[dropcap]భా[/dropcap]రత దేశానికి ఒక పక్క స్వాతంత్రం వచ్చింది, మరో పక్క దేశ విభజన అయ్యింది. భారత్, పాకిస్తాన్లుగా విడిపోయాం. అప్పటి రక్తపాతం ఇంకా పచ్చి గాయాలుగానే వున్నాయి. కానీ అది అక్కడే ఆగిపోలేదు. పరస్పర అనుమానం, ద్వేషం, పగలతో ఆ సీన్ మళ్ళీ మళ్ళీ recreate అవుతూనే వుంది. కేవలం మనోభావాల ఆధారంగా ఈ దృశ్యాన్ని చూస్తే అర్థం చేసుకోలేము, దానికి మెదడూ, సమ్యమనం, తటస్థ వైఖారి (డిటాచ్మెంట్) అన్నీ అవసరం. ఏడు దశాబ్దాలు దాటినా మారని పరిస్థితి. ఇది మన వరకే కాదు, ప్రపంచమంతటా వున్న విషయం. మనమందరం అనుకోవాల్సిన చోట, మనమూ వాళ్ళూ అని వేరుగా చూసినంత కాలం సమస్యకు పరిష్కారం వుండదు.
ఇది చదివి చాలా తెలిసిన విషయమే అనిపిస్తుంది కదా. అవును తెలిసిన విషయమే. అయితే ఇదంతా పన్నెండు నిముషాల లఘు చిత్రంగా మలచడానికి ఆ దర్శకుడి సృజనాత్మకత మనల్ను అబ్బుర్పరుస్తుంది.
టైటిల్ అప్పుడు వచ్చే షాట్ పై నుంచి పడి రెండుగా విరిగిన క్రికెట్ బాల్. బాల్ గా దాన్ని పోల్చుకుంటాం, కానీ ఆ రెండు సగాలకీ కాస్త ఇంకేదో వుంటుంది అది తర్వాత గాని అర్థం కాదు. ఆ తర్వాత ఎదురెదురు నిలబడ్డ ఇద్దరు పిల్లలు చెమ్మా చెక్కా ఆడుతుంటారు. వాళ్ళ పెదవి కదలికలకు అనుగుణంగా కాకుండా కాస్త తక్కువ వాల్యూంలో గోల లాంటి ధ్వని వినిపిస్తుంది. ఆ తర్వాత మనం చూడ గలిగేది ఆ పిల్లల వెనుక రెండు బారుల్లో పెద్దవాళ్ళు నిలబడి వుండడం. అందరివీ కోపంగా వున్న ముఖాలు. పెదాల కదలికల వల్ల కొన్ని బూతులను పోల్చుకోవచ్చు. పిల్లల ముఖాల్లో ఇదివరకు కనబడిన సంతోషం మాయమై కళ్ళు నీటితో నిండి వుండడం చూస్తాము. నేపథ్యంలో గోల శబ్దం పెరుగుతూ వుంటుంది. అందరూ తెల్లని వస్త్రాల్లో వుంటారు. రాజ్ కుమార్ రావ్ చివరికి తెగేసి చెబుతాడు, ఇక ఇది ఏ మాత్రం సాగదు, ఇకనించి మీరు అటూ, మేము ఇటూ వుందాము అని. ఎదురెదురు పోర్షన్లలో వాళ్ళు వెళ్ళిపోతారు. పిల్లలు వొకరిని వొకరు విడువకపోతే పెద్ద వాళ్ళు బలవంతంగా లాక్కుని వెళ్తారు.
చెప్పబడిన విషయం మనకు మొదటి సీన్ నుంచీ తెలిసిన విషయమని అర్థమై పోతుంది. అయితే కొత్తగా ఎలా చెప్పాడు అన్నది మనం చూడాల్సింది. సంభాషణలు చాలా అంటే చాలా స్వల్పం. ప్రతీదీ దృశ్యపరంగానే చెప్పబడింది. ఆ మిజాన్సెన్ లు బాగున్నాయి. మనం వాడటం మానేసిన బ్లాక్ ఔట్- బ్లాక్ ఇన్ లు మళ్ళీ ఇందులో చూస్తాము. ఒక పధ్ధతి ప్రకారంగా ఇరువర్గాల మధ్య వున్న ఘర్షణల తీవ్రత పెరుగుతూ వున్నప్పుడు, ఆ స్థాయీ భేదాల మధ్య punctuation marks లా. ఆ టేబల్ సీన్ లో డబ్బు, సొమ్ములూ కాకుండా పిల్లవాడి పుస్తకాలు కూడా పెడతారు. అంటే భవిషత్ తరం విద్య, interests, అక్కర, భవిష్యత్తు లు కూడా పణంగా పెట్టడం అన్నట్టు.
ఇందులో నటన, సంగీతం అంత గొప్పగా ఆకర్షించవు. కారణం కథ మొత్తంగా చెప్పే బాధ్యత దర్శకుడు విక్రం గుప్తా, అతని DOP తీసుకున్నారు. విక్రం గుప్తా “మై హూఁ న”, “గదర్” లాంటి చిత్రాలకు సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా చేసాడు. Man’s world అనే టీవీ మినీ సెరీస్ చేసాడు.
ఇది చూస్తుంటే నాకు నార్మన్ మెక్లారెన్ తీసిన “నైబర్స్” అన్న లఘు చిత్రం గుర్తొచ్చింది. అది మనుషులు నటించినా ఒక కార్టూన్ చిత్రం లా వుండి, నవ్విస్తూ ఏడిపిస్తుంది. ఇదే అంశం : మనమూ-వాళ్ళూ. వీలైతే అది కూడా చూడండి.
ఈ చిత్రం యూట్యూబ్ లో వుంది. చూడండి.
లింక్:
https://youtu.be/UiOkXTFk_iA