కాజాల్లాంటి బాజాలు-26: ఉట్టినే అన్నారా!

2
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]పొ[/dropcap]ద్దున్న పదిగంటలయింది. ఆఫీసులకీ, కాలేజీలకీ వెళ్ళేవాళ్ళు వెళ్ళగా మిగిలిపోయిన పని ఇంకా పూర్తికానేలేదు, ఇంతలో

‘స్వర్ణా, నువ్వు వెంటనే బయల్దేరి మా కాలనీలో ఉన్న పోలీస్ స్టేషన్‌కి వచ్చెయ్యి..’ అంటూ వదిన ఫోన్ చేసింది.

‘ఏమైంది వదినా..’ అంటుండగానే ‘నల్లిబాబాయిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చేరు. నువ్వు తొందరగా బయల్దేరి వచ్చెయ్యి’ అంది. నాకు కాళ్ళూచేతులూ ఆడలేదు.

నల్లిబాబాయి మాకు చుట్టమేవీకాదు. ఊళ్ళో అందరూ ఒక కుటుంబంలా ఉంటూ వరసలు పెట్టి పిలుచుకుంటారు కనక బాబాయ్ అని పిలిచేవాళ్ళం. అందులోనూ ప్రతివాళ్లతోనూ దెబ్బలాట పెట్టుకుని నల్లిలా కుడుతూ సతాయిస్తూ ఉంటాడని నల్లిబాబాయి అనే పేరు ఆయనకి ఊళ్ళో స్థిరపడిపోయింది.

ఊళ్ళలో అంతే. ఎవరో ఒకరి ప్రత్యేకతని గమనిస్తారు. దానిని వేళాకోళంగా మారుస్తూ వాళ్ళకి పేర్లు పెట్టేస్తుంటారు. సాధారణంగా గుండ్రటి మొహం ఉన్న అమ్మాయికి ఇత్తడిసుబ్బి అనీ, పొడుగుమొహం ఉన్న అమ్మాయికి కర్రిమొహంది అనీ, అస్తమానం పెడమొహం పెట్టుకు తిరిగేవాళ్లని పెడపొయ్యనీ, ఎవరి పొడా గిట్టనివాళ్లని పొట్లపాదనీ, పొడుగ్గా ఉంటే తాటిచెట్టనీ, పొట్టిగా ఉంటే గూటం అనీ, లావుగా ఉంటే రుబ్బురోలనీ, మొహం ధుమధుమలాడించుకుంటూ ఉండేవారిని కొరివి అనీ, పళ్ళు కనిపిస్తూ నవ్వుతుండేవాళ్లని పళ్ళదెయ్యం అనీ ఇలా ఎవరో ఒకరు ఒక పేరు పెట్టేస్తారు. దాంతో అందరూ ఆ పేరుతోనే వాళ్లని పిలుస్తుంటారు. ఆఖరికి పాపం వాళ్ళు కూడా దానికే అలవాటు పడిపోయి అలా పిలవకపోతే వాళ్లని కాదనుకుంటారు.

అలాగే మొన్నామధ్య ఊర్నించి ఫోనొస్తే “ఎవరూ!” అనడిగేను. “నేనూ, సుందర్రావుని..” అని వినిపిస్తే సుందర్రావెవరా అని ఆలోచిస్తుంటే, “నేనూ ఎర్రకోతిని..” అని వినిపించింది. మా చుట్టాల్లో ఇద్దరు కోతులున్నారు. ఒకరు నల్లకోతీ, ఇంకోరు ఎర్రకోతీనూ. ఇద్దరూ కూడా ఊళ్ళొ ఎప్పుడూ వీధుల్లో నడిచేవారు కాదు. ఎంతసేపూ అందరి పెరట్లోని చెట్లమీదా ఉండేవారు. జామకాయిని పండనిచ్చేవారుకాదు. మామిడిపిందెని ముదరనిచ్చేవారు కాదు. ఏదైనా పాదుని పందిరెక్కిస్తే ఆ పందిరి పీకి పడేసేదాకా వీళ్ళకి తోచేదికాదు. అందుకే ఊళ్ళోవాళ్లందరూ వీళ్ళ కోతి చేష్టలకి కోతులని పేరెట్టేరు. అందులో ఒకడు నల్లగానూ, ఇంకోడు తెల్లగానూ ఉంటారు కనక నల్లకోతీ, ఎర్రకోతీ అనేవాళ్ళు. వాడలా అన్నాక అప్పుడు వెలిగింది నాకు ట్యూబ్‍లైటు.

అలాగే ఈ నల్లిబాబాయి కూడా. అస్తమానం ఎవర్నో ఒకర్ని కుడుతూ ఉండడమే అతని పని, అంటే ఎవర్నో ఒకర్ని ఏదో ఒకటని బాధపెట్టడం, ఏడిపించడం ఈయన స్వభావం. ఊళ్ళోవాళ్లయితే ఏదో ఆ కాసేపూ పడి, లేకపోతే చేతనైతే ఇంకో నాలుగు మాటలని వెడుతుంటారు. కానీ పాపం మా పిన్ని మటుకు తాళి కట్టించుకున్న పాపానికి రోజులో ఇరవైనాలుగ్గంటలూ ఆయన సూటీపోటీమాటలు భరిస్తూనే ఉండేది. ఏమీ అనేదికాదు. ఒక్కొక్కసారి ఆ మాటలు హద్దుమీరి పిచ్చితిట్లలోకి కూడా వెళ్ళిపోయేవి. కానీ పిన్ని మటుకు ఒకసారి చీరకొంగు దులిపేసుకుని, దాంతో మొహం తుడిచేసుకుని, తనలోని భావాలు పైకి కనిపించనిచ్చేదికాదు.

బాబాయి నల్లిలా అలా కుడుతుంటే, మొహం తుడిచేసుకుని వెడుతున్న పిన్నిని చూసి నాకూ, వదినకీ ఆవేశంలాంటిది వచ్చేసేది. ‘అన్ని మాటలంటుంటే నువ్వెందుకు ఊరుకుంటావు పిన్నీ, నువ్వూ బాబాయిని అనొచ్చుగా..’ అనేవాళ్లం మేం.

‘పోనిద్దూ, ఏదో తోచక కాసేపు అరుస్తారంతే. ఎన్నాళ్లరుస్తారు. నోరు నెప్పెట్టి ఆయనే ఊరుకుంటారు. వాదిస్తే నాక్కూడా తలనెప్పేకదా!’ అనేది. ఎంతయినా మొహమ్మీద ‘నువ్వో పిచ్చిమాలోకానివి, నీకేం తెలీదు, నీమొహం మండ, నా ఖర్మకాలి నిన్ను చేసుకున్నాను, నీకు తిండి పెట్టేబదులు ఆ పాకలో గేదెకి గడ్డేస్తే ఇన్ని పాలైనా ఇస్తుందీ..’ అంటూ అస్తమానం ఏదోకటి సణుగుతుంటే అలా నిమ్మకి నీరెత్తినట్టున్న పిన్నిని చూసి ఆవిడకి “మహాతల్లి” అని పేరెట్టుకున్నాం నేనూ వదిన.

ఇప్పుడిలా బాబాయి పోలిస్ స్టేషన్ లో ఉన్నాడంటే పాపం ఆ మహాతల్లి ఎలా ఓర్చుకుంటోందో అనుకుంటూ పోలీ స్టేషన్‌కి పరిగెట్టేను.

నేను పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేసరికి ఇనస్పెక్టర్ ఎదురుగా కుర్చీల్లో వదినా, మహాతల్లీ కూర్చుని ఉన్నారు. ఆ మహాతల్లి మొహంలో ఎప్పుడూ చూడని ఏదో వింతకాంతి. ఆ పక్కనున్న బెంచీ మీద నల్లిబాబాయి బెదురుచూపులు చూస్తూ బిక్కమొహం వేసుకుని కూర్చున్నాడు. అరుగుమీద కూర్చుని వచ్చేపోయేవాళ్లని అరిచి, పిలిచి, వాళ్లకి పేర్లు పెట్టి తిడుతూ కుట్టే బాబయ్యని అలా చూస్తుంటే నాకు ఏమిటోగా అనిపించింది.

నేను వెళ్ళగానే వదిన, ‘రా రా, నీ కోసవే చూస్తున్నాం. ఇదిగో ఇక్కడ సంతకం పెట్టు.’ అంటూ ఓ కాగితం నా ముందుకు తోసింది. సంతకమా.. అసలు అదేం కాగితం.. దేని గురించి అన్నట్టు చూసేను.

ఇనస్పెక్టర్ నావైపు చూస్తూ, ‘ఈవిడ ఆయన మీద గృహహింస కేసు పెట్టేరు. అందుకని ఆయనని అరెస్టు చేసి తీసుకొచ్చేం. కానీ ఇప్పుడీవిడ దానిని వెనక్కి తీసుకుందామనుకుంటున్నారు. అందుకని ఇద్దరికీ కౌన్సిలింగ్ లాంటిది చేసి, ఇద్దరిమధ్యా కొన్ని ఒప్పందాల్లాంటివి రాసేం. ఆ కాగితం మీద ఆ భార్యాభర్తలిద్దరితోపాటు ఇంకో ఇద్దరు సంతకం పెడితే బాగుంటుందని మీ ఇద్దరినీ అడుగుతున్నాం.’ అంటూ నన్నూ వదిననీ చూపించేడు.

నాకు గుండాగినంత పనైంది. పిన్ని, బాబయ్యల పెళ్లయి పాతికేళ్ళు దాటుతోంది. ఇన్నాళ్ళూ బాబయ్య తిట్లకి చీరకొంగు విదిలించి మొహం తుడిచెసుకునే మహాతల్లి ఏకంగా పోలీస్ స్టేషన్ కొచ్చి గృహహింస కేసు పెట్టిందంటే నాకు నమ్మబుధ్ధవలేదు.

మా ఇద్దరి ఎదురుకుండా ఇనస్పెక్టర్ పిన్నికీ, బాబయ్యకీ కొన్ని సూచనలు ఇచ్చేడు.

ఇంకెప్పుడూ బాబయ్య పిన్నిని భౌతికంగా కానీ, మానసికంగా కానీ హింసించరాదనీ, వారాని కొకసారి పోలీస్‌ని వాళ్ళింటికి పంపుతుంటాననీ, ఏమాత్రం బాబయ్య పిన్ని మీద అధికారం చూపించినట్టు తెలిసినా వెంటనే తీసుకొచ్చి లోపల పడేస్తాననీ బాబయ్యకి చెప్పేడు.

అలాగే పిన్నికి చాలా ధైర్యం చెప్పేడు. పోలీసులంటే మహిళలకి సోదరులవంటివారనీ, ఏ మహిళ గృహహింసకి లోనవుతున్నట్టు తెలిసినా ఊరుకోరనీ, వాళ్ళ చెమడాలు ఎక్కదీస్తారనీ, ఎప్పటికప్పుడు బాబయ్య ప్రవర్తనలో ఏమాత్రం తేడా కనిపించినా తనకి ఒక్క ఫోన్ చేస్తే చాలనీ, ఆఘమేఘాలమీద ఊళ్ళో వాలిపోయి, బాబయ్యని లోపల పడేస్తాననీ చెప్పేడు.

ఈ మాటలన్నీ నల్లిబాబయ్య బిక్కచచ్చిపోయి, బెదురుచూపులు చూస్తూ వింటుంటే, మొహమంతా ఆనందం వెల్లివిరుస్తుంటే, పెద్ద పెద్ద కళ్ళని మరింత విప్పార్చుకుని మైమర్చిపోయి వింటోంది మహాతల్లి.

సంతకం పెట్టవలసిన కాగితాలని మా ముందుకు జరిపాడు ఇనస్పెక్టర్. బాబయ్య మావైపు ఆత్రంగా చూస్తున్నాడు. ఆ కాగితాలని పట్టుకుని అలా చదువుతూ కూర్చుంది మహాతల్లి. ఎప్పటికీ ఆ చదవడం అవదూ. నాలుగు పేజీలున్న ఆ కాగితాలని ముందునుంచి చివరికీ, చివర్నించి ముందుకీ తిప్పి తిప్పి చూస్తోంది. ఆవిడకి పెన్ను అందిస్తున్న ఇనస్పెక్టర్ ఆ మహాతల్లి ఆ కాగితాలని అంత శ్రధ్ధగా చదవడం చూసి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు.

పదినిమిషాలయింది. పావుగంటయింది. మహాతల్లి ఎంతో ఏకాగ్రతతో ఆ కాగితాల్లో రాసినవి చదువుతోంది. ఉరిశిక్ష పడబోయే ఖైదీలా ఉన్న నల్లిబాబాయి మొహం చూడ్డానికి నాకు భయమేసింది. తీర్పు చెప్పబోతున్న జడ్జిలా ఉన్న మహాతల్లిని చూస్తుంటే గుండె దడదడలాడింది.

అంత జాగ్రత్తగా చదువుతున్న మహాతల్లిని చూసి ఇనస్పెక్టర్ ‘ఇంకా ఏమైనా చెప్పాలా అమ్మా!’ అనడిగేడు.

మహాతల్లి ఆ కాగితాలు ఇనస్పెక్టర్‌కి అందిస్తూ, ‘అవునండీ. నేను ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా, ఎప్పుడొచ్చినా ఆ మనిషి నన్నేం అనకూడదు. అది కూడా రాయండి’ అంది అధికారికంగా. ఆ మాటలకి నేనూ వదినా తెల్లబోయాం. ఎప్పుడూ ‘మీ బాబయ్యగారు..’ అంటూ నల్లిబాబాయిని సంబోధించే మహాతల్లి ఇలా అంటోందేమిటా అనుకుంటుండగానే ఆ ఇనస్పెక్టర్, ‘అలాగేనండమ్మా. మీ ప్రాథమిక హక్కులకి ఆయన ఏమాత్రం భంగం కలిగించినా పరిణామం తీవ్రంగా ఉంటుందని రాస్తాను’ అంటూ గబగబా అది కూడా దానిలో చేర్చేడు. నాకు నల్లిబాబాయి మొహం చూడ్డానికి భయమేసింది.

మరోసారి అందులో విషయాలన్నీ చదివి మహాతల్లి సంతకం పెట్టింది. తర్వాత నేనూ, వదినా కూడా వాటి మీద సంతకాలు పెట్టేం.

అవన్నీ తీసుకుని ఇనస్పెక్టర్ నల్లిబాబాయిని మరోసారి హెచ్చరించి అందర్నీ పంపేసేడు. వెడుతూ వెడుతూ మహాతల్లి వదిన చేతులు పట్టుకుని, ‘నీ సాయం జన్మజన్మలకీ మరవలేను.’ అంది.

నల్లిబాబాయినీ, మహాతల్లినీ కారెక్కించి ఊరు పంపేసేక ఈ ఉపద్రవానికి కారణమేంటని వదిన నడిగేను. అప్పుడు అసలు జరిగిన విషయం వదిన చెప్పింది. ముందురోజు వదిన వాళ్ళ చుట్టాలింట్లో పెళ్ళికెళ్ళి వస్తూ దారే కదాని మా ఊరివైపు వెళ్ళిందిట. అప్పుడే తెలతెలవారుతోందిట. కాలవగట్టు పక్కనించి వస్తుంటే ఎవరో ఒకావిడ కాలవ మధ్యలోకి వెళ్ళడం లీలగా చూసిందిట. అప్పుడే కాలవలోకి కొత్తనీరు ఉధృతంగా వస్తోంది. ఈవిడెవరో పాపం అనుకుంటూ వదిన కాబ్ డ్రైవర్ సాయంతో గబగబా వెళ్ళి ఆవిడని వెనక్కి తెచ్చిందిట. తీరా చూస్తే ఆవిడ మహాతల్లే. వదిన్ని చూడగానే ఆవిడ ఇంక దుఃఖం ఆపుకోలేక విషయం వదినకి చెప్పిందిట. పిన్నికి అసలు ఏడుపంటే అసహ్యంట. నానాతిట్లూ తిట్టి ఆవిడ ఏడిస్తే చూడాలని నల్లిబాబాయి కోరికట. ఆయనకి ఆ అవకాశం ఇవ్వకుండా ఈవిడ చీరకొంగు దులిపేసుకుని మొహం తుడుచుకున్నట్టు చేసి బాబాయికి ఆ అవకాశం ఇచ్చేదికాదుట. అది చూసి నల్లిబాబాయి మరీ విజృంభించేవాడుట. కానీ, ఎన్నేళ్లని ఆవిడ మటుకు భరించగలదూ! అందుకని పొద్దున్నే మంచినీళ్లకోసమన్నట్టు కాలవకొచ్చి, అందులో మునిగి చచ్చిపోదామనుకుందిట.

విషయం విన్న వదినకి ఆవేశం వచ్చేసిందిట. ఇప్పుడు వాళ్ల కాలనీలో ఉన్న ఇనస్పెక్టర్ వదినకి కజిన్ అవుతాడుట. అతనితో మాట్లాడి నల్లిబాబాయిని కాస్త భయపెట్టమని చెప్పిందిట. ఆయనే ఈ అరెస్టు నాటకమంతా ఆడేడుట. లేకపోతే ఎక్కడో ఊళ్ళో ఉన్న నల్లిబాబాయిని ఇక్కడెవరైనా అరెస్టు చేస్తారా! బాబాయికి ఇవన్నీ తెలీవు కనక గృహహింస కేసుకింద పోలీసులు అరెస్టు చేసేరనగానే హడిలిపోయేడుట.

విషయమంతా చెప్పేక వదినంటుందీ, ‘అవును స్వర్ణా, ఇక్కడ నాకోటి అర్థం కావటం లేదూ. చచ్చిపోదామనుకున్న మహాతల్లి మనం బాబాయిని భయపెట్టేక మాట్లాడకుండా ఆయనతో వెళ్ళిపోకుండా ఏదో ఘనవిజయం సాధించినట్టు ఎన్ని షరతులు పెట్టిందో చూడూ. వెలిగిపోతున్న మహాతల్లి మొహం చూస్తుంటే నీకేమీ అనిపించలేదూ!’ అంది.

అనిపించకపోవడమేం ఖర్మ.. తర్వాత అనుభవం కూడా అయింది. అప్పట్నించి ఎప్పుడు ఊరెళ్ళినా ఆ ఎత్తరుగుల ఇంటిముందు నల్లిబాబాయి స్తంభాన్నానుకుని తలొంచుకుని కూర్చుని జంధ్యాలు వడుక్కుంటూ ఏవో గొణుక్కుంటూ కనిపించేవాడు.

లోపల్నించి మహాతల్లి కంచుకంఠంతో నాలుగు వీధులకి వినపడేలా ‘ఏ పనీ రాదు కానీ పూట పూటా కుంభాలు కుంభాలు చెల్లించడం మటుకు వస్తుంది. పెద్దలిచ్చిన ఆస్తి ఎన్నాళ్ళొస్తుందీ. కూర్చుని తింటే కొండలు తరుగుతాయి. అబ్బే, ఈ జడ్డిమనిషికి ఏవైనా పడితేనా! ఎప్పుడు ముద్ద పడేస్తుందా.. ఎప్పుడు కడుపులో పడేద్దామా అనే ధ్యాసే అస్తమానం. దరిద్రుడికి ఆకలెక్కువని ఊరికే అన్నారా!’ అంటూ అరిచేది.

అందుకే మనవాళ్ళు ‘చేసుకున్నవాళ్లకి చేసుకున్నంత మహదేవా..’ అని ఉట్టినే అన్నారా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here