్థిరపడకుండానే వాళ్ళవాళ్ళు అతనికి పెళ్ళి కూడా చేశారు. సంవత్సరం క్రితం మా ఇంట్లో ఆడవాళ్ళు అడగడంతో పనిలో చేర్చుకున్నాను. లోడింగ్, అన్‌లోడింగ్ చూస్తుంటాడు. పనిలో చురుగ్గానే కనపడుతున్నాడు. అవును ఇంతకూ అతని గురించి ఎందుకడుగుతున్నావు?” అన్నాడు.

“ఏం లేదు ఊరికే అడిగాను” అని ఉదయ్ అంటుండగానే రమేష్ లోపలికొస్తూ “ఇవాళ ఉదయ్ మనకు నష్టం రాకుండా చేశాడు అంకుల్! వందడుగు టైల్స్ పొరపాటున ఎక్కువ లోడైనాయి. మరో ఐదు నిముషాలైతే లారీ వెళ్ళిపోయేది. లోండింగ్ విషయాలు ఎక్కువగా పట్టించుకోని ఉదయ్ ఇందాక లారీ పైకెక్కి మరీ లేక్కేశాడు” అన్నాడు.

“అవునా ఉదయ్? వెరీ గుడ్! ఒకవేళ లోడు వెళ్ళిపోయినా మరేం ఫరవాలేదులే! మన పాత కస్టమర్ సూర్యారావుగారికేగా! తనే చూసుకొని మనకు చెబుతాడు కూడా. ఏదిఏమైనా నువ్వు వచ్చిన మొదటి రోజు నుండీ చూస్తున్నాను. అన్ని విషయాలు బాగా గమనిస్తున్నావు. మరొక నెల రోజులాగి నీ వర్క్ నిర్ణయిద్దాం ఏమంటావ్?” అడిగాడు.

“అలాగేనండీ నాకు మరి కాస్త అవగాహన వస్తుంది” అన్నాడు నవ్వుతూ.

సాయంత్రానికి పనులన్నీ అయిపోగానే తన గదికి చేరుకున్నాడు ఉదయ్.

రాత్రి ఎనిమిది కావస్తోంది. చిన్నగా రోడ్డు మీదకొచ్చి తను భోజనం చేసే మెస్‌కి వచ్చి కూర్చున్నాడు. ఒకతను వచ్చి ఇస్తరి వేసి వడ్డించాడు. కొద్దిసేపటికే మరో భారీ మనిషి వచ్చి ప్రక్కన నిలబడ్డాడు. ఉదయ్ తలతిప్పి చూస్తే రమేష్ నవ్వుతూ “ఇవాళ మా ఇంట్లో ఎవరూ లేరు. నేనూ ఇక్కడే భోజనం చేస్తాను” అన్నాడు. ఉదయ్ ఏమీ మాట్లాడలేదు.

ఇద్దరూ మౌనంగా భోజనం చేశారు. ఒక పావుగంట తరువాత “వెళ్ళొస్తా” అని అతనికి చెప్పి ఉదయ్ తన గదికి బయలుదేరాడు. రమేష్ అనుసరించడం చూసి “ఏమిటి విషయం” అన్నాడు.

“నీతో మాట్లాడాలి”

“రేపు ఫ్యాక్టరీకొచ్చినపుడు మాట్లాడొచ్చుగా?”

“చెప్పాగా ఇంట్లో ఎవరూ లేరని? కాసేపు కబుర్లు చెప్పుకుందాం” అంటూ కూడా వచ్చాడు.

గది బయట చిన్న పంచలో రెండు ప్లాస్టిక్ కుర్చీలు వేశాడు ఉదయ్. కాసేపు ఏమీ మాటలు లేవు.

“మా అంకుల్ నీకు జీతమెంత ఇస్తున్నాడు”

“ఇంకా నిర్ణయించలేదు. అవసరమైన ఖర్చులకు ఆఫీసులో తీసుకోమన్నారు”

“నేను చెప్పేదా ఎంత ఇస్తాడో?”

“అవసరం లేదు”

“ఏమవసరం లేదు?”

“తెలుసుకోవాల్సిన అవసరం లేదు”

“పదివేలు లోపే”

“ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నదేమిటి?”

“ముందు నుంచీ జాగ్రత్త పడాలి. ఎప్పుడు ఈ ఉద్యోగాలు ఊడతయ్యో తెలీదు. అప్పుడు బాధపడి లాభం లేదు”

“జాగ్రత్తంటే?”

“ఇందాక చూశావుగా వందడుగుల టైల్స్”

ఉదయ్ అతన్ని ఆశ్చర్యంగా చూశాడు.

“ఇక్కడ అలాంటివి చాలా మార్గాలున్నాయి. ఈ సముద్రంలో మనమూ నాలుగు చేపలు పట్టుకుంటే ఎవరికీ తెలియదు”

“ఊహించాను. నాకు అలాంటి చేపలు అవసరం లేదు”

“అవునా? నీకు అవసరం లేకుంటే నీ ఇష్టం. నాకు నష్టం కలిగించే ప్రయత్నాలు చేస్తే మాత్రం నీకే కష్టం”

“ఏంటి బెదిరిస్తున్నావా?”

“మా అంకుల్ నేను చెప్పిందే వింటాడు”

“ఏం చెబుతావు?”

“అది నీకు అనవసరం. నిన్ను ఒక్కరోజులో ఏ గొడవలోనో ఇరికించి వెళ్ళగొట్టించగలను”

“నువ్వు చెబుతే నమ్మి నన్ను తీసేసే వ్యక్తిదగ్గర పని చెయ్యడం కంటే వెళ్ళిపోవడమే మంచిది”

“అలా ఊరికనే వెళ్ళనిస్తామా?”

“ఏం చేస్తావ్?” ఉదయ్ ముఖంలో కాస్త విసుగు.

“నాకు నేనుగా ఏమీ చెయ్యను”

ఉదయ్ ఇక మాట్లాడలేదు.

రమేష్ లేచి జేబులోంచి సిగరెట్ తీసి అంటించుకొని “నాకు అర్థమైనంతవరకూ నువ్వు చాలా అమాయకుడివి. ఒక్క మాట చెబుతున్నాను విను! నీకు ఎంత జీతం నిర్ణయిస్తే దానికితోడు అంతే డబ్బు నెలకు నీకు నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు యం.కాం అంటగా! ఆఫీసులో కూర్చుని లెక్కలు రాసుకో, హాయిగా కాలం గడిచిపోతుంది. ఫ్యాక్టరీలో లోడింగ్ విషయమే కాదు దేనిలోను తలదూర్చకు. రాళ్ళ ప్రపంచం కదా, తలకు దెబ్బలు తగలొచ్చు. నాకంటే ఎక్కువ చదువుకున్నావు, ప్రశాంతంగా ఆలోచించు. వస్తాను ఉదయ్” అంటూ భుజం తట్టి నవ్వుతూ వెళ్ళిపోయాడు.

మంచం మీద పడుకున్న ఉదయ్ ఆలోచిస్తూ చిన్నగా మొబైల్ ఫోన్ అందుకుని శ్రీరాంకి ఫోన్ చేశాడు.

“హలో గ్రానైట్ మ్యాన్ ఎలా ఉన్నావ్” హుషారుగా శ్రీరాం స్వరం.

“ప్రస్తుతానికి బాగనే ఉన్నాను”

“అదేమిటి.. వాయిస్ డల్‌గా ఉంది”

“అదేం లేదు, బాగనే ఉన్నాను”

“సరే, రొటీన్‌గా కాల్ చేశావా, ఏదైనా విశేషం ఉందా”

“ఇవాళ ఒక విశేషమే జరిగింది” అంటూ లారీ లోడింగ్ దగ్గర నుండి రమేష్ వెళుతూ మాట్లాడిన మాటలు వరకూ చెప్పాడు.

“ఉదయ్! పరిస్థితి బట్టి చూస్తే నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. వాళ్ళ రాబడి నీ వల్ల ఆగిపోయిందంటే వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఊరుకాని ఊరు. నిన్ను నేను భయపెట్టట్లేదు గానీ జాగ్రత్తగా ఉండాలని మాత్రం చెబుతున్నాను. నీ మంచితనం అవతలవాడు అలుసుగా తీసుకోగలడు. ఇంతకీ ఏం చెయ్యాలనుకుంటున్నావు?”

“ఇంకా ఏమీ ఆలోచించ లేదు”

“మీ కంపెనీ ఓనరుతో చెబుతావా?”

“ఏమో తెలీదు. ముందు నీకు చెబుతున్నాను”

“ఓనరుకి చెబుతే మంచిదని నా అభిప్రాయం”

“రేపు ఫ్యాక్టరీకెళ్ళి పరిస్థితిని బట్టి నిర్ణయిస్తాను”

“సరే..రేపు కూడా నాకు ఫోన్ చెయ్యి”

“అలాగే ఉంటాను” అని కాల్ కట్ చేశాడు.

కొద్దిసేపాగి అరుణకి కాల్ చేశాడు

“ఉదయ్ ఎలా ఉన్నావు, భోజనం చేశావా?”

“మొదటే ఈ ప్రశ్నేంటి? మా అమ్మ కూడా అంతే”

“నీ వాయిస్ కాస్త నీరసంగా ఉందిలే అందుకని అడిగా”

“అవునా? నేను బాగనే ఉన్నానే, నీకెందుకలా అనిపించింది?”

“లేదు.. నువ్వు ప్రస్తుతం బాగా లేవు. కాస్త ఆందోళనలో ఉన్నావేమో అనిపిస్తున్నాది. దానికి తగ్గట్లు ఈ సమయంలో నాకు ఫోన్ చెయ్యడం నా అనుమానానికి బలాన్నిస్తున్నది”

“నీ అంచనా నిజమే. ఇక్కడ నేను అవినీతికి పాల్పడకుండా ఉంటే సరిపోదుట. ఆ పని చేసే వాళ్ళతో కలవాలి లేదా చూస్తూ ఊరకుండాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలిట. ఉద్యోగంలో చేరిన కొంత కాలానికే నా అనుమానాల కంటే వంద రెట్లు నీచమైన పరిస్థితి ఎదురైంది”

అరుణ కాసేపు ఆలోచించింది. “మీ నాన్నగారి వ్యాపారంలో ఇలాంటి పరిస్థితి రాలేదా?”

“అక్కడ విషయాలు వేరు. నేను చూసే పనుల వరకూ నాకు నచ్చినట్లే ఏర్పాడు చేశారు. పైగా నేను ఓనరు గారి అబ్బాయిని కదా, స్టాఫ్ అంతా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆ విషయాలు ఒక రకం. ఇక్కడ నమ్మక ద్రోహం నా ఎదుటే జరుగుతున్నది”

“ఏం జరిగింది అలా”

మళ్ళీ జరిగిందంతా అరుణకు చెప్పాడు ఉదయ్

“మీ ఓనరే నిన్ను పరీక్షించడానికి అలా ఏర్పాటు చేశాడేమో!”

“నాకు అలా అనిపించడం లేదు”

“అలాంటప్పుడు మీ ఓనరుగారికి హడావిడి చెయ్యకుండా విషయం చెప్పే ప్రయత్నం చెయ్యి”

“ఏమో! నాకు అలా చేద్దామనిపించడం లేదు”

“అయితే కొన్ని రోజులు ఈ విషయం ఏమీ మాట్లాడకు. జాగ్రత్తగా ఉండు. ఒంటరిగా రాత్రిళ్ళు తిరుగకు”

“అలాగే.. ఇక ఉంటాను మరి”

“గుడ్ నైట్” చెప్పి ఫోన్ పెట్టేసింది అరుణ

ఆ రాత్రి ఆలోచిస్తూ చాలా సేపటికి నిద్రపోయాడు ఉదయ్.

***

ఉదయ్ కాస్త ఆలస్యంగా నిద్రలేచాడు. ఆ రోజు ఆదివారం. అవసరమైన పని ఉంటేనే ఆఫీసు తీస్తారు. ఫాక్టరీలో రాత్రి పన్నెండు గంటల వరకు గ్యాంగ్ సా మిషన్లు నడుస్తుంటాయి. తిరుపతి స్వామి కూడా ఒక్కసారి వచ్చి వెళతారు. లేకుంటే అదీ లేదు.

ఉదయ్ తిరుపతి స్వామికి ఫోన్ చేసి “సార్! ఇవాళ అర్జంటు పనులేమైనా ఉన్నయ్యా, లేకుంటే నేను కాస్త బయటకెళ్ళొస్తాను” అడిగాడు.

“పెద్దగా పనులేమీ లేవులే. నేనూ రావట్లేదు. నువ్వూ పాపం చాలా రోజులుగా బయటకెక్కడికీ వెళ్ళ లేదు. ఆఫీసు దగ్గర మోటర్ బైక్ ఉంటుంది. వాచ్‌మ్యాన్ దగ్గర తాళం ఉంటుంది, తెలుసుగా? తీసుకొని ఒంగోలుకు వచ్చేయ్. మా ఇల్లు లాయరు పేట వి.ఐ.పి. రోడ్‍లో ఉంది. ఎవర్నడిగినా చెబుతారు. మా ఇల్లూ చూసినట్లుంది. ఆ తరువాత మాకు దగ్గర్లోనే సాయిబాబా గుడి, కొండమీద బ్రహ్మాండమైన శ్రీగిరి వేంకటేశ్వర స్వామి వారి గుడి చూడొచ్చు. ఈ రెండు గుళ్ళు ఇక్కడ బాగా ఫేమస్. నీకు ఓపిక ఉంటే కొత్తపట్నం బీచ్‌కి వెళ్ళి కాసేపు కూర్చుని కూడా రావచ్చు, ఏమంటావ్?”

“అలాగేనండీ! బయలుదేరుతున్నా”

ఉదయ్ బైక్ మీద ఒంగోలు తిరుపతి స్వామి ఇల్లు చేరే సరికి గంట పదైయింది. ఇల్లు మరీ పెద్దది కాకపోయినా బాగుంది. ఇంటి చుట్టూ పూల మొక్కలుతో చాలా అందంగా ఉంది. తిరుపతి స్వామి వరండాలోనే కూర్చుని ఉన్నారు.

“రా ఉదయ్! త్వరగానే వచ్చేశావే!”

“అవునండీ! ట్రాఫిక్ ఏమీ లేదు. అడ్రసు కూడా సులభంగానే కనుక్కున్నాను”

తిరుపతి స్వామి భార్య బయటకొచ్చి చూసింది.

“దుర్గా! ఈ అబ్బాయి పేరు ఉదయ్, ఈ మధ్యే మన ఫ్యాక్టరీలో చేరాడు”

ఇద్దరూ నమస్కారాలు చేసుకున్నారు.

“మా ఇద్దరికీ కాఫీ పంపించు”

కాసేపటికి ఆమె కాఫీ కప్పులు ఇద్దరికీ ఇచ్చి వెళ్ళింది.

మరి కాసేపట్లో తిరుపతి స్వామి కూతురు బయటకెళుతూ వీళ్ళని చూసి ఆగింది.

“ఉదయ్! మా అమ్మాయి స్వాతి” పరిచయం చేశాడు.

ఇద్దరూ హాయ్‌లు చెప్పుకున్నారు

“యం.బీ.ఏ చేసింది. చెన్నై లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్నది. ఒక ఐదారేళ్ళాగి ఉద్యోగం మానేసి రమ్మని నా ఫ్యాక్టరీ బాధ్యత అప్పగించేస్తా”

“నాన్నా! మళ్లీ ఆ మాట అన్నావంటే నేను అమెరికా వెళ్ళిపోతా”

ముగ్గురూ నవ్వుకున్నారు.

“బై” అంటూ ఆమె వెళ్ళిపోయింది.

ఇక కాసేపు మాటలు లేవు.

“మీరు ఇలా వరండాలో కూర్చుని ఒక్కొక్కళ్ళతో మాట్లాడుతుంటే మా నాన్న గుర్తొస్తున్నాడు. ఆయన కూడా ఇంతే ఆదివారం పేపరు పట్టుకొని వరండాలో కూర్చుని రెండు మూడు కాఫీలు తాగుతూ కాలక్షేపం చేస్తాడు” అన్నాడు ఉదయ్.

“మీ నాన్నగారు ఏం చేస్తుంటారు?” కుతూహలంగా అడిగాడు తిరుపతిస్వామి.

ఉదయ్ కాసేపు తడబడ్డాడు

“మా నాన్న గురించి చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మరో ఆదివారం ప్రత్యేకంగా ఆ కార్యక్రమం పెట్టుకుందాం. ప్రస్తుతం నేను వెళ్ళొస్తాను. ఆలస్యమైతే మీరు చెప్పిన గుళ్ళు మూసేస్తారేమో”

“మెత్తగా కనబడతావు గానీ నీలో చమత్కారం కూడా ఉందయ్యా. అయినా దుర్గాప్రసాదు నిన్ను నా దగ్గరకు పంపెప్పుడు నీకుగా నువ్వు చెప్పేంతవరకూ నీ విషయాలేమీ అడగొద్దన్నాడు. చాలా పెద్ద ఫ్లాష్‌బ్యాకే ఉండి ఉంటుంది. నువ్వన్నట్లు నీకిష్టమైనప్పుడు దానికోసం ఒకరోజు పెట్టుకుందాం లే”

ఉదయ్ ఒక చిన్న నవ్వుతో ఆపాడు. ఇక మాట్లాడలేదు.

ఆయన చెప్పిన రెండు గుళ్ళూ చూసుకొని ఉదయ్ కొత్తపట్నం సముద్రతీరానికి చేరేసరికి గంట పన్నెండు కావస్తోంది. కాస్త దురంగా ఒక చిన్న తాటాకు పందిరి. దాని క్రింద కూర్చోవడానికి ఒక పొడవాటి దుంగ పడేసి ఉంది . ఉదయ్ వెళ్ళి దానిమీద కూర్చుని సముద్రం వైపు చూస్తూ ఉండిపోయాడు. చల్లని గాలి వీస్తోంది. దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళే అలలు. దూరంగా అక్కడక్కడా చిన్నగా కదులుతున్న నాటు పడవలు. ఉదయ్ నిశ్చలంగా చూస్తున్నాడు.

కాసేపటికి ఒక కూర్రాడు వచ్చి నవ్వుతూ నిలుచున్నాడు

ఉదయ్ కొన్ని క్షణాలు అతనివైపు చూసి “ఏంటి?” అడిగాడు.

“మీకేమైనా కావాలంటే తెచ్చిస్తాను సార్”

“ఏమైనా అంటే ఏమేమి తెచ్చిస్తావ్?”

“అదే సార్, సిగరెట్లు, వాటర్ బాటిల్స్, తినడానికేమైనా, ఇంకా…” అని ఆగాడు.

“ఇంకా?” నవ్వుతూ అడిగాడు ఉదయ్

కుర్రాడు ఏమీ మాట్లాడలేదు.

“పర్లేదు చెప్పు”

“అదేసార్! బీరు బాటిల్సూ అవీ”

“నీ పేరేంటి?”

“సత్తి”

“అంటే సత్యమా?”

“అవును”

(సశేషం)

Exit mobile version