ఉద్యమరావూ- ఉద్యోగపు ఉసు(వసూ)ళ్ళూ

0
2

[డా॥ చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రచించిన ‘ఉద్యమరావూ- ఉద్యోగపు ఉసు(వసూ)ళ్ళూ’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]త[/dropcap]నొక కారణ జన్ముడనుకునేవాడు ఉద్యమరావు. వాళ్ళ నాన్నగారు ఒకప్పుడు జాతిపిత గాంధీజీ వల్ల ప్రభావితుడై స్వాతంత్ర్యోద్యమంలో, అంటే క్విట్ ఇండియా ఉద్యమంలో, పాల్గొన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఒక ప్రభుత్వరంగ సంస్థలో సాధారణ ఉద్యోగిగా చేరి, కమ్యూనిస్టు సిద్ధాంతం చేత ప్రేరణ పొంది, సమ్మెలు, ఘెరావ్‌లు చేసే సమయంలో ఉద్యమరావు పుట్టాడు.

వెంటనే వాళ్ళ నాన్నగారికి జ్ఞానోదయమయ్యింది కాబోసు, తన పుత్రరత్నానికి కన్ఫ్యూషన్ లేని పేరు పెట్టారు. రకరకాల భావజాలాలకి తను లోనైనట్టు తన వారసుడు కూడా ప్రభావితమైతే, ఎవరూ అతణ్ణి తప్పులెన్నకుండా ఏ ఉద్యమంలో అయినా దూరిపోయేందుకు వీలుగా, దూరాలోచన చేసి, ఆ పేరుపెట్టారు. అయితే, ఉద్యమరావు ఉద్యోగం వెతుక్కునే వయసొచ్చేసరికి కాలం మారింది; తల్లితండ్రులు కాలం చేశారు.

తన పాదం ఏ పథంవైపు కదం తొక్కించాలో దిశానిర్దేశం చేసేవాళ్ళు లేక, ఉద్యమరావు తన దారి తనే ఎంచుకోవలసి వచ్చింది. తన తండ్రి ఉద్యమాలలో పాల్గొన్నా, ఇంట్లో లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపించలేదు. తన తండ్రి తనని చదివించగలిగాడు, అంతే!

తను కాలేజీలో చదివేటప్పుడు తన సీనియర్లు పడ్డ నిరుద్యోగ వేదనని గమనించి, ఎలాగో అలా ప్రభుత్వోద్యోగం సంపాదించాలనుకున్నాడు. దానికోసం లంచమివ్వడానికి సిద్ధపడ్డాడు కూడా! కానీ, దేవుడు దయామయుడు కాబట్టి, తన తండ్రి పైనుండి ఆశీస్సులు కురిపించాడు కాబట్టి, అతడికి లంచం -సిఫారసుల్లేకుండా ఉద్యోగం వచ్చింది. ఎటొచ్చీ మనవాడిలో కృతజ్ఞతా భావం మృగ్యం. ఏం చేస్తాం?

***

ఒక గుమాస్తాగా మొదలుపెట్టిన అతని ఉద్యోగ ప్రయాణం అతణ్ణి అయిదేళ్లలో ఆఫీసు సూపర్నెంట్ అయ్యే వరకూ తీసుకువెళ్ళింది. అప్పుడే ఉద్యమరావుకి, వాళ్ళ కొలీగ్స్‌కీ మధ్య అరమరికలు ఏర్పడ్డాయి.

“మన యాజిటేషన్ లేడూ, అదేనోయ్ మన ఉద్యమం గాడు, బాసుల అడుగులకి మడుగులొత్తుతూ ఉంటాడు. చూడు రవీ, వాడు బాస్ లోపలికి వెళ్ళిన వెంటనే ఏదో పనున్నట్టు ఒక మొహం పెట్టుకుని లోపలికి వెళ్తాడు. కావాలంటే చూసుకో,” అని ఛాలెంజ్ చేశాడు ఆనందరావు. “నిజమే ఆనందం, అక్షరాలా నువ్వన్నట్టే జరిగింది సుమీ! నేను గమనించనే లేదు! ఇంకా బొడ్డూడని ఈ బచ్చాగాడు వెలిగిపోతున్నాడు, మనమేదో శుద్ధ వెధవాయలన్నట్టు! ఎంత కొవ్వు, ఎంత తెగింపు,” అని గుసగుసలాడాడు రవి.

కొన్నాళ్ళకి..

“వీడు మన బాస్‌తో స్నేహితుడిలా మాట్లాడేట్టు పోజు కొడతాడు గానీ, ఆయన దగ్గర మాత్రం స్టాండింగ్ కమిటీ మెంబర్. నేను కళ్ళారా చూసొచ్చాను,” అని రవి తనకు తెలిసిన విషయం చెప్పాడు. “ఆఁ, అవుతాడులే! పెద్దాయన చేతికి మట్టి అంటకుండా, వసూళ్ళు చేసే కలెక్షన్ ఏజెంట్ అట! తనని తానే నియమించుకున్నాడు మరీనూ!” అని వాపోయాడు ఆనందరావు.

“ఎహే, ఆనందం, నేనన్నది వీడు ఆయన ఎదురుగుండా నిలబడే ఉంటాడట! వీడి చేత ఏం చెత్తపనులు చేయించినా, వాడికి గౌరవం ఇవ్వలేదని చూసినప్పుడు, నా ఆనందం అంతుపట్టకుండా పోయింది,” అని వివరణని ఇచ్చాడు రవి.

తన సహోద్యోగులు చెవి కొరుక్కుంటున్న మాటలు తన చెవిని పడకపోలేదు. తాటాకు చప్పుళ్లకి బెదిరిపోయే రకం కాదు తను. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే దీర్ఘాలోచన చేసి, తన తండ్రిలా విలువలతో ఆస్తిపాస్తులు లేకుండా జీవించాలా, లేక ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా జీవించాలా అని బేరీజు వేసుకుని,  విలువలు ఉంటే ఒంటి మీది వలువలు కూడా మిగలవేమో అని భయపడ్డాడు. చివరికి, నాలుగు రాళ్లు వెనకేసుకునే అవకాశం తనకు దొరికిందని గర్వపడ్డాడు.

జీవితంలో క్లారిటీతో నడుచుకుంటూ, సంతోషంగా ఉంటున్న వాళ్ళు కొలీగ్స్ వల్ల పెడసరం మాటలు పడాలని తెలుసు. ఎంత నమ్మకం లేకపోతే, ఆ ఆఫీసర్ తనని కలెక్షన్ ఏజెంట్‌గా పెట్టుకుంటాడు? ఈ ‘సేవ’ చేసినందుకు గాను తనకు కొంత సొమ్ము ముట్టేది. ఆ గీతం డబ్బులతో ఊరవతల చౌకగా వచ్చే స్థలాలు కొని, తన ఆస్తిని పెంచుకున్నాడు.

***

రోజులు గడిచిన కొద్దీ ఆఫీసర్లకి ఇతనిపై నమ్మకం పెరిగి, ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేవారు. ఆఫీసులో చాలా మందికి బదిలీలు అయ్యాయి. కానీ మన ఉద్యమరావొక్కడే స్టిక్కర్‌లా అతుక్కుని కూర్చొన్నాడు. ఎలా అంటే, ఏ ఆఫీసరూ అతణ్ణి వదలడానికి ఇష్టపడలేదు కాబట్టి. అక్కడి ఆఫీసర్‌తో ఎటువంటి పనున్నా, ఉద్యమరావును ఆశ్రయిస్తే పని జరిగిపోతుందనే ప్రాచుర్యాన్ని కూడా తెచ్చుకున్నాడు.

***

ఆత్మగౌరవమూ, నిజాయితీ ఉండే ఒక ఆఫీసర్ అతణ్ణి పక్కన పెట్టి మరో సూపర్నెంట్‌కి తన విషయాలని చూసే అవకాశం ఇచ్చాడు. కావాలనుకున్న పదవీ- కావాలనుకున్నంత పాపులారిటీ వచ్చినా, ఆ కొత్త కాండిడేట్‌కి పాపం ఉద్యమరావుకు ఉండే తెలివితేటల్లో నూరవ వంతు కూడా లేవు కాబట్టి నెలరోజుల్లో పదవీచ్యుతుడై, ఉద్యమరావుకే మళ్ళీ ఆ పదవిని అప్పజెప్పవలసి వచ్చింది.

***

ఇది జరిగిన తరువాత తనని ఆ పోస్టులోంచి తొలగించే వాళ్ళు ఉండరని అనుకుని మనవాడు విర్రవీగాడు. తెలివైన ఒక ఆఫీసర్ వాడు చేసిన ఒక పెద్ద తప్పును పట్టుకున్నాడు. వందల కోట్ల టెండర్‌ని గెలుచుకునేందుకు కావలసిన అర్హతలు గల్లంతు చేస్తూ, రూల్స్ ప్రకారం అర్హత లేని కంపెనీకి టెండర్ ఇవ్వమని సిఫారసు చేశాడు ఉద్యమరావు.

తన చెయ్యి ద్వారా తప్పు జరగబోయిందని కోపించి, ఆఫీసర్ ఉద్యమరావు మీద ఏసీబీ కేసు పెట్టించాడు. ఉద్యమరావుకి పౌరుషం రగులుకుని, లంచగొండుల చేత సమ్మె చేయించాలని అనిపించింది. అది వర్కౌట్ అవదని గ్రహించి, ఆ ఆఫీసర్ మీద కడుపుమంటతో ఉండే జనాలని కనిపెట్టి, ఆయనకు ఉండే బలహీనతలు కనిపెట్టి, వాటిని ఆసరాగా చేసుకుని ఆయన మీద లేనిపోని అభియోగాలు మోపి, తను అప్రూవర్‌గా మారాడు.

***

తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మి చేయగల సామర్థ్యం గలవాడు కాబట్టి ఇక మీదట వచ్చిన బాసులు అతనితో పెట్టుకోవడం మానేశారు. ముఖ్యమైన పనులు ఉన్నా కూడా వాటిని వేరే వాళ్ళకి పురమాయించి, హెడ్ ఆఫీసుకి పంపవలసిన నివేదికలు, టెండర్ల డ్రాయింగులు మొదలైన పనులు ఉద్యమరావుకి అప్పజెప్పారు.

తైలానికి అలవాటు పడ్డ ఆ చేతులు దురదపెట్టడం మొదలెట్టాయి. తనని ఆపడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటారని ఉద్యమరావు ఊహించలేదు. తనకిచ్చిన పనులు త్వరగా పూర్తవుతాయి గనుక మిగిలినంత సేపూ టెండర్ సెక్షన్‌లో తచ్చాడి, అక్కడి విషయాలు తెలుసుకుని, ఆయా కాంట్రాక్టర్లకి విషయాలు చేరవేసి లబ్ధి పొందాడు.

***

కొన్నాళ్ళకి ఉద్యమరావుకి మనోవ్యాధి పట్టుకుంది. ఎవరిదో ఉసురు తగిలిందని తను తెగ బాధ పడిపోయాడు. వయసొచ్చాక రిటైర్మెంట్ రాకుండా ఉంటుందా! బతికినంత కాలం అక్రమ సంపాదనతో బతికేద్దామని అనుకున్నాడాయె. రెండు నెలలు పోతే తన ఉద్యోగం నుంచి విరమణ చేయాలి. ఏ భాషాజాలంలో ఎలా అన్నా సరే, తనకు మాత్రం తన ఉద్యోగం ఊడిపోతున్నట్టే అనిపించింది, అదీ మరొకరు ఉసురు తగిలి. ఇది మనోవేదనే గాని అతనికి మరణయాతనలా తోచింది.

***

ఆ పైవాడు అతనికి కొంత విరామం ఇద్దామనుకున్నాడేమో, ఒక రోజు, రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు, టెండర్ల విషయాలు చూసే సూపర్నెంట్‌కి ప్రమాదం జరిగి రెండు కాళ్ళూ విరిగాయి. కనీసం రెండు నెలలు మంచం నుంచి దిగకూడదని డాక్టర్ చెప్పారట. పరామర్శించి వచ్చిన ఉద్యమరావు, ‘ఇంక నేను తప్ప వేరే దిక్కెవరు మా ఆఫీసర్‌కి?’ అనుకుని సంతోషించాడు.

అనుకున్నట్టే అతనికి బాధ్యత అప్పగించాడు ఆఫీసర్. ఫైళ్ళు తిరగేస్తుంటే, ఒక నాలుగు టెండర్లు ఒకే కాంట్రాక్టర్‌కి వచ్చేటట్టు ఉన్నాయి. ‘అమ్మయ్య, మళ్ళీ నా చేతిలో లక్ష్మీదేవి నాట్యమాడుతుందోచ్,’ అనుకుంటూ ఫైల్లో ఉన్న వివరాల ప్రకారం శ్రీ పంచముఖ గాయత్రీ కనస్ట్రక్షన్స్ అధినేత కనకారావుకి ఫోన్ కొట్టాడు.

ఆ రాత్రి ఓ అయిదు తారల హోటల్లో ఆ అధినేతను కలిసి, కొన్ని వందల కోట్లు విలువ చేసే నాలుగు టెండర్లు ఒకేసారి రాబోతున్నందుకు కనకారావును ముందస్తుగా అభినందించాడు. బేరసారాలు చేసుకున్నాడు.

మళ్ళీ ఎవరి ఉసురు తగిలిందో ఏమో, ఆఫీసర్ నాలుగింటినీ రేట్లు ఎక్కువగా ఉన్నాయని తిరగగొట్టాడు. రేట్లు తగ్గించడానికి ప్రయత్నించమన్నాడు. ఇంకా మనవాడి  ఉద్యోగం పోవడానికి ఎనిమిది రోజులే ఉన్నాయి. గబగబా అన్నీ చేసినా, కొత్త రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయని టెండర్లని రద్దు చేశాడు ఆఫీసర్.

ఉద్యమరావు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్టు అనిపించింది. కత్తిపోటుకి నెత్తుటి చుక్క లేదు. రావలసిన డబ్బు రాకపోగా, తీసుకున్న అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయాల్సిన అగత్యం వచ్చిపడింది. చేతికందిన డబ్బు ఇవ్వడానికి మనసు రాక, కనకారావుని ఆ డబ్బుని తన రిటైర్మెంట్ బహుమతిగా భావించమన్నాడు.

***

ఉద్యమరావు రిటైర్ అయ్యే రెండు రోజుల ముందు ఏసీబీ వాళ్ళు వచ్చి, అతణ్ణి అరెస్ట్ చేసి, తీసుకుని వెళ్లారు. కనకారావు ఫిర్యాదు చేసినట్టు అందరూ అనుకున్నారు. అంతే! అతనికి రిటైర్మెంట్ తరువాత రాబోయే సొమ్ములు అందలేదు.

ఇదివరలో అతనికి స్థానబలిమి ఉండేది. రిటైర్ అయ్యేవాడంటే చెదలు పట్టిన చెట్టు, ఒట్టిపోయిన గొడ్డుతో సమానమని తనే మిగిలిన వాళ్ళ గురించి అనుకునేవాడు. మరి, అతని గురించి తన కొలీగ్స్ అలాగే అనుకోరా? అతణ్ణి ఆదుకునే వాళ్ళు ఎవరూ లేరు పాపం. మంచి చేసే అవకాశం ఉన్న ఒక మంచి ఉద్యోగం వస్తే, దాన్ని వసూళ్ళకు వాడుకునే వాడికి సామాన్య ప్రజానీకపు ఉసురు తగలదూ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here