Site icon Sanchika

ఉగాది పండగ వచ్చింది

[dropcap]ఉ[/dropcap]గాది పండగ వచ్చింది!
ఉత్సాహాన్ని తెచ్చింది!!
కొండంత ఊపుతో వచ్చింది!
కోటి ఆశలను చూపింది!!
పాత వత్సరపు వీడ్కోలు!
కొత్త వత్సరపు స్వాగతం!!

వేకువేకువన లేచాము!
తలంటి స్నానము చేసాము!!
కొత్తబట్టలు వేసాము!
వీధుల షికార్లకెళ్లాము!!
రైతులు ఉదయం లేచారు!
ఏరువాక సాగించారు!!

వివిధ వృత్తుల వారున్నూ!
పనిముట్లు శుభ్రపరిచారు!!
చైత్రశుద్ధ పాడ్యమితో
కొత్తసంవత్సర మొచ్చింది.
పురోహితుడు వచ్చాడు
పంచాంగమును చెప్పాడు.

రాశి నక్షత్రము చూసి
లాభనష్టములు చెప్పాడు
రాజపూజ్యము అవమానం
అన్నీ ఏకరువు పెట్టాడు

అమ్మలు వేకువన లేచారు!
ఇల్లూ వాకిళ్లు ఊడ్చారు!!
తలంటి స్నానం చేస్తారు!
పిండివంటలను చేసారు!!
సుష్టుగా మేము తిన్నాము!!!

ఎరుకల వాళ్లు వచ్చారు!
భవిష్యత్తును తెలిపారు!!
పాడి, పంట, వర్షము, గాలి!
అంతా మొత్తం చెప్పారు!
చేటలో బత్తెం సంచిలో పోసి!
వెళ్లిస్తామని అన్నారు!!

వేప చిగురుతో మామిడి ముక్కలు!
బెల్లముతోనూ నువ్వులు కలిపి!
ఉగాది పచ్చడి చేసారు!!
ఆరు ఋతువుల కలయికగాను!
ఆరు రుచుల పచ్చడి చేసి!
అందరికీ కొంచెము పెట్టారు!
ఆనందంగా తిన్నాము!!

కొడుకులూ కోడళ్లు తోడను!
కూతుళ్లూ అల్లుళ్ల తోడను!
మనుమలు మనుమరాళ్ల తోడను!
ఇల్లు సందడిగా మారింది!!
గ్రామానికి వెలుగొచ్చింది.
ఉగాది పండగ వచ్చింది!
ఊరికి సంతోషాన్ని తెచ్చింది!!

వసంత ఋతువాసనతో
లేత మావి చిగుర్లతో
కోయిల మంజుల కూతలతో
కొత్తబట్టల కాంతులతో
ఉగాది పండగ వచ్చింది!
జరసంతోషాన్ని తెచ్చింది!!

మోడుగ మారిన చెట్లన్నీ
చిగురుల కళకళలాడినవి!
దూరపు బంధు జనమ్ములతో
గ్రామ గ్రామాలు నిండినవి!
ఉగాది పండగ రాగానే
జనాల మనసులూ నిండినవి!

Exit mobile version