Site icon Sanchika

ఉపనిషత్తుల ప్రాశస్త్యం

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘ఉపనిషత్తుల ప్రాశస్త్యం’ అనే రచనని అందిస్తున్నాము.]

ఉప అంటే సమీపంగా, ని అంటే కింద, షత అంటే కూర్చునుట అని అర్థం.

ఉపనిషత్తులు అన్నీ కూడా జ్ఞానం ప్రధానంగా ఉన్నాయి. గురువు ముందు శిష్యుడు కూర్చొని జ్ఞానాన్ని ఆర్జించాడు. వీటిలో ప్రధానంగా విశ్వాంతరాళంలో మనిషికి ఉండే స్థానం గురించి చర్చ జరిగింది. ఉపనిషత్తులు తాత్త్విక గ్రంథాలు. ఆత్మ-అంతరాత్మ ప్రపంచానికి మూలం కాబట్టి ఉపనిషత్తుల గురించి ధార్మికులందరూ తప్పక తెలుసుకోవాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు.

హిందూ ధర్మ శాస్త్రాలలో ఉపనిషత్తులు ఒక భాగము. వేదముల చివరిభాగములే ఉపనిషత్తులు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఒకప్పుడు మహా ఋషులు, ఋషి పుత్రులు ఒకచోట చేరి.. ఆత్మ అంటే ఏమిటి? అనాత్మ అంటే ఏమిటి? జీవుడు ఎవరు? జీవుల ఈశ్వరుల నడుమ సంబంధం ఎటువంటిది? ఎక్కడి నుండి మనం వచ్చాం? ఈ దేహం ఎలా ఏర్పడింది? చివరికి ఎక్కకడికి పోతాం? అన్న ప్రశ్నల గురించి చర్చలు జరుపగా వచ్చిన జవాబులే ఉపనిషత్తులు అని తెలుస్తోంది.

పూర్వము పోలీసు, న్యాయవవస్థ లేవు కాబట్టి, నీతి, నియమము, మంచి, చెడు, ధర్మము, అధర్మము, పాపము, పుణ్యము అనే అంశాల పైన న్యాయ తీర్పులన్నీ ఉండేవి.. వాటిని తెలియజేసేవే వేదాలు.. ఉపనిషత్తులు. మానవులు తమ జీవితాలను వీటిలో వున్న నియమాలకనుగుణంగా తీర్చిదిద్దుకునేవారు కాబట్టి వారి జీవితాలు అర్థవంతంగా, ధర్మబద్ధంగా, న్యాయసమ్మతంగా వుండేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడ అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు.

అవి:

  1. ఈశోపనిషత్తు
  2. కఠోపనిషత్తు
  3. ముండకోపనిషత్తు
  4. కేనోపనిషత్తు.
  5. ప్రశ్నోపనిశషత్తు
  6. మాండూక్యోపనిషత్తు
  7. తైత్తరీయోపనిషత్తు
  8. ఐతరీయోపనిషత్తు
  9. బృహదారణ్యకోపనిషత్తు.
  10. చాందోగ్యోపనిషత్తు.

వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ప్రతీ గురువు తన శిష్యులకు ప్రధానంగా ఉపనిషత్తులను, అందులో దాగి వున్న నిగూడార్థములకు తప్పక తమ శిష్యులకు బోధించేవారు.

ఉపనిషత్తులు పూర్తిగా జ్ఞానకాండకు సంబంధించినవి. అందుకే ఉపనిషత్తులలో బోధించిన విషయాన్ని బ్రహ్మవిద్య అని కూడా అంటారు. జ్ఞానకాండ వల్ల జీవాత్మ, పరమాత్మ జ్ఞానంతో పాటు మోక్షం, పరబ్రహ్మ స్వరూపం తెలుస్తాయి. అయితే వీటిలో పరమాత్మను తెలుసుకునేందుకు నిర్దేశించిన కర్మకాండ, విధి విధానాలు మాత్రం లభ్యం కావు.

Exit mobile version