[dropcap]నే[/dropcap]ను సినిమా సమీక్ష వ్రాయదలచినప్పుడంతా సాంప్రదాయిక పధ్ధతిని పాటించాను. ఉపోద్ఘాతము, కథ క్లుప్తంగా, సాంకేతికతా కథా అంశాలు. అన్నీ తూకంతో. వివరంగా చెబితే అది సమీక్ష పరిధిని దాటి పోయి ఫిల్మ్ రైటింగ్ అనిపించుకుంటుంది. ఏ చట్రాన్నైనా చేదించాల్సిందే కదా. ఇకనించి నేను మరింత వివరంగా వ్రాద్దామని నిర్ణయించుకున్నాను. ఇందులో రెండు సమస్యలు వస్తాయి. ఒకటి స్పాయిలర్స్. ఒక సస్పెన్స్ సినిమాలు మినహాయించి దీనిని గురించి పట్టించుకోదలచలేదు. రెండోది వచనం. నాకు మామూలుగా flowery and poetic వచనం ఇష్టముండదు. కోకు లాంటి నిరలంకారిక వచనం ఇష్టం. ఆ ఇష్టాన్ని కూడా పక్కన పెడదామనుకుంటున్నాను. కనీసం కొన్నాళ్ళు.
కొంత్రకొరియెంటే అంటే ఆంగ్లం లో undertow. మనం చూసే సముద్ర తలం మీద నీరు వొడ్డు వైపే నిరంతరాయంగా ప్రవహిస్తూ కనబడుతుంది. దాని కింద మరో తలం లో ఎలా వుంటుందో అందులో దిగిన వాళ్ళకే అనుభవమవుతుంది తప్ప వొడ్డున నిలబడ్డ మనిషి కళ్ళకు కాదు. ఆ సముద్రం కింద మరో తలంలో, కొన్ని చోట్ల కనీసం, నీరు వ్యతిరేక దిశలో ప్రవహిస్తూ వుంటుంది. అంటే వొడ్డుకు విపరీత దిశలో. ఇది కూడా అంతే సహజం, మనం కళ్ళతో చూసే ప్రావహం సహజమైనంత. ఈ చిత్రానికి ఈ శీర్షిక వాచ్యంగానూ, ప్రతీకగానూ బాగా అమరింది. (సముద్రంలో ఆ ప్రాంతంలో మునిగినవాడు బహుశా ఎప్పటికీ ఒడ్డున చేరలేడు. ఆ undertow అతన్ని లోపలికి ఈడ్చుకుంటూ పోతుంది.) ఇన్నాళ్ళు ఆ కొంత్రకొరియెంటే (తెలుగులో ఏమంటారో తెలీదు) ని మనం తప్పు పట్టాము, అసహజం అన్నాము, గుర్తించ నిరాకరించాము. కానీ ఇప్పుడిప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంతో సహా, దీన్ని గుర్తించి తగిన గౌరవం కూడా ఇస్తున్నాయి చిత్రాలు, సమాజాలు.
అది పెరూ లోని వొక సముద్రతీర ప్రాంతం. మిగెల్ (క్రిస్టియన్ మెర్చాదో) భార్య మరియెలా (తాత్యానా ఆస్తెంగో) కడుపుతో వుంది. అది వారికి పుట్టబోయే మొదటి బిడ్డ. అతను భార్యను జాగ్రత్తగా చూసుకుంటూ వుంటాడు. ఇంతలో కబురొస్తుంది కార్లోస్ మరణించాడని. అతను మిగెల్ కి కజిన్. కార్లోస్ సొంత సోదరుడు హెక్టర్ కంటే మిగెల్ నే అతనికి దగ్గర. కార్లోస్ అంత్యక్రియలు మిగెల్ చేస్తేనే అతని ఆత్మకు శాంతి కలుగుతుంది అంటే అలానే చేస్తాడు. పెళ్ళయ్యి అయిదేళ్ళుగా అక్కడుంటున్న భార్యకు తెలియని విషయం వొకటుంది. మిగెల్ కు సంతియాగో (మనోలో కార్దోనా) అనే అతన్ని ప్రేమిస్తూ వుంటాడు. ఇంకెక్కడో వుండే సంతియాగో చిన్న తనం నుంచీ అప్పుడప్పుడు ఈ పల్లె కు వస్తూ వుంటాడు. అంటే వాళ్ళ ప్రేమ అంత నిలకడగా వుంది. కాని ఎలాంటి ప్రేమ అది. సమాజానికి చెప్పుకోతగ్గది కాదు. చాటుగా వుంచాల్సిందే. హృదయం తీరూ, సమాజం తీరూ వొక్కలానే వుండవు కదా. అలాగని అతనికి భార్య పట్ల ప్రేమ లేదని కాదు. అడకత్తెరలో పోకచెక్క లాంటి పరిస్థితి అతనిది. తనకు భార్యా, పుట్టబోయే బిడ్డ అన్న కుటుంబం వుండడంతో మిగెల్ కి సంతియాగోకి అంత స్వేచ్చ వుండదు. ఈ విషయమైమిగెల్ కి కష్టంగా వున్నా అతనికంటే సంతియాగోకి కష్టం ఎక్కువ. ఇద్దరూ పీడితులే. సంతియాగో వొక చిత్రకారుడు. చేతిలో కెమెరాతో వూరంతా తిరుగుతూ అందరి ఫొటోలు తీస్తుంటాడు. కొన్నింటిని చిత్రరూపం ఇస్తాడు, కేవలం తనకోసం, రహస్యంగా. ఎవరితోనూ మాట్లాడడు, మిగెల్తో తప్ప. చాలామంది అతని గురించి వింతగా చెబుతారు, ఏవో అనుమానాలతో అతన్ని అవమానకరంగా చూస్తారు, వెనుక మాట్లాడుకుంటారు. ఒక సారి వో యువజంట చాటుమాటు సరసం కోసం తిరుగుతూ సంతియాగో ఇంటివరకూ వెళ్తారు. ఇంట్లో ఎవరూ వుండరు. అప్పుడామెకు అక్కడ మిగెల్ నగ్న చిత్రం (పేంటింగ్) కనిపిస్తుంది. ఇక వూరంతా విషయం పాకి పోతుంది. చివరికి భార్య వరకూ వెళ్తుంది మాట.
ఇక్కడివరకూ వున్న స్ట్రేట్ నేరేటివ్ కాస్తా మేజిక్ రియలిజం లాంటి కథనం లోకి వెళ్తుంది. భార్యా భర్తలు ఇంట్లో వుండగా ఎవరో తలుపు తడతారు. మిగెల్ తలుపు తెరిస్తే ఎదుట సంతియాగో. మిగెల్ కంగారు పడతాడు. వెనకనుంచి భార్య వచ్చి ఎవరూ అంటుంది. కంగారు పడకు నేను నీకు మాత్రం కనిపిస్తాను ఇంకెవ్వరికీ కనబడను అంటాడు సంతియాగో. ఆ క్షణం నుంచీ మిగెల్ సంతియాగోలు నిజమైన స్వేచ్చను పొందుతారు. కలిసి మాట్లాడుకుంటారు. చేతిలో చేయి వేసి వూరంతా నడుస్తారు. అల్లరి చేస్తారు, ఆడుకుంటారు. ఇంటికి వెళ్తుంటే ఏమైందో తెలీదు, అప్పటి నుంచీ తన మాటలు ఎవరికీ వినిపించట్లేదు, తను కూడా ఎవరికీ కనబడట్లేదూ అంటాడు సంతియాగో. మిగెల్ కళ్ళల్లో నీరు. నీ శరీరానికి పధ్ధతిగా అంత్యక్రియలు జరిగితే నీకు శాంతి లభిస్తుంది అంటాడు. రోజూ సముద్రంలోకి వెళ్ళి అతని శరీరాన్ని వెతకుతుంటాడు మిగెల్. వొకసారి దొరుకుతుంది కూడా. కాని దానికి వొక తాడుతో పెద్ద రాయికి కట్టేస్తాడు. తర్వాత తనే చెప్పినట్టు, ఆ చర్య తను సంతియాగో ఆత్మతో సాన్నిహిత్యాన్ని పోగోట్టుకోలేని స్వార్థం నుంచి అని. వొకసారి ఇద్దరూ నగ్నంగా సముద్రతీరంలో సరసాలాడుకున్న తర్వాత మిగెల్ నిద్రలోకి జారుకుంటాడు. మర్నాడు సంతియాగో నిద్రలేపుతున్నట్టు అనిపించి కళ్ళు తెరిస్తే ఎదుట ప్రీస్ట్. ఏమిటిదంతా, నీకు కుటుంబం వుంది, గౌరవం వుంది. ఇలా నగ్నంగా పిల్లలు నిన్ను చూస్తే ఏమనుకుంటారు? ఇకనించి ఇలాంటి పిచ్చి పని చెయ్యనని ప్రమాణం చెయ్యి అంటాడు. నిజమే, ఇదంతా ఎంత కాలం? ఆ రోజు సముద్రంలోకి వెళ్ళి కట్టేసిన ఆ తాడును తెంపేస్తాడు.
భార్య వొక మగ పిల్ల వాడిని కంటుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చిన సంతియాగోకి తన కొడుకుని చూపించి మురిసిపోతాడు. నువ్విప్పుడు తండ్రివయ్యావన్న మాట అంటాడు సంతియాగో. ఇదివరకు తన ఇంటికి వచ్చి తను తండ్రి కాబోతున్నాననే మంచి వార్త చెబుతున్నప్పుడు పట్టలేని ఆనందంతో వెలిగిపోతున్న అతని నవ్వు ముఖం చూసి సంతియాగో అంటాడు కదా, నిన్ను ఇలా చూడటమే నాకిష్టం అని. ఇద్దరూ దెబ్బలాడుకుంటారు, కొట్టుకుంటారు, కన్నీళ్ళు పెట్టుకుంటారు, ప్రేమించుకుంటారు కానీ ఇద్దరూ ఒక్కటే అన్నట్టుగా వుంటారు. ఇప్పుడు భార్యకు కూడా తెలిసింది కాబట్టి ఆ పేంటింగ్ సంగతి ఏమిటి అని అడుగుతుంది. మొదట అబధ్ధమాడుతాడు తనకేం తెలీదని. వూళ్ళో వాళ్ళకి చేపలు పడుతుంటే సంతియాగో శవం దొరికిందనీ, అతని కుటుంబానికి సమాచారం చేరవేసి వాళ్ళొస్తే అప్పజెప్పాలని చూస్తున్నారనీ, అయితే మిగెల్ కు మాత్రం చెప్పకూడదనుకుంటున్నారనీ ఆ యువ జంటలోని అమ్మాయి చెబుతుంది. నువ్వు అతనికి అంతిమ సంస్కారం చేస్తేనే అతని ఆత్మకు శాంతి అని కూడా అంటుంది. అప్పుడు నిజం చెబుతాడు భార్యకి. ఆమె ఏడుస్తుంది, దెబ్బలాడుతుంది, అలుగుతుంది, వెళ్ళిపోతుంది, నువ్వు ఇంకా అతన్ని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. అతను అవునంటే అయితే నువ్వు నీ మనసు చెప్పినట్టు చేసుకో నేను వెళ్తున్నాను అని బిడ్డను తీసుకుని వెళ్ళిపోతుంది. మిగెల్ సంతియాగో తల్లి, చెల్లెలను కలిసి ఆ అంతిమ సంస్కారం తనను చెయ్యనివ్వమంటాడు. మొదట నిరాకరించినా అతని ప్రేమను చూసి వొప్పుకుంటారు. అంతే కాదు ఆమె చెబుతుంది, తనతో వొకసారి కొడుకు ఈ విషయం చెప్పాడనీ, ఏమీ చెయ్యలేక అప్పటినుంచీ పొడి పొడి సంభాషణలే చేస్తూ వచ్చిందనీ.
చనిపోయిన సనిత్యగోఎ శరీరాన్ని తను సముద్ర ఖననం చేసి దేవుడికి సమర్పిస్తున్నాననీ, అతని ఆత్మకు శాంతి కలగచెయ్యాలని ప్రార్థనలుచేస్తాడు. ఆ అంతిమ యాత్రలో ముందు యెవరూ కూడా రారు. దూరంగానే వుంటారు. ఆ యువజంటలోని అమ్మాయి ముందు చొరవ చేస్తుంది. ఆ తర్వాత మరికొందరు చేరుతారు. చాలా మంది మాత్రం వెనుకే వుండిపోతారు. సంతియాగో శవాన్ని వో వోడకెక్కించి బయలుదేరుతాడు మిగెల్. అతని శవాన్ని సముద్రమధ్యంలో విడుస్తాడు. చివరిసారిగా సంతియాగో ఆత్మ వచ్చి వొక ప్రేమాలింగనం, వొక ముద్దు ఇచ్చి మిగెల్ నుంచి శలవు తీసుకుంటుంది.
సుండేన్స్ కు ఇది ఉత్తమ విదేశీ చిత్రానికి గాను నామాంకితమైంది. కాని గెలుచుకోలేదు. కాని ఇతర అవార్డులు అరడజను పైగా వచ్చాయి దీనికి. దర్శకుడు జేవియర్ ఫుంటియెస్ లెయోన్ కు ఇది తొలి పూర్తి నిడివి చిత్రం. ఇది కాకుండా రెండు లఘు చిత్రాలు, మరో పూర్తి నిడివి చిత్రమూ తీశాడు. దీనికి కథ జూలిఒ రోహాస్ తో కలిసి వ్రాశాడు. ముందుగా అనుకున్న కథలో సంతియాగో స్థానంలో వో వేశ్య వుంది. తర్వాత ధైర్యం చేసి కథను ఇలా మార్చారు. స్క్రీన్‌ప్లే దర్శకత్వాలతో పాటు మవురీషియో విదల్ చాయాగ్రహణం, సెల్మా ముతల్ వెర్మ్యులన్ సంగీతం అద్భుతంగా వున్నాయి. ఈ మూడింటి మిశ్రమ పరిణామమే మనలో కలిగే భావోద్వేగాలు. అయితే ఇంతే క్రెడిట్ ముగ్గురు నటులకీ వెళ్తుంది. నటించారు అనడం కంటే నిజజీవితంలో చూస్తున్న ముగ్గురు మనుషులుగా కనబడ్డారు. మరీ ముఖ్యంగా క్రిస్టియన్ మెర్చాదో నటన చాలా బాగుంది. ఈ స్పానిష్ చిత్రాన్ని చూడమని నా శిఫారసు. ఒకవేళ హెటీరో ప్రేమలకు భిన్నంగా దేన్నీ గౌరవించే పరిస్థితుల్లో వున్నా, ఈ చిత్రం చూస్తే మార్పు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఇది తాకేది ప్రేక్షకుని మేధకు కాదు హృదయానికి.