[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]
వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:
వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.
ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.
శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.
ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.
వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్థాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.
వాక్కులు
~
361
యాభై ఏళ్లుగా తెలుగు పాడవుతూనే ఉంది.
“అధ్యాపకులు, విద్యాధికులు”
362
మేం తప్పులే చేస్తాం వాటిని కాలానికి వదిలేస్తాం అంటున్నారు.
“డాక్టరేట్స్, ఉపాధ్యాయులు”
363
ఉదయంలోని హృదయం చక్కగా కదిలింది.
“చల్లదనం”
364
బందీగా ఉండి, బందీగా మసలి చివరికి స్వేచ్ఛను సాధించాడు మనిషి.
“మరణం”
365
చెడిపోయింది చలామణిలో చెలరేగుతోంది.
“నడవడిక”
366
వక్రతకు సక్రమమైన రూపం అమరింది.
“మనిషి”
367
బుద్ధీ, మెదడూ బిగుసుకుపోయి, ముద్దుబాఱాయి.
“విద్యాధిక్యత”
368
గాడి తప్పింది, వేగంగా దొర్లుకుంటూ పోయి పడిపోయింది.
“మనుగడ”
369
అసభ్యత అన్న పెంటపై మూకుమ్మడిగా ఈగలు మూగుతున్నాయి.
“ముసలాళ్లు”
370
ఎఱుక అంటే ఎందుకో ఎందఱికో రుచించడం లేదు.
“మనోదౌర్బల్యం”
371
తలలు తెల్లబడ్డాక బూతు అలవాటయింది.
“కొసమెఱుపు”
372
మనిషికి, మనిషికి మధ్య వికారం కాష్టంలా కాలుతూనే ఉంది.
“ప్రవర్తన”
373
ఏకాంతంలో స్వాంతం సాంత్వన పొందుతోంది.
“కవిత్వం”
374
ధ్యాసకు పరిణతి వచ్చింది.
“ధ్యానం”
375
తపన తపస్సు చేస్తోంది.
“గమనం”
376
ఖేదం హ్లాదమై సీతాకోకచిలకలా ఎగిరింది.
“ప్రేమ”
377
తలపు గెలిచింది.
“వలపు”
378
ఊహ మెఱిసింది.
“కళ”
379
ఉదాత్తత ఉవ్వెత్తున లేచింది.
“ఇంగితం”
380
నీతి నెయ్యికాగే వాసన అయింది.
“నిజాయితీ”
381
పసిపాప నవ్వు మిసిమి.
“స్వచ్ఛత”
382
చెక్కబడాల్సిన చక్కటి శిల్పం ఇంకా శిలగానే ఉంది.
“సంస్కారం”
383
ఇంకా లోకంలో ఎండు డొక్కల గుండెలు కొట్టుకుంటూనే ఉన్నాయి.
“ఆకలి”
384
ఎన్నో బతుకులు పుళ్లై రక్తాన్ని పలికిస్తునాయి.
“పేదరికం”
385
ఇచ్చిన కష్టానికి వచ్చిన చాలని ఫలితం చమటై ప్రశ్నిస్తోంది.
“కాయకష్టం”
386
అనాదిగా మనిషి చుట్టూ కనిపించని నిప్పు రగులుతూనే ఉంది.
“దౌర్జన్యం”
387
భూమిపైన చిఱిగిపోని పొర గట్టిపడుతూనే ఉంది.
“ద్రోహాం”
388
ఊరు ఊరుకూ మురుగు కాలువలు పెరిగిపోతూనే ఉన్నాయి
“అసభ్యత, అసంస్కారం”
389
మేధావులు ఉన్నవి జాగ్రత్త.
“సమాజం”
390
తలపులు చితికిపోయాయి.
“శోకిష్టి”
(మళ్ళీ కలుద్దాం)