యువభారతి వారి ‘ఉపనిషత్ సుధా లహరి’ – పరిచయం

0
2

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

ఉపనిషత్ సుధా లహరి

2011 వ సంవత్సరంలో ఈ లహరీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తలపెట్టినపుడు, “వేదాలు, ఉపనిషత్తుల మీద ఉపన్యాస లహరులు అంటూ యువభారతి వెనక్కు పోతోంది” అన్నారు ఒకాయన నవ్వుతూ. “లేదు.. లేదు.. ముందుకు పోతోంది. ముందున్నవి యేవో, వాటి గురించి వెనకాడకుండా తెలుసుకుని, ముందుకు పోయేందుకు ఆ ముందువి ఈ తరం ముందుంచుతోంది.” అన్నది దానికి నవ్వుతూనే సమాధానం.

సమాజంలో ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అమూల్యమైన జ్ఞాన సంపద ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉంది. ఒక వ్యక్తి సామాజికునిగా అనుసరించవలసిన ధర్మం గురించీ, అతనికి సమాజం పట్ల గల బాధ్యతల గురించీ, తన కుటుంబంతో, సాటివారితో మెలగవలసిన తీరుతెన్నుల గురించీ, ఉపనిషత్తులలో పేర్కొనబడిన విషయాలు – సర్వకాలాలకూ అనుసరణీయాలైనవి ఉన్నాయి.

వేదంలోని సంహిత, బ్రాహ్మణ భాగాలను ‘కర్మకాండ’ గా, ఆరణ్యకాలు, ఉపనిషత్తులను ‘జ్ఞానకాండ’ గా పేర్కొంటారు. వేదాల చివరన ఉన్నవి ఉపనిషత్తులు కనుక ‘వేదాంతం’ అని కూడా వాటికి పేరు. కర్మకాండ నుండి – జ్ఞానసముపార్జన వైపు తీసుకు వెళ్లి, బ్రహ్మవిద్య ద్వారా ఆత్మావలోకనానికి దారి చూపడం ఉపనిషత్తులు చేసే పని. ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధించాయి కానీ కర్మకాండను నిందించలేదు. అయితే కర్మకాండల ద్వారా సముపార్జించిన పుణ్యమైనా, అనుభవించిన తరువాత మళ్ళీ మనిషి పూర్వస్థితికి చేరుకుంటాడనీ, జననమరణచక్రం నుండి విముక్తుడు కాలేడనీ ఉపనిషత్తులు చెప్పి – శాశ్వతమైన మోక్షం గురించి జ్ఞానబోధ చేశాయి. సృష్టి తత్త్వ రహస్యమెరిగిన నిజమైన మత తత్త్వానుష్టానమే మోక్షం. ఉపనిషత్కర్తలు చరిత్ర జ్ఞానం వున్నవారు. కర్మకాండల వెనుక గల అసలు పరమార్థం చెప్పి, ఆ పరమార్థ జ్ఞానం పొందమనీ, అందువల్ల అసలు ప్రయోజనమనీ సమాజానికి హితవు చెప్పారు.

ఈ లహరీ కార్యక్రమాలలో ఉపనిషత్తుల ఉపదేశం గురించి ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, ఈశావాస్యోపనిషత్తు – సామాజిక దృక్పథంపై డా. రేమెళ్ల అవధానులు గారు, కేనోపరిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై డా. దోర్బల ప్రభాకర శర్మ గారు, కఠోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై డా. కే కోదండరామాచార్యులు గారు, ప్రశ్నోపనిషత్తు – సామాజికాంశాలు అన్న విషయంపై ఆచార్య పి శశిరేఖ గారు, ముండకోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు గారు, మాండూక్యోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై డా. రాళ్ళబండి కవితా ప్రసాద్ గారు, తైత్తరీయోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై డా. ఆచార్య కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని గారు, చాన్దోగ్యోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై డా. రాణి సదాశివ మూర్తి గారు,   ఐతరేయోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై డా. చిర్రావూరి శ్రీరామశర్మ గారు,  బృహదారణ్య కోపనిషత్తు – సామాజికాంశాలు అన్న అంశంపై  ఆచార్య మానస చెన్నప్ప గారు, సర్వోపనిషత్తులు, ఏక సూత్రత అన్న విషయంపై డా. చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు చేసిన ప్రసంగాల సంపుటమే – ఈ ‘ఉపనిషత్ సుధా లహరి’.

ఏది తెలుసుకోవడం వాళ్ళ, మరేదీ తెలుసుకోవలసిన అవసరం లేదని తెలుసుకుంటామో, నీ, నా అన్న భేద భావాలు మరచి, అంటా ఒక్కతెననే భావనతో విశ్వమాన సౌభ్రాతృత్వాన్ని అర్ధం చేసుకోగాలుగుతామో, ఆ ప్రయాణానికి ఉపనిషత్తులు దారి చూపి తీసుకు వెళతాయి.

మన ఉపనిషత్తుల గురించి సమగ్రమైన పరిజ్ఞానం కలగాలంటే –  ఈ క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ చిన్న పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/upanishath-sudhalahari-2/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here