Site icon Sanchika

ఉన్నాయా..!?

[dropcap]కొ[/dropcap]త్త అక్షరాలు కావాలి
ఏడుపు చొక్కా విప్పి
ధైర్యపు మలాము పూసేవి
అధైర్యపు గుండె శబ్దాల్ని
తెగింపు డప్పులుగా మార్చేవి
రాతిబండల దర్బారుల్ని
కూకటి వేళ్ళతో పెకళించి
రాత రాసిన బ్రహ్మకూ
సవాలు విసిరేవి
కొన్ని కొత్త అక్షరాలు కావాలి

రాజ్యాల్ని కూలుస్తాయో
ప్రజల నోళ్ళకు వల్లెలౌతాయో
కలల్ని విప్పేస్తాయో
రేపటి రాత్రుల్ని మింగేస్తాయో
కొన్ని కొత్త అక్షరాలు కావాలి

నిన్నటి కథలకు శుభం పలికేయాలి
సరిక్రొత్త దిగంతాన్ని
దిగంబరంగా ముందుకు పరచేయాలి
నచ్చిన రంగులతో ఆకాశాన్ని కప్పేసేలా
నరనరాల్లో ఉత్తేజాన్ని గుచ్చేసేలా
కొన్ని కొత్త అక్షరాలు కావాలి

పల్లె పట్నం
వ్యతిరేకార్థాలు కావని చెప్పాలి
ఉన్నోడు లేనోడు
లింగ బేధాలు లేవని రాయాలి
దోచుకోవడం దాచుకోవడం
నిఘంటు చరిత్రలోంచి వెలివేయాలి
అందుకే
కొన్ని కొత్త అక్షరాలు కావాలి

Exit mobile version