ఉప్పు సముద్రం కుప్పకూలిన చోట…

1
59

ఒక్కో సరిహద్దు గర్జించినపుడల్లా
అల్లల్లాడుతూ ఆకాశం బిత్తరపోయినట్టు
ఒక్కో అదృశ్య తరంగం వీరంగం చేస్తూ
ఒక్కో కుదుపులా వచ్చిపోతుంటుంది…
అకస్మాత్తుగా తెగబడే తూటావాన
మైత్రి ఒప్పందాలను తూట్లు పొడిచాక
శాంతిమేఘం ఆఖరి చుక్క కురిసి కూలబడిపోయినట్టు
పిట్టల్లా రాలిపోయే
ఊపిరి గుట్టల కూడలిలో
కనుల ఆకాశాలు
బూజురు ముక్కల్లా పిగిలీ పొగిలీ
ఎడతెగక కురిసే వేదన
కుప్పకూలిన ఉప్పు సముద్రమై
అంత్యక్రియల దగ్గర
ఆరడుగులకు అవతల పోగుపడుతుంది
నిశ్శబ్ద లోయలో
యుద్ధ ట్యాంకులు మోహరించగానే
శత్రు శిబిరపు ఆయుధ బంకర్లలోకి
విధ్వంసపు వరద పోటెత్తినట్టు
ఆకాశమంత మౌనవేదన కుక్కలు ముట్టిన
కుళ్లిన శవమై గుండె నరాల్లో కొట్టుకుపోతుంది

రేపో మాపో మళ్లీ
మాయ కత్తుల గాలి విరుచుకుపడొచ్చు
మునిచీకటిలో మనిషిని పరుగెత్తిస్తూ
వడిగా వచ్చే ఒక పొడవాటి దుఃఖనది
ఒకేసారి మరెన్ని పడవల్ని లాక్కుపోతుందో?
మునిగిపోయిన పడవల కోసం
కొట్టుకుపోయిన తెడ్ల కోసం
కోసుకుపోయిన ఒడ్డు కోసం
ఏ సంగాం తీరంలోనో
ఏ సముద్రం అంచునో
మరో నేలా, మరో నింగి ఉంటాయేమో!
అక్కడికయినా… ఆఖరు సంస్కారాల కోసం
కొన్ని పూల పడవల్ని
తోడిచ్చి సాగనంపడం మంచిది కదా!

అనుభవాన్ని ఒడబోస్తున్న అక్షరాలు
అక్షరాల్ని ఒడబోస్తున్న కన్నీటి చుక్కలు
స్పష్టంగానే హెచ్చరిస్తున్నాయి
ఇది నిరంతర యుద్ధం!
ముగిసిపోదని తెలిసీ కొనసాగించే పోరు!
యుద్ధరంగం చివరంచుల్లో
రక్తాలోడుతూ కూలిపోయిన మేఘాలకు
సైనిక వందనం సమర్పించినట్లు
శ్వాసాగిన ప్రతి దేహానికీ
సగౌరవంగా అంత్య క్రియలు జరగే
ఒక ఏర్పాటు తప్పక ఉండాలి కదా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here