Site icon Sanchika

ఊతం

[dropcap]వా[/dropcap]తావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అవంతిక రద్దీ ఏమాత్రమూ లేని తార్రోడ్డుమీద మెల్లగా పోనిస్తోంది కారుని. తెరచి ఉంచిన కిటికీలోంచి  చల్లగా గాలి తగులుతుంటే తనూ, అమ్మా, నాన్నా తన చిన్నప్పుడు ఎన్నోసార్లు ఆ రోడ్డుమీద ఆటోల్లో చేసిన ప్రయాణాలు గుర్తుకొస్తున్నాయి ఆవిడకి.

చిన్న పట్టణం కొత్తపేట. అక్కడ హైస్కూల్లో లెక్కల మాస్టారు నాన్నగారు, హిందీ టీచరు అమ్మ. తన చదువంతా ఆ స్కూల్లోనే జరిగింది. ఇంటరయ్యాక ఎమ్‌సెట్ పరీక్ష రాసి రాజమండ్రిలోని ఇంజనీరింగ్ కాలేజిలో చదివి, ఆ కాలేజిలోనే ఉద్యోగాన్ని కూడా సంపాదించింది తెలివైన అవంతిక. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే  తన పెళ్ళి బదిలీల బాదరబందీల్లేని బాలాజీతో చాలా యాదృచ్ఛికంగా జరిగిపోయింది. బాలాజీ రాజమండ్రిలోనే ఓఎన్‌జీసీ కి కాంట్రాక్టుగా పనిచేసే ఒక జర్మన్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అత్తమామలు ఇద్దరూ పెద్ద ఉద్యోగాలే చేస్తున్నారు తమ పెళ్ళినాటికి. మామ గారు కర్నూలులో ఏదో ప్రోజెక్టులో చీఫ్ ఇంజనీరుగా పనిచేసేవారు. తరువాత ఏడాదే ఆయన రిటైరైపోయారు. అత్తగారు మహిళా కళాశాల్లో లెక్చరరుగా కర్నూల్లోనే ఉండేవారు. వాళ్ళిద్దరూ గవర్నమెంటు రూలు ప్రకారం ఎప్పుడూ ఒక్క ఊరిలోనే పనిచేసేవారు. వాళ్ళకి బాలాజీ కంటే పెద్దవాడైన మరో కొడుకూ ఉన్నాడు. అతను విజయవాడలో డాక్టరుగా ప్రాక్టీసు పెట్టాడు. అత్తమామలిద్దరూ మంచి సరదా మనుషులు.  బాలాజీకి, తనకి కలిపి పెద్ద మొత్తమే వచ్చేది నెలకి.  మొత్తం మీద ఆర్థికంగా స్థితిపరుల కుటుంబమేనని చెప్పొచ్చు తమది.  తమ పెళ్ళైన మూడేళ్ళకి కవల కొడుకులు ప్రహ్లాద్, ఆహ్లాద్ పుట్టారు. ఈ మధ్యకాలం లోనే తన తల్లిదండ్రులు, అత్తగారూ అందరూ రెటైరైపోయారు. అత్తమామలిద్దరూ రాజమండ్రి వచ్చేసి తమదగ్గరే ఉండడం మొదలుపెట్టారు.

అవంతికకి అక్కడే ఒక సమస్య వచ్చిపడింది. తన అమ్మానాన్నలకి తానొక్కర్తే సంతానం. వాళ్ళిద్దరూ రెటైరైపోయాక  తనదగ్గరే వారిని ఉంచుకోవాలన్నది ఆమె అభిప్రాయం. ఆ సంగతే వారికి చెబితే ముందు ఒద్దన్నా, ఆమె బలవంతం చేస్తూండడంతో ఆమె అత్తమామలని అడిగి చూడమన్నారు.

“ఇంట్లో ఇప్పటికే ఆరుగురం ఉన్నాం. మరో ఇద్దరు కూడా వస్తే ఇరుకైపోవడంతో పాటు కొత్త సమస్యలేవైనా రావచ్చు. ఐనా, కొత్తపేట ఇక్కడికి ఎంత దూరం కనక?  కారెక్కితే అరగంట ప్రయాణం! నువ్వే నీకిష్టమైనప్పుడు వెళ్ళి చూసి వస్తూండు. నువ్వు వాళ్ళకి ధన సహాయం చేసినా కూడా మాకేం అభ్యంతరం లేదమ్మా. ఇక్కడికి వాళ్ళొస్తే లేనిపోని సమస్యలన్నీ వస్తాయి”

అత్తగారు మరో మాటలేకుండా తెగేసి చెప్పేసారు. అవంతికకి కష్టం వేసింది ఆ మాటకి. పెద్దకొడుకు ఉండగా అత్తమామలు తమ వద్దే ఉండడం మింగుడు పడని అవంతికకి బాలాజీ కూడా తల్లిదండ్రులు తనవద్ద నుండడమే తనకీ, అన్నయ్యకీ సమ్మతమని చెప్పేసాడు.

అప్పటినించి అవంతికే రెండువారాలకో సారి వెళ్ళి తల్లిదండ్రులని చూసి వస్తూండేది. వారికి పెద్దగా అవసరం లేకపోయినా తృణమో పణమో వారికి ఇస్తూండేది.  వారిద్దరూ వార్ధక్యంలో ఒంటరులైపోయి ఉన్నారని బాధ పడుతుండేది.  తల్లి ఆరోగ్యం గురించి కలత. ఏదైనా సమస్య వస్తే తండ్రి ఒక్కడూ తాము వెళ్ళేదాకా ఇబ్బంది పడతాడని ఆందోళన. పోనీ రాజమండ్రే వచ్చేసి తమకి దగ్గర్లోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉండమంటే వారికి ఆ సలహా నచ్చలేదు.

ఆరోజు ఆదివారం కావడంతో పిల్లలిద్దరినీ తీసుకొని తెల్లారేసరికి కొత్తపేట వెళ్ళింది. కారులో కేరింతలు కొడుతూ పిల్లలిద్దరూ ఆనందంగా గడిపారు.  తనూ చిన్నప్పుడు ఆటోలో తల్లి ఒడిలో కూర్చొని అలాగే పాటలు పాడుతూ ప్రయాణించేది. మధ్యాహ్నం భోజనం అయ్యాకా ఒక గంటసేపు అమ్మానాన్నలతో కబుర్లు చెప్పి, ఎప్పటిలాగే బరువెక్కిన గుండెలతో తిరుగు ప్రయాణమయింది అవంతిక. రావులపాలెం దాటి మూలస్థానం వంతెన  దగ్గరకొచ్చాకా ఒక చోట మంచి మంచి సీతాఫలాలు ఒక వ్యక్తి అమ్ముతున్నాడు. చూడగానే అవంతికకి నాన్నగారికి అవెంత ఇష్టమో గుర్తొచ్చింది. కాని, కొంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇవ్వాలి.  కారాపి, కొంత ఆలోచించి, బుట్టెడు పళ్ళు తల్లిదండ్రులకీ, మరో బుట్టెడు తమకీ కొని, కారుని వెనక్కి తిప్పింది.

అరగంట తిరక్కుండానే కొత్తపేట చేరుకుంది. ఇంటిముందు కారాపుతూనే అక్కడ చాలా మంది చెప్పులు విప్పి ఉండడాన్నీ, కొన్ని సైకిళ్ళు, స్కూటర్లు ఆగి ఉండడాన్ని చూసిన  అవంతిక గుండె గుభిల్లుమంది. ఏమైందోనని ఆందోళన పడుతూ గబగబా లోపలికెళ్ళింది. లోపల చాలామంది ఉన్నారు. ఇద్దరు ముగ్గురు తనకి తెలిసిన వారూ ఉన్నారు వారిలో. వారి మధ్య కూర్చొని ఉన్నారు అమ్మా నాన్నా!  నవ్వుతూ మాట్లాడుతున్నారు వచ్చిన వారితో! అమ్మయ్య అని సవ్యంగా ఊపిరి పీల్చుకుంది అవంతిక.

“అమ్మలూ,  ఏమయిందిరా! మళ్ళీ వచ్చేసావేం? ఏదైనా మర్చిపోయావా?”

తండ్రి ఆత్రంగా అడిగాడు.

“లేదు నాన్నగారూ. మీకిష్టమైనవి దార్లో కనిపిస్తే కొనుక్కొ చ్చానంతే”

అవంతిక కొడుకులిద్దరూ ఆపసోపాలు పడుతూ పళ్ళబుట్టని లోపలికి మోసుకొచ్చారు. అవంతిక గబగబా వంటింట్లోకి వెళ్ళి తల్లిని గట్టిగా కేకవేసి పిలిచింది.

“అమ్మా! నాన్నగారికి ఇష్టమని మంచి సీతాఫలాలు కనిపిస్తే కొనేసాను. ఇచ్చిపోదామని వచ్చాను. కానీ, ఏం చేస్తున్నారు మీరు? ఈ మీటింగేమిటి? ఎంత గాభరా పడ్డానో తెలుసా, ఇందరిని చూసి ఏమైందోనని! ఏం జరుగుతోంది? ఇందాకా నేను వెళ్ళేటప్పుడు లేని హడావుడంతా ఏంటిప్పుడు?”

గబగబా అవంతిక అడిగేస్తోంది, తల్లి ఇచ్చిన మంచినీళ్ళు తాగుతూ.  అప్పుడే ఆ గదిలోకి వచ్చిన తండ్రి అన్నాడు, కూతురి గాభరా చూసి, ప్రశ్నలని విని:

“అమ్మా, మేమంతా రిటైరైపోయిన వాళ్ళమే. నీకు సుబ్బారావు మాస్టారూ, భీమయ్య మాస్టారూ, ఆంజనేయులు గారూ తెలుసు కదా! అందరం ప్రస్తుతం ఒకే పడవలో ప్రయాణంచేస్తున్న వాళ్ళం. అందరి పిల్లలూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు రెక్కలొచ్చి.  మేము వారితో వెళ్ళలేక ఇక్కడే మిగిలిపోయాం. పిల్లల్నే తల్చుకుంటూ, పలకరిస్తున్న రోగాలతో డీలా పడిపోయేకంటే, అందరం ప్రతివారం ఒకరింట్లో ఇలా కలుసుకొని కష్టసుఖాలు పంచుకొని ఏవో తినుబండారాలు తినుకుంటూ కొంతసేపు సరదాగా కాలక్షేపం చేద్దామని తీర్మానించుకున్నాం. మాలాంటి వారే మరికొందరు కూడా కలిశారిందులో.  మాలో ఎవరికైనా అనారోగ్యం చేస్తే మిగతావారంతా వచ్చి సహాయ పడతారు. ఒకరికొకరు ఊతంగా నిలుస్తారు. ఈ వారం పార్టీ మన వంతు. మేమంతా ఒకరికి ఒకరం తోడునీడగా, సహాయపడుతూ ఒక జట్టుగా ఉంటామమ్మా!   మా గురించి మా పిల్లలు ఆందోళన పడనక్కరలేని విధానం ఇది. అందరి పిల్లల ఫోన్‌ నెంబర్లూ అందరికీ సర్క్యులేట్ చేసుకున్నాం. అత్యవసరమైతే సమాచారం తెలపడానికి! ఇది మొదలుపెట్టి రెండు వారాలే అయిందమ్మా. నీకు ఇందాకా నీకు చెబుదామనుకుంటూనే మాటల్లో పడి మర్చిపోయాను”

తల్లి వంటింట్లో పని హడావిడిలో పడిపోయింది, మరో ఇద్దరి సాయంతో.

తమ సంక్షేమాన్ని తామే చూసుకుంటున్న ఆ పార్వతీ పరమేశ్వరులందరికి నమస్కరించుకుంటూ,  సెలవు తీసుకొని, పిల్లల్తో బయటికి నడిచింది అవంతిక, తేలిక పడిన మనసుతో!

Exit mobile version