[box type=’note’ fontsize=’16’] “వొక స్త్రీకి అవాంఛిత అవమానం ఎదురైతే దగ్గరుండి ధైర్యం చెప్పాల్సిన మనిషే మొహం తిప్పేస్తే ఆ వైఖరి రేప్ కంటే ఏం తక్కువ” అని ప్రశ్నించే ‘అన్‍ఫెయిత్‌ఫుల్’ అనే షార్ట్ ఫిల్మ్‌ని సమీక్షిస్తున్నారు పరేష్ ఎన్. దోషి. [/box]
[dropcap]కొ[/dropcap]న్ని కథాంశాలుంటాయి. అవి సాగదీసి నవలగానో, పూర్తి నిడివి చిత్రం గానో చెయ్యడానికి వీలు ఉండదు. అవకాశం దొరికి వాటిలో వో అంతర్భాగంగా చెయ్యొచ్చు తప్ప బలవంతంగా ఇరికించినట్టు వుండకూడదు. ఈ లఘు చిత్రంలో ఆలోచింపజేసే విషయమే వున్నది. వదిలెయ్యడానికి లేదు. ఇలాంటి వాటికి బాగా అందివచ్చే ప్రక్రియ లఘు చిత్రం.
పెళ్ళి అనే వ్యవస్థ ఎన్నో లొసుగులు ఉన్నప్పటికీ ఇంకా పోలేదు. సహజీవనం లాంటివి ఇప్పుడు వచ్చాయి. కాని పెళ్ళి మాత్రం విరాట్ వృక్షం లానే నిలబడి వుంది. సహజీవనమైనా, పెళ్ళైనా ఒక ముఖ్య లక్షణం పరస్పర విధేయతే. అంటే ఇద్దరిలో ఎవరూ మరొకరిని చీట్ చెయ్యకుండా వుండడం. ఇద్దరి మధ్య మూడో మనిషి వస్తే ఆ పెళ్ళి పునాదులు కదులుతాయి. మనుషుల ఆలోచనల్లో ఎంత మార్పు వచ్చినా ఈ విలువ మాత్రం మారలేదు.
ప్రస్తుతానికి ఈ “అన్‌ఫైత్‌ఫుల్” అనే లఘు చిత్రం నిడివి కేవలం ఆరు నిముషాలే. చెప్పడం మాత్రం సూటిగా, ప్రభావవంతంగా చెప్పబడిన కథ. మౌలికా పటేల్ (నటుల పేర్లే, పాత్రలకు పేర్లు లేవు) వొక కేఫ్ లో కూర్చుని వుంటుంది. కళ్ళు తేమగా వున్నాయి. ఎదుట బల్ల మీద తన మొబైల్ వున్నది. అలాగే ఎదుట వో ఖాళీ కుర్చీ. ఎవరికోసమో ఎదురు చూస్తూ వున్నది. ఆమె ముఖం ఏవో ఆలోచనల్లో పడినట్టు చదవతగ్గట్టుగా వుంది. గతం రాత్రి నిర్మానుష్యమైన రోడ్డు మీద తను నడుస్తూ వుంది. తను ఫోన్ చేసి తన కాబోయే భర్త తో మాట్లాడుతుంటుంది. ఎక్కడున్నావ్ అంటాడు. నా స్కూటి చెడిపోతే వొకచోట వదిలేసి నడిచి ఇంటికి వెళ్తున్నాను అంటుంది. అతను కంగారు పడి, ఇంత రాత్రి నువ్వు వొంటరిగా నడుస్తూ వెళ్తావా, ఎక్కడున్నావో చెప్పు నేనొచ్చి నిన్ను పికప్ చేస్తానంటాడు. నవ్వి, ఏం కాదులే ఇల్లు దగ్గర పడింది అంటుంది. సరే సరే పెళ్ళి దగ్గర పడింది ఇక శలవులు పెట్టేయ్ అంటాడు. ఆ సంభాషణ అయిపోయినతర్వాత ఆమె గమనిస్తుంది, తనను ఎవరో వెంబడిస్తున్నట్టు. డౌన్ ఏంగల్ షాట్ లో ఆమె, ఆమె నీడ కదులుతూ, వెనకాలే ఆమెకంటే వేగంగా ఒకతనూ, అతని నీడా కదులుతూ కనిపిస్తాయి. ఆమె వేగం పెంచుతుంది. అతను అంతకంటే వేగంగా వచ్చి కర్చీఫ్ ఉన్న చేత్తో ఆమె నోరు నొక్కేస్తాడు. ఆమెకు స్పృహ వచ్చేసరికి తను వో నిర్మాణంలో వున్న బిల్డింగ్ నేలపై పడి ఉంటుంది. నోటికి కర్చీఫ్ కట్టేసి వుంటుంది. తన మీద పడి అతను (అర్జున్ బారోట్) రేప్ చేస్తుంటాడు.
వెయిటర్ వచ్చి ఏం చెప్పమంటారు మేడం అనేసరికి ఈ లోకంలో వచ్చి కాఫీ చెబుతుంది. కాసేపట్లో ఆమె కాబోయే భర్త (సబక్ జోషీ) కూడా కూడా వస్తాడు. ఉదాసీనంగా వున్న ఆమెను చూసి ఏమైంది అని అడుగుతాడు. నిన్న నేను రేప్ కు గురయ్యాను అంటుంది. అంతే “వాట్” అంటూ అతను లేచి వెళ్ళిపోతాడు. కాసేపు తర్వాత ఆమె కూడా లేచి బయటకు వెళ్తుంది.
క్రితం రాత్రి తను శారీరికంగా రేప్ కు గురైతే, ఈ రోజు తను మానసికంగా, ఆత్మికంగా, భావనాత్మకంగా రేప్ కు గురైంది. అయినా లేచి ముందుకు అడుగు వెయ్యాల్సిందే.
వొక స్త్రీకి అవాంఛిత అవమానం ఎదురైతే దగ్గరుండి ధైర్యం చెప్పాల్సిన మనిషే మొహం తిప్పేస్తే ఆ వైఖరి రేప్ కంటే ఏం తక్కువ? తన ప్రమేయం లేకుండానే వొక స్త్రీ సెక్స్ అనేదాంట్లో పాల్గొంది అంటే చాలు అది కాస్తా ఆమెకు వో మచ్చగా మారిపోతుంది. మగవాని విషయంలో తేడా రాదు గాని ఆడదాని విషయంలో శారీరిక “పవిత్రత” అనేదానికి అంత విలువనిచ్చింది పురుష స్వామ్యం. ఈ విషయాన్ని అటు తిప్పి ఇటు తిప్పి కాకుండా సూటిగా, క్లుప్తంగా చెప్పబడింది ఇందులో.
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, ఎడిటింగ్ నీరవ్ బ్రహ్మభట్ బాగా చేశాడు. హార్దిక్ పటేల్ కెమెరా పనితనం కూడా బాగుంది, ముఖ్యంగా రాత్రి పూట ఆ రోడ్డు మీద దృశ్యాలు. నిరుడు Global Indian Film Festival కు, ఈ యేడు Dadasaheb Phalke International Film Festival (DPIFF) కు ఎంపికయ్యింది ఈ లఘు చిత్రం.