వాక్కులు-1

4
1

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:
[dropcap]వా[/dropcap]క్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.
ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.
ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు
~
1
తేనె పాడయిపోయింది.
“తెలుగు”
(ఇది తొట్టతొలి వాక్కు)

2
తోట కాలిపోయింది.
“స్నేహం”

3
చిఱునవ్వు నల్లగా ఉంది.
“అనురాగం”

4
సముద్రం పొంగుతూనే ఉంది.
“స్వార్థం”

5
క్రూర మృగాలు అడవిలోనే ఉన్నాయి.
“సమాజం”

6
పువ్వుల్లోంచి దుర్వాసనలు వస్తున్నాయి.
“బాంధవ్యాలు”

7
బలమైన పెద్దకోట కుప్పకూలిపోయింది.
“సంక్షేమం”

8
మొన్నో, అటుమొన్నో వీచి వెళ్లిపోయింది తెమ్మెర.
“ఆప్యాయత”

9
దృశ్యం చెదిఱిపోయింది.
“మమకారం”

10
అభినందనలు వెల్లువెత్తాయి.
“వక్రత”

11
తెలివి, తెలివిడి లేవు, రావు కానీ పేలాపన సాగుతోంది.
“తెలుగుకవి, విమర్శకుడు”

12
బిరుదులు వచ్చాయి; డబ్బు నవ్వింది.
“తెలుగుకవులు”

13
తప్పులెన్నో చెప్పబడ్డాయి ఆపై అబద్ధాలు ఎన్నో చేర్చబడ్డాయి.
“చరిత్ర”

14
ఇజాలు జనాల్లో దిగబడ్డాయి.
“విషబీజాలు”

15
పెద్దలు తలలు తిప్పేసుకున్నారు.
“సవ్యత, భవ్యత”

16
పాత పెద్దలు పట్టించుకోవడం లేదు.
“నిజం”

17
తలలు నెఱిసిన వాళ్లు ఉద్బోధిస్తున్నారు.
“తప్పులు, వక్రత”

18
వింతపశువులు వికారాన్ని విరజిమ్ముతున్నాయి.
“విద్య”

19
నా అభిప్రాయం, నా అభిప్రాయం అని బిగ్గఱగా అఱుపులు వినిపిస్తున్నాయి.
“మనోవ్యాధి”

20
విశ్వవిద్యాలయాలు డాక్టరేట్స్‌ను ఇచ్చేస్తున్నాయి.
“డబ్బు, మందు, పొందు”

21
ముందుకెళుతున్న కొద్దీ దూరమౌతోంది కాంతి.
“అప్యాయత”

22
రాయబడాల్సిన కవిత మొదలవనే లేదు.
“సమత”

23
తీగలు తెగిన వీణలు మోగుతూనే ఉన్నాయి.
“ఆశయాలు”

24
ఒక మహావృక్షం కూలిపోయి దారి పక్కన పడుంది.
“సంస్కారం”

25
మన పెద్దలు నీటిపై ముగ్గు వేశారు.
“నిజాయితి”

26
మఱో గాలి వీస్తోంది.
“సంస్కృతి”

27
ఎప్పటి నుంచో మంట రగులుతూనే ఉంది.
“ఆకలి”

28
బూడిద రాలుతూనే ఉంది.
“అసూయ”

29
తెలుసుకోవాల్సింది అర్థం అవకుండానే ఉంది.
“మురికివాడ”

30
చాలామంది పేలిపోతున్నారు.
“మతం”

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here