[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]
వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:
[dropcap]వా[/dropcap]క్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.
ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.
శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.
ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.
వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.
వాక్కులు
~
91
లోలో వెన్నెల వెల్లివిరిసింది.
“మధురభావన”
92
మన పూర్వీకుల మంచి ఆలోచనలు మనపై ఉన్నాయి.
“నక్షత్రాలు”
93
పూయబోయే పువ్వు పరిమళించింది.
“ఆశయం”
94
మనసులోనూ పొద్దు పొడుస్తోంది.
“కర్తవ్యం”
95
మనసును వయసు, వయసును మనసు కౌగిలించుకుంటున్నాయి.
“జీవనం”
96
మెదడు మనసును పరిశోధిస్తోంది.
“స్నేహం”
97
లోకజ్ఞానం లేక, తెలిసిందేదీ లేక లేకీపని చెయ్యబడుతోంది.
“విమర్శ”
98
మనిషి, మనిషి నుంచీ మురికి పుడుతూనే ఉంది.
“కపటం”
99
ఈ మట్టిని, దేశాన్ని అన్నవాళ్లకు అన్నంత.
“డబ్బు, పేరు, పలుకుబడి”
100
ఇంకా అర్థం కావాల్సిన అందాలతో అద్భుతమైన ఓ కవిత మన ముందుంది.
“ప్రకృతి”
101
ఎంతో గొప్ప సంగీతం తన స్వరాలను మన దగ్గఱికి పంపుతోంది.
“సముద్రం”
102
చెడ్డతనం చావకుండా ఉంది.
“ముల్లు”
103
మంచివాళ్ల ఆలోచనలు చీకట్లోనూ మిలమిలలాడతాయి.
“నక్షత్రాలు”
104
మేలైన భావాలు మనపైన సాగుతున్నాయి.
“మేఘాలు”
105
కాంతి మెఱుపై నెలకొనే ఉంది
“ఆధ్యాత్మికత”
106
ఆలోచన ఆనందించింది.
“ఆరాధన”
107
చింతనకు చైతన్యం వచ్చింది.
“ఉపాసన”
108
పారవశ్యం పరిమళించింది.
“ధ్యానం”
109
పుణ్యాన్ని నైపుణ్యంతో పేల్చేశారు.
“మనుషులు”
110
ఆలోచనలకు గజ్జి అంటుకుంది
“హింస”
111
మెదళ్లు పుళ్లై వాటినుంచి చీము కారుతోంది.
“మతవాదం”
112
పెద్దశాతం ప్రజలూ, ప్రభుత్వమూ ఒకవైపు, మతోన్మాదం ఒక వైపు.
“భ్రష్టత్వం, దేశద్రోహం”
113
వైదికకాంతి కదులుతూ, మెదులుతూ ఉంటుంది.
“ఆదిశంకరాచార్య, వివేకానంద”
114
ఒక అద్భుతం మాట్లాడింది తెలుగులో.
“(ఆదిభట్ల) నారాయణదాసు”
115
భగవంతుడు ఆశీర్వదించాడు.
“వేకువ”
116
కుల, మత ఘోషలు తెలుగులో కవితలయ్యాయి.
“దుర్మతి, దుర్గతి, దుస్థితి”
117
ఏకాంతానికి భాషారూపం వచ్చింది.
“కవిత”
118
తన మొహమే తనకు తొడుగు.
“మనిషి”
119
కాంతితో కలిసి ఉండాలి అన్న సందేశం నిలిచి ఉంది.
“భారత(ప్ర)దేశం”
120
ప్రయత్నం అన్న భాషను నేర్చుకుంటే ఫలితం అన్న కవిత్వం వచ్చేస్తుంది.
“విజయం”
(మళ్ళీ కలుద్దాం)