[box type=’note’ fontsize=’16’] ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్రసాహిత్యం తృతీయ సంపుటం వాగ్దేవి వరివస్య (భాషా సాహిత్య వ్యాసాలు)కు – డా. కె లక్ష్మణచక్రవర్తి గారు రాసిన పీఠిక. [/box]
[dropcap]తె[/dropcap]లుగు సాహిత్య పరిశోధన గురించిన ప్రస్తావన ఎక్కడ వచ్చినా, ఏ విశ్వవిద్యాలయ ఆచార్యుడి దగ్గర వచ్చినా వెంటనే మనసులో మెదిలే పేరు ఆచార్య వెలుదండ నిత్యానందరావు. గత నాలుగు దశాబ్దాలుగా సాహిత్యరంగంలో, మూడు దశాబ్దాలుగా పరిశోధనసూచిలో నిమగ్నమైన, పరిశోధనతో తన జీవితాన్ని ముడివేసుకున్న వ్యక్తి వెలుదండ నిత్యానందరావు. ఏ అంశం మీద పరిశోధన జరిగిందని తెలుసుకోవాలనే జిజ్ఞాసువులు (ఇందులో అవసరం కొద్దీ జిజ్ఞాసువులు అయినవారు ఉంటారు) పర్యవేక్షకులు, పరిశోధకులు అయిన వారికి ఆకరం నిత్యానందుల వారు. వారిని నేను తొలిసారి చూసింది ‘ఆధునిక మహాకవులు- అందించిన వారసత్వం’ సాహిత్యసదస్సులో. (1996 మార్చి) అప్పటికే వారు యూనివర్సిటీ అధ్యాపకులు. నేను యూనివర్సిటీ విద్యార్థిని. నేను ఏ. వి. కళాశాల అధ్యాపకుడైన తర్వాత ఆ పరిచయం సాహిత్యాభిప్రాయాలు పంచుకునే స్నేహంగా మారింది. వారి వ్యాసాలు భాషా వరివస్య- సాహిత్య వరివస్య అన్న రెండు భాగాలు ఒక సంపుటంగా వెలువడుతున్న సందర్భంలో అందులోకి వెళ్లేందుకు నన్ను గడప కావలి (పీఠిక రాయమని) పెట్టడం ఆయనకు నాపై ఉన్న అభిమానమో, గౌరవమో, ఆప్యాయతో తెలియదు. దానికి కృతజ్ఞతలనో, వందనాలనో చెప్పకుండా, లోపలికి వెళ్లేందుకు దారి చూపే కావలి పని లోకి వెళుతూ మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తూ విషయంలోకి వెళ్తాను.
భాషా వరివస్య, సాహిత్య వరివస్య అన్న విభజనలో ఒకటి భాషా కేంద్రితం. రెండు సాహిత్య కేంద్రితం. అయితే భాషా వరివస్యలో తెలుగువారు సంస్కృతం, తమిళం, ఉర్దూ, ఒరియా వంటి భారత దేశ భాషలకు చేసిన సేవలను చెప్పడంలో సాహిత్య సేవ ప్రధానమైనది కానీ భాషా సేవ కాదు. ఇక్కడ ఆ భాషా సాహిత్యాలకు చేసిన సేవ అని అర్థం చేసుకోవాలి. అంతే!. భాష, అనువాదం విషయంలో వ్రాసినవి భాషాభూమిక లోనివి. పాఠక సౌలభ్యం, సాహిత్య వ్యాసానికి కొంచెం భిన్నం అన్న కారణం చేత ఈ రెండు భాగాలుగా ఈ వ్యాసం సంపుటాన్ని వెలుదండ నిత్యానందరావు నిర్దేశించుకుని ఉంటారు. ఆ దృష్టితోనే పీఠిక కూడా నడిచిందని మనవి చేస్తూ ముందుకు వెళదాం.
భాషా వరివస్యలో మొత్తం 27 వ్యాసాలున్నాయి. అందులో తెలుగువారు ఇతర భాషలకు చేసిన సేవపై తొమ్మిది వ్యాసాలు, అనువాదంపై ఏడు వ్యాసాలు, భాషకు సంబంధించిన మరో ఏడు వ్యాసాలు, బ్రౌన్ సమకాలికుడైన పెద్దయ్య గురించి, బ్రౌన్ కాలేజీ గురించి, గుర్రం వెంకట సుబ్బరామయ్య గురించి రాసిన వ్యాసాలున్నాయి.
సంస్కృతం, ప్రాకృతం, హిందీ, తమిళం, ఉర్దూ, ఒరియా, కన్నడ భాషలకు తెలుగు వారు చేసిన సేవ; భారతీయ భాషలకు పాశ్చాత్యులు చేసిన సేవలను తెలియజేసే తొమ్మిది వ్యాసాలు సమాచారాత్మకమైనవి. ఇవి ఆయా భాషల్లో తెలుగు వారు చేసిన కృషిగా అర్థం చేసుకోవాలి. ఈ భాషా సేవ శీర్షికలోని వ్యాసాలు ఆ భాషలో తెలుగు వారు చేసిన స్వతంత్ర రచనలను పరస్పర అనువాదాలను పరిచయం చేసేవి. ప్రాకృత భాషా సేవ కేవలం గాథాసప్తశతి కేంద్రంగా కొనసాగింది. ఈ భాషాసేవకు సంబంధించిన వ్యాసాలన్నీ వెలుదండవారు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిగా ఉన్నప్పుడే రాయడం గమనార్హం. ఈ వ్యాసాలలోని సమాచారం, అంశాలను గమనించినప్పుడు ఆయా విషయాలపై పరిశోధనలు జరగవలసిన అవసరాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఇప్పటికీ ఈ అంశాలపై పరిశోధనలు రాలేదు. ఈ వ్యాసాలను రాసేనాటికి నిత్యానందరావుకు డిగ్రీ కూడా పూర్తి కాకపోవడం గమనార్హం. కవుల, రచయితల విషయంలో చాలా చిన్న వయసులోనే సృజనాత్మక రంగంలోకి వచ్చారని చెప్పుకుంటూ ఉంటాం. వ్యాస రచయితల విషయంలో ఇటువంటి అంశాలు ప్రస్తావించరు.
భారతీయ భాషలకు పాశ్చాత్యుల సేవ వ్యాసం క్రైస్తవ మత ప్రచారం కొరకు భారతీయ భాషా సాహిత్యాలకు బ్రిటీషు వారు సేవ చేశారు అన్న వాస్తవిక జ్ఞానాన్ని అందిస్తుంది. తెలుగు భాషకు కాల్డ్వెల్, క్యాంబెల్, బ్రౌన్ వంటి విదేశీ పండితులు సేవలు అందించినట్లుగానే భారతీయ భాషలకు కూడా ఆ కాలంలో మరికొందరు పాశ్చాత్యులు సేవలు అందించారు. అందువల్ల కొంత మేలు జరిగినా భారతీయ మత గ్రంథాలను, మత గేయాలను అనువదించడంతో పాటు మత గ్రంథాలను, గేయాలను ఆయా భారతీయ భాషలలోకి తీసుకురావడం అందరూ చేసిన ప్రధానమైన పని అన్న తెలివిడిని ఈ వ్యాసం అందిస్తుంది. కొందరు బెంగాలీ కవులు రచయితల పరిచయం అన్న వ్యాసం 65 మంది ఆ భాషా కవులను పరిచయం చేసింది. వంగ భాషా సాహిత్య చరిత్రలు తెలుగేతర భాషలలో ఎక్కువగా వచ్చి ఉంటై. వాటిని సేకరించుకోవడం ఒక ఎత్తైతే, దాని ప్రామాణికతను నిర్ణయించుకుని చెప్పడం మరొక ఎత్తు. అది ఈ వ్యాసంలో కనిపిస్తుంది.
‘జనవ్యవహార భాష’ వ్యాసం సాహిత్యోపయోగం మాత్రమే భాష ప్రయోజనం కాదని, అది శాస్త్ర సాంకేతిక భాషగా, వైజ్ఞానిక భాషగా తెలుగు ఎదగ వలసిన రీతిని వివరిస్తుంది. ‘పరిణామక్రమంలో భాషా పరిశోధన’ అన్న వ్యాసం తెలుగులో జరిగిన భాషా పరిశోధన చెబుతూనే సమకాలీన పరిస్థితిని వివరించింది. ‘భాషా సేవ – సెంటిమెంట్లు’ వ్యాసం వర్ణ ద్వేషం (దీనిని అక్షరము అని అర్థం చేసుకోమని మనవి. నిజానికి భాష విషయంలో వర్ణం కూడా ఉందనుకోండి) లో మహాప్రాణాలు, సంయుక్తాక్షరాలు వద్దు అనడం, మాండలిక భాషను నెత్తికి ఎత్తుకునేందుకు ప్రామాణిక భాషను నిందించడం వంటివి చెబుతూనే మళ్లీ మాండలిక పదాల సేకరణ, సర్వేక్షణ, నిఘంటు నిర్మాణాలు, పదకోశాలు, వర్ణనాత్మక వ్యాకరణ రచనలు రావలసిన జరగవలసిన అవసరాన్ని ఈ వ్యాసం విడమరిచింది.
‘తెలంగాణ సాహిత్యం- భాషా వైవిధ్యం’ అన్న మరో వ్యాసం మాండలిక వైవిధ్యాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని చెబుతుంది. “మాండలికాలు వాడాల్సిన చోట మొహమాట పడకూడదు. మాండలికాలు వాడాలి. సాధారణ భాష వాడాల్సిన చోట సాధారణ భాష వాడాలి. ఏది ఎక్కడ వాడాలో తెలిసి అక్కడ వాడడం విజ్ఞత అలా ఉండడమే భాషా వైవిధ్యం” (పుట -557) అని ఈ వ్యాసం ప్రబోధిస్తుంది.
భాషా వరివస్యలో అనువాదంపై ఏడు వ్యాసాలున్నాయి. ‘వి వి బి అనువాద కేతనం’ వ్యాసం వారి ‘అనువాదదర్శిని’ సమీక్షించింది. తెలుగు నుంచి ఇంగ్లీషులోకి ఆయన చేస్తున్న అనువాదాలను ఈ వ్యాసం పరిచయం చేసింది. ‘కవిత్వానువాదాలు విహంగవీక్షణం’ అన్న మరో వ్యాసంలో తెలుగు నుంచి ఇతర భాషలలోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి చేసిన కవిత్వ అనువాదాల్ని సింహావలోకనం చేసింది. పుల్లెల శ్రీరామచంద్రుడు అలంకారశాస్త్రాలను అనువదించ లేదు. అలంకార శాస్త్ర గ్రంథాలకు అర్థ తాత్పర్యాలు వ్రాశారు వాటిని అనువాదంలో చెప్పవలసిన పని లేదు. ‘అనువాదం కావాలి జీవన నాదం’ అన్న వ్యాసం తెలుగు నుంచి ఇతర భాషల లోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి జరిగిన అనువాదాలను ప్రస్తావించింది. వేయిపడగలు ఇంగ్లీషు అనువాదం రావాల్సి ఉంది అన్న కోరిక ఈ వ్యాసంలో కనిపిస్తుంది. దానిని వెలిచాల కొండలరావు గారు సి. సుబ్బారావు, ఐవి. చలపతిరావు, అరుణా వ్యాస్ వంటి వారితో ఆంగ్లంలోకి అనువదింప జేసి ప్రచురించారు. ప్రత్యామ్నాయ పదకల్పనలు సాధకబాధకాలు అన్న వ్యాసంలో కౌటిల్యుడి అర్థశాస్త్రం నుంచి ఇప్పటి పరిపాలనా అవసరాలకు తగిన పదాలను సూచించారు. ఆంగ్లంలో ఆంధ్ర కవిత లో తెలుగు నుంచి ఇంగ్లీషులోకి కవిత్వ అనువాదాలు చేస్తున్న వారి కృషిని మన కళ్ళ ముందు నిలిపారు. ఇది తెలుగు కవితను గురించి ఇంగ్లీషులో పరిశోధన చేయాలనుకునే వారికి ఉపయోగపడే వ్యాసం.
బ్రౌన్ వేమన పద్యాల అనువాదం పై వ్రాసిన వ్యాసం Verses of Vemana పై సమీక్ష వంటిది. అనువాదం లోని సామంజస్యాన్ని, అదే విధంగా అన్వయ క్లిష్టతను, సరైన అనువాదం జరిగిన రీతిని సోదాహరణంగా ఇందులో ప్రస్తావించారు. మూలంలోనే దోషం అన్న భాగంలో పదప్రయోగ దోషం, క్రియా పద లోపం వల్ల దోషం, పద్య నిర్మాణమే దోష భూయిష్టం అన్న మూడు రీతులలో అనువాద దోషాలను చర్చించారు.
“బాప డెముక కూడు భక్షించుచుండును
పేరటంబు పోవు పెండ్లి మగువ
కులము మానము వీడి కోర్కెలు మెండాయె
ఈ పద్యానికి “A Brahmin will eat bone food in which pounded skeleton is mingled. A married women becomes perantalu, these give up their cast & character though excess of avarice అని బ్రౌన్ అనువాదం. A Brahmin will eat bone food అంటే చాలు మూలంలోని భావం వచ్చింది. తక్కిన భాగం అక్కరలేదు A married women becomes perantalu అని పేరంటాలు శబ్దానికి వివరణ ఇచ్చాడు బ్రౌన్. తర్వాత ఆ పేరంటాలు పేరంటానికి పోతుంది perantalu goes to perantam అని వాక్యం రావాలి. అది ఎక్కడో ప్రింటింగ్ లోనో, బ్రౌన్ ఫెయిర్ కాఫీ లోనో రాసుకున్నప్పుడు ఎగిరి పోయింది. బ్రాహ్మణునికి మాంసాహారం నిషిద్ధం కనుక అలా తింటే కుల భ్రష్టుడు అవుతాడు. కానీ ముత్తయిదువలే పేరంటాలకు వెళ్తారు వితంతువులు పోరు. మరి ఇక్కడ ఆ పేరంటానికి పోవడమే శీల భ్రష్టతకు హేతువు అని వేమన, వేమనను అనుసరించి బ్రౌన్ చెబుతున్నారు. ఇది అసమంజసం. పద్యంలోనో మన అవగాహన లోనో ఎక్కడో తిరకాసు ఉంది’’(పుట -215). పద్యంలోనే దోషం ఉందని, అందువల్ల అనువాదంలో కూడా దోషం ఏర్పడిందని నిత్యానందరావు వివరించారు.
నిజానికి ఇక్కడ మూలంలో ఏ రకమైన దోషం లేదు. వేమన పద్యాలు దృష్టాంతాలంకారంతో ఉంటాయి. మొదటి రెండు పాదాల విషయం మూడవ పాదంతో సమన్వయం అవుతుంది. మూడవపాదంలో ‘కులము మానము వీడి కోర్కెలు మెండాయె’ అన్నాడు. బ్రాహ్మణుడు మాంసాహారం తిని కులాన్ని, పెండ్లి కూతురు పేరంటాలకు పోయి మానం విడిచారని అర్థం చేసుకోవాలి. నిజానికి ‘పేరటంబు బోవు పెండ్లి మగువ’లో అన్వయ క్లిష్టత ఉంది. పెండ్లి కూతురు పేరంటం పిలవడానికి పోతుందనో, పెండ్లి అయిన కొత్తలో పేరంటానికి పోతుందనో అర్థం చేసుకోవాలి. పేరంటాలకు ముత్తయిదువలు పోతారు. పెండ్లి అయ్యి అత్తవారింటికి వచ్చిన అమ్మాయి మొదటి సంవత్సరంలో ఇతరుల ఇండ్లకు పెద్దగా పేరంటాలకు పోదు. ఆమె వచ్చిన మొదటి సంవత్సరం తిరిగేలోపు ఆమె పెండ్లి అయి వచ్చిన ఇంటికి పేరంటాలు వస్తారు. ఆమె పేరంటానికి పోవడం మానం విడవడం అని వేమన భావన. అదీగాక వేమన కాలంలో బాల్య వివాహాలు జరిగేవి. ఎనిమిది తొమ్మిది సంవత్సరాలకే పెండ్లి అయిందనుకుందాం ఆమె కాపురానికి ఇంకా అత్తవారింటికి వెళ్ళి ఉండదు కాబట్టి అలా వెళ్లకపోయినా పెండ్లి అయింది కాబట్టి ముత్తయిదువలా పేరంటాలకు పోవడం మానము వీడిన పనిగా నాటి కాలపు దృష్టితో వేమన చెప్పాడనుకోవాలి.
ఆంధ్ర సాహిత్యోద్ధరణలో బ్రౌన్ కాలేజీ వ్యాసంలో బ్రౌన్ మనుచరిత్ర, హంస వింశతి వంటి కావ్యాల పాఠనిర్ణయంలో చూపిన కౌశలం, పండితులతో ఈ కార్యక్రమాలను బ్రౌన్ సూచనల మేరకు నడిపించిన అయోధ్యాపురం కృష్ణారెడ్డి వంటి వారి కృషిని ఈ వ్యాసం తెలియ చేస్తుంది. బ్రౌన్ సమకాలికుడైన పెద్దయ్య వ్యాసం కైఫియత్తు పద్ధతిలో వ్రాసిన ఒక అఙ్ఞాత కర్తృకమైన ‘వేంపాటి వారి వంశావలి’ లిఖిత ప్రతికి వ్యావహారిక రూపం. గుర్రం వెంకటసుబ్బయ్య కవిత్రయ మహాభారతంలో తిక్కన రచన అయిన పదిహేను పర్వాలను ఇంగ్లీషులోకి అనువదించిన నెల్లూరుకు చెందిన ఆంగ్లోపన్యాసకుడి కృషిని చెబుతుంది. ప్రథమాంధ్ర వ్యాకర్త కాణ్వుడు వంటి వ్యాసాలు ఆయా అంశాలను మన ముందు నిలిపే వివేచనాత్మక మయిన వ్యాసాలు.
సాహిత్య వరివస్యలో మొత్తం 27 వ్యాసాలు ఉన్నాయి ఇందులో రెండు కృష్ణ గోదావరి నదుల ప్రస్తావన తెలుగు కవిత్వంలో ఉన్న రీతిని చెప్పేవి. రెండు జాతీయోద్యమం. రెండు ఆకర గ్రంథాలు విజ్ఞాన సర్వస్వం, రెండు సంస్కృతి సాహిత్యాలపై, రెండు ఒక ప్రాంతపు కవుల పరిచయం కాగా శతకం, నవల, కథ, వ్యాసం, యాత్రా చరిత్ర అన్న ప్రక్రియలపై ఒక్కొక్క వ్యాసం ఉన్నాయి. సామెతల్లో వైద్యం, వ్యాఖ్యానాలు అర్థ నిర్ణయం, పాటల పరిమళంలో ద్విపద, నిజాం పాలనలో తెలుగు వెలుగు వంటి మరికొన్ని వ్యాసాలు ఉన్నాయి ఈ వ్యాసాల శీర్షికల వలన వెలుదండ వారి వ్యాస విషయ వైవిధ్యం తెలుస్తుంది. ఏ అంశాన్ని ఎంచుకున్నా దానికి సంబంధించిన సమగ్ర విషయాన్ని అందించే ప్రయత్నంతో పాటు జరగవలసిన కృషిని ఏదో ఒక రీతిలో ప్రస్తావించటం ఆయన వ్యాసాల్లో ఉన్న ప్రత్యేక లక్షణం.
‘విశ్వనాథ – తెలుగు సినిమా’ ఈ సాహిత్య వరివస్య వ్యాసాలలో రెండవది. అద్వితీయమైనది. ఒక అంశాన్ని ఏ రీతిగా సమన్వయం చేసుకోవాలో అర్థం చేసుకునేందుకు ఉదాహరణగా నిలిచే వ్యాసం ఇది. వ్యాస శీర్షిక చూడగానే సినిమారంగంలో విశ్వనాథ సత్యనారాయణ గురించి చెబుతారు అని అనుకుంటాం. అందుకు భిన్నంగా వేయిపడగలు లో సినిమాహాలుతో ప్రారంభమై సినిమాలు, సినిమా పాటలు, నటుల గురించి ఆ నవలలో విశ్వనాథ చేసిన ఆలోచనలతో కొనసాగి, ఆయన ఆకాశరాజు అన్న సినిమాకు మాటలు పాటలు వ్రాసారు అని చెబుతూ, విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు, చెలియలికట్ట నవలలో సినిమాహాల్‌లో జరిగే తతంగం, విశ్వనాథ వారికి నటులతో ఉన్న అనుబంధం, సినిమా పాటలలో విశ్వనాథ సత్యనారాయణ పేరు ప్రస్తావన, ఏకవీర నవల సినిమాగా మారడం వరకు సాగినది ఈ వ్యాసం. ఈ శీర్షికతో ఇదొక పరిశోధనాంశం. ఇంతకుముందే అన్నట్టు ఒక విషయాన్ని అనేక రీతులుగా విభజించుకొని ప్రణాళికాబద్ధంగా చేసే రచనకు చక్కని ఉదాహరణ ఈ వ్యాసం.
‘చారిత్రక నవల’ పై వ్యాసం చారిత్రక సాంఘిక నవలల భేద సాదృశ్యాలను చర్చిస్తూ తెలుగులో వచ్చిన వాటిని శుద్ధ చారిత్రక నవలలు, చారిత్రక కల్పనా నవలలు, మిథ్యా చారిత్రక నవలలు అని విభజించి అర్థం చేసుకోవాలన్నారు, తెలుగు చారిత్రక నవలపై రారా మాటలను ఉటంకిస్తూ దానితో ఏకీభవించడం లేదని, అందుకని తిరస్కరించడం కూడా లేదంటూ ఇది నిగ్గు తేల్చాల్సిన విషయం అంటారు వెలుదండ వారు. దీనిని వారే చెప్పకుండా మనలో ఆలోచనలను రేకెత్తించి, చర్చకు పురికొల్పుతారు.
‘సామెతలలో వైద్య విజ్ఞానం’ పై వ్రాసిన వ్యాసం జానపదుల వైద్య జ్ఞానాన్ని మన ముందు నిలుపుతుంది విజ్ఞానం ప్రతి విషయంలోనూ ఉంటుంది. దానిని గుర్తించాలి. శిష్టులు ఆయుర్వేద గ్రంథాల ద్వారా తెలుసుకున్నది చికిత్స సమయంలో అనుభవంలోకి తెచ్చుకుంటారు. జానపదులు అనుభవపూర్వకంగా తెలుసుకున్నది సామెతల రూపంలో వ్యక్తమౌతుంది. అవే జనవ్యవహారంలో కనిపిస్తాయి వాటిని వివరించేది ఈ వ్యాసం.
‘పాటల పరిమళంలో ద్విపద’ అన్న వ్యాసాన్ని రెండు భాగాలుగా అర్థం చేసుకోవాలి ద్విపద ఏర్పడ్డ రీతి ఒకటైతే, ద్విపద సాహిత్య పరిణామం రెండవది. ద్విపద గణ నియమంలో కొన్ని మార్పులు చేసుకుంటే మధ్యాక్కర, మధురగతిరగడ, ద్విరదగతి రగడ, సీసం, తరువోజ వంటి పద్యాలు పుట్టాయని, పాట నుంచి ద్విపద పుట్టిందనీ ఈ వ్యాసంలో చర్చిస్తూ ఆధునికయుగం దాకా ద్విపద ప్రయోగ వైవిధ్యాన్ని సోదాహరణంగా మనముందు నిలిపారు. ‘అభ్యుదయ కవిత్వ ప్రభంజనం’ అన్న తొలి వ్యాసంలో “భారతంలో మార్క్సిజం వెతకడం ఎంత వ్యర్థమో అభ్యుదయ కవిత్వం లో పై వాటిని (రసం, ధ్వని, అలంకారాలు శబ్ద ప్రయోగం) అన్వేషించటం అంతే వ్యర్థం (పుట -9) అన్నారు. ఆ రచనా రీతిని బట్టి, వస్తువును బట్టి అక్కడికి అవసరమైన విశ్లేషణ రీతిని ఎన్నుకోవాలన్న ఆలోచనలు విద్యార్థిదశలోనే నిత్యానందరావులో కలగడం గమనార్హం.
‘విదేశాలలో రామకథ’ వ్యాసం దేశవిదేశాలలో కనిపించే రామ కథను పరిచయం చేసేది. వివిధ దేశాల లోని రామకథలో ఈ రకమైన మార్పులు కనిపించటానికి స్థానిక భాషా సంప్రదాయాలకు, మత సంస్కృతులకు, ఆచార వ్యవహారాలకు అనుగుణంగా పాత్రలు సంఘటనలు మారడం కారణం అని చెప్పి సాహిత్య స్వభావంలోని అంతర్గతిని మన ముందు నిలిపారు. ‘కృష్ణా కవిత్వ తరంగ శీకరాలు’, ‘కవుల కలాలలో గోదావరి గలగలలు’ వ్యాసాలు కృష్ణా గోదావరి జీవ నదులు తెలుగు కవిత్వంలో పొందిన స్థానాన్ని అంచనా వేసింది. ఈ వ్యాసాలలో కృష్ణా ,గోదావరి నదులను ప్రస్తావన వశంగా, ఖండకావ్యాలుగా, కావ్యాలుగా మలిచిన వారిని ఈ వ్యాసం మన కళ్ల ముందు నిలుపుతుంది.
‘వ్యాసవిలాసం’ అన్న సుదీర్ఘ వ్యాసంలో వ్యాసరచనకు కందుకూరి, గిడుగు, గురజాడ, పానుగంటి మూలస్తంభాలు అని ప్రతిపాదించారు. వ్యాసాలను సంపాదకీయ వ్యాసాలు, ఫీచర్ రైటింగ్, కళా తాత్విక వ్యాసాలు, జీవిత పరిచయత్మక వ్యాసాలు, సాహిత్యేతర వ్యాసాలు, పత్రికలూ ప్రత్యేక సంచికలు, సాహిత్య విమర్శ వ్యాసాలు అన్న విభజనతో ఆయా వ్యాస భేదాలను విషయం శైలి ఆధారంగా చర్చిస్తూ ఆధునిక సాహిత్య విమర్శ లో కప్పదాటు శైలి, గునుగుడు శైలి, సాగుడు శైలి, పునరుక్తి శైలి, అర్థ శూన్య వాక్య విన్యాస శైలి, ప్రబంధ శైలి, ఆవేశ శైలి, అనన్వయ శైలి, కథాకథన శైలి, ఆదివారం అనుబంధాల శైలి అని శైలి భేదాలను చెప్పారు. అయితే వీటిని వివరిస్తూ వారే ఒక వ్యాసం వ్రాయవలసి ఉంది. (ఇంతకీ ఈ పీఠికను ఏ శైలిలో చేరుస్తారో!)
నిత్యానందరావు గారికి ఆధునిక సాహిత్యంలో అభిరుచి, అభినివేశం, ఆసక్తి ఉన్న రంగం జాతీయోద్యమ సాహిత్యం. ఇందులో జయ జయహే భారత భాగ్య విధాత, జాతీయోద్యమ సాహిత్యం అన్న రెండు వ్యాసాలున్నాయి. తెలుగులో దేశభక్తి కవిత్వం గురించి వివరించే జయ జయహే భారత భాగ్య విధాత వ్యాసంలో చిలకమర్తి, గురజాడ మొదలు సినారె దాక స్వాతంత్రానంతరం దేశంపై, దేశ స్థితి పై వ్రాసిన కవులను ఇందులో ప్రస్తావించారు. ఈ వ్యాసంలో నిత్యానందం గారి ఆత్మ కనిపిస్తుంది. అందుకు ఉదాహరణ ప్రాయమైన ఈ వాక్యాలు గమనించండి
“వందేమాతర గీతం మట్టికి, గురజాడ దేశభక్తి గీతం మానవుడికి ప్రాతినిధ్యం వహించే రెండు విరుద్ధ గీతాలని, రెండు భిన్న భావనలన్న తలంపు జనంలో పెరిగింది. వందేమాతర గీతం కన్నా గురజాడ చాలా గొప్పది అని భావించే తత్వం కూడా ఒకటి మొదలైంది. మట్టి పూర్వరూపం అయితే మనిషి ఉత్తర రూపం. మట్టి లేనిదే మనిషికి మనుగడ లేదు. మనిషి లేకుండా మట్టి ఉంటుంది” (పుట 399).
“ప్రాచీన రాజులను, కత్తులను, కటార్లను, ఆచారవ్యవహారాలను పొగిడిగినంత మాత్రాన మధ్యయుగాల నాటి వాటిని యథాతథంగా అనుసరించే తిరోగమన భావానికి దేశభక్తి కవిత్వంలోని గతవైభవ కీర్తన ఉదాహరణ అనుకునే వారికి ఒక నమస్కారం” (పుట 391).
“నిజంగా భారత మాత అనే వ్యక్తి ఉంటే చెరబండరాజు కవిత్వం లోని ఆవేదన మూర్తి అవుతుంది” (పుట 395). వంటి వాక్యాలు వెలుదండ వారికున్న స్పష్టమైన అభిప్రాయాలన్నది మళ్లీ వివరించ వలసిన పనిలేదు. జాతీయోద్యమ సాహిత్యం అన్న మరో వ్యాసంలో ఖండకావ్యాలు, గేయ కవిత, నవల, కథానిక, నాటకం, పత్రికల ఆధారంగా జాతీయోద్యమ సాహిత్యాన్ని పరిచయం చేశారు. “పొట్లపల్లి రామారావు జాతీయత కలిగిన ఒక అణువు బ్రహ్మాండాన్ని సైతం ఎదిరిస్తుంది అని ప్రతీకాత్మకంగా రాసిన కథ ఒంటరి చావు” (పుట 485). అన్నారు ఇది ప్రతీకాత్మకమే అయినా కథన దృష్ట్యా అంతరార్థ కథనంలోకి కోవలోకి చేరుతుంది. ఎలొగరీ శిల్పం ఈ కథకు భూమిక. ఈ జాతీయ భావనలకు కొనసాగింపు వంటిదే ‘సంస్కృతి ద్వారా సమైక్య సాధన’ లో నాగరకతకు మూలం భౌతిక వికాసం, సంస్కృతికి ఆలంబనం మానసికమైన ఆలోచనాస్రవంతి. భావధార. సంస్కృతి మారినపుడు ఆలోచనా విధానంలో కూడ మార్పు వస్తుందని (పుట 407). ఈ వ్యాసం బోధిస్తుంది. ‘తెలుగు సాహిత్యం చరిత్ర సంస్కృతి సమాలోచనం’ వ్యాసం కావ్యాలలో కనిపించే చారిత్రక, సాంస్కృతిక అంశాలను అవగాహన చేసుకునే రీతిని నేర్పే వ్యాసం
తెలంగాణ ప్రాంతం కేంద్రంగా వ్రాసిన వ్యాసాలు ‘తెలంగాణ కథానికా క్రమంబెట్టిదనిన’, ‘నిజాం పాలనలో వెలవెలబోయిన తెలుగు వెలుగు’, ‘తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు సూచీ గ్రంథాలు కోశాలు’, అన్నవి ఉన్నాయి. తెలంగాణ కథను 1912 – 1940, 1940 – 1956, 1956 – 1985, 1985 నుంచి నేటి వరకు అని విభజించుకుని తెలంగాణ కథా వికాసాన్ని తెలంగాణ కథాక్రమంబెట్టిదనిన అన్న వ్యాసం చర్చించింది. అచ్చమాంబ తొలి కథకురాలు అన్న భావన స్థిరం కాకముందు రాసిన వ్యాసమని పై విభజన బట్టి అర్థం చేసుకోవచ్చు. “ఆంధ్రప్రాంతంలో బ్రాహ్మణ ఆచార వ్యవహారాలు ఎక్కువగా ప్రదర్శితం కావడం, బ్రాహ్మణరచయితలు ఎక్కువ ఉండటం విశేషం కాగా, తెలంగాణ కథకులలో దీనికి భిన్నమైన స్థితి ఉండడం గుర్తించదగిన అంశం. ఉద్యమ కాల్పనిక చైతన్యం ఆంధ్రలో కనిపిస్తే ఉద్యమ వాస్తవిక దృక్పథం తెలంగాణ కథలలో గమనించవచ్చు” (పుట. 403) వంటి ప్రతిపాదనలు ఈ వ్యాసంలో చేసి తరువాతి తరానికి మార్గ నిర్దేశనం చేశారు. ‘నిజాం పాలనలో వెలవెలబోయిన తెలుగు వెలుగు’ వ్యాసం నాటి తెలుగు భాషా బోధన కోసం పరిశ్రమించిన వారిని తెలుగు భాషా స్థితిగతులను వివరిస్తూనే “నిజాం స్వార్థపరుడు. తెలుగు భాషను అణచివేశాడు. కానీ అతను ఉర్దూ అధికార భాషగా, బోధనా భాషగా సమర్థనీయంగా తీర్చిదిద్దడం కోసం చేసిన కృషి అనన్య సామాన్యమైనది” (పుట. 424) అంటారు వెలుదండ వారు. ఈ వ్యాసంలో ఇచ్చిన గణాంకాల సమాచారం వ్యాస సమగ్రతకు ఆయన పడే శ్రమను, శ్రద్ధను తెలుపుతుంది.
‘తెలంగాణలో విజ్ఞాన సర్వస్వాలు సూచీ గ్రంథాలు కోశాలు’ వ్యాసంలో ఈ రంగాలలో తెలంగాణ నుంచి జరిగిన కృషిని వివరించారు. ఇటువంటి కృషిని తెలిపే మరో వ్యాసం ‘తెలుగులో ఆకర గ్రంథాలు’ పరిశోధనకు పునాదిగా నిలిచేవి ఆకర గ్రంథాలు. పదసూచికలు. వ్యాస సూచికలు. గ్రంథ సూచికలు, నిఘంటువులు, సంగ్రహ సమాచారాత్మక కోశాలు అన్నవి ప్రధానమైన ఆకర గ్రంథాలుగా ఈ వ్యాసం పరిచయం చేసింది. ప్రాచీన సాహిత్యంలో కవి కాల నిర్ణయాలకు, అలభ్య రచనలకు ఆకరాలుగా నిలిచిన లక్షణ గ్రంథాలు, సంకలన గ్రంథాలను కూదా ఈ వ్యాసంలో ప్రస్తావించుకోవచ్చు ఈ విజ్ఞాన సర్వస్వాలు, సూచికలు ఇప్పుడు అంతర్జాలంలో కూడా దొరుకుతున్నాయి. కథానిలయం అన్న వెబ్సైట్ కథల కాణాచి. వికీపీడియా ఒక సమాచార గని. ఇవి 21వ శతాబ్దపు ఆకర గ్రంథాలు.
‘కంప్యూటరీకరణ నేటి ఆవశ్యకత’ అన్న వ్యాసంలో నిత్యానందరావు గారు 20 సంవత్సరాల క్రితం చెప్పిన అంశాలు ఇవ్వాళ జరుగుతున్నాయి. మనసు ఫౌండేషన్, వికీపీడియా, ఆంధ్రభారతి వంటి సంస్థలు ఇవాళ డిజిటల్ రంగంలో తెలుగు భాషా సాహిత్యాలకు ఎంతో సేవ చేస్తున్నాయి. విశ్వవిద్యాలయాల బయట ఈ రకమైన కృషి ఎక్కువగా జరగడం ఇక్కడ ప్రధానంగా గుర్తించవలసిన విషయం. యాత్రా చరిత్రలు, భక్తి శతకాల పై వ్రాసిన వ్యాసాలు వాటి ప్రాధాన్యాన్ని సోదాహరణంగా విశ్లేషించాయి.
‘కల్వకుర్తి కవుల కవన కుతూహలరాగం’, ‘గోదావరీ కవి తరంగిణి’ అన్న వ్యాసాలు ఆ ప్రాంతపు కవులు రచయితల పరిచయాలతో కూడుకున్నవి ఈ వ్యాసాలలో కొందరి గురించి రెండు వాక్యాలు , కొందరి గురించి సంగ్రహ పరిచయం ఉండడం ఆయా రచనల లభ్యత, దొరికిన సమాచారం ఆధారంగా రచించినట్లు అర్థం చేసుకోవాలి. గోదావరీ కవి తరంగిణి’ వ్యాసంలో సదస్సు నిర్వాహకులు 267 మంది కవులు, రచయితల జాబితా మాత్రమే ఇస్తే మరో యాభైమందిని తన వ్యాసంద్వారా వెలుదండ వారు పరిచయం చేశారు. పాలెం ఓరియంటల్ కాలేజీలో పని చేసిన మామిడన్న సత్యనారాయణమూర్తి, శశాంకవిజయం కేవల శృంగార కావ్యం కాదు అది నక్షత్రగమనాన్ని ప్రాతిపదికగా చేసుకుని సాగిన సంకేతాత్మక కథ అని తన పిహెచ్.డి పరిశోధన ద్వారా నిరూపించిన పోచినపెద్ది కామసత్యనారాయణ వంటి లోకానికి అంతగా తెలియని సాహితీ వేత్తలను ఈ వ్యాసం మనకు పరిచయం చేస్తుంది. ఇటువంటి వ్యాసాలు జిల్లా సాహిత్య చరిత్రలకు ఆకరాలు. ఉభయ గోదావరిలో పుట్టి ఎక్కడ స్థిరపడినా వారిని ఆ ప్రాంతపు వారిగా చూపించడం ద్వారా కవి జన్మస్థానమే అతడి స్థానికత అని వెలుదండవారు భావించినట్లు గుర్తించవచ్చు. ఇదే పద్ధతి కల్వకుర్తి కవుల విషయంలోనూ అనుసరించారు. కవి కార్యక్షేత్రం కంటే కవి జన్మక్షేత్రం అతడి స్థానికతను నిర్ణయిస్తుంది. కానీ ఇటీవల చర్చలు, వాదోపవాదాలు, ప్రాంతీయ సాహిత్య చరిత్రలు గమనించినప్పుడు ఒక చోట జన్మస్థానం ఆధారంగా, ఇంకొక చోట కార్యక్షేత్రం, మరొకచోట సమాధి (చచ్చి బతికిన చోటు) ఆధారంగా కవి ప్రాంత స్థానికతను నిర్ణయిస్తున్నారు. ఈ విషయంలో నిత్యానంద రావు గారు జన్మస్థానం కేంద్రంగా చేసుకుని తమ పరిశీలన కొనసాగించారు.
‘వ్యాఖ్యానాలలో అర్థనిర్ణయం – సాధకబాధకాలు’ వ్యాసంలో వ్యాఖ్యానంలో జరిగే పొరపాట్లను ఉద్దేశ్యపూర్వకం, అవగాహన లోపం, తొందరపాటు ఏమరపాటు అని మూడు రకాలుగా విభజించి పరిశీలించారు. వ్యాఖ్యానం అనగానే కేవలం ప్రాచీన సాహిత్యం అని భావించకుండా ప్రాచీనాధునిక కాలాలు రెండింటినీ ఎన్నుకున్నారు. ఉద్దేశపూర్వకం అన్న విభాగంలో ఆరు రకాలు చెప్పారు. ఉద్దేశపూర్వకానికి పునాది హాస్యం, చమత్కారం, వ్యంగ్యం అని గమనించాలి. అవగాహనాలోపం అన్న విభాగంలోని ఉదాహరణల్లో శ్రీనివాస శిరోమణి రామాయణ అనువాద విధానం ఆధారంగా కాక వ్యాఖ్యానం ద్వారా ఎక్కువగా వివరించవలసి ఉండింది. తొందరపాటు అనవధానత అన్నవి ప్రాణిసహజ లక్షణాలు. దానికి నేను నిత్యానంద రావు గారు కూడా అతీతులం కాము. దీనికి మరికొన్ని కారణాలను కూడా మనం చేర్చవచ్చు. ఈ వ్యాసంలో అనఘామూల్య మణిప్రరోహము (3-34) నిర్మల అమూల్య గుణరత్న నిధి (6- 84) అన్న వసుచరిత్ర పద్యంలో అమూల్య శబ్దానికి వ్యాఖ్యాతలు అందరూ ‘విలువ లేని’ అనే వ్రాశారు ‘విలువ కట్టలేని’ వ్రాయవలసి ఉండింది వెలుదండ వారి అభిప్రాయం. నిజానికి అమూల్య శబ్దానికి ప్రాచీన నిఘంటువులు 1940 కంటే ముందు వచ్చినవి విలువ లేని, వెలలేని అనే అర్థాలే చెబుతున్నాయి. విలువ లేని అంటే ఈ కాలంలో మనం అర్థం చేసుకున్నట్లు Price less అనే అర్థం, విలువ కట్టలేని అన్న అర్థం తీసుకోకూడదు. అమూల్య విలువలేని అన్నప్పుడు ఇదమిత్థంగా దాని మూల్యాన్ని నిర్ణయించడానికి వీలు లేనిది అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఒక పదాన్ని ప్రయోగించిన కాలంలోని అర్థం వ్యాఖ్యాతకు ప్రధానమైనది. కానీ నేటి అర్థం కాదు. శ్రేష్టమైనది, వెలలేని అన్న అర్థాల దృష్టితో దీనిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాఖ్యానం విషయంలో ఉండే సాధకబాధకాలు , అన్వయదోషాలు ఈ వ్యాసంలో చర్చించి కొత్త తరానికి జాగరూకతను కలిగించారు అనడంలో సందేహం లేదు. ఆ దృష్టితో దీన్ని జాగ్రత్తగా అధ్యయనం చేయవలసిందే.
సాహిత్య వరివస్య లోని వ్యాసాలన్నీ గమనించినప్పుడు విషయ విస్తృతిని, అవగాహన వైవిధ్యాన్ని గుర్తించవచ్చు, ఏ విషయాన్ని ఎన్నుకున్నా దానికి తగిన శ్రమ చేసి ఆ విషయ పరిధి మేరకు సమగ్రంగా చెప్పడం వీటిలో గమనించవచ్చు. పరిశోధకులకు దారిచూపడాన్ని గుర్తించవచ్చు
సాహిత్య వరివస్య, భాషా వరివస్య కలిపి మొత్తం 54 వ్యాసాలున్నాయి ఇందులో కొన్ని వివరణాత్మకం, మరికొన్ని వివేచనాత్మకం. వ్యాసాలన్నీ ఏదో ఒక రీతిన ఆలోచనాత్మకం. ఈ వ్యాసాలన్నీ గమనించినప్పుడు నిత్యానంద రావు గారిని ‘ఆల్ రౌండర్’ అనక తప్పదు భాష, వ్యాకరణం, అనువాదం, సాహిత్యం, చరిత్ర, సంస్కృతి, డిజిటల్ రంగం ఇలా అనేక విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. సాధారణ పాఠకులకు ఎక్కువగా, పరిశోధనాత్మక దృష్టితో చదివే పాఠకులకు కూడా ఏదో ఒక తెలియని సమాచారం నిత్యానంద రావు గారి వ్యాసాలలో కనిపిస్తుంది. అలా ఉండేందుకు ఆయన తగినంత కృషి ఆ వ్యాసరచన సందర్భంలోనే కాక, ఇతరత్రా కూడా చేస్తూనే ఉంటారు. నా మటుకు నాకు ఈ వ్యాసాల వలన తెలుగు నుంచి ఇంగ్లీషులోకి అనువాదం చేస్తున్న వారి పేర్లు, రచనల పేర్లు, ఒక ప్రాంతపు రచయితలు కవులు కొందరైనా నాకు కొత్తగా పరిచయమయ్యారు. అలా కొత్త తరానికి సమాచారాన్ని వివేచనాత్మకంగా ఈ వ్యాసాల ద్వారా అందించారనడంలో సందేహించవలసిన పని లేదు. తాను ఎక్కడి నుంచి ఆ సమాచారాన్ని సేకరించింది చెప్పడానికి ఆయన వెనుకాడరు. అది వారి నుంచి ఈ తరం తప్పకుండా నేర్చుకోవలసిన గుణం.
ఇక ఈ వ్యాసాల శైలి విషయానికి వస్తే నిత్యానంద రావు గారిలో కొండొకచో వ్యంగ్యం, చమత్కారం హాస్యస్ఫోరకత్వం కనిపిస్తుంటాయి.
“అర గడియ భోగం ఆరునెలల రోగం తస్మాత్ జాగ్రత్త అని సుఖ రోగాల గురించి హెచ్చరిస్తున్నారు ఏకపత్నీ వ్రతం, నిగ్రహం, పరదారా విముఖత్వం జీవితంలో ఉండాలని వెనుకటి అమాయకపు పెద్ద మనుషులు బోధించారు. నేటి తెలివి మీరిన మనుషులు నిగ్రహం ప్రస్తావన లేకుండా కండోమ్ వాడండి ఎయిడ్స్ కు దూరం కండి అని గోడల మీద రాయిస్తున్నారు”(పుట. 344).
“తెలుగు పద్యం అర్థం కాక అర్థ తాత్పర్యాలు కోసం వ్యాఖ్యానాన్ని పాణిగ్రహణం చేసిన పాఠక వరునికి ఆర్తి తీరేదెలా”(పుట. 503).
“ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ఆలోకన పేరుతో దినపత్రికల సమాచారాన్ని పోగుచేసి రెండు సంపుటాలు వేశారు. ఇలాంటి పనులు వృథా అని అధికారులు అడ్డుపుల్లలు వేశారు (భద్రిరాజు) కృష్ణార్పణం” (పుట.525).
“ఒక్కో భాష విషయంపై ఒక్కో గ్రంథం రాయాల్సిన అంత సమాచారమున్నా కేవలం ఒక వ్యాసంలో రాయవలసి రావడం వల్ల పత్రం పుష్పం ఫలం తోయం అన్నట్లుగా పరిశీలించక తప్పదు” (పుట. 168).
ఇవి నిత్యానందరావు గారి శైలిలో తరచుగా కనిపిస్తుంటాయి. ఈ శైలి పై తాను చేసిన పిహెచ్. డి ప్రభావం పేరడీల ప్రభావం అక్కడక్కడా కనిపిస్తుంది. బహుశా ఆ ప్రభావమే చాలా సీరియస్ విషయాన్ని హాస్య గుళికలా అందించే స్వభావం వారికి ఇచ్చింది. ఆ ప్రభావమే ఒక్కొక్కసారి సీరియస్ విషయం కూడా చేరవలసిన అంత సూటిగా పాఠకుడికి చేరనీయకుండా కూడా చేస్తుందేమో!. విషయం మరింత సులభం చేసే చెప్పాలన్నదీ దీనికి కారణంగా భావించవచ్చు. తాను వ్రాసిన ప్రతి వాక్యం అచ్చులో ఒక సంపుటంగా రావాలన్న తపనతో వెలుదండ నిత్యానందరావు దీనిని ప్రచురిస్తున్నారు. ఈ సందర్భంలో కొన్ని ఇప్పటి తెలివిడికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి ప్రచురించవచ్చు. కానీ అలా చేయకుండా తన నిజాయితీని తన అవగాహన పరిణామాన్ని అర్థం చేసుకోవడానికి అనుగుణంగా వ్యాసాలను ఉన్నదున్నట్లు ప్రచురిస్తున్నారు. ఇది వారి నిజాయితీకి గుర్తు. ఇదే సాహిత్య పరిశోధకుడికి ఉండవలసిన గుణం. ఆ గుణం ఈ వ్యాసాలలో స్ఫటికంలా భాసిస్తుంది. బహువిధ విషయ వైవిధ్యభరితమైన ఈ వ్యాస సంపుటి వెలుదండ వారి నాలుగు దశాబ్దాల సాహిత్య కృషిని మన ముందు నిలుపుతుంది. ఇది ఆయన నిత్యానందంతో ఇప్పటివరకు చేశారు. ఎప్పటికీ చేయాలని కోరుకుంటూ ఈ వ్యాసాల వెలుగుదండను ధరించడానికి సహృదయులను సాదరంగా ఆహ్వానిస్తూ సెలవు.
డా. లక్ష్మణ చక్రవర్తి
12-5-2021,
వైశాఖ శుద్ధ పాడ్యమి
***
వాగ్దేవి వరివస్య (భాషా సాహిత్య వ్యాసాలు)
పుటలు. 585. వెల.600-00.
ప్రతులకు: నవోదయ బుక్ హౌజ్, కాచీగుడా, ఫోన్: 9000413413
లేదా రచయిత ఫోన్ నెంబర్ 9441666881కు గూగుల్ పే చేసి తెప్పించుకోవచ్చు. .