ఉగాది పండుగ వచ్చిందీ…

1
1

[dropcap]తె[/dropcap]ల్లవారితే ఉగాది!

ఇంటింటా పండగే! ఇంటి ముందు రంగుల రంగవల్లులు. గడపలకు పసుపు కుంకుమలు. గుమ్మాలకు తోరణాలు. అంతేనా!

బజారుకెళ్ళి కొత్త బెల్లం కొత్త చింతపండు, అరటి పండు, కొబ్బరికాయలు; పెరటిలో నుండి మామిడికాయలు వేప పూలు; అసలు పండగ అంటేనే ఇవన్నీ ఏర్చి కూర్చికోవడం వీటన్నింటితో ఉగాది పచ్చడి తయారు చేసి దేవునికి నైవేద్యం పెట్టి అందరి చేతిలో ఒక్కో చెంచా వేస్తూ ఉంటే నోట్లో వేసుకోగానే ఉప్పా, పులుపా, తీపా, కారమా, చేదా, వగరా అంటూ అడుగుతుంటే అన్నీ కలగలిపిన పచ్చడి నోట్లోకి జారుకోగానే ఆఖరున మిగిలిన మామిడికాయ ముక్కకి పులుపనీ, వేప మొగ్గకి చేదు అని అరటి పండ్లు తీపి అని వాళ్లు చెబుతుంటే నవ్వుకుంటూ మరొకరి చేతిలో పచ్చడి వేయడానికి నడిచిపోయే లలితమ్మను చూస్తూ ఉంటే ఎవరికైనా చేయెత్తి దండం పెట్టాలనిపిస్తుంది.

సమిష్టి కుటుంబం గురించి చెప్పాలంటే లలితమ్మ గారి కుటుంబం గురించే చెప్పుకోవాలి ఎందుకంటే సమిష్టి కుటుంబాలలో ఆడవారి పాత్ర ప్రముఖమైనది. అత్తగారు భర్త ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్లు అయిపోయినా ప్రతి సంవత్సరం అన్ని పండుగలకు వచ్చే అల్లుళ్ళూ ఒక కొడుకు కోడలు మనుమలు మనుమరాళ్ళు. దక్షిణాయనం రాగానే అడుగడుగునా పండుగలే అన్నట్టుగా ప్రతి పండుగకి వీరి ఇంట్లో సందడే!

అంతేకాదు లలితమ్మ గారికి తెలుగు భాష అన్నా, తెలుగు పండుగలు అన్నా, తెలుగు వారు అన్నా, చెప్పలేని మమకారం. అందుకే పండుగలలో ఎన్ని పనులు ఉన్నా ఎంత సందడిలో ఉన్న ప్రభుత్వం వారు నిర్వహించే కవి సమ్మేళనాలలో మొదటి పది మందిలో లలితమ్మ గారి పేరు వుండవలసినదే!

అలాగే ఉగాది పండుగకు ముందు రోజు కొత్త అమావాస్య కూడా ఘనంగానే చేస్తారు ఆమె. బూర్లూ, పులిహోరతో అమ్మవారికి ఉపారం పెట్టి, కొత్త చీర, పసుపు కుంకుమ, వడపప్పు పానకం చలిమిడి దక్షిణ వీటన్నింటిని చాకలి అమ్మాయి భారతీదేవికి ఇచ్చాక గాని ఆమె భోజనం చేయరు.

నియమనిష్ఠలు మడి తడి ఈ కాలంలో కూడా పాటించేవారు అరుదు. తను తన అత్తగారి దగ్గర నేర్చుకున్న సంప్రదాయాన్ని మార్చడానికి లలితమ్మ గారు ఒప్పుకోదు. ఇలా చేయడంలోని ఆనందం తృప్తి మీకు అర్థం కావు అంటుంది ఆమె.

ఆరోజు కూడా అలాగే చాకలికి ఉపారం పెట్టి భోజనానికి కూర్చోబోతుండగా “అమ్మా! అమ్మా! నానమ్మ ఏమిటోగా ఉంది చూడు. రా! రా! అంటూ పిల్లలు లాక్కెళ్లిపోయారు. ఆవిడ పరిస్థితి చూసి అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. హాస్పిటల్‌కి తీసుకెళ్లి ప్రాథమిక పరీక్షలు కాగానే ఐ.సి.యూ.లో పెట్టేసారు. అమావాస్య ఘడియలు దాటడం కష్టం ఏమో అని భయపడుతూనే ఉంది లలితమ్మ. ఆ రాత్రి ఇంకా సీరియస్‌గా ఉందని క్రిటికల్ కేర్ యూనిట్లోకి మార్చారు

తెల్లవారితే ఉగాది!

తూరుపు వెలుగు రేఖలు విచ్చుకోక ముందే నాలుగు గంటల వేళ ఆవిడ ఆఖరి శ్వాస విడిచారు. పెద్ద తరానికి చెందిన ఒక ప్రతినిధిని దేవదూతలు తీసుకు వెళ్లి పోయారు. ఇంటికి తెచ్చేసి కార్యక్రమాలు జరిపించారు ఆ ఉగాది ఆ ఇంట్లో వాళ్లకి నిరాశా నిస్పృహలు మిగిల్చింది.

అంతేనా ప్రతి సంవత్సరం ఊరంతా ఉగాది పండుగ వీరి ఇంట్లో “ఏమండీ! బ్రాహ్మణులకు చెప్పారా? కూరలు, పచ్చళ్ళు, పిండి వంటలు ఏమి చేయమంటారు? వంట బ్రాహ్మడికి చెప్పరాదు, నాకు ఒంట్లో నీరసంగా ఉంది. వడ్డన నేను చూసుకుంటాలెండి” అంటూ భర్తతో మాట్లాడుకోవడమే పండగ విశేషాలు. ముందు రోజే వచ్చే కూతుళ్లు అల్లుళ్లు మనవలు కాలం గడుస్తున్న కొద్దీ “మా ఇంట్లో పూజ చూసుకుని ఉగాది పచ్చడి తినేసి నానమ్మ ప్రసాదం టైం కి వస్తాము” అని అంటూ మెల్లమెల్లగా రాకపోకలు తగ్గించేసారు.

తమ కుటుంబం మాత్రమే ఇలా పండుగకు దూరంగా. కొడుకు కోడలు మనవలు తొలుత వచ్చే ఉగాది పండగ చేసుకోలేకపోవడం మనసుకు కష్టంగా తోస్తుంటే –

“పిల్లల్లారా! మీరు కూడా మీ అత్తవారి ఇళ్లకు వెళ్లి ఉగాది పండుగ చేసుకోవచ్చు కదా! ఎందుకు తద్దినం భోజనాలు తింటారు” అని అడిగిందామె.

“అమ్మా! ఆ బ్రాహ్మణులను చూడు, ఎంత పౌరోహిత్యమైనా వృత్తి ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళైనా ఉగాది పూట మన ఇంటికి వచ్చి ఆ భోజనం తిని వెళుతూ ఉంటే మేము మా సొంత నానమ్మ కోసం ఆ మాత్రం చేయలేమా? నానమ్మ చనిపోయిన ఈ రోజు ఉగాది పండుగ మనము ఆమె పండుగ జరుపుకుందాం. ఏం పరవాలేదు అమ్మా” అని అన్నారు యధావిధిగా ఉగాది రోజు జరిగిపోతోంది కాల చక్రం తిరుగుతూనే ఉంది.

***

“కమలా! రామితో చెప్పి వీధిలో కళ్లాపి వేయమని పేడ ఆరకపోతే ముగ్గు పెట్టడం రంగులు అద్దడం కుదరదని గోల పెడతారు” అంటూ

“లక్ష్మీ! రంగులన్నీ చూసుకున్నావా? గ్యాస్ ముగ్గుతో పెడతావా? వరిపిండి పెడతావా? ఏ ముగ్గు వేస్తావు? ఇప్పుడే చూసుకో !” అంటూ

“విజయా! రేపటి ఉగాది పచ్చడికి అన్ని వచ్చాయో లేదో చూడు వేప చెట్టు కింద పేపర్ పరువు పువ్వులన్నీ దానిమీద రాలుతాయి.

“శ్రీనూ! నాన్న గారికి చెప్పి కొత్త చింతపండు, బెల్లం, అరటి పండ్లు, కొబ్బరికాయలు, మామిడి కాయలు తెమ్మని చెప్పు” అంటూ లలితమ్మ హడావిడి పడిపోతూ అటు ఇటు తిరిగేస్తోంది.

“నానమ్మా! మర్చిపోయావా మనము ఉగాది చేసుకోము కదా! ఎందుకంటే నాన్నమ్మ తద్దినం కదా అదే మనకు పండుగ అని చెప్పావు కదా మరిచిపోయావా” అంది మనవరాలు.

తెల్లటి చీరెతో, వేలుముడి వేసిన జుత్తుతో, నుదుట విభూది బొట్టుతో ఉన్న లలితమ్మ పసుపుకుంకుమలతో పాటు అత్తగారి తద్దినాన్ని కూడా స్వర్గానికి పంపించేసింది బాధ కళ్ళలో నీళ్ళు తిరుగుతూంటే అవి పిల్లలకు కనిపించకుండా

“తాతగారు తాతమ్మ దగ్గరకు వెళిపోయాడు కదా! అందుకని మనం ఉగాది పండుగ మనకు ఇచ్చేసారన్న మాట! మాకు ఉగాదులు లేవు. మాకు ఉషస్సులు లేవు” అని పాడనక్కరలేదు. ఈ సంవత్సరం నుండి పండుగ అందరిలాగే చేసుకోవచ్చును.

ఉగాది పండుగ వచ్చిందీ….

నేను రాసిన కవిత పట్టుకెళ్ళి కవి సమ్మేళనంలో ఎవరు చదువుతారూ? అంది లలితమ్మ.

“తెలుగు లోనా?”

“అమ్మో! నాకు తెలుగు రాదు” అంటూ పారిపోతున్న మనవలని చూస్తూంటే అప్పటిదాకా దాచుకున్న కన్నీళ్ళు జలజలా రాలిపోవడం మొదలైంది.

“అమ్మా! కన్నీరు చిందించకు. ఇదిగో! నీ వారసురాలు. నీ కవితలను చక్కగా చదువుతుంది” అంటూ కొడుకు పదేళ్ళ మనవరాలిని లలితమ్మ ఒళ్ళో కూర్చోబెట్టాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here