శరీరపు రంగు మనిషి జీవితాన్ని శాసించే అమానవీయ పద్దతిని ప్రశ్నించిన తెలుగు సినిమా ‘ఊర్వశి’

0
2

[dropcap]సి[/dropcap]నిమాలలో చాలా మంచి చిత్రాలు ఇప్పటి వారికి తెలీదు. మన భాషలోని మంచి చిత్రాలను మనం చాలా త్వరగా మర్చిపోయాం. ఇప్పటి పిల్లలకు తెలిస్తే అలనాటి కొన్ని పాత పౌరాణికాలు, కాలం తాకిడిని తట్టుకుని నిల్చిన కొన్ని క్లాసిక్స్ తప్ప, మంచి సామాజిక అంశాలతో వచ్చిన చాలా సినిమాలు మరుగున పడి పోయాయి. అటువంటి కొన్ని చిత్రాలను ‘సంచిక’ కోసం వెలికి తీసి ఇలా రాయడం నాకు చాలా ఉత్సాహంగా ఉంది.

ఈ వారం నేను పరిచయం చేయాలనుకుంటున్న చిత్రం 1974 లో వచ్చిన ‘ఊర్వశి’. ఈ చిత్రానికి కే. బాపయ్య గారు దర్శకత్వం వహించారు. శారద, సత్యనారాయణ, రావుగోపాలరావు, అల్లురామలింగయ్య, రాజబాబు, గిరిబాబులు ప్రధాన తారాగణం. చాలా మంది సినీ ప్రేమికులకు తెలియని విషయం హిందీ నటుడు సంజీవ్ కుమార్ దక్షిణాదిన ఒకే ఒక్క సినిమాలో నటించారు. ‘ఊర్వశి’ లో ఆయన ఒక అతిథి పాత్ర పోషించారు. అది ఇప్పుడు ఈ సినిమాకు ఒక అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు. ఈ సినిమా ఈ రోజున చూస్తే కూడా చాలా మందికి నచ్చుతుంది. కథను ట్రీట్ చేసిన విధానం చాలా బాగుంటుంది.

అందానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. తెలుపు రంగంటే మనకు ఎంతో అభిమానం. తెల్లగా ఉన్నవారిని అందమైనవారని చాలా గౌరవిస్తాం. ప్రేమిస్తాం. నలుపు రంగంటే చాలా అయిష్టతను చూపిస్తాం. నల్లగా ఉన్నవారిని చులకన చేసి చూడడం మనకు పెద్ద నేరం అనిపించదు. ఆడపిల్ల నల్లగా ఉంటే ఇక ఆ అమ్మాయి జీవితాంతం ఆత్మన్యూనతా భావంతో కుచించుకుపోతూ బ్రతికేలా చేస్తాం. సమాజం రంగు ఆధారంగా చూపే ఈ వివక్ష మనిషి ఎదుగుదలకు చాలా ప్రతిబంధకం అవుతుంది. జీవితం అంతా అవమానాల మధ్య బ్రతుకుతూ తమకే అర్థం కాని కోపంతో రగిలిపోతూ, తమ అనుకునే వారి ప్రేమ దొరకక, చిన్న చిన్న విషయాలలో కూడా చుట్టూ ఉన్న సమాజం చూపే వివక్షను ఎదుర్కోలేక బాధపడి జీవితంలో బాలెన్స్ తప్పి ఎవరి మీద కోపం చూపించాలో అర్థం కాక తమ శరీరాలని, తమ జీవితాలను నిత్యం అసహ్యించుకుంటూ ఎవ్వరినీ నమ్మలేక, చాలా నిస్సహయంగా జీవించే మనుష్యులు మన మధ్య ఇప్పుడు కూడా కనిపిస్తున్నారు. శరీరం రంగు, ఒడ్డు పొడుగు, లావు, ఇలా ఎన్నో విషయాలలో తాము తక్కువగా ఉన్నామని ఆత్మన్యూనతా భావంతో జీవిస్తూ తమ జీవితాలని చిందర వందర చేసుకున్నవారు ఎంత మందో మన చుట్టూ కనిపిస్తారు. అవి చూసి కూడా బాడీ షేమింగ్, రంగు పట్ల వివక్ష మనం ప్రదర్శిస్తూనే ఉంటాం.

కొన్ని సార్లు బాహాటంగా కాకపోయినా ఒక మనిషిని కించపరచడానికి ఎదో ఒక సందర్భంలో వారి శరీరాలను విమర్శించడం, వారిని చులకన చేస్తూ మాట్లాడడం, సమాజానికి అలవాటు. ఆ అవమానాలను తట్టుకోలేక, ఎదుర్కోలేక జీవితాలను నరకం చేసుకుంటున్నవారిని చూస్తూ కూడా వారి జీవితాలు సుఖంగా లేకపోవడంలో మన ప్రమేయం కూడా ఉందని ఒప్పుకోలేం. కొన్ని సార్లు శారీరిక కారణాలతో ఇతరులను గేలి చేస్తూ మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఆ క్రూరత్వాన్ని చూపిస్తూ దాన్ని ప్రశ్నించిన సినిమా ఇది.

సత్యనారాయణకు అరుణ సుగుణ ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు కవలలు. సుగుణ తెల్లగా అందంగా ఉంటుంది. అరుణ శరీర ఛాయ కారు నలుపు. తెల్లటి చెల్లెలు పక్కన ఇంకా నల్లగా కనిపిస్తూ ఉంటుంది. సహజంగా లోకం ఆమెను వింతగానే చూస్తుంది. అయితే ఆ లోకాన్ని ఎదుర్కోవడానికి ఆమెలో ఆత్మవిశ్వాసం పెరిగేలా ఆమెను పెంచరు ఆమె తల్లి తండ్రులు. కూతురు రంగును చూసి నలుగురు నవ్వినప్పుడు తామేదో తప్పు చేసినట్లు కుచించుకుపోయే తల్లితండ్రులు ఆమెలో ఎటువంటి విశ్వాసం నింపగలరు? చిన్నతనంలో ఈ అవమానాలు అరుణలో తీవ్రమైన కోపాన్ని పెంచుతాయి. తన పక్షాన ఎవరూ నిలబడనప్పుడు తనను తాను కాపాడుకోవాలనుకునే క్రమంలో ఇతరులపై తన అక్కసును కోపాన్ని పదర్శిస్తూ అందరితో గొడవలు పెట్టుకుంటూ ఉంటుంది. అవి తల్లితండ్రులకు ఇంకా తలనొప్పిని తెచ్చిపెడతాయి. కొన్ని చోట్లకు ఆమెను తీసుకెళడానికి కూడా తండ్రి ఇష్టపడడు. ఇది అరుణలో ఇంకా కోపం తెప్పిస్తుంది. సుగుణ అంటే కూడా కసి పెరుగుతుంది. తాను అందంగా లేనని లోకం అన్న ప్రతి సారి తనలో ధైర్యం నింపవలసిన తండ్రి తనను దూరం పెడుతూ ఉంటే తట్టుకోలేక ఒక రకమైన కోపంతో, అసహనంతో ఆమె పెరుగుతుంది. ఈ ప్రవర్తన వల్ల చాలా సార్లు విచక్షణ కోల్పోయి తప్పులు చేస్తూ ఉంటుంది.

ఆ ఇంట తాతగారు ఒక్కరే అరుణ ఒంటరి తనాన్ని అర్థం చేసుకుంటాడు. కాని అరుణకు పూర్తిగా తోడు కాలేకపోతాడు. తోటి పిల్లల వెక్కిరింపులు పడలేక, గొడవ పెట్టుకుని స్కూలు మానేస్తుంది అరుణ. తండ్రి కూడా ఆమె చదువు పట్ల పెద్ద శ్రద్ధ వహించడు. సుగుణ శ్రద్దగా చదివి లాయర్ కోర్సు చేస్తూ ఉంటుంది. ఆమెకు అక్క అంటే ప్రేమ. కాని ఇద్దరి మధ్య ఎప్పటీకీ తరగని దూరం పెరిగిపోతుంది. సుగుణ తన సహద్యాయి గోపాలాన్ని ప్రేమిస్తుంది. గోపాలం చదువు కోసం విదేశాలకు వెళతాడు. వారి వివాహానికి పెద్దలు ఒప్పుకుంటారు.

సత్యనారాయణ శ్రీమంతుడు. ఒక ఫాక్టరీ యజమాని. అతని ఇంట చేరతాడు నాగలింగం. ఆ ఆస్తి మీద అతని కన్ను ఉంటుంది. అరుణకు పెళ్ళి సంబంధాలు చూడమని తాతగారు ధర్మారావు చెప్పినప్పుడు అది అవకాశంగా తీసుకుని శేషగిరి అనే ఒక యువకుడిని ఆ ఇంటికి తీసుకువస్తాడు. అంతకుముందు అరుణను చూడడానికి వచ్చిన పెళ్ళివారు అరుణను కాక సుగుణను చేసుకుంటామని అడిగినప్పుడు అరుణ మనసు గాయపడుతుంది. తన జీవితంలో పెళ్ళి అనే అదృష్టం లేదని భయపడుతుంది. అప్పుడే శేషగిరికి ఒక చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు ధర్మారావు. ఎవరూ లేరని తెలిసి ఉండడానికి బస కూడా తమ ఇంటి ఔట్ హౌస్‌లో ఏర్పాటు చేస్తాడు.

శేషగిగి అరుణతో స్నేహం చేస్తాడు. అతన్ని వివాహం చేసుకోదలచానని అరుణ ఇంట్లో చెబుతుంది. అతని వివరాలు కనుక్కునే సమయాన్ని కూడా ఇవ్వదు. మొండి పట్టు పట్టి అతన్ని పెళ్ళి చేసుకుంటుంది. శేషగిరికి అన్ని అలవాట్లు ఉంటాయి. కాని భార్య దగ్గర ప్రేమ నటిస్తూ ఉంటాడు. అతని మాయలో పడిపోతుంది అరుణ. తన భర్త దేవుడని అతనికోసం ఇంటి వారందరూ ఏదైనా సరే చేయవలసిందే అని పట్టుబడుతుంది. ఫాక్టరీలో చిన్న ఉద్యోగం కాకుండా మేనేజర్ పదవి ఇప్పిస్తుంది. అయితే శేషగిరి ఆఫీసు డబ్బు అవసరాలకు వాడుకుని ఆఫీసులో సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, సత్యనారాయణ అతన్ని ఉద్యోగం నుంచి తీసి వేస్తాడు. అరుణ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతానన్నప్పుడు వారిద్దరిని వేరే ఇంట్లోకు మార్చి అన్ని సౌకర్యాల మధ్య వారి వేరుకాపురానికి సుగుణ సహకరిస్తుంది. కాని శేషగిరి చేతికి మాత్రం డబ్బు దొరకనివ్వరు. శేషగిరి వ్యాపారం చేస్తానని దానికి డబ్బు కావాలంటాడు. అతని కోసం ఇంట్లో అందరితో దెబ్బలాడుతుంది అరుణ. శేషగిరి ఆమెను ప్రతి నిత్యం మోసం చేస్తూనే ఉంటాడు. ఈ పరిస్థితులలో అరుణ గర్భవతి అవుతుంది. భర్త కోసం డబ్బు ఇంకా కావాలని గొడవ చేస్తూనే ఉంటుంది. కాని ఒక రోజు తన చెల్లెలిపై భర్త అత్యాచారం చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆమెకు తాను చేసిన తప్పు అర్థం అవుతుంది. తన భర్త మోసం తెలుసుకుంటుంది. కోపంతో భర్తను హత్య చేస్తుంది.

ఆ హత్యా నేరం సుగుణ తన మీద వేసుకుంటుంది. ఆమెను ప్రేమించిన గోపాలం నిజం తెలుసుకుని సుగుణని జైలు నుండి విడిపిస్తాడు. హస్పిటల్‌లో ఒక ఆడబిడ్డను కంటుంది అరుణ. బిడ్డ ఏ రంగులో పుట్టిందో అని ఆమె పడే ఆత్రుత చాలా జాలి గొలిపేదిగా ఉంటుంది. తండ్రి చేతిలో అందమైన తన బిడ్డను పెట్టి. చూడండి నేనూ ఒక అందమైన బిడ్డను కన్నాను. ఆమెకు ఊర్వశి అని పేరు పెడుతున్నాను. నా బిడ్డను ప్రేమగా పెంచండి అని కోరి చనిపోతుంది. ఆడపిల్లల శరీరపు రంగు వారి జీవితాలను ఎలా నిర్ణయిస్తుందో ఈ సినిమా చాలా నిజాయితీగా చూపిస్తుంది. అరుణలో కసి , కోపం, తొందరపాటు, అమాయకత్వానికి ఆమె వ్యక్తిత్వాన్ని ఎదగనీయకుండా ఆమె రంగును చూసి ఆమెను నిత్యం అవమానించిన ప్రతి ఒక్కరూ కారణమే. చివరకు ఆమె ఆత్మవిశ్వాసం లేని ఒక బలహీన మనస్కురాలిగా పెరిగితే, ఆమె బలహీనతను ఆమె భర్త తన స్వార్థం కోసం వాడుకుని ఆమెను ఇంకా గాయపరుస్తాడు.

శారీరిక లోపం మనిషి ఎదుగుదలకు ప్రతిబంధకం కాకూడదు. ఎటువంటి లోపం ఉన్న వ్యక్తి అయినా ఆ లోపం కారణంగా బలహీన మనస్కులుగా మారకూడదు. సమాజంలో ఎవ్వరికీ మరొకరిని శారీరిక లోపం ఆధారంగా విమర్శించే హక్కు లేదు. తల్లి తండ్రులు తమ పిల్లలకు ప్రేమ పంచేటప్పుడు అందరినీ సమానంగా చూడగల విజ్ఞతను అలవర్చుకోవాలి. అది చేయలేనప్పుడు జీవితాంతం ఆ బిడ్డలకు అన్యాయం చేసిన వారవుతారు. తాము చేయని తప్పుకు ఆ బిడ్డలు వివక్షకు గురి అవడం ఎంత అన్యాయం. మన సమాజంలో ఆడపిల్లలకు రంగు చాలా ముఖ్యమైనది. నలుపు ను చాలా తక్కువగా చూడడం మన సాంప్రదాయంలో ఒక భాగం. మనం పెట్టుకున్న ఈ కొలమానాలు ఎందరి జీవితాలను అతలాకుతలం చేసున్నాయో.

నలుపు రంగును అడపిల్లలలో మగవారిలోకూడా చూసి అసహ్యించుకుంటాం. బహుశా ఈ రంగు బాధ మగవారికి కూడా తప్పదని చెప్పాలనే కావచ్చు, దర్శకులు ఈ సినిమాలో రాజబాబు పాత్రను సృష్టించారు. నల్లగా ఉండే ఈ కోడుకుని ప్రపంచానికి తెలీయకూండా ఇంట్లో బంధించి ఉంచుతారు తల్లి తండ్రులు. ఇంట్లో బంధింపబడి నరకం చూసే కుర్రాడి పాత్రలో రాజబాబు నటన బావుంటుంది. అయితే ఈ పాత్రకు ముగింపుని చూపించలేక పోయారు దర్శకులు. అరుణ మరణంతో సినిమా ముగుస్తుంది. గోపాలం పాత్రలో సంజీవ్ కుమార్ కనిపిస్తారు. నటనకు పెద్ద స్కోప్ లేని పాత్ర అది. వారికి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు డబ్బింగ్ చెప్పారు.

ఇక అరుణ సుగుణలుగా డబల్ రోల్‌లో అత్యద్భుతమైన నటన ప్రదర్శించారు శారద గారు. ఇప్పుడు హీరోయిన్లమని చెప్పుకునే తెలుగు రాని తెలుగు నటీమణులను చూసి వారు చేసిందే నటన అని, అదే హీరోయినిజం అని మురిసి పోయే పిల్లలు ఈ సినిమాలో శారద గారి నటనను చూసి తీరాలి. సుగుణ ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఓర్పు, ఓరిమి ఉన్న అమ్మాయి. అక్క గురించి తండ్రిని నచ్చ చెప్పడం, అక్కను కుటుంబానికి దూరం కాకుండా చూసుకోవడానికి ఆమె చూపే ఓరిమి ఇవన్నీ ఆ పాత్ర అద్భుతంగా ప్రదర్శిస్తే, బలహీనురాలయిన అరుణ పాత్రలో ఇంకా గొప్పగా నటించారు శారద. ఎవరినీ నమ్మలేక, ప్రతి వారి పట్ల కోపం, అభద్రతా భావం, కుటుంబం పట్ల ప్రేమ, అసహ్యం ఒకే స్థాయిలో చూపించడం, భర్త వద్ద అమాయకురాలయిన బలిపశువుగా, నిజం తెలిసి గుండే బద్దలయిన ఒక స్త్రీగా చివరగా తన బిడ్డ రంగు ఏంటో అని ఆత్రుత పడే ఒక సాధారణ తల్లిగా ఆమె చాలా అద్భుతమైన నటనను ప్రదర్శించారు. ఒకే సినిమాలో భిన్నమైన రెండు వ్యక్తిత్వాలను చూపించగలిగారు ఆమె.

అరుణ లాంటి స్త్రీల జీవితాలు అలా అవడానికి వివక్ష ప్రధాన కారణం. వారిని ఆత్మగౌరవం ఉన్న స్త్రీలుగా మనం ఎందుకు మరల్చలేకపోతున్నాం అన్న ప్రశ్న మనకు ఈ సినిమా చూసాక చాలా సార్లు కలవరపెడుతుంది. ఈ సినిమా ఎక్కడా దొరకదు ఇప్పుడు. ఒక్క యూ ట్యూబ్‌లో మాత్రం ఉంది. చూడాలనుకున్నవారు చూసేయ్యండి. సినిమా గురించి ఎటువంటి సమాచారం కూడా నెట్‌లో లేదు. కాని సినిమా చూసాక మాత్రం శారద గారిని ఇష్టపడతారు. సినిమా తీసిన విధానాన్ని మెచ్చుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here