Site icon Sanchika

ఉల్లిపాయ – రాహుకేతుగ్రహము

[dropcap]ఉ[/dropcap]ల్లి చేసే మేలు తల్లికూడ చేయదన్నది సామెత. ‘తల్లి, ఉల్లి’ ప్రాసగ కలిశాయని చేసిన సామెత కాదిది. వంటశాలలో తరిగేవారికేకాదు, దగ్గరున్నవారికి కూడ తరతమ భావము చూపకుండా కన్నులలో నీరు తెప్పించగలదు. ఉల్లిఘాటు ఆరోగ్యకరమని భావిస్తారు అందుచేత సామెత పుట్టింది.

ఔషధ గుణములు కలిగి తరిగేటప్పుడు కంటినీరు తెప్పించి మేలుచేసి కంటిరెప్పలా రక్షించే తల్లి వంటిదని సామెతను పుట్టించుకున్న జానపద వైద్యశాస్త్ర సాహితీ వస్తువు ఉల్లిపాయ. శిష్టసమ్మత పురాణ కథా వస్తువు కూడ. ముఖ్యముగా తెల్ల ఉల్లిగా మహౌషధము అనే నిఘంటు అర్థము కలిగిఉంది.  ఉల్లి ఘాటు నిట్టూర్పులో పురాణ ప్రసిద్ధ గ్రహము,గ్రహణము రాహువుగాథ దాగిఉంది.

రాహువు మాయావి అనబడే రాక్షసుడు. విప్రచిత్తి, సింహిక దంపతుల కుమారుడు. సైంహికేయుడని పేరు. దేవదానవుల సంయుక్తఫలము క్షీరసాగరమథన ఉద్భవ అమృతభాండమును అపహరించాడు. మోహినీ ఆకారమునకు ఆకర్షితుడై లొంగిపోయి పంపక సమయములో రహస్యముగా దేవతల పంక్తిలో కూర్చుని అమృతము త్రాగాడు. కాని సూర్యచంద్రులది గుర్తించి చెప్పడము వలన జగన్మోహినీ అవతారమై విష్ణువు చక్రాయుధముతో కంఠాన్ని ఖండించాడు. మాయావివి తల, మొండెము వేరయినా అమృత పానమువలన రాహు, కేతువులుగా వరము పొందాయి. ఆ సమయాన కంఠము నుండి కొన్ని రక్తబిందువులు, అమృతబిందువులు నేలమీద పడ్డాయి. రక్తబిందువులు ఎఱ్ఱని ఉల్లిపాయలు, అమృతబిందువులు తెల్ల ఉల్లిపాయలుగా మారి రాహుకేతువుల జ్ఞాపక చిహ్నములుగ వరముపొంది ఆహారపంటలలో జేరాయి. ఎఱ్ఱనివి రక్తముగ నిషిద్ధము. తెల్లనివి అమృతోద్భవము కాబట్టి ఉపయోగమని శిష్టులంటారు. ఉల్లి జన్మకారకుడుగ సూర్యచంద్రులను డ్రేగన్ ఆకారముగ తలమొండెములతో మ్రింగి రాహువు గ్రహణమై బాధిస్తున్నాడని ఉల్లిని ముట్టని వారున్నారు మరి..

మన దేశములో అన్ని ప్రాంతాలలోను ఉల్లిపంట పండిస్తారు. ఉల్లి ఊరినా, మల్లెపూసినా మంచినేల లోనె అనే సామెత అందుకే పుట్టింది. ఆహారపదార్థముగ తెలుగువారికి ఉల్లిపాయగా ప్రసిద్ధి. పచ్చిగాను, పచనముగాను ఉల్లి జతపడని వంటకము నేటికాలములో అరుదు. పెసరట్టు, మినపట్టు, పలావ్, పెరుగుపచ్చడి, పకోడి,వడలు,ఆమ్లెట్‌గ సర్వజన ప్రియాహారము.

ఎఱ్ఱ ఉల్లిగా నీరుల్లిగా అంగ్లంలో ఆనియన్ అని, తెల్ల ఉల్లిగా వెల్లుల్లిగా అంగ్లంలో గార్లిక్‌గ పేర్లు కలిగి ఆరోగ్య జాబితాలో చేరింది. తినే ఆహారపదార్థముగ శ్లేష్మము హరిస్తుందంటారు.శరీరము చల్లబడితే వేడిమి పుట్టించే  సాధనముగా ఉల్లిని దంచి శరీరానికి పూసేది వెల్లుల్లి వైద్యము. ఉల్లిరసము అసంకల్పితముగా పడినా, లేదా వైద్యపర్యవేక్షణలో కండ్లలో పిండుకున్నా కండ్లకు మహోపకారము జరిగి పొరలు తగ్గవచ్చు. జానపదులు మెచ్చిన, అహారవస్తువుగా వైద్యపరంగా ఉల్లిఘాటులో ముఖ్యముగా తెల్ల ఉల్లిలో గంధకము ఉంది. ఇది ఏంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. ఈ నమ్మకాలపై పరిశోధించి, తేల్చవలసిన అవసరమును ఆధునిక వైద్యులు గుర్తించడమే ఉల్లి జనప్రియ ఆహార ప్రసిద్ధికి నిదర్శనము..

ప్రాచీన నమ్మకమని కొట్టిపారేయకుండా ఉల్లిపాయ వాడకములో అందరికీ పరిచితమయిన పదాలలో చెప్పాలంటే హార్ట్ ఎటాక్, కొలెస్ట్రాలను అదుపులో ఉంచగల పోషకవిలువలు ఉల్లిఘాటుకు ఆశించినంత కాకపోయినా ఉంటాయని, ఆధునిక వైద్యులు అంటున్నారు. ఉల్లిఘాటును ఇతర ఆహారపదార్థాలతో  కలయికగా రుచి కోసము చేర్చి వండడము ఎలాగూ ఉంది. పచ్చి ఉల్లిని తినడం మరీ మంచిదని తేల్చారు. నుఖ్యముగా ఉల్లి పైభాగము ఉల్లికోడిగా ప్రసిద్ధమైనది. అది కూడా మంచి పోషకవిలువలున్న ఆహారము అని పోషకవిలువల పరిశోధన నిపుణుల అభిప్రాయము.

విశ్వవిజేత అలెగ్జాండరు తనసైనికదళాలకు తుష్టిని,పుష్టిని కలిగించాలని ఆహారములో ఎక్కువగా ఉల్లిపాయనే వండించేవాడన్న నమ్మకము ఉల్లిపాయ ప్రసిద్ధికి కారణమయింది. లూయీపాశ్చరు బాక్టీరియా పరిశోధనలు 19వశతాబ్దిలో ఉల్లిచేసే మేలుగురించినవి వివరించేవిగా ఉంటాయి.

మునగకాయ యుల్లి ముల్లంగి గుమ్మడి
కాయనేతిబీరకాయ,పుచ్చ
కాయనక్కదోసకాయవట్రువసొఱ
కాయగాదుశ్రాద్ధకర్మమునకు…

అంటారు అరిష్టము అనే అర్థము నిచ్చిన ఆంధ్రవాచ్స్పత్వ కర్త కొట్ర శ్యామలకామశాస్త్రి. ఈజిప్టు సమాధులపై చిత్రకళలో ఉల్లిపాయల బొమ్మలున్నాయి. యూదులు (Jews) జాతివారు ఇష్టంగా తినేవారు. మనదేశములో శిష్టులు ఉల్లిపాయను తినకూడదంటారు. దేశాటనము చేసిన శ్రీనాథుడు వెల్లుల్లిని తిలపిష్టమును తిన్నానని చాటువులో వాపోవడం  ఉల్లిపట్ల నిరసన అయినా ఆహారపదార్థ వాడుకలో ఉల్లి ఉంది అని చెప్పినట్లే. అయితే భారతంలో అనుశాశనిక పర్వములో భీష్ముడు ధర్మరాజుతో ఉల్లిని పితృకార్యవాడుక నిషిద్ధవస్తువుల్లో చేర్చాడు.

మునగ యుల్లి యడవిమునగ దుర్మాంసము।లానుగమ్ము మలినమైనయుప్పు
కఱియజీలకఱ్ఱ కఱివేము గురుజయిం।గువ ప్రవర్జనీయకోటియగుట
(అనుశాసన 3వ ఆశ్వాసము 189)

శ్రాద్ధ కర్మమునకు నిషేధించించ బడినవని చెప్పాడు. పితృకార్యములలోతప్ప మిగిలిన సమయాలలో ఉల్లి శిష్టులు తినే ఆహార పదార్థముగ నిషేధింప బడినట్లు లేదు. ధర్మరాజు కాలానికి అంటే మహాభారత కాలము నాటికి ఉల్లి ఆహారపదార్థముగా ఉంది. ఉల్లిపాయలు క్షీరసాగర ఉద్భవ అమృతపానమును బ్రాహ్మణ వేషధారియై మోసము చేసిన రాహువు కంఠనిర్గమ రక్త, అమృత బిందువులు కారణముగా ఉద్భవించాయన్న పురాణకథనము కంబరామాయణము.

సంస్కృతములో ఉల్లిపాయను అమృతోద్భూతము అంటారు. అమృత నిర్గమము, అరుణపలాండువు అని కూడ పేరులున్నాయి. నీరుల్లి అని తెలుగులో పిలవబడే ఈ సంస్కృత పదమునకు పలాండువు, ఉల్లి, ఉల్లిగడ్డ వాడుక పదాలు.  ఉల్లిపాయలు, ఎఱ్ఱగడ్డ, ఎఱ్ఱఉల్లి, (వెల్ల+తెల్లఉల్లి), తెల్ల ఉల్లిగడ్డగా వర్ణబేధములు కలిగి ఉంటాయి. భోజనపదార్థముగ ఖ్యాతి గడించిన ఉల్లిపాయకు శూద్రప్రియము అని నిఘంటు అర్థముంది.

దీనికి ముఖదూషణము అనే పేరుంది. ఉల్లికి మల్లెపుష్పము పూయదు. ఉల్లివాసనే ఉంటుందన్నట్లు తినేటప్పుడు ఇష్టమేకాని ఉల్లివాసన భరించడము అయిష్టమనే వారున్నారు. ఘటిక మ్రింగిన సిద్ధునితో పోల్చి ఉల్లి తిన్న కోమటి అనే సామెతను చేర్చుకుని (3వ అశ్వాసము 203)  మార్కండేయ పురాణము దాని ప్రజాహిత సాహిత్య ప్రసిద్ధిని చాటింది. ఉల్లి ఎంత ఉడికినా కంపుపోదు. కాని ఉల్లి ఊరినా, మల్లెపూసినా మంచి నేలలోనె. ఉల్లి ఉంటే మల్లి గూడా వంటలక్కే. ఉల్లి పదితల్లుల పెట్టు అని సామెతలలో ప్రశంస లందుకుంది. సూర్య చంద్రులున్నంతవరకూ రాహుకేతువులు శాశ్వతము. వారిని గుర్తుతెచ్చే ఉల్లిపాయ కూడ ఆహార పదార్థముగ శాశ్వతము.

Exit mobile version