యువభారతి వారి ‘ఉపనిషత్సుధ’ – పరిచయం

0
2

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

ఉపనిషత్సుధ

[dropcap]ఆ[/dropcap]త్మ నిత్యం. అదే సత్యం. మిగిలినదంతా అనిత్యం, అసత్యం. కానీ నిత్య సత్య సందీప్తమైన ఆత్మను, ఆస్థి చర్మమయమైన శరీరం ఆవరించి ఉన్నందున, ఆవరణలోనే ఆనందం ఉన్నట్లు అనిపిస్తుంది. అలా అనిపించే ఆనందాన్ని అధిగమించి, ఆవల కనిపించే ఆనందాన్ని ఆత్మగతం చేసుకోవడమే జీవిత పరమావధి. దీనినే మహర్షులు తపస్స్వాధ్యాయ సహకారాలతో సాధించారు. ఈ సాధన సంపత్తిని సామాన్య మానవులకు కూడా అందుబాటులో ఉండేటట్లు అందరికీ అర్ధమయ్యే భాషలో చెప్పాలని తత్త్వవేత్తలు ప్రయత్నించారు. ఆ ప్రయత్నానికి ప్రతిఫలమే ఉపనిషద్వాంగ్మయం.

ఉపనిషత్తులు – భారతీయ తత్త్వ జిజ్ఞాసకు ప్రతీకలు. ఇవి, జీవునికీ, దేవునికీ మధ్య ఉన్న ఆంతర్యాన్నీ, సత్య గవేషణా దృక్పథాన్నీ మహోన్నత జీవితాదర్శాన్నీ విశ్లేషిస్తాయి. దేశ,కాల,పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉండే కర్మలను చూసి, అవే ఆర్ష తత్వ విధానాలని అనుకోవడం పొరపాటు. భారతీయ ఆర్ష తత్వాన్ని సూక్ష్మంగా తెలియజెప్పే సామర్థ్యం ఉపనిషత్తులకే ఉన్నది. ఉపనిషత్తుల్లో తాత్త్వికాంశాలు ప్రతీకాత్మకంగా ప్రబోధితములైనవి. ఎంతో పాండిత్యం, శ్రద్ధ, జిజ్ఞాస ఉంటేనే గాని, ఉపనిషత్తుల్లోని రహస్యాలు మనకు అవగతం కావు. భారతీయ తత్త్వ వివేచనకు ఉపనిషత్తుల అధ్యయనం అనివార్యం. ఈశావాస్య, తైత్తతీయ, ఛాందోగ్య, బృహదారణ్యక, మాండూక్య, కేన, ఐతరేయాది ఉపనిషత్తులు అనేకంగా ఉన్నవి. వాటి గూర్చి స్థూలంగానైనా ప్రతి అధ్యయనశీలుడూ తెలుసుకోవలసిన అగత్యం ఉన్నది. వాటి గురించి తెలుసుకోకుండా, అవేవో పాత పుస్తకాలని, అందులోని భావాలు నేటి తరానికి అనావశ్యకములని, మాటవరస కైనా అనకూడదు.

యుగయుగాలుగా మహర్షులు చేసిన మహత్తరమైన మనో మంథనకు పర్యవసానంగా ఆవిర్భవించిన ఆలోచనామృతమే ఉపనిషత్సాహిత్యం. అందుకనే ఉపనిషత్తులలోని మాటలు మామూలు మాటలుగా కాక మంత్రాల మూటలుగా భావించడం భావయోగులకు భావ్యమని తోచింది.

ఇలాంటి భావాలను మరో భాషలో మరోవిధంగా మార్చి చెప్పటం కష్టం. ఆ భావాలను ఆ మాటల్లోనే విని ఆనందించాలి. చదువుకొని ఆస్వాదించాలి. కానీ ఈ మాటలు కూడా ప్రస్తుతం అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ మాటలను జాగ్రత్తగా గమనించి, వాటినే అనుగమించి, ఉపనిషత్సుధారాశికి ఈ చిన్న ఉపాయనం సమకూర్చిన సహృదయులు – కీర్తిశేషులు, శ్రీ ఇలపావులూరి పాండురంగారావుగారు. ఈయన సంస్కృత, ఆంద్ర, హిందీ, ఇంగ్లీషు భాషలలో చక్కని అభినివేశం సంపాదించిన పండితులు. హిందీలోనూ, తెలుగులోనూ ఎన్నో కావ్యాలను రచించారు. ఆర్ష విజ్ఞాన ప్రసరణకు ఆయన చేసిన కృషి అభినందనీయం.

వందకు మించిన ఉపనిషత్తులను వెలయించిన అక్షరభారతి – వేదమండలానికి క్షీరసాగరం లాంటిది. అందులోనుంచి అందుకోగలిగినంత అక్షరసుధను సేకరించి, అందరికీ అందించగలిగినంతవరకు అందించాలనే ఆరాటానికి అక్షరాకృతి ఈ ‘ఉపనిషత్సుధ’.

ఉపనిషత్తుల సారాన్ని వేదాంత పరిభాషలో కాకుండా త్యాగం – భోగం, ఇహం – పరం, అన్నం – ఆనందం లాంటి మామూలు మాటల్లో తెలుసుకోవడానికి క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/upanishath-sudha/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here