ఉద్యోగం

0
3

[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘ఉద్యోగం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]‘ఫ[/dropcap]లానా మొత్తం’ ‘వరహాల జీవితం’ గలవాడు అంటే ‘వరహాల జీతం’ గలవాడు అని అర్థం. అంటే జీతమే జీవితం. అంటే ఉద్యోగమే జీవితం అని గదా! ఉద్యోగం లేదంటే జీవితం లేనట్లే. నిరుద్యోగికి ప్రాణం వుంటుంది గానీ, జీవితం మట్టుకు వుండదు!

నిరుద్యోగిగా, అంటే, జీవితం లేక ప్రాణం మట్టుకే వున్నవాడిగా, నా దినచర్య – పొద్దున బ్రేక్‍ఫాస్ట్ లాంటివి కావించినాక యింట్లోంచి బయలుదేరడం, సినిమాహాలు ముందు నుండి బజారును దాటవేసి, లైబ్రరీకి వెళ్ళడం, అన్ని దినపత్రికల్లోని ‘కావలెను’ ‘కాలం’ లను చూడ్డం, అవసరమైన వాటిని కాగితం మీద నోట్ చేసుకోవడం, తర్వాత ఏవైనా పుస్తకాలు తీసుకుని లైబ్రరీని మూసేవరకు (లంచ్ టైం వరకు) అక్కడే గడిపి ఆ తర్వాత మిత్ర బృందంతో బజార్లలో తిరగడం..

మా ముచ్చట్లలో చోటు చేసుకోని విషయాలే వుండేవి కావు. విశ్వంలో వున్నవన్నీ మహా భారతంలో వున్నాయి. మహాభారతంలో లేనివి విశ్వంలో లేవు అన్నట్లుగా, మా ముచ్చట్లలో లేని విషయాలు ఏవీ వుండేవి కావు. సామాజికార్థిక రాజకీయ వర్తక వాణిజ్య శాస్త్ర సాంకేతిక సాహిత్య సాంస్కృతిక కళా రంగాలన్నింటినీ ఓ తడుము తడిమే వాళ్లం! భవిష్యత్తులో ఈ భూరాన్ని వహించేవి మా భుజద్వజాలే అనుకునే వాళ్లం! కాళ్ళు పీకేవరకు నిల్చుని, నిల్చుని, ఆ తర్వాత రోడ్డు పక్కన వున్న పూరి గుడిసె హోటల్లలో ‘చాయ్’ తాగుతూ, సిగరెట్లు కాల్చుతూ కూర్చుని ముచ్చట్లు పెట్టుకోవడం. అప్పటికీ సమయం సాగకుండా వుంటే, వూరు దాటేంతవరకు నడుస్తూ వెళ్ళడం. వూరవతల ప్రకృతి కన్య అందాల్ని గ్రోలుతూ యింకా ముందుకు సాగుతూ వట్టిపోయిన వాగువరకు.. ఆ పెద్ద వాగు వర్షాలప్పుడు వూర్లను ముంచడం, సముద్రానికి కొల్లబోవడమే దాని పని. ఇసుక దిబ్బలేమో కంట్రాక్టర్లకు..

ఆకలి జ్ఞాపకం చేస్తే అప్పుడు వడివడిగా, వడగండ్ల వానలోలాగా యింటివేపు కాళ్ళు.

భోజనం – మంచం – పుస్తకమో, నిద్రో, ‘కావలెను’ కాలమో..

సాయంత్రం సూర్యుడు యింటికి, మేము బజార్లకు రాత్రి భోజనాల వరకు.. ఆకుకు రెండు పార్శ్వాల్లా, మా దినచర్యల్లో, కాలపట్టికల్లో, విషయ సూచికల్లో పెద్ద తేడా ఏమీ కన్పించేది గాదు.

ఉద్యోగపర్వం రావాలంటే దానికి ముందు అరణ్య పర్వాలు, అజ్ఞాత పర్వాలు గడవాలి గదా. మన ‘భారతం’లో నిరుద్యోగ పర్వమన్నది ముఖ్యాతి ముఖ్యమైన పర్వం చిరుద్యోగ పర్వ, గురుద్యోగ పర్వాల అమృతాల్ని గ్రోలేముందు నిరుద్యోగ పర్వపు గరళాన్ని రుచి చూడక తప్పుతుందా? ఆ గరళాల నుండి బ్రతికి బయటపడితేనే మున్ముందు చిరుద్యోగ పర్వాల, గురుద్వోగ పర్వాల అమృతాస్వాదనల భాగ్యం! దుర్భర నిరుద్యోగ అరణ్య పర్వంలో కూడా హిమగిరి సొగసుల్ని చూడగలగాలి, చూసి ఆనందింపగలిగేంతటి శక్తి సామర్థ్యాల్ని కూడదీసుకోవాలి. పాశుపతాస్త్ర సంపాదనా ప్రయత్నాలు గావించుకోవాలి.

ఇక అజ్ఞాత పర్వ సంగతి సరేసరి! ఈ భూమ్మిద మనం వున్నాం, సంచరిస్తున్నాం అన్న విషయం ఎవ్వరికీ తెలియగూడదు గదా. పక్కింటి వాళ్ళకు గూడా మనం బ్రతికే వున్నట్టు తెలియగూడదు! ఎవరికంట నన్నాపడితే “ఇప్పుడేం చేస్తున్నావు?” అని అడుగుతారు గదా! “ఏం చేయడం లేదు. యింకా నిరుద్యోగమే” అంటే ఈ బ్రతుక్కి దొరికేవి ఈసడింపులే గదా! ఈసడింపులు వుండగూడదంటే మరి అబద్దం ఆడాలి ‘ఉద్యోగం చేస్తున్నాను’ అని! కానీ, అబద్దం ఆడలేం గదా. అందుకని ఎవరికంటా పడకుండా, దొంగలా బ్రతికేస్తే సరిపోతుంది! జనసంచారం, బంధుమిత్ర జన సంచారం వుండే చోట్లకు అస్సలు పోగూడదు. ఎవరికంటాబడ్డా “యింకా బేకారుగానే తిరుగుతున్నావా!” అంటారు.

ఉద్యోగ పర్వ ప్రవేశార్హతను పొందాలంటే సవ్యసాచిత్వం సాధించుకొని వుండాలి. విద్యార్హతలు పెంచుకోవాలి. లంచాలు పెట్టాలి. అడ్డమైన పనులే చేయాలి! మన నాయకుల్ని చూడ్డం లేదా! తమ ప్రజల ఉన్నతి కొరకై, దేశాన్ని కుదువ బెట్టడమో, కుదవ బెట్టడంతో చాలకపోతే తెగ నమ్మడమో జేయడం లేదా?

మా నాన్న అప్పు డబ్బుతో నేను దళారి ద్వారా లంచం పెట్టాను ఉద్యోగానికి.. ఎలక్షన్లనో ఎన్నో రెట్లు సంపాదిద్దాం అనే గదా నాయకులు ఖర్చు చేస్తున్నారు. అధికార పక్షంలో వుంటే ఎలక్షన్‍లో గెలువక పోయినా ఏదో ఒకటి రాదా! ఎలక్షన్‍లో ఓడిపోయిన వాడే దేశాన్ని పాలింపగా లేంది! ప్రజలు ఓడగొట్టిన వాడే దేశాన్ని పాలింపగా లేంది! లంచం పెడితే అనుకున్నది కాకపోతే ఏదో ఒకటి రాదా! మినిస్టర్ గాకపోతే దేనికో ఓ దానికి చైర్మన్‌షిప్. అంచేత నాకు రాత్రుల్లేగాదు, పగల్లు కూడా నిశ్చింతగా నిద్రపట్టేది! పగటి నిద్రలో కూడా అన్నీ శుభాల్ని సూచించే కలలే వచ్చేవి! ఆకాశంలో మన భూగ్రహానికున్న ఈ ఒక్క చందమామే కాదు, కొత్త కొత్తగా ఎన్నెన్నో చందమామలు పుట్టుకొచ్చి కన్పించేవి – సౌరమండలంలోనివే ఏ యితర గ్రహాల చందమామలో, కాక మన పాలపుంతలోనివే, ఏ యితర నక్షత్ర గ్రహాలో అలా ఎన్నెన్నో చందమామలుగా కన్పించేవి! అంటే నా భవిష్యత్తు ‘అకాశం’ అంతా దేదీప్యమానం అనే గదా ఆ స్వప్న విశ్లేషణ అర్థం!

ఒక్క ఆడవాళ్ళ నోళ్ళళ్ళనే నువ్వుగింజ నానకూడదని ధర్మరాజు శాపం.. కానీ, ఆ ఆడవాళ్ళ నీడబడ్డ కొందరు మగవాళ్ళకు కూడా ఆ శాపం అంటిందని నా అనుమానం! దాంట్లో నేనొకణ్ణి! అందువల్ల నా విషయంలో ఎంతటి బరువైన రహస్య విషయమైనా బహిరంగ రహస్యమే! ఎవ్వరెదురు పడినా “ఇంకా బేకారుగానే తిరుగుతున్నావా?” అన్న ప్రశ్న వాళ్లడక్కముందే, నేను వాళ్ళను నిరుత్సాహపర్చకుండా – సంతోషాన్ని ఫలహారంగా పంచిపెట్టాలని “ఉద్యోగం కొఱకు ప్రయత్నిస్తూన్నాను. ఏదో మీద మీద గాదు. సరాతాన్ని బట్టి ఏదో మీదమీద పొక్కిలిదీసుడు గాదు. గడ్డపార నందుకుని తవ్వడం చాలా బలంగా, లోతుగా! “ఊరికే అనుకునేరు – కాదు- లంచం పెట్టి ప్రయత్నిస్తూన్నాను” అనేవాడ్ని. వాళ్ళకు కొంచెమన్నా నమ్మకాన్ని కలిగించేవాడ్ని – లంచం పెట్టి ప్రయత్నిస్తూన్నాను కాబట్టి ‘ఫర్వాలేదు. వస్తే రావచ్చు’ అని వాళ్ళు అనుకుని నన్ను ‘బేకారోనిలా’ చూడకుండా, చంపకుండా బ్రతికించే వాళ్ళు అప్పటికి.. ‘లంచం’ అన్నదాన్ని ‘రహస్యం’ అని దాచి పెడుతూ – ఊరికేనే ఉద్యోగ ప్రయత్నం చేస్తూన్నాను – ఉద్యోగం తప్పకుండా దొరికిపోతుంది అనంటే నమ్మేవాళ్ళు వుండాలి కదా! వాళ్ళు నమ్మి, మన ‘విలువ’ నిలబడాలంటే ‘లంచం’ని రహస్య వస్తువులాగానో, అతి రహస్య వస్తువులాగానో దాచిపెడితే ‘విలువ’ నిలుస్తుందా? ఎంత పెద్ద మొత్తం లంచం పెడితే అంత ఎక్కువగా నమ్మకాన్ని కల్గించవచ్చు, విలువను పెంచుకోవచ్చు.. అంచేత రహస్యంగా వుంచాల్సిన లంచాన్ని వలువలూడ్చి నాలుబజార్ల దగ్గర నిల్చోబెట్టాను! కన్పించిన వారికల్లా, అడుగకున్నా కూడా చెప్పాను. అవసరం కాకున్నా అవసరమే అనుకున్నాను. వేరే ఊర్లలో అతి దగ్గరి బంధువులకు పోస్టుకార్డుల్లో ఈ విషయాన్ని రాసి తెలిపాను. పైగా “ఇది అతి రహస్య విషయం. ఎవ్వరికీ తెలియగూడదు – చెప్పగూడదు, తెలుపగూడదు” అన్న పదాల్ని గూడా చేర్చాను! రహస్య విషయాన్ని రహస్యంగా వుంచాలనుకుంటే కనీసం ‘ఇన్‍లాండ్’ లెటర్లోనన్నా రాసి వుండేవాడ్ని గదా! ఆ కాలంలో ఫోన్లు గట్రా లేవు. వుంటేనోటి మాటగానే చెప్పేవాడ్ని, గాల్లో కల్సిపోయేవి! అదే కాగితం మీద పెడితే – నాల్గుకాలాలు నిల్చిపోదా చెప్పిన విషయం! పోస్టుకార్డు మీదనైతే బోల్డంత ప్రచారం జరిగినా జరుగుతుంది!

ఇప్పుడు నా దినచర్యల్లో మార్పులు కొట్టిచ్చినట్లు కన్పించసాగాయి! దీనికిముందు రోజూ కాళ్ళీడ్చుకుంటూ లైబ్రరీలకు పోయి, వార్తా పత్రికల్లో ‘కావలెను’ శీర్షికల్ని తిరగేయాల్సిన ఖర్మ, నోట్ చేసుకోవాల్సిన ఆగత్యాలు, అప్లికేషన్లు రాయడం, పోస్టాఫీసుకు పోయి పోస్టు చేయడం జవాబులకై పడిగాపులు పడడం లాంటి పనికిమాలిన పనులు తప్పిపోయినై. ఇప్పుడీ పనులన్నింటికీ మొత్తంగా కల్పిన ఒకే ఒక్క ప్రత్యామ్నాయం ‘మద్యదళారీ’ మహానుభావుడే! అప్పట్లో అన్ని రోగాలకు ఒకటే మందు పెన్సిలిన్ (ఇప్పట్లో అన్నింటికీ ఒకే ప్రత్యామ్నాయం – ఆల్‍ఇన్‍వన్ – కంప్యూటర్) ఉద్యోగం యిచ్చే అధికారి దేవుడే కావచ్చుగాక – కానీ, ఈ దళారి – పూజారి. దళారి లేందే మన ప్రభుత్వం నడుస్తున్నదా, నిలుస్తున్నదా? అసలు దళారే ప్రభుత్వమాయె.

ఈ దళారి నన్ను ఫలానా సమయానికి, ఫలానా స్థావరానికి రమ్మంటే వెళ్ళి రావడం. ఇప్పుడు నాకున్న పని యిదొక్కటే. చాలా సింప్లిఫై అయిపోయింది నా పని! సైకిలు రాయకు పుచ్చుకుని మైళ్ళకు మైళ్ళు పోయి వస్తూండాలి. దళారేమో నా  ఉద్యోగానికీ – దాన్నిచ్చే అధికారికీ మధ్య వారధి. అలాగే ఈ దళారికీ నాకూ మధ్య వారధులు మా బంధుమిత్రులు! రోజునేనొక్కడ్నే ఆ దళారిని కలవడానికి వెళ్తూంటాను గానీ, మధ్యమధ్య ఈ బంధుమిత్రుల్ని కూడా వెంట తీసుకుపోవాల్సిన అవసరాలు వచ్చేవి. అంచేత వాళ్ళ సైకిళ్ళకు కిరాయలు, టీలు, సిగరెట్లు, పాన్లు, అప్పుడప్పుడు టిఫిన్లు ఖర్చు గూడా! సరిపడా అప్పులు చేయకతప్పదు గదా!

ఇప్పుడు నా దినచర్యల్లా పై ఉద్యోగానికి ముందు ఇంటర్వ్యూ ఎప్పుడుంటుందో ఆ రోజును తెల్సుకోడానికి వెళ్ళడం – పర్సనల్‍గా – సైకిలు మీద (ఫోన్లు లాంటివేమీ లేవని ముందే మనవి చేయడం జరిగింది!)

నెళ్ళకు నెళ్ళు తిరుగగా తిరుగగా, ఎదురుతెన్నులు కాయగా కాయగా ఒరోజు రానే వచ్చింది – ఇంటర్వ్యూ రోజు.. స్థలం జిలా కేంద్రం. నేను, దళారీ కావాల్సినంత ముందుగానే బస్సులో బయల్దేరాం. మా నాన్న – బంధుమిత్రులు బస్సెక్కించారు – ఇప్పుడు యూ.ఎస్. కు పోతూంటే ఎయిర్‌పోర్టుకు వచ్చినట్లు!

“పరిస్థితులు ఎలాగున్నాయి?” నేను అడిగాను దళారీని.

“ఏలాంటి సందేహాలు, అనుమానాలు లేవు. కాకపోతే ధర కాస్తా పెరిగి పోయింది!” చెప్పాడు దళారీ

“ఉద్యోగం ముఖ్యం. ఉద్యోగం రావాలి గానీ, ధరదేముంది!” అన్నా.

“ఇంక అపాయింట్‍మెంట్ ఆర్డరు మీ చేతులో వున్నట్టే అనుకోండి” అన్నాడు దళారీ! ఇప్పుడు నేను ప్రయాణిస్తున్నది మన ‘ఆం.ప్ర.రో.ర.సం’ బస్సుగాదు – అది వ్యోమనౌక – మరో లోకానికి అన్నంత ఆ చేస్తూన్న ప్రయాణం మామూలు రోడ్డు ప్రయాణం కాదు. అప్పుడే ఏం చూశాం! మురిపించే కాలమంతా గూడా ముందే మిగిలివుంది! ఎంత హాయి ఈ రేయి – ఎంత మధురమీ హాయి!..

ఇంటర్వ్యూ చైర్ పర్సన్ జిల్లాస్థాయి అధికారి. యిద్దరు ఆ అధికారి స్థాయికి సమానస్థాయిలో వున్న వ్యక్తులు తమ తమ అభ్యర్థుల వెంట వచ్చారు! ఎన్నో ఏళ్ళుగా తెల్సిన వాళ్ళే.. పొడి పొడిగా మాటలు నడిచాయి. నాలో నేను అనుకున్నాను. ఆ అభ్యర్థుల వెంట వీళ్ళు వుండగానే ఏమాయెగాక! నాకున్న విద్యార్హతలు ఆ అభ్యర్తులకు వున్నాయా! అంచేత వాళ్ళ స్థానమన్నదే వుంటే గింటే నా తర్వాతదే..

దళారీ అటూయిటూ వెళ్తూన్నాడు – పరిగెత్తినంత పనిచేస్తూన్నాడు. మధ్య మధ్య నన్ను కళ్ళలో పలకరిస్తూ, బలవంతపు నవ్వుతో ‘ధీమాగా ఉండు’ అన్నట్టు సమాచారాన్ని అందిస్తున్నాడు.. నా ఇంటర్వూ అయిపోయింది.

నాకు ఉద్యోగం రాలేదు!

కారణం – నేను లంచం యిచ్చినట్లు ప్రచారం చేసిన విషయం వాళ్ళ చెవుల దాకా వెళ్ళిందట!

నా ఆకాశహర్మ్యాలు కూలిపోయాయి.

రహస్యాన్ని పాటించని పెద్ద నేరానికి అంతే పెద్ద శిక్ష పడింది. అమలు కాసాగింది..

ఎంతో అనుభవజ్ఞుడైన దళారి నాలోని మాలిన్యాన్ని కొంతైనా తగ్గించే దిశగా అన్నట్టుగ “ఇదే ఆఖరు లిస్టు గాదు. ఇంకా అవకాశాలు వుండనే వున్నాయి. అంతగా చలించి పోవాల్సిందేమీ లేదు” అన్నాడు.

నాతో యింటర్యూకు వచ్చిన, నాకన్నా తక్కువ విద్యార్హతలు గల్గిన అభర్థులకు అపాయింట్‌మెంట్ ఆర్డర్లు రావడం, వాళ్ళు ఉద్యోగాలకు రిపోర్ట్ చేయడం లాంటి విషయాలు నాకు తెల్సివచ్చాయి.. దాంతో బాటుగా తెల్సివచ్చిన విషయం ఏమిటంటే కనీస విద్యార్హతలు వున్నా గూడా అత్యధికంగా వేలం పాడిన వారికే ఉద్యోగాలు దక్కాయి!.. అంతేగానీ, రహస్యం రచ్చ కెక్కించడం కారణం కాదు – అది దళారీ అందుకున్న ఒక నెపం మట్టుకే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here