Site icon Sanchika

వాక్కులు-8

[శ్రీ రోచిష్మాన్ సృజించిన సరికొత్త కవితా ప్రక్రియ ‘వాక్కులు’ అందిస్తున్నాము.]

వాక్కు ప్రక్రియలోని నిర్మాణం లేదా విధం:

వాక్కులో ఒక అభివ్యక్తి రెండు వరుసల్లో ఉంటుంది. మొదటి వరుసలో క్రియా పదాలతో ఒక సంపూర్ణమైన పంక్తి ఉంటుంది. ఇది ఒక పంక్తిగా మాత్రమే అంటే 30 అక్షరాల లోపు ఉండాలి.

ఈ పంక్తి ఒక వాస్తవ పరిస్థితిని, ఒక ఊహను, ఒక భావుకతనూ, ఒక విషయాన్ని ఒక భావాన్ని ప్రకటించేదిగా ఉంటుంది. ఆ పంక్తిలో చెప్పడం పూర్తవుతుంది. రెండవ వరుసలో ఒక పదం, లేదా రెండు, మూడు విడివడి పదాలలో సూచనాత్మకంగా ఒక తీర్మానం ఉంటుంది. ఈ వరుసలో క్రియా పదాలు ఉండవు. ఈ రెండో వరుస మొదటి వరుసకు కొనసాగింపు కాదు. ఈ రెండో వరుస వాక్కును సంపూర్ణం చేస్తూ కవిత్వావిష్కరణకు మూలకం ఔతుంది.

శిల్పాత్మకమైన లఘురూప కవితాప్రక్రియ వాక్కు.

ఈ శిల్పాత్మక ప్రక్రియ వాక్కులో వస్తువు ఏదైనా కావచ్చు.

వాక్కు అన్న పదానికి ఎన్నో అర్థాలు ఉన్నాయి. అవి అందరికీ తెలిసినవే. అవి నిఘంటువుల ద్వారా తెలుసుకోగలిగినవే. అన్ని అర్ధాలకు సంబంధించిన అభివ్యక్తులకూ ఈ వాక్కు ప్రక్రియలో అవకాశం ఉంటుంది.

వాక్కులు

~

211
వాక్యం దుసాత్మకం కావ్యం అయింది తెలుగులో.
“పరిణామం, విప్లవం”

212
రసహీనార్థ ప్రతిపాదక శబ్దం కావ్యం అనిపించుకుంటోంది తెలుగులో.
“మేధ, ప్రయోగశీలత్వం”

213
తెలుగులో గజల్ అజల్ అయిపోయింది.
“సినారె”

214
ఎన్ని గ్రహాలున్నా జాబిల్లి మాత్రమే కవిత అయింది.
“వెన్నెల”

215
చీకట్లో మంచి మెఱిసింది.
“నక్షత్రాలు”

216
ప్రవాహం లేకపోతే జీవితం కాదు.
“నది”

217
ముళ్లూ, పువ్వులూ, కొమ్మలు, ఆకులు, గడ్డి అన్నీ ఉంటాయి తోటలో.
“జీవితం”

218
తెలుగు జనాలు కవితను వదిలించేసుకున్నారు.
“కవి, విశ్లేషకుడు”

219
శంఖం ఊదడమైంది చెవిటి వాళ్ల మధ్యలో.
“మంచిమాట”

220
ఔషధాలున్నాయి రోగులు సహకరించడం లేదు.
“సంస్కరణలు”

221
అధికశాతం అసత్యానికి ఆకారం వచ్చింది.
“చరిత్ర”

222
ఇళ్లల్లో మంటలు చెలరేగుతున్నాయి.
“బాంధవ్యాలు”

223
కంటి పాపకూ. కనుఱెప్పకూ మధ్య కారం చేరింది.
“అనుబంధం”

224
ముళ్లే రెమ్మలై పువ్వు పూచింది.
“జీవితం”

225
తన చేతిలోనే తాను ఓడిపోయాడు.
“మనిషి”

226
సరిగ్గా ఉండడం‌ సరిగ్గా జరగలేదు.
“ప్రవర్తన”

227
తప్పులు దిద్దుకోబడడం లేదు.
“ఒప్పు”

228
చెడిపోవడం చెఱిగిపోవడం‌ లేదు.
“మనుగడ”

229
విశ్వం ఒక‌ విశేషమైన అభివ్యక్తినిచ్చింది.
“ప్రకృతి”

230
లోకంలో ఇంకా కార్చిచ్చు రగులుతూనే ఉంది‌.
“ఆకలి”

231
పూలు వాడిపోతాయి కాని ముళ్లు వాడిపోవు‌.
“అవమానాలు”

232
మనిషి తనకు తాను బలైపోతున్నాడు.
“జీవితం”

233
తెలియని భాషలో చాల కాలంగా చాల గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
“స్నేహం”

234
మాట పనిచేస్తోంది, మనసు పనిచెయ్యడం లేదు.
“సంబంధం”

235
మెదడుకు మనసు లేదు, మనసుకు మెదడు లేదు.
“మనిషి, మనుగడ”

236
శ్రుతి చేరలేదు, స్వరాలు తడబడుతున్నా గానం సాగుతోంది.
“జీవనం”

237
నీరుపడినా తామరాకుకు తడి అంటడం లేదు.
“మనిషి, మమత”

238
తీఱని వ్యాధి తనువును తింటోంది.
“మనస్తత్వం”

239
మొదలుకు మొదలు ఉంటుంది కానీ అంతానికి అంతం లేదు.
“చెడ్ఢతనం”

240
దాహానికి దాహం‌ తీఱదు.
“వాంఛ”

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version