[dropcap]”అ[/dropcap]ల్లాహొ అక్బరల్లాహ్” అంటూ పెద్ద మసీదులో అజా మొదలవ్వగానే ఉప్పలమ్మకి మెలకువ వచ్చేస్తుంది. అష్టకష్టాలూ పడి రెండు చేతుల్నీ దగ్గరకి చేర్చి కళ్ళు తెరుస్తుంది. ఆ చేతుల్లో ఒకప్పుడు చాలాకాలం పైసలమ్మ కనిపించేది. ఆ తరవాత చదువులమ్మ కనిపించేది. ఇప్పుడు రెండు చేతుల్లోనూ ఒకటే కనిపిస్తుంది. అదే గద్దె. ఆ చేతుల్ని మెల్లగా పక్కలకి దింపుతూంటే ఆ చేతుల మధ్యలోంచీ చుక్కలు తొంగి చూస్తూంటాయి. ఎడం పక్క చందమామ కనిపిస్తూంటాడు. ఆ చుక్కలూ చందమామా దిశలు మార్చుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఎక్కడికీ కదలవు. నాలుగైదు మబ్బుతునకలుంటాయిగానీ అవి మబ్బుల్లా కాకుండా దూది పింజల్లాగో ఏకుల్లాగో ఉంటాయి. ఆ మబ్బులు నీళ్ళుతాగడానికి ఎక్కడకీ వెళ్ళవు. అవి నీళ్ళు తాగడానికి వెళ్ళకపోతే వాటికి చల్లగాలి తగిలినా వానెలా కురుస్తుంది. అందుకే ఉప్పలమ్మకి వాన పడదు. ఎండకాయదు. మంచు కురవదు. పగలూ రాత్రీ తేడా లేకుండా చలిమాత్రం చుట్టూ అలుముకునే ఉంటుంది. ఒక్కోసారి ఒళ్ళు జలదరింపజేస్తుంది. ఒక్కోసారి ఎముకల్నే కొరికిపారేస్తూ ఉంటుంది.
తనకి కనిపిస్తున్నది ఆకాశం లాంటిదేగానీ ఆకాశం కాదు. ఎందుకంటే అవి తన మునిమనవడు.., అతని మునిమనవడికోసం లోకప్పుకి అంటించిన మెరుపు కాగితాలు. అందుకే వెల్లకిలా పడుకుని పైకి చూస్తే చాలు, అంత పెద్ద ఆకాశమూ మన గదిలోకి వచ్చేస్తుంది.
సహజమైనా కృతకమైనా చంద్రుడు చంద్రుడే చుక్కలు చుక్కలే. ఆ చుక్కల్లో చంద్రుడిని మించిన అందగాడు ఈ లోకంలో తన భర్త శివయ్య తప్ప ఇంకెవరైనా ఉన్నారా? సీతారాముల దాంపత్యం కన్నా రాధాకృష్ణుల ఆరాధనకన్నా లైనా మజ్నూల అమరత్వంకన్నా గొప్పదీ అందమైనదీ ప్రేమపూరితమైనదీ ఇంకేదైనా ఉందా?
ఎందుకులేదు? అందాలన్నింటినీ మించిన అందం. భావాలన్నిటినీ మించిన అనుభావం ఒకటుంది. అదే గద్దె. పైన అంటించిన చుక్కలమధ్య చంద్రుడి స్థానంలో మెరిసిపోతూ ఉంటుంది. దాన్ని మించినది ఈ భూమిమీద మరొకటుంటుండదు. ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే అది గద్దె. అంటే తన హృదయ పీఠాన్నలంకరించిన సింహాసనం. ఒక్కసారైనా దానిమీద కూర్చోకపోతే ఈ జీవితానికి అర్థం ఉండదు. అర్థం లేని జీవితానికి అంతం ఉండదు. అందుకే గద్దె కోసం అర్రులు చాస్తూ ఎదురుతెన్నులు చూస్తూ ప్రాణాలుగ్గబట్టుకుని కూర్చుంది.
ఒకప్పుడు పైన పంఖా తిరుగుతూండేది. అది ఆలోచనల్ని సుళ్ళుతిప్పుతూ పైకి లేపేది. అవి పంఖానిదాటి పై అంతస్తుని దాటి ఆకాశంలోకెగిరి చుక్కల్ని చుట్టుముట్టేవి. ఆ చుక్కలన్నీ క్రమంగా కలలగద్దెగా రూపుదాల్చేవి. ఆ పంఖా మాయమై ఎన్నో యేళ్ళయింది. అది లేకపోతే ఝూంకారం చేస్తూ రివ్వున తిరిగే సుడిగాలి సద్దూ ఉండదు ఆలోచనల ఆహాకారాలూ ఉండవు. అవే లేకపోతే మనిషికి ప్రాణం ఉన్నా ప్రయోజనం ఉండదు.
కాలం మారిపోతోంది. ఎంతమారిందో ఎంత ఏమార్చిందో తనకి తెలియదు. కానీ ఇప్పుడు పంఖాని మరిపిస్తూ ఎక్కడినించీ వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియకుండా సద్దులేకుండా గదంతా ఆవహిస్తుంది చల్లదనం. ఆ చల్లదనం ఎంత హాయిగా ఉంటుందో అదిచ్చే నిశ్శబ్దం అంత గంభీరంగా ఉంటుంది. ఆ నిశ్శబ్దాన్ని మౌనంగా మారిస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు.
ఎందుకుండదు? సృష్టిలో మౌనంకంటే కూడా ఆనందాన్నిచ్చే గద్దె ఉందిగా?
నీ గద్దె ఎక్కడుందో చెప్పు తాతమ్మా, తెచ్చి నీ కాళ్ళముందు పెడతానంటాడు హనుమంతు. తనూ చెప్పాలనే అనుకుంటుంది. తన పెదాలు కదుల్తాయిగానీ అందులోంచీ మాట మాత్రం బైటకి రాదు. దాంతో ఉప్పలమ్మ గద్దె గురించి హనుమంతుకు తెలిసే అవకాశం రాదు. ఫలితంగా ఉప్పలమ్మకి మనసైన గద్దె మనసులోనే ఉండిపోతుంది.
హనుమంతు తన మునిమనవడు. తనలాగే అతనికీ పట్టుదల జాస్తి. ఎంతైనా శివయ్య రక్తం కదా?
ఎప్పుడో అరవైయేళ్ళ క్రితం తనకి మాట పడిపోయే ముందు అన్నమాట విన్నది ఈ హనుమంతే. తన నోట్లోంచి వచ్చిన ఆ చివరి మాటే “గద్దె”. తను ఆ గద్దె కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకుని కూర్చుందనీ లేకపోతే దేహాన్నించీ జీవం ఎప్పుడో విముక్తిని పొంది అనంతవాయువుల్లో లీనమైపోయివుండేదనీ అతని విశ్వాసం. ఉప్పలమ్మలో కొట్టుమిట్టాడుతున్న జీవానికి శాశ్వత అమరత్వం ప్రసాదించాలన్నదే అతని జీవిత లక్ష్యంగా మారిపోయింది. ఈమధ్యన అతనిక్కూడా దేహం బరువైపోతోంది. ఆ బరువుని దింపుకుంటేగానీ జీవానికి శాంతి ఉండదనిపిస్తోంది. దానికి శాంతి లభించాలంటే ముందు ఉప్పలమ్మని సాదరంగా సాగనంపాలి. అందుకే ఉప్పలమ్మ మనసులో ఉన్న గద్దె గురించి కనుక్కోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాడు.
ఒకప్పుడు పోచంపల్లిలో ఉండేది ఉప్పలమ్మ. కాబట్టీ ఉప్పలమ్మ గద్దె అక్కడే ఉండే అవకాశం ఉందని భావించాడు. అన్ని ఇళ్ళలోకీ తీసుకెళ్ళి చూపించాడు హనుమంతు. అప్పటికి హనుమంతు పాతికేళ్ళవాడు. అప్పట్లో చేతికీ మూతికీ అందని కుటుంబం వాళ్ళది. అందుకే దొరగారి గడీలు, నవాబుగారి ఖిల్లా, పంతులుగారిల్లు.., లాంటివి తప్ప తను తీసికెళ్ళగలిగిన అన్ని ఇళ్ళలోకి ఉప్పలమ్మని తీసుకెళ్ళి కుర్చీలన్నింటినీ చూపించాడు. కానీ ఫలితం దక్కలేదు.
హైదరాబాదొచ్చి మేస్త్రీగా మొదలై ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాడు. స్థలాలు కొని ఇళ్ళు కట్టి అమ్మడంలాంటి దంధాలు మొదలు పెట్టాడు. క్రమంగా దశ తిరిగింది. దాంతో వాళ్ళుండే ప్రాంతానికి మకుటం లేని మహారాజుగా రూపొందాడు. ఒకప్పుడు ఎవరైతే తమని ఇంట్లోకి రానిచ్చేవారుకారో ఇప్పుడు ఆయా ఇళ్ళన్నింటికీ ప్రధాన అతిథీ ప్రత్యేక ఆహ్వానితుడూ సభాధ్యక్షుడూ హనుమంతే. అలాంటి హనుమంతు, తాతమ్మని తీసుకువస్తానంటే కాదనేదెవరు?
దొరగారి గడీలో ఓ పెద్ద సింహాసనం ఉంది. అది దొరగారి తాతముత్తాతల కాలం నాటిది. దాని కాళ్ళు సింహం కాళ్ళలా ఉంటాయి. పాదాలు పులిపంజాల్లా ఉంటాయి. దాని చేతులు జయకేతనాన్ని ఎగరవేస్తున్న ఏనుగు తొండాల్లా ఉంటాయి. వెనుక ఆనుకోవడానికి ముఖమల్ దిండ్లు. ఆ వెనుక ఎర్ర చందనపు చెక్కతో చెక్కిన నెమలి. దానికి నిజమైన నెమలి కన్నులతో కూర్చిన పింఛం. అందం సౌకర్యాలని మించిన రాజసం ఉట్టిపడుతూ చూసినవాళ్ళని ఊరిస్తూ కలల లోకాల్లో విహరింపజేస్తూ ఉంటుంది. ఎంతటివారికైనా ఆ సింహాసనంలో ఒక్కసారి కూర్చుంటే చాలు జన్మధన్యమైపోతుందనే కోరిక కలగడం సహజం. బహుశా ఉప్పలమ్మ కలవరించే గద్దె అదేనేమో.
తాతమ్మని తీసికెళ్ళి ఆ సింహాసనంలో కూర్చోబెట్టాలనుకున్నాడు. కానీ తాతమ్మ కదిలే పరిస్థితిలో లేదు. కొండ మనదగ్గరకి రానప్పుడు మనమే కొండదగ్గరకి వెళ్ళాలి. అందుకే తాతమ్మకోసం ఆ సింహాసనాన్నే కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టాడు. ఓ మంచిరోజున మంగళస్నానాలు చేయించి ఉప్పలమ్మని అందులో కూర్చోబెట్టాడు. ఆమె ముఖంలో ఆనందం కనిపించింది. కానీ అది సింహాసనంలో కూర్చోవడం వల్ల కలిగిన ఆనందం కాదు. తన కోరిక తీర్చడం కోసం తన మనవడు పడుతున్న తపనని చూడ్డం వల్ల కలిగిన ఆనందం. అంటే పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చిందన్నమాట.
సమ్మక్క సారక్క జాతరకి ఎక్కే గద్దెల్ని చూడాలనేది తాతమ్మ కోరికేమోనని అక్కడికి తీసికెళ్ళాడు. ఆ జాతర్ని చూసి తాతమ్మ ముఖంలో సంతోషమే తప్ప వెలుగెక్కడా కనపడలేదు. ఎక్కడైనా బోనాల పండగ జరుగుతోందన్నా, బతుకమ్మలాడుతున్నారన్నా అక్కడికి తీసికెళ్ళేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఉప్పలమ్మ ముఖంలోనే తప్ప కళ్ళల్లో ఏమాత్రం నవ్వు కనిపించేది కాదు.
ఉప్పలమ్మని సంతోషంగా సాగనంపడం కోసం హనుమంతు చెయ్యని ప్రయత్నాల్లేవు. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఉప్పలమ్మని నెలకోసారైనా పోచంపల్లి తీసుకెళ్ళేవాడు. అక్కడ ఉన్నంతసేపూ ఏదో ఒకవైపునుండి మగ్గాల చప్పుళ్ళు వినిపిస్తాయి. ఆ చప్పుళ్ళని సుప్రభాతం విన్నంత శ్రద్ధగా వినేది. కానీ ముఖం మాత్రం వికసించేది కాదు.
ఒకసారి పాతబడి వెనుకవైపుగా వెళుతున్నప్పుడు హఠాత్తుగా ఉప్పలమ్మ ముఖంలో ఏదో దివ్యకాంతి కనిపించింది. అంటే ఆ ప్రాంతాల్లోనే ఎక్కడో ఉందన్నమాట ఉప్పలమ్మ గద్దె. అందుకే తన చలవ బండిని వెనక్కి తిప్పి తీసుకొని వచ్చి పాతబడి ముందు నిలిపాడు. తనకి ఊహ తెలిసినప్పటినుండీ ఆ బడి అలా తుప్పు పట్టిన తాళంతోనే ఉంది. కాస్త గట్టిగా లాగితే ఊడిపడిపోయేలా ఉంది. తన పరపతి ఉపయోగించి అప్పటికప్పుడే బడితాళం తీయించాడు. కిందంతా అరడుగు మందాన పేరుకుపోయిన దుమ్ము, పైనంతాబూజు. చుట్టూ భరించలేని దుర్గంధం. నానమ్మని సాగనంపడానికి గద్దె కోసం వెతకాల్సిన పని లేదు. లోపలకి తీసుకొస్తే చాలు. ఆ కంపుకే పంచ ప్రాణాలూ అనంతవాయువుల్లోకి పారిపోతాయి.
లోపల శుభ్రం చేయించి వెనక గది తలుపు తెరిచి చూస్తే దాన్నిండా కాళ్ళూ చేతులూ విరిగి పోయిన కుర్చీలు, బల్లలు, మేజాలు, పెట్టెలు, భోషాణాలు అడ్డదిడ్డంగా పడున్నాయి. వాటిల్లోనే ఉప్పలమ్మ గద్దె కూడా ఉండుంటుంది. అందుకే అన్నింటినీ జాగ్రత్తగా బైట పెట్టించాడు.
చలవ బండి వెనక వైపున పడకమీద ఉన్న ఉప్పలమ్మ ముఖంలో అనిర్వచనీయమైన ఆనందంతో కూడిన వెలుగు. దాన్ని చూడగానే ఉప్పలమ్మ గద్దె కూడా ఆ కుర్చీల్లోనే ఉండివుంటుందనే నమ్మకం కలిగింది. కానీ ఎంత శుభ్రం చేసినా ఇంకా దుమ్మ వాసనా ముక్కువాసనా పూర్తిగా పోలేదు. అలాంటి కంపులోంచీ ప్రాణవాయువుని పీల్చుకోవడం ఆవిడకి కష్టం అవుతుంది. అందుకే ఆమె ముఖానికి ఆమ్లజని తొడుగుని పెట్టి దానితాలూకూ సరంజామాతో సహా జాగ్రత్తగా కిందికి దింపించాడు.
కిందికి దింపగానే ఉప్పలమ్మ ముఖంలోని వెలుగు నాలుగింతలైంది.
అక్కడున్న కుర్చీల్లో ఒకదానికి ఒక చెయ్యీ ఒక కాలూ విరిగిపోయి ఉన్నాయి. దాన్ని చూడగానే ఉప్పలమ్మకి ప్రాణం లేచివచ్చినట్లైంది. దానిని దగ్గరకి తీసుకురమ్మన్నట్లుగా సైగ చేసింది. దాన్ని తీసుకొచ్చి పడక పక్కనే నిలబెట్టారు. దానికి మూడు కాళ్ళే ఉన్నాయి. నాలుగో కాలు స్థానంలో వేరే కుర్చీ కాలుని తెచ్చి నిలబెట్టారు. తన చేతిని ఆ కుర్చీవైపు చాచే ప్రయత్నం చేస్తోంది ఉప్పలమ్మ. దాన్ని గమనించిన హనుమంతు ఆమె చేతిని కుర్చీకి తగిలించాడు హనుమంతు.
అంతే.., ఒక్కసారిగా లేచి నిలబడింది ఉప్పలమ్మ. అడ్డం వచ్చిన ఆమ్లజని తొడుగునీ దాని గొట్టాల్నీ లాగి పారేసింది. తనంత తానే కుర్చీలోకూర్చుంది.
అక్కడున్న అందరూ చేష్టలు దక్కి అబ్బురంగా చూస్తున్నారు.
అంతవరకూ చలనం లేకుండా పడివున్న తాతమ్మలో ఒక్కసారిగా ఇంతటి చైతన్యం, ఇంతటి శక్తి, ఇంత ఉత్తేజం ఎక్కడనించీ వచ్చాయో? ఎలా వచ్చాయో? అర్థం కాక అయోమయంతో కూడిన ఆనందంతో చూస్తున్నాడు హనుమంతు. ఎనభైయేళ్ళ జీవితంలో ఎన్నో విచిత్రాల్ని చూశాడు. మరెన్నో అద్భుతాల గురించి విన్నాడు. కానీ ఇది మాత్రం విస్మయాలన్నింటినీ మించిన విస్మయం. ఆశ్చర్యాలన్నింటినీ మించిన ఆశ్చర్యం.
ఉప్పలమ్మ మాట్లాడుతోందిగానీ విస్మయానందంలో తేలాడుతున్న హనుమంతుకు మాత్రం ఏదీ అర్థం కావడం లేదు.
“నాయనా, హనుమంతూ, ఇది మామూలు గద్దె కాదు. ఎంతోమంది గొప్పగొప్ప మహానుభావులు కూర్చున్న గద్దె. దీనిమీద కూర్చుని అలీఫ్ బే తా థా లూ, ఓనమాలూ చెప్పని పంతులు పంతులే కాదు. ఇది గాంధీతాత కూర్చున్న గద్దె. గాంధీ తాత దగ్గర బహుమతిగా కోరి తెచ్చుకున్నారు బాబాజీ. సబర్మతి నుండి పోచంపల్లిదాకా సాగిన దీని ప్రయాణంలో దీనిని దర్శించుకుని తరించినవాళ్ళు లెక్కలేనంతమంది. ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులనీ, శాంతి దూతలనీ, మహా జ్ఞానులనీ, పండితులనీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని తీర్చిదిద్దిన ఘన చరిత్ర కలిగినదీ గద్దె. దీనిమీద కూర్చుని చేస్తేనే ఆలోచన. దీనిమీద కూర్చుని రాస్తేనే పుస్తకం. దీనిమీద కూర్చుని చెబితేనే పాఠం. ఇంతకంటే ఎక్కువ జ్ఞానాన్ని పంచిన గద్దె ఈ లోకంలో ఇంకెక్కడా ఉండదు”
ఉప్పలమ్మ తనతో మాట్లాడుతోందో.., తనలో తను మాట్లాడుకుంటోందో తెలియడం లేదు.
తెలిసిందొక్కటే. తాతమ్మ ఓ అద్భుతం. అరవైయేళ్ళ క్రితం.., అరవైయేళ్ళ వయసులో స్పృహ కోల్పోయింది.
నూట ఇరవైయేళ్ళ తాతమ్మ తనకంటే చలాకీగా ఉత్సాహంగా బలంగా ధైర్యంగా తెలివిగా మాట్లాడుతోంది. చిన్నప్పటి యాస కాకుండా బడిలో చదువులు చెప్పే పంతుళ్ళ భాష మాట్లాడుతొంది. అదీ ఈనాటి పంతుళ్ళకంటే వెయ్యిరెట్లు స్పష్టంగా తన భావాల్ని వ్యక్తీకరిస్తోంది.. ముందీ విషయాన్ని కుటుంబ సభ్యులందరికీ తెలియజేయాలి. అందుకే స్పర్శవాణిలో తమ కుటుంబ వాప్యస్థలి బృందాన్ని స్పర్శించాడు. అది తెరుచుకోగానే అందులో తాతమ్మ ఛాయాచిత్రాన్ని పెట్టాడు. ఆవిడ మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా చిత్రీకరించి అందులో పెట్టాడు. చివరిగా తాతమ్మని చూడటానికి అందర్నీ రమ్మని ఆహ్వానించాడు.
***
అదే పాతబడి. అదే పాత కుర్చీ. కానీ తాతమ్మ మాత్రం ఆనాటి ఉప్పలమ్మ కాదు. గురువులకే గురువుగా మారిపోయిన మహితాత్మురాలు. ఆవిడ పాతబడిలో ఏర్పాటు చేసిన సమావేశానికి దేశ విదేశాలనించీ వచ్చిన కుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. పాతకుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలుపెట్టింది, “ఈ రోజు దినపత్రికలో ప్రధానంగా ఒక వార్త నన్ను ఆకర్షించింది. ఒకమ్మాయి, మరుగుదొడ్డి లేని ఇంట్లో పెళ్ళి చేసుకోనంది. అంతే కాదు, తన ఊళ్ళో అందరి ఇళ్ళకీ మరుగుదొడ్లని కట్టించడానికి సహకరించింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డిని కట్టించడమే తన జీవిత ధ్యేయంగా పనిచెయ్యడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయిని నవ చైతన్యానికి ప్రతీకగా గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెకో ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ప్రదానం చేసింది. సరిగ్గా అరవైయేళ్ళ క్రితం మన ఊళ్ళో బాబాజీ ప్రోత్సాహంతో మేమంతా చేసిన పని అదే. అప్పుడు మేము చేసిన పనికి ఇప్పుడు ఆ అమ్మాయి జాతీయ పురస్కారం అందుకుంది. అంటే అప్పటినుండీ ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు అర్థమౌతోంది. అంటే ఈ అరవైయేళ్ళ కాలంలో మీరు సాధించిన అభివృద్ధి శూన్యం అని అర్థమౌతోంది. అప్పట్లో మేము శ్రీమంతులందరి ఇళ్ళకీ తిరిగి వాళ్ళని బతిమాలీ బామాలీ కాళ్ళూ గెడ్డాలూ పట్టుకుని ఇప్పించిన భూముల్ని సాగు చేసుకుని బతుకుతున్నవాళ్ళెందరు? మన హనుమంతు మిమ్మల్ని చదివిండానికీ, తను స్థిరపడ్డానికీ అమ్మిన స్థలం ఎవరిది? ఆ స్థలాన్ని అమ్మిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి చదువుకున్నదెవరు? ఆ చదువు సంపాదించిపెట్టిన ఉద్యోగాలతో ఊడిగం చేస్తూ మీరు సంపాదించి పెడుతున్నదెవరికి? ఆలోచించండి. అర్థం చేసుకోండి. ఇకనైనా మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి కలిసి రండి..,
ఉప్పలమ్మ చెబుతూనే ఉంది.
కొందరు వింటున్నారు. కొందరు ఆవిడ ప్రసంగాన్ని చిత్రీకరించి స్పర్శవాణుల్లో అందరికీ పంచుతున్నారు. కొందరు ప్రసంగ పాఠాన్ని పత్రికలకి పంపడానికి చిత్తు ప్రతిని తయారు చేసుకుంటున్నారు..,
ఉప్పలమ్మ చెబుతూనే ఉంది, “నేను ఊరుకోను. మీ పంటికింద రాయినౌతాను. మీ కంట్లో నలుసునౌతాను. మీ చెవుల్లో జోరీగనౌతాను. మీ మనసుల్లో అలజడినౌతాను. మీ జీవితంలో అశాంతినౌతాను. చివరికి మీ చేతుల్లో ఆయుధాన్నౌతాను.., .., .., గ్రామ స్వరాజ్యాన్నౌతాను.. ఊళ్ళన్నీ స్వయం సమృద్ధం అయ్యేంత వరకూ నేను చావను. మిమ్మల్నీ చావనివ్వను… … …
*