[షేక్ కాశింబి గారు రచించిన ‘ఉమ్మడి సంపద’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]మూల్యమైన ఉమ్మడి సంపద అది
అన్ని అణువులకి మూల కేంద్రకమది
అందరినీ సేదదీర్చే ఆత్మీయతా పూలపక్క
అడుగడుగునా దీవించే సహకారపు తేనెచుక్క
అందరికీ దానిపైనే కొండంత నమ్మకం
ఆందోళనలో అదే ఓదార్పు లేపనం
నష్టానికి నూరు శాతం సరైన పూరకం
కష్టమొస్తే లేదు దాన్ని మించిన ఆధారం
లెక్కలు గట్టి ముక్కలుగా చీల్చలేనిది
పక్కాగా ఏ పరికరంతోనూ కొలవనలవి కానిది
సమీకరణాన్నుపయోగించి విలువ తేల్చలేనిది
సూత్రాలతో తత్వాన్ని విశ్లేషించుట కనువుగానిది
నిత్యం ప్రేమతో పరిమళించే వాడని పూలగుత్తి
నితరంతరం కరుణని ప్రసరించే మలగని దీపవు వత్తి
ఎంత కొల్లగొట్టినా తరగని మమతల గని
సదా తియ్యని వాత్సల్య ఫలాల నందించే హరిత వని
ఎప్పుడూ ఒకే తీరు విచ్చుకునే దయా పుష్పం
ఏ అవసరంలో నైనా ఆదుకునే దైవీ హస్తం
ఎందరు తాగినా వట్టిపోని అనురాగపు ఊట
ఏ సందర్భంలోనైనా రక్షణ కనువైన దుర్భేద్యపు కోట
దారి మళ్ళించ సాధ్యమవని జీవనది
ఏరి కోరి ఓ ఒక్కరికో పరిమితమవని ధర్మనిధి
సమదృష్టితో అంతటా వర్షించే సస్నేహ మేఘం
సాంత్వనా స్పందనల ఆలాపనతో అలరించే మోహన రాగం
అనురాగామృతం నిండిన అమ్మ హృదయం!