ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు

0
3

[‘ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు’ అనే పిల్లల కథ అందిస్తున్నారు శ్రీ కాశీ విశ్వనాధం పట్రాయుడు.]

[dropcap]ఒ[/dropcap]క రోజు ధర్మవరం జమిందారు గారు, అతని భార్య కలసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో జమిందారు భార్యకు తుమ్ము వచ్చింది. ఆ తుమ్ముకు నోట్లో ఉన్న అన్నం మెతుకులు తుళ్ళి ఎదురుగా ఉన్న జమిందారు ముఖం మీద, బట్టల మీద పడ్డాయి. జమీందారుకు కోపం చిర్రెత్తుకొచ్చింది.

భార్యను ఏమీ అనలేక పిల్లి కాలు ఎద్దు తొక్కితే ఎలుక వైపు ఎర్రగా చూసిందన్నట్లు ధూళి వల్లే తుమ్ము వచ్చిందని పంఖా విసిరే వాడి వైపు గుర్రుగా చూసాడు జమిందారు. “అయ్యా నా తప్పేమీ లేదండీ, కాపలావాడు తలుపు సరిగ్గా వెయ్యకపోవడం వల్ల గాలి ఎక్కువగా వీచింది, అందువల్లే అమ్మగారికి తుమ్ము వచ్చింది” అని చెప్పాడు.

కాపలాదారుకి కబురు పెట్టి, వాడిని గద్దించగానే “మహా ప్రభో నా తప్పేమీ లేదు, తోటలో ఉన్న చెట్ల నుంచి వచ్చిన గాలి ఎక్కువగా ఉండటం వల్ల తలుపులు తెరుచుకున్నాయి.” అని చెప్పాడు.

జమీందారులు కోపం రెట్టింపైంది. సపరివారంగా తోటలోకి వెళ్ళాడు. తోటమాలిని పిలిచి “తోటను శుభ్రం చేయడం లేదా? నా భార్యకు తుమ్ము వచ్చింది.” అని గట్టిగా అడిగాడు.

“తోట శుభ్రంగానే ఉంది మహారాజా, బహుశా విరిసిన పువ్వుల పుప్పొడి గాలిలో ఎగిరి అమ్మగారి ముక్కును తాకి తుమ్ము వచ్చి ఉంటుంది” అని చెప్పాడు తోటమాలి.

తోటంతా కలయచూస్తే ఒక చిన్న మొక్కపై సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. చక్కని పువ్వులు పుప్పొడితో నిండి ఉన్నాయి. “ఆ మొక్కను పీకండి” అని హుకుం జారీచేశాడు. అయ్యో జమిందారు కోపానికి ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ఆ చిట్టి మొక్క బలైపోయిందని జమిందారు భార్య బాధ పడింది. అప్పటి నుంచీ పనికి రాని వాటిమీద, బలహీనుల మీద ప్రతాపం చూపినప్పుడు ఈ సామెత వాడుతున్నారు.

మంగలం (మంగళం కాదు) అంటే కుండ పగలగా ఏర్పడిన పాత్రవంటి కిందివైపు భాగం. ..పెంకు ముక్క. ఎంతో పెద్ద శబ్దం చేస్తూ ఉరుము ఉరిమి, ఏ మహాభవనం మీదో, మహావృక్షం మీదో కాకుండా పగిలిపోయిన కుండపెంకు మీద పడి ఆ చిన్న పెంకు నశించిపోయిందన్నమాట. అధికారం పలుకుబడి కలిగిన వ్యక్తి తప్పు చేసినప్పుడు అతడికి బదులుగా అమాయకునికి శిక్ష పడిన సందర్భంలో కూడా ఈ సామెత వాడుతున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here