Site icon Sanchika

ఉరితాడు

[09 డిసెంబర్ 23 ‘అవినీతి వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా షేక్ కాశింబి గారు రచించిన ‘ఉరితాడు’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]వే[/dropcap]ళకొక్క తీరైన వస్త్రాలతో గొప్పగా కనిపించేందుకు
వేల వన్నెల దుస్తుల దొంతరలు చీమల బారుల్లా నట్టింటికి నడిచి వచ్చినప్పుడు
ఉద్విగ్నతా నదీ కెరటమై ఎగిసి పడిందే గానీ, వీటి కోసం
వెచ్చించిన ధన మెక్కడిదని రొక్కించి ప్రశ్నించి ఉంటే.. ‘అమ్మ’

వివిధ సందర్భాల సందళ్ళలో ఆకర్షణా బిందువై మిలమిల మెరిసేందుకు
వేర్వేరు నమూనాల నగలు పెట్టెలు ఒడ్డుకు చేరిన పడవల్లా వరుస కట్టినప్పుడు
ఉత్సాహపు కడలి పొంగై ఉప్పొంగిందే గానీ, ఇంటాయనకి
వీటి ధర చెల్లించే స్తోమతెలా వచ్చిందని లెక్కలడిగి ఉంటే.. ‘ఇల్లాలు’

వళ్ళు కదలకుండా రెప్పపాటులో గమ్యం చేర్చేందుకు
విశాలమైన పుష్పక విమాన మంటి వాహనం ముంగిట నిలిచినప్పుడు
విహంగాలై ఆకాశాన విహరించారే గానీ, అన్నని
వివరం లేని ఈ బహుమతి సంగతేమిటని ఆరా తీసుంటే.. ‘తోబుట్టువులు’

వందలాది అద్భుత కళాఖండాలతో అలంకరించిన
వసతిగృహం ‘ఇంద్రభవనం’ లోకి అట్టహాసంగా ప్రవేశించినప్పుడు
వెల్లువయ్యే పుత్రోత్సాహపు వరదలో కొట్టుకుపోయాడేగాని, కొడుకుని
వీటిక్కావాల్సిన సంపదెలా సమకూర్చావని నిలేసి వుంటే.. ‘నాన్న’

వెండి, బంగారాలతో పోతపోసిన అచ్చులకి తోడు.. కరెన్సీ కట్టలు
వరుసగా గూటికి చేరిన పక్షుల్లా అల్మారాల్లోకి చేరుతున్నప్పుడు
విందు, వినోదాల మత్తు ఊబిలో కూరుకు పోయారే గానీ, తండ్రిని
వాటి వివరాలు చెప్పమనే స్పృహ కలిగి వుంటే.. ‘పిల్లలు’

వినికిడి మాత్రాన విచ్చేసిన ‘అనిశా’ వారు ఇల్లంతా జల్లెడ పట్టే వారు కాదు
వెను వెంటనే ‘ఛార్జ్ షీట్’ వేసి, విచారణ కోసం ‘ఖైదు’ చేసే వారూ కాదు
విచ్చుకున్న మేడి పండులోని పురుగుల్లా.. కట్టిన మూటల్లోంచి చీకటి చిట్టాలు బయటపడేవి కావు
వేగంగా నిగ్గు తేల్చేందుకు ‘సిట్’, `సిబిఐ’లు ఆయత్తమయ్యేవి కావు!

‘వావ్!’ మని చప్పట్లు చరిచిన అనుచరులు తుపాకీ పేలిన చప్పుడుకి ఎగిరిన పిట్టలయ్యే వారు కారు
‘వహ్వా!’ అన్న నోళ్ళు ‘వ్వె.. వ్వె.. వ్వె..’ అని వెక్కిరించేవీ కాదు
వంగి వంగి సలాములు చేసిన ఆశ్రితులు సైతం మంత్ర మేసినట్లు మాయమయ్యే వారు కాదు
వంచిన తల నెత్త లేక, కుప్పకూలిన కట్టడంలా జనం ముందు నిలవాల్సి వచ్చేది కాదు!

వల్లమాలిన వ్యామోహంలో చిక్కాడని నవ్వుకున్న తోటివారిలో ఉదాసీనత వీడిన ఒకరిద్దరైనా..
వయసు నేర్పిన అనుభవమున్న ఆత్మీయుల జాబితాలో బాధ్యతెరిగిన ఒక్కరైనా..
ఉపేక్షించకుండా తొలినాడే హెచ్చరించి తప్పిదాన్ని ఎత్తి చూపి ఉంటే..
వృద్ధి చెందగలదా ఈ అవినీతి నాచు ‘ఉరితాడు’లా? కాదు కదా!

Exit mobile version