Site icon Sanchika

వాక్కులు-14

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్థాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

391
రావాల్సిన అతిథి తియ్యాల్సిన తలుపు కోసం‌ వేచి ఉంది.
“మానవత్వం”

392
మనుషులకందని ఎత్తులో గాలిలో ఒక ఉద్యానవనం‌‌ తేలుతోంది.
“మంచితనం”

393
బుద్ధికి తోచని వెలుగు కళ్లు తెఱిపించాలని ప్రయత్నిస్తోంది.
“విజ్ఞత”

394
రూపొందని చిత్రం పత్రం కోసం వెతుకుతోంది.
“ఇంగితం”

395
విరచించబడాల్సిన కావ్యం‌ అక్షరాల కోసం ఆశపడుతోంది.
“కృతజ్ఞత”

396
శ్రావ్యమైన సంగీతం‌ సవ్యమైన గాత్రం‌ కోసం కలగంటోంది.
“సభ్యత”

397
మాన్యత పొందేందుకు సాటిలేని మార్గం ఉంది.
“నాణ్యత”

398
మతం ఇవ్వలేని‌ హితం‌ ఉంది.
“కవిత్వం”

399
మనిషిని మహనీయుణ్ణి చేసే మహత్తు ఉంది.
“సేవ”

400
చెదిఱిపోని‌ కళలు కలకాలం ఉంటాయి.
“సద్భావాలు”

401
తత్త్వసత్యానికి, సత్యతత్త్వానికి సత్వం వచ్చింది.
“భగవద్గీత”

402
ఏ విశారదుడో విశ్వాన్ని విశేషంగా విరచించి విజయాన్ని పొందాడు.
“సౌందర్యజ్ఞత”

Exit mobile version