రంగుల హేల 31: వాదోపవాదాల వాగ్ధూళి

7
2

[box type=’note’ fontsize=’16’] “స్వీయలోపమెరుగుట పెద్ద విద్య అంటారు. అలా నాదే తప్పేమో అని ఎవరికి వారు ఒక్క క్షణం ముందుకు వస్తే ఎంత బావుంటుందో!” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మిరంగుల హేల” కాలమ్‌లో. [/box]

[dropcap]ఈ[/dropcap] రోజుల్లో ప్రతివారూ తమ తమ వాదనలను ఇనుమడించిన ఉత్సాహంతో సూక్ష్మంగా వినిపించగలుగుతున్నారు లాయర్ అవసరం లేకుండానే. ఎవరికి వారే అత్యుత్తమ న్యాయవాది. అందులో న్యాయం అంతా స్వీయమే. ప్రతివారికీ బోలెడంత విజ్ఞానం అందుబాటులో ఉంది. తద్వారా తమ వాదనకు జిలుగు మెరుగులు పెట్టుకోగలుగుతున్నారు.

నేనొకసారి డిగ్రీ క్లాస్‌లో “అసలు చర్చలు ఎందుకు మాష్టారూ? ఎవరిష్టం వారిది, ఎవరి పాయింట్ వారిది కదా!” అనడిగాను. అప్పుడాయన “ఒక విషయం చర్చకు పెట్టినప్పుడే ఆ విషయం గురించి ఎవరికెంత తెలుసు? ఎవరికెంత తెలియదు? ఎవరెవరి అజ్ఞానం లేదా జ్ఞానం ఏ స్థాయిలో ఉన్నది అన్నది మనకీ ఎదుటివాళ్ళకీ కూడా తెలుస్తుంది” అన్నారు. అయితే ప్రతివాది మాట్లాడే మాటలు పూర్తిగా విని తగిన సమాధానం మన దగ్గర ఉందా? లేకపోతే ఎదుటివారితో ఏకీభవించాలా? అనే దిశగా ఆలోచిస్తే బానే ఉంటుంది కానీ లేనిపోని ఆత్మాభిమానానికి పోయి అహం దెబ్బతిన్నట్టు భావించి పరుష పదజాలానికి తెగబడితే అక్కడ డిబేట్ ఉద్దేశం నాశనం అవుతుంది. సామరస్యం పోతుంది. లేనిపోని తలనెప్పులు వస్తాయి. వినే చెవి, బుర్ర, ఆత్మ పరిశీలనా తత్వం ఉన్నవారితో అటువంటి చర్చలు ఫలవంతం అవుతాయి. అలాంటి వ్యక్తులు అరుదాతి అరుదుగా ఉంటారు. కాబట్టి ఇటువంటి రిస్కీ ప్రయోగాలు చేయకపోవడమే వంటికి మంచిది.

రాజకీయ పార్టీల వారి కయితే ఎల్లప్పుడూ మంచి ట్రైనింగ్ ఉంటుంది. అంచేత వారంతా కలలో కూడా ‘మా పార్టీ సిద్ధాంతమే మంచిది. మేము చేసే పనులే మంచివి. ఎదుటి పార్టీ దెప్పుడూ తప్పే’ అని వాదిస్తుంటారు. అర్ధరాత్రి లేపినా సరే. ఇదే రికార్డు తడబడకుండా కళ్ళు నులుముకుంటూ వేస్తారు. అలాంటి చక్క చక్కటి తర్ఫీదు పొందుతారు వాళ్ళు.

మనమయితే ఎవరన్నా ఏమన్నా అనగానే వందసార్లు ఆత్మవిమర్శకు కూర్చుని అతి సున్నితంగా ఫీల్ అయిపోయి బుర్ర తిరిగే వరకూ ఆలోచించి మనల్ని మనం బాధ పెట్టుకునయినా సరే మరోసారి అలా చెయ్యకూడదు అని ఒట్టు పెట్టేసుకుంటాం. వేడిపాలు తాగి నోరు కాల్చుకున్న పిల్లిలా పెరుగును కూడా ఊదుకుంటూ తాగుతాం. మనలా అందరూ ఉండాలనుకోవడం అత్యాశనుకోండి. మన విషయం పక్కకి పెడదాం.

ఇక పొతే కుటుంబంలో కూడా ఎన్నో పార్టీలుంటాయి. అన్నదమ్ములకు పడదు. ఒకరి మీద మరొకరికి బోలెడన్ని ఆరోపణలు. ఆ అసహనాగ్ని నిత్యం చెవిలో పదే పదే చెప్పే మాటల వల్ల మరింత వేడెక్కుతుంది తప్ప చల్లబడడం కష్టం. ఆ సోదరుల్ని ఇద్దర్నీ కూర్చోబెట్టి వారి వారి తప్పుల్ని తక్కెడలో వేసి తూచి ఎక్కువ తక్కువలు ఎవరు బేరీజు వెయ్యగలరు? స్వీయలోపమెరుగుట పెద్ద విద్య అంటారు. అలా నాదే తప్పేమో అని ఎవరికి వారు ఒక్క క్షణం ముందుకు వస్తే ఎంత బావుంటుందో! కానీ ఇది సత్యకాలం కాదు కలికాలం కాబట్టి అటువంటి పరిష్కారం అసంభవం.

అక్కచెల్లెళ్లకి సాధారణంగా పడకపోవడం అరుదు. కారణం అక్కడ ప్రేమలు చిక్కగా భేదాలు పల్చగా ఉంటాయి. తోడల్లుళ్ళకి అందులో పాత్ర ఇవ్వబడదు. అదీ చిదంబర రహస్యం. అయినా కూడా తగుదునమ్మా అని ఎవరైనా ప్రవేశిస్తే ఫూల్ అవ్వడం ఖాయం గనక వారు బుద్దిగా మౌనం పాటిస్తారు. తోడల్లుళ్లు తిట్టుకున్న, కొట్టుకున్న దాఖలాల్లేవు.

అయితే ఇంట్లో నిత్యం భార్యాభర్తల మధ్య చిరాకు పరాకుల వాగ్ ధూళి రేగుతూ ఉంటుంది. మధ్యలో ఎవరైనా తీర్పులివ్వడానికి ఉత్సాహపడితే వారి నెత్తిన సుత్తిదెబ్బలు పడతాయి ఎందుకంటే కలిసి జీవించవలసిన దంపతులు వారు కాబట్టి అక్కడ బోలెడన్ని రాజీ పత్రాల అగ్రిమెంట్ వ్యవహారాలు ఉంటాయి. అందువల్ల వారు మధ్యలో ఉన్నట్టుండి గబుక్కున తగ్గిపోతూ అన్యోన్యం ప్రాక్టీస్ చేస్తుంటారు. బ్యాలన్సు చెడినప్పుడు మళ్ళీ ధూళి కార్యక్రమం తప్పదు. ఈ వేదాంతం తెలుసు కాబట్టి చుట్టుపక్కల వారు చూసీ చూడనట్టు చూస్తూ, వినబడినా వినబడనట్టు నటిస్తుంటారు.

ఇక జాతీయ ఛానళ్లలో నిత్యం రాజకీయాల చర్చల్లో నిందారోపణల పర్వం దుమ్ము రేగుతూ నడుస్తుంటుంది. ఇంగ్లీష్ ఛానళ్లలో యాంకర్లు గుక్క తిప్పుకోకుండా ఇంగ్లీష్ ఎస్సే అప్పచెప్తున్నట్టు వాదనలు మొదలు పెడతారు. జవాబు చెప్పేవాణ్ణి చెప్పనివ్వకుండా నట్టుకుంటూ అడ్డం పడిపోతుంటారు. తెలుగు ఛానళ్లలో, పొద్దున్నే మనం బద్దకంగా సోఫాల్లో పడి కాఫీ తాగేటప్పుడు మన రాష్ట్ర పార్టీల నాయకులూ, ప్రతినిధులూ చక్కగా రెండు ప్లేట్ల టిఫిన్ తిని వచ్చి కూర్చుంటారు. యాంకర్ అందరినీ శుభోదయంతో ఆహ్వానించి రాత్రి వండి పెట్టిన ఒక వివాదాస్పద విషయం అనే నిప్పు మధ్యలో పెట్టి అన్ని పార్టీలవారినీ పుల్లలుగా పేర్చిఈ విషయం గురించి మీరేమంటారు? అంతేనంటారా? నిజమేనంటారా? అంటూ మంట రాజేసి నవ్వుతాడు. ఇంకా కోట్ సర్దుకుంటూ కాఫీ బ్రేకులు తీసుకుంటూ తన జీతానికి న్యాయం చేస్తూ ఉంటాడు. మంట తగ్గినట్టనిపిస్తే పొగ ఊది మళ్ళీ రాజేస్తాడు. కారప్పొడి ఇడ్లీలు తింటూ మనకీ కాలక్షేపం గానే ఉంటుంది.

టీవీ పగిలేంత గట్టిగా బహు పార్టీల ప్రతినిధుల వారు సర్రు సర్రున బాణాలు వేసుకుంటారు. అధికార పార్టీ వారు చిరునవ్వులతో మాట్లాడుతూ ఉంటే అది పోగొట్టుకున్న వారు ఉచ్చస్వరంతో అరుస్తూ ఉంటారు. ప్రజలకూ తెలుసు అదో వాలకం అని. అది నిత్యం జరిగే మెదడుకు మేత పెట్టే ఒక తమాషా. అయిదేళ్ల క్రితం మీరేం చేసారంటే, పదేళ్ల క్రితం మీ తండ్రిగారేం చేసారంటూ, పాతికేళ్ల క్రితం మీ పార్టీ తాతగారేం చేసారంటే అంతకు ముందు మీ ముత్తాత గారలా చేసింది గుర్తు లేదా అంటూ పొడుపు కథల్లా దెప్పుకుంటూ ఉదయ కాలక్షేపం జరుగుతుంది. అవుట్‌పుట్ ఏమీ ఉండదు. అలా నోరు నొప్పిపుట్టేవరకూ అరిచి, వాదించి సొమ్మసిల్లి కార్లో పడి ఇళ్ళకి పోతుంటారు ప్రాతినిధ్యశాల్తీలు. మనం పనుల్లో పడతాం. మన గ్రామాల్లో వీధి అరుగుమీద మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు ఇలాగే కాలక్షేపం చేస్తుండేవారు.

ఇకపోతే ఒకటో రెండో సీట్లున్న కొన్ని మేధావి పార్టీలుంటాయి.వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రజలను ఉద్ధరించే భాగ్యం వారికి ఎన్నడూ కలిగే అవకాశం లేదు కాబట్టి వారికి గొప్ప వెసులుబాటు ఉంటుంది. అదేంటంటే సదా అసాధ్యమైన ఆదర్శాలు వల్లిస్తూ అధికారంలో ఉన్నవారు ఏం చేసినా ఏడాది పొడుగునా విమర్శిస్తూ ఉండొచ్చు. అందులో గొప్ప హాయి ఉంటుంది కదా మరి! తప్పులెన్నుటలో ఉన్న సుఖ భోగం వేరు కదా! అదో అదృష్టం వారిది.

నిజానికి కోర్టుల్లో వాదోపవాదాలు ఎలా ఉంటాయో సామాన్యులకి తెలీవు. ‘సినిమాల్లోలా తప్పట్లు కొట్టేలా పంచ్ డైలాగులు ఏమీ ఉండవు. వాదనలు సీరియస్‌గా నడుస్తుంటాయి. పాయింట్లన్నీ అధికంగా కాగితాల మీదే ఉంటాయి. వాటిపై జడ్జి గారు తీసుకునే తీర్పు నిర్ణయం కూడా క్లిష్టంగా ఉంటుంది.’ అంటాడు మా అడ్వకేట్ మిత్రుడు.

సిటీలో రోడ్ మీద ఇద్దరు పక్క పక్కనే లేదా ఎదురుగానో వాహనాల మీద వెళుతుంటారు. ఒక పెద్ద ఆక్సిడెంట్ జరగబోయి అదృష్టవశాత్తూ ఆగిపోతుంది. వెంటనే తప్పులేని వాడు వెహికల్ దిగి పెద్ద గొంతుతో అరుస్తూ తప్పున్నవాడిని ‘ఇంట్లో చెప్పొచ్చేశావా?’ అంటూ తిట్లు అందుకుంటాడు. వెంటనే తప్పున్న వాడు అలెర్ట్ అయిపోయి ఎదుటివాడిదే తప్పని బుకాయిస్తూ అదే స్థాయిలో అరుస్తాడు. ఇలా తిట్ల వాదోపవాదాలు మొదలవుతాయి. ట్రాఫిక్ ఆగిపోయి మిగిలినవాళ్ళొచ్చి వీళ్ళను ‘జానేదో భై’ అంటూ వాళ్ళని సముదాయించాక, ఇద్దరూ చెరోదారినా పోతారు. ట్రాఫిక్ ధూళిలో ఇలాంటివి తరచూ కలుస్తుంటాయి.

స్త్రీ వాదులతో స్టేజీలపై వాదనలకు దిగే ధైర్యం చెయ్యకపోయినా కొందరు మేల్ మిత్రులు టీ తాగేటప్పుడేదో సన్నగా వాదించడం వినబడుతుంటుంది. ఫీమేల్ రెబెల్స్ ఓ చెవి వేసి ఏదో అనబోయేంతలో సీనియర్లు కళ్ళతోనే సైగ చెయ్యడంతో వాదనాగ్ని చల్లారిపోతుంటుంది. చర్చల్లో, వాదోపవాదాల్లో జ్ఞాన వివేకాల పంపిణీ జరగాలి కానీ అజ్ఞాన అవివేకాలు కాదు కదా! ఆవేశపడకుండా ఇరు వర్గాలవారూ ఒక సుహృద్భావ వాతావరణంలో సంయమనంతో ఇలాంటివి చర్చిస్తే బావుంటుంది తప్ప మనసుల్ని కష్ట పెట్టుకుంటే కష్టం కదా!

“వాగ్భూషణమే సుభూషణము, భూషణముల్ నశించు నన్నియున్” అన్న సుభాషితం మనం ఎప్పుడో మరిచిపోయాం. మన పని వచ్చినపుడు అరిచి కరవడం, మనది కానప్పుడు మౌనానంద స్వాముల వారిలా మిడిగుడ్లతో చూడడం ఇదేగా మనం చేసే పని! మంచి వాక్కుతో న్యాయం,ధర్మం అంటూ మాట్లాడితే మాత్రం ఎవరూరుకుంటారు లెండి? మన వీపుల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే కదా! ఏవంటారు?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here