వాళ్ళు మాంసం తింటారు!

0
2

[box type=’note’ fontsize=’16’] Hansda Sowendra Sekhar వ్రాసిన ‘They Eat Meat!’ అనే కథను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు వి.బి. సౌమ్య. [/box]

[dropcap]ఉ[/dropcap]పోద్ఘాతం: ఈ కథ మొదట “La.Lit Magazine” అన్న పత్రికలో వచ్చింది. తరువాత 2015లో “Adivasi will not Dance” సంకలనంలో తిరిగి ప్రచురితమైంది. తెలుగు అనువాదానికి అనుమతినిచ్చిన రచయిత Hansda Sowendra Sekhar కు, ప్రచురణ కర్తలు Speaking Tiger Books వారికి ధన్యవాదాలు. కథలో ఉన్న కొన్ని సంతాలీ భాష పదాలు అలాగే ఉంచి బ్రాకెట్లలో వివరణ ఇచ్చాను.

***

2000లో వదోదర వెళ్ళాక మా పాన్ముని-ఝీ కి (ఝీ అంటే మేనత్త. ) తరుచుగా బయటి ఆహారం తినడం అలవాటయింది. అంతకుముందు భర్త బిరం, పిల్లలు రొబి, హొపొన్ లతో కలిసి భుబనేశ్వర్‌లో ఉండే రోజుల్లో కడుపు నొప్పి వస్తుందనీ, జబ్బు చేస్తుందనీ భయపడి అసలు బయట తినేది కాదు. ఒకోసారి ఘాట్శిలకి అవతల ఉన్న తమ సొంతఊరు నుండి 33, 5 – రెండు జాతీయ రహదారుల మీదుగా మారుతీ ఆమ్నీని డ్రైవ్ చేసుకుని వాళ్ళొచ్చే సరికి బాగా రాత్రయిపోయి, పాన్ముని అత్తయ్యకి వంటచేసేందుకు ఓపికుండేది కాదు. అట్లాంటప్పుడు ఏదైనా దారిలో ఉన్న హోటెల్ నుండి పార్సిల్ తెచ్చుకునేవారు. అయితే, హోటెళ్ళ మీద అత్తయ్య అనుమానం ఏ స్థాయిలో ఉండేదంటే ఒక ముద్దన్నా తినేముందే కడుపులో గుడగుడ మొదలయ్యేది.

బిరం కుమం (మామ) తరుచుగా ఈ విషయంలో ‘ప్రతి చోటా నీ ప్రమాణాలకి తగ్గట్లు ఆహారం దొరకాలంటే కష్టం’ అని విసుక్కునేవాడు. బిరం సోరెన్ గ్రామీణ విద్యుత్ నిగం అన్న కేంద్ర ప్రభుత్వ కంపెనీలో డైరెక్టర్ గా పనిచేసేవాడు. ఇది గ్రామాలలో విద్యుత్ సరఫరా చేసే సంస్థ. ఇరవై ఏళ్ళుగా ఇందులో పనిచేస్తూ పనిలో భాగంగా ఆయన తరుచుగా ఊళ్ళు తిరిగే వాడు. ఆయనకి పెద్దగా ఆహార పట్టింపులు లేవు.

‘నా ప్రమాణాలకి తగ్గట్లు ఆహారం దొరక్కపోతే నేను తిననే తినను’ మామయ్య ఏమన్నా అనగానే అత్తయ్య కూడా‌ గట్టిగా బదులిచ్చేది.

బిరం మామ భార్యతో వాదోపవాదాలు చేసేవాడు కాదు. ఆయనకి అలాంటివి ఇష్టం లేదన్నది ఒక కారణం. ఈ విషయంలో అత్తయ్య పట్టు, ఆమె వంటగదిని శుభ్రంగా పెట్టుకోడానికి ఎంత శ్రమిస్తుందీ అంతా ఆయనకి తెలుసు. ఇది రెండో కారణం. మాములుగా చేసే అన్నం-పప్పు, చపాతీ-కూర ఇలాంటివే కాక మా అత్తయ్య వంట ప్రోగ్రాములు, వనిత, మేరీ సహేలీ వంటి పత్రికలూ చూసి ఆ స్ఫూర్తితో వంటలో బాగా ప్రయోగాలు చేసేది. గుడ్లు, పాలు, సేమ్యా, గుమ్మడి, ఆఖరుకి టమోటా, ఆలూ తొక్కలు – ఇలా అన్నీ వాడి ప్రయోగాలు చేస్తూ ఉండేది. సేమ్యా ఇడ్లీ, ప్రెజర్ కుక్కర్ లో గుడ్లు లేని కేకు, చిక్కటి పులుపు ఉన్న టమాటా పచ్చడి, బియ్యప్పిండి తో రకరకాల వంటకాలు – ఇలా చాలా చేసింది.

“మా అమ్మకి ఆవు పేడ ఇచ్చినా దానితో ఒక పిఠా చేసేస్తుంది” అంటూ ఉంటాడు రొబి. (పిఠా అంటే బియ్యప్పిండితో చేసే అల్పాహారం)

మామూలు వంటలతో పాటు పాన్ముని అత్తయ్య రెస్టారెంట్లలో, వీథుల్లో ఉండే చిన్న బండ్లలో దొరికే ఫ్యాన్సీ వంటకాలు కూడా బాగా చేయడం నేర్చుకుంది. ఫుచ్కా (పానీపూరీ), మసాలా దోశ, చౌమీన్, చిల్లీ చికెన్ ఇలాంటివన్నీ చేసేది. పిల్లలు బైట చిల్లీ చికెన్ తిన్నారని తెలిస్తే వెంటనే ఇంట్లో చేసి రెంటిలో ఏది బాగుందని అడిగేది.

బిరం మామకి 1999 చివర్లో వదోదరకి బదిలీ అయిందన్న విషయం తెలిసినపుడు అత్తయ్యకి వెంటనే ఆహారం గురించిన చింత కలగడం పెద్ద ఆశ్చర్యం కలిగించలేదు.

“అక్కడ మనమేం తింటాము?” ఆశ్చర్యంగా అన్నది.

“గుజరాత్‌లో చేపలు తినరేమో కదా?”

ఘట్శిల లోని స్నేహితులు, బంధువులూ కూడా “మీరు అక్కడ ఎక్కడుంటారు? ఏం తింటారు? అంత దూరం పోయి ఒక్కళ్ళే ఉండగలరా?” అంటూ‌ ప్రశ్నలేశారు.

ఈ ప్రశ్నలన్నీ అప్పటికే ఇలాంటి ప్రశ్నలతో సతమతమవుతున్న అత్త-మామలని మరింత ఒత్తిడికి గురిచేశాయి. బిరం మామ అసలు ఈ వయసులో బదిలీని ఊహించలేదు. పదేళ్ళలో రిటైరవుతాడనగా ఇప్పుడు ఇంకో ఊరికి పోవడం అన్నది పెద్ద విషయమే. దాదాపు దేశంలోని ఒక మూల నుండి ఇంకో మూలకి పోతున్నట్లే.

పాన్ముని అత్తయ్య లోకజ్ఞానం కలది కనుక వెంటనే గుజరాత్‌లో తెలిసిన వారిని సంప్రదించడం మొదలుపెట్టింది. మా బంధువులలో ఝపన్ అని మా అక్క ఒకామె వదోదర లోనే ఉంటోంది. ఆమె భర్త సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసేవాడు.

“హలో, ఝపన్… అవునమ్మా … మీ మామయ్య కి వదోదర బదిలీ అయ్యింది.”

“ఓహ్, నువ్వూ వస్తున్నావా అత్తయ్యా వదోదరకి?”

“అవును. ఎలా ఉంటుంది అక్కడ?”

“ఊరు బాగుంటుందత్తయ్యా. అంతా పొందికగా, శుభ్రంగా ఉంటుంది. కాస్త అలవాటు పడ్డాక నీకు నచ్చుతుంది.”

“అలవాటు పడక తప్పదు కదా ఝపన్! నా ఖంగారల్లా ఎక్కడుంటాం, ఏం తింటాం అనే. నీకు తెల్సు కదా!”

“తెల్సు అత్తయ్యా. అదే కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు.”

“ఇబ్బందా… ఏమిటది?”

“అవునత్తయ్యా. వీళ్ళ ఆహారపుటలవాట్లు వేరే. ఇక్కడికొచ్చాక మనం రోజూ తినేవి కొన్ని మానేయాల్సి వస్తుంది.”

“ఎలాంటివి ఝపన్?”

“హుం….. మాంసం తినరు ఇక్కడ. చేప, చికెన్, మటన్ – కనీసం గుడ్లు కూడా తినరు.”

“అవునా!!!”

“ఖంగారు పడకత్తయ్యా. మాంసం తినేవాళ్ళు ఇక్కడా ఉన్నారు. కొన్ని చోట్ల గుడ్లు, మాంసం అమ్ముతారు కానీ అవి అంత తేలికగా దొరకవు. మాంసం తినేవాళ్ళతో ఇక్కడి వాళ్ళు అంతగా కలవరు. ఇక్కడంతే.”

“ఓహ్. ఇలా ఐతే ఏం చేసేది ఝపన్?”

“బాధపడకు అత్తయ్యా, నీకు గుడ్లో చికెనో తినాలనిపిస్తే మా ఇంటికి రా. మా సీఐఎస్ఎఫ్ క్యాంపస్ లో అంతా సులభంగా దొరుకుతాయి. ఇబ్బందేం లేదు”

***

2000 సంవత్సరం ఆఖరుకి వచ్చేసరికి మా మామ వాళ్ళు వదోదరకి వెళ్ళిపోయారు. కటక్ లోని మెడికల్ కాలేజిలో చదువుతున్న రొబి అక్కడే ఉండిపోయాడు. తొమ్మిదో తరగతిలో ఉన్న హొపొన్ అమ్మా నాన్నలతో కలిసి వదోదర వెళ్ళి అక్కడి ఓఎన్జీసీ లోని కేంద్రియ విద్యాలయంలో చేరాడు. ఆ స్కూలు సుభాన్ పురా కాలనీలో వీళ్ళు ఉంటున్న గ్రౌండ్ ఫ్లోరు ఇంటి నుండి దాదాపు ఓ గంట ప్రయాణం.

అది కొంచెం సౌకర్యవంతంగా ఉన్న రెండస్థుల మేడ. ఇంటి యజమాని రావు వాళ్ళు సీనియర్ సిటిజన్ జంట. ఒక హాలు కం భోజనాల గది, రెండు పడగ్గదులు, రెండు బాత్రూములు, ఒక వంటగది. ఇంటి ముందు ఒక వరండా ఉంది. వెనకాల కూడా ఒక చిన్న వరండా ఉంది. ఇంటి ముందున్న స్థలంలోనే చిన్న డాబా, పూలమొక్కలకని స్థలం, కారు పార్కింగ్ అన్నీ ఉన్నాయి. ఇంటి వెనకాల ఒక చిన్న తోట ఉంది. ఒక పక్కగా పై అంతస్తుకి, మేడమీదకి వెళ్ళేందుకు మెట్లున్నాయి. నిజానికి రావు గారి మారుతీ 800 కోసం కట్టిన గ్యారేజి ఒకటే ఉండేది కానీ వాళ్ళు ఇంటి ముందు గేటు పక్కనే ఇంకో కారు కోసమని ఒక షెడ్డు వేయించారు. గేటు తెరవగానే ఉన్న కాంపౌండు రెండు అంతస్తులకీ కామన్ అనమాట.

రావు గారు వాళ్ళు ఆంధ్ర ప్రదేశ్ నుండి వచ్చిన తెలుగు దంపతులు. బిరం మామ లాగానే మిస్టర్ రావు కూడా ఏదో కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేశాడు. దేశమంతా తిరిగాక చివరగా వదోదర వచ్చి అక్కడ రిటైరై ఈ సుభాన్ పురా కాలనీలో స్థిరపడ్డాడు. వాళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్దవాడు జర్మనీలో పనిచేస్తున్నాడు, రెండో వాడు వేరే రాష్ట్రంలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు.

ఈ ఇంట్లోకి మారాక రావు గారితో జరిగిన మొదటి సమావేశాన్ని బిరం మామ మర్చిపోలేడు. ఆ రోజు కాసేపు కూర్చుని టీ తాగుతూ, బిస్కట్లు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుకున్నాక రావు – “మిస్టర్ సోరెన్, ఏమనుకోకండి – కొంచెం మీ గురించి వివరాలు చెబుతారా? మీరెక్కడి వాళ్ళు?” అనడిగాడు.

“దానిదేముంది…ఇంతకుముందు చెప్పాను కదా… మేము జార్ఖండ్ నుండి వచ్చాము.” బిరం మామ అన్నాడు.

“నేను గతంలో జార్ఖండ్ వెళ్ళాను. చాలా రోజుల క్రితం రాంచీ, పలామూ వెళ్ళాను. అప్పట్లో అదంతా బీహార్ రాష్ట్రమే కదా. జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడింది కొన్ని రోజుల క్రితమే కదా” రావు అన్నాడు, బిరం మామని ఆశ్చర్యానికి గురిచేస్తూ.

“అవును. నవంబర్ లో” అన్నాడు బిరం మామ.

“మీరు… మీరు ఏమీ అనుకోనంటే…”

“పర్వాలేదు. చెప్పండి. నేనేమీ అనుకోను” అన్నాడు బిరం మామ కొంచెం ఖంగారుగా.

“హుం …. సోరెన్ అంటే గిరిజన పేరు కదా? ప్లీజ్, అపార్థం చేసుకోకండి. సమాచారం తెలుసుకోడానికి అడుగుతున్నాను అంతే”

చూడ్డానికి మెతగ్గా కనిపిస్తున్న రావు ఇలా మొహం మీదే అడిగేయడంతో ఆశ్చర్యపోయినా తమాయించుకున్న బిరం మామ – “అవునండి. మేము గిరిజనులమే. సంతాలీలము” అన్నాడు.

“సోరెన్ గారూ, నన్ను క్షమించాలి. మీరేమనుకోకండి. నేను నా వృత్తిలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉండే గిరిజనులతో పనిచేశాను. నేను రాంచీలో కూడా ఉన్నాను. నాకు అన్ని జాతులూ సమ్మతమే. పైగా అసలు ఈ ఊళ్ళో మేము కూడా పరాయి వాళ్ళమే కదా!”

“అవునండి. నాకు తెలుసు” అన్నాడు బిరం మామ…. ఈ సంభాషణ ఎటు పోతోందో అర్థం కాక.

“చూడండి సోరెన్, నేను అడగడానికి ఒక కారణం ఉంది. అందరూ నా లాగ ఆలోచించకపోవచ్చు.”

ఏం చెబుతున్నాడో అని వింటున్నాడు బిరం మామ.

“వదోదర ఒక హిందూ నగరం. జనాలకి పవిత్రత మీద నమ్మకం ఎక్కువ. అంటే ఏమిటో నాకు తెలియదు కానీ, ఇక్కడ వీళ్ళు మాంసం తినరు తెలుసా? మాంసం, చేపలు, చికెన్, గుడ్లు – ఏదీ తినరు. పైపెచ్చు శాకాహారులు కాని వారిపై వీళ్ళకంత సదభిప్రాయం లేదు.

“తెలుసండి” బిరం మామ తల ఊపాడు.

“గిరిజనులు, తక్కువ కులాల హిందువులు వీళ్ళంతా అపవిత్రులని వీళ్ళ అభిప్రాయం. మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను” ఇబ్బంది పడిపోతూ అన్నాడు రావు.

“నాకు కొంత తెలుసండి” అన్నాడు బిరం మామ.

“ముస్లిములు, క్రిస్టియన్‌లు అయితే అసలు సమస్యే లేదు. వాళ్ళకంటూ ఈ ఊళ్ళో వేరే కాలనీలు ఉన్నాయి. ఊళ్ళోనే వేరే ఊళ్ళనమాట ఈ ముస్లిం, క్రిస్టియన్ బస్తీలు.”

బిరం మామ అలాగే తల ఊపుతూ ఉన్నాడు.

“సోరెన్ గారూ, మీరు చూస్తే మంచి వారిలా ఉన్నారు. సంసారపక్షంగా ఉన్నారు. మేము మిమ్మల్ని నమ్ముతున్నాము. మీరొక చిన్న పని చేయగలరా?”

బిరం మామ సందేహంగా – “ఏమిటండీ అది?” అని అడిగాడు.

“చూడండి సోరెన్ గారూ, ఇరుగుపొరుగులు మీ గురించి ఆరా తీయొచ్చు. వాళ్ళకి కుతూహలం ఎక్కువ. మీరెక్కడివారని అడిగితే జార్ఖండ్ నుంచి వచ్చానని మాత్రం చెప్పండి. అంతకు మించి వివరాలు ఇవ్వవద్దు. అసలు భుబనేశ్వర్ నుండి బదిలీ మీద వచ్చానని చెబితే మరీ మంచిది. ఆ ఊరు అందరికీ తెలుసు కనుక ఇంక ఎవరికీ సందేహాలు రావు. ఏమంటారు?”

“ఆ, అర్థమవుతోందండీ” అన్నాడు బిరం మామ కొంచెం స్థిమిత పడుతూ. ఈ సంభాషణ జరగవచ్చని విని సన్నద్ధుడై ఉన్నాడు.

“నన్ను ఎవరైనా అడిగితే నాకు మీరు నమ్మకస్తులైన స్నేహితులు, సహోద్యోగుల ద్వారా పరిచయం అనీ, మీరు మంచివారనీ చెబుతాను.” అన్నాడు రావుగారు.

“మీకు నా కృతజ్ఞతలు” అన్నాడు బిరం మామ బలవంతంగా నవ్వు తెచ్చి పెట్టుకుని.

రావు గారు “హమ్మయ్యా” అన్నట్లు నిట్టూరుస్తూ, “సోరెన్ గారూ, థాంక్స్. ఇంతకుముందు మేము కూడా మాంసం, చికెన్, గుడ్లు తినేవాళ్ళము. అసలు పొద్దునే అల్పాహారంలో గుడ్లు తప్పనిసరిగా ఉండేవి రోజూ. నా కొడుకులు ఇప్పటికీ నాన్ వెజ్ తింటారు. కానీ ఇక్కడికొచ్చినపుడు మాత్రం తినరు. మేము ఇంక ఇక్కడే స్థిరపడిపోదాం‌ అని నిర్ణయించుకున్నపుడు ఈ ఇక్కడి పరిశుభ్రత, పద్ధతులూ వీటివల్ల కలిగే సుఖంతో పోలిస్తే మాంసం మానేయడం అన్నది చిన్న సమస్యగా అనిపించింది. మీరు అర్థం చేసుకుంటారనుకుంటాను” అన్నాడు.

“భలేవారే, అర్థమవుతోంది లెండి” అని మాత్రం అనగలిగాడు బిరం మామ.

“అయినా ఎవరి మనసులో ఏముందో, పైకి మర్యాదగా ఉంటూ ఎవరి మీద ఎవరు ద్వేషం పెంచుకున్నారో ఎవరికి తెలుసు? పదేళ్ళ బట్టి ఇక్కడ ఉంటున్నాము. అయినా సరే, మేము గుజరాతీలం కామని మా గురించి ఎవరన్నా ద్వేషం పెంచుకున్నారేమో నాకు తెలీదు. అసలు ఎప్పటికీ తెలియదేమో కూడా. ఆ వీథిలో ఉన్న ఇల్లు చూశారా” అంటూ ఎదురుగ్గా ఉన్న ఇరుకు వీథిలోని ఇంటిని చూపాడు. “అందులో ఉండేది మహమ్మద్ వాళ్ళ కుటుంబం. వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టపడనివాళ్ళు ఈ కాలనీలో ఉన్నారు. అందుకని మనం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు మళ్ళీ.

“నిజమే లెండి.” బిరం మామ కూడా తలఊపాడు.

“అన్నట్లు జాగ్రత్తంటే గుర్తొచ్చింది… మీరు ఇంకోటి చేయాలి” మళ్ళీ కొంచెం నసుగుతూ అన్నాడు రావు గారు.

ఇంకేం అడుగుతాడో? అనుకుంటూనే బిరం మామ “చెప్పండి. ఏం చేయాలి?” అన్నాడు.

“మా ఇంటి వంటగదిలో మాంసం వండనని మాటివ్వగలరా? చికెన్, మటన్, చేపలు గుడ్లు ఏదీ వాడకూడదు.”

బిరం మామ ఒకసారి కిందకెళ్ళి పాన్ముని అత్తతో ఈ సంభాషణని గురించి చర్చించాడు.

ఆమె చాలాసేపు తల పట్టుకుని అలా మౌనంగా కూర్చుండిపోయింది.

‘ఝపన్, ఎక్కడికొచ్చి పడ్డాము మేము అసలు?’ తర్వాత పాన్ముని తన కోడలి వద్ద వాపోయింది.

ఝపన్ అక్క “పర్వాలేదు లెండి, కొన్నాళ్ళలో అలవాటు అవుతుంది” అని ఓదార్చింది.

“అయినా మాంసం తినేవాళ్ళని ద్వేషించడం ఏమిటి? మనకి చేపలో, చికెనో కనీసం ప్రతి ఆదివారమన్నా కావొద్దా? గుడ్లు దాదాపు రోజూ వాడతాము కదా?” పాన్ముని అత్తయ్య తన కోపాన్ని వెళ్ళగక్కింది.

“ఏం చేస్తాము అత్తయ్యా? జ్యమోన్ దేస్, త్యమోన్ భేస్. ఏ ఊళ్ళో ఆ ఊరి పద్ధతులని అవలంబించాలి కదా” అని నిట్టూర్చింది ఝపన్ అక్క.

“ఇక్కడ క్యాంపస్‌లో ఉన్న మార్కెటులో గుడ్లు, చికెన్, మటన్, చేపలు, ఆఖరుకి మందు కూడా కొనుక్కోవచ్చు కానీ మేము బయట ఇవేవీ కొనం. అయినా ఈ వదోదర బజారు మొత్తంలో ఎక్కడా ఇవన్నీ దొరకవనుకో” అన్నది మళ్ళీ.

పాన్ముని అత్తయ్య ఆశ్చర్యంతో, నమ్మశక్యం కానట్లు చూసింది.

“ఖంగారు పడకండి. మీకు చేపలు తినాలనిపించినప్పుడల్లా మా ఇంటికొచ్చేయండి. మీ ఇంటికి ఫోను కనెక్షన్ వచ్చిందా?” పాన్ముని అత్త మోకాలు నిముర్తూ అన్నది ఝపన్ అక్క.

“ఇంకా లేదు. మరో వారం పట్టొచ్చు” అన్నది పాన్ముని అత్త.

“సరే అత్తయ్యా, మీకు ఫోన్ రాగానే కాల్ చేయండి. మధ్యాహ్న భోజనానికో, రాత్రికో ఏదో ఒకరోజు రండి. మన సంతాలీ సంప్రదాయ పద్ధతిలో దాకా (అన్నం) తో జిల్హాకూ (చేపలకూర) తిందురు గానీ. సరేనా?

లాండ్ లైన్ ఫోను రాగానే పాన్ముని అత్త మొదట కటక్‌లో ఉన్న రొబి వాళ్ళ హాస్టల్ కి కాల్ చేసింది.

“ఒరే బాబూ, మేము చికెన్ తిని రెండు వారాలైందిరా. కనీసం గుడ్లు కూడా తినలేదు”

“మంచిదేకదా, బో (అమ్మ)” రొబి నవ్వాడు.

“మంచిదా?”

“అంతే కదా… కనీసం ఆరోగ్యం బాగుంటుంది నీకు అప్పుడు. మామూలుగా చికెన్ తిన్న ప్రతిసారీ అజీర్తి చేస్తుంది కదా నీకు”

“నేనే వండితే బానే ఉంటుంది కదరా”

“ఊరికే బాధపడకు బో. ఆహారపుటలవాట్లు మార్చుకో. పెద్దదానివవుతున్నావు కదా. పెద్దవాళ్ళు మాంసం, గుడ్లు ఇలాంటివన్నీ తగ్గిస్తే మంచిది. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ సమస్యలు, శరీరంలో కొవ్వు పెరగడం, అజీర్తి, కీళ్ళ వాతం …ఇలా అన్నీ వస్తాయి”

ఈ సంభాషణ అప్పటికే చిరాగ్గా ఉన్న అత్తయ్యకి మరింత చిరాకు తెప్పించింది.

***

ఇలా ఆహారం విషయంలో ఇన్ని పరిమితులు ఉన్నప్పటికీ ఏడాది తిరక్కుండానే పాన్ముని అత్తయ్య వదోదర నగరం ప్రేమలో పడిపోయింది. మార్కెట్లు, రోడ్లు, అన్నీ శుభ్రంగా, పద్ధతిగా ఉండడమే దీనికి కారణం. పాత ఊరే అయినా కావాలసినంత ఖాళీ స్థలం, పచ్చదనం ఉన్నాయి. ఒడిశా, జార్ఖండ్ లతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంది. ఒకరోజున బయట హోటెల్లో తినడానికి సాహసించడంతో పాన్ముని అత్తకి ఈ ఊరిపై కలిగిన అభిమానం స్పష్టంగా తెలిసింది.

‘ఇవాళ బయట తిందాము’ ఒకరోజు మధ్యాహ్నం షాపింగ్ చేస్తూ ఉండగా బిరం మామ సూచించాడు.

“బయట తినాలా” – అత్తయ్య అవాక్కయింది.

‘అరే, తింటే కదా ఇక్కడ హోటెళ్ళు ఎలా ఉంటాయో తెలిసేది? భుబనేశ్వర్‌లోలా కాదు. ఇక్కడ పద్ధతులు వేరే. అంతా శుభ్రంగా ఉంటాయి’.

కుతూహలం వల్ల బిరం మామ వెంట ఒక కొట్టుకి వెళ్ళింది.

సాధారణమైన హోటెలే అయినా బాగా విశాలంగా ఉంది. మంచి గాలి తగులుతోంది. అన్నింటికంటే ముఖ్యంగా చాలా శుభ్రంగా ఉంది. టేబుళ్ళ మధ్య వచ్చే పోయే వాళ్ళూ, సర్వర్లూ తిరగడానికి కావాలసినంత స్థలం ఉంది. టేబుళ్లు పైన తెల్లగా ఉన్నాయి కానీ బాగా శుభ్రంగా ఉన్నాయి. పసుపు మరకలలాంటివి లేవు. గ్లాసులు, కూల్ డ్రింకుల వంటి మరకలు లేవు. ఎక్కడా నీటి మడుగులు, మూలల్లో పేరుకు పోయిన చెత్త, నేల మీద బూట్ల ముద్రలు, బురద ఏవీ లేవు. పాన్ముని అత్తయ్య వాళ్ళ సొంతింట్లో లాగా ఉండింది.

ఇద్దరూ చెరొక గుజరాతీ థాలీ ఆర్డర్ ఇచ్చారు. పాన్ముని అత్తకి వంటకాలు సాధారణంగా నే ఉన్నా ఆ రుచి నచ్చింది. కానీ అన్నింటికంటే ఆ పరిశుభ్రతే బలమైన ముద్ర వేసిందని చెప్పాలి.

***

మా అత్తా-మామా తరువాత కూడా తరుచుగా ఝపన్ అక్కయ్య వాళ్ళింటికి వెళ్ళేవారు. కానీ, మామ ఆఫీసు, హొపొన్ స్కూలు – వీటితో వాళ్ళు బిజీ అవడం, పాన్ముని అత్తయ్య వడోదర కి అలవాటు పడడం – వీటి వల్ల ఆ తరుచుదనం కాస్త తగ్గింది. అయినా కనీసం నెలకోసారన్నా కలిసేవారు.

అలాగే ఝపన్ అక్కయ్య చేసే వంటకాల్లో కూడా తేడా వచ్చింది. పుట్టింటివారైన అత్తయ్య వాళ్ళకోసం ఝపన్ అక్కయ్య చేపలు, చికెన్ వంటకాలు అన్నీ ఆదరంగా వండి పెట్టేది. అయితే, క్రమంగా వాళ్ళు మాంసం తినడం మానేసి, బయట హోటెళ్ళలో దొరికే శాకాహార భోజనానికి అలవాటు పడ్డాక ఆమెకి కూడా కష్టపడి అవన్నీ వండకని చెప్పేశారు. ఏదో అన్నం, పప్పు, ఒక కూరా, పేరుకి మాంసం కూడా ఉంది అనుకోడానికి ఒక్కోసారి ఏదన్నా చేసేది – కనీసం గుడ్డు కూరైనా సరే.

‘నిజం అత్తయ్యా, ఈ ఊరు చాలా శుభ్రంగా ఉంటుంది. అసలీ ఊరులో ఉండడంలో సుఖం అదే. అన్నీ పద్ధతిగా ఉంటాయి. మీరింకా అహ్మదాబాదు పోలేదు కదా?’ ఝపన్ అక్కయ్య అన్నది పాన్ముని అత్తయ్య తో ఒకసారి.

‘ఇంకా లేదు కానీ విన్నాను. బాగుంటుందంట కదా?’ అత్తయ్య అన్నది.

‘బాగుండటమా? అద్భుతంగా ఉంటుంది! అసలు రోడ్లెంత బాగుంటాయంటే … హాయిగా పరుచుకుని పడుకునేయొచ్చు. ఇక ఆ షాపులు..ఆ బజార్లు…’

‘ఓహో, ఓసారి మీ మామని అక్కడికి తీసుకెళ్ళమని అడుగుతా’

‘తప్పకుండా వెళ్ళండి. అత్తయ్యా, మీకు తెలుసా, ఒకప్పుడు గుజరాత్ లోని నగరాలు కూడా మురికిగా ఉండేవి. కానీ ఒకసారి..ఒక ఏడెనిమిదేళ్ళ క్రితం.. ఇక్కడొక ప్లేగు మహమ్మారి వచ్చింది గుర్తుందా?’

పాన్ముని అత్తయ్య గుర్తుందన్నట్లు తల ఊపింది. ఒకరోజు తను ఘాట్శిల రైల్వే స్టేషన్‌లో ఉండగా అహమ్మదాబాదు-హౌరా ఎక్స్‌ప్రెస్ ఈ స్టేషన్ మీదుగా పోతుందని స్టేషన్ మాస్టర్ ప్రకటించాడు. వెంటనే జనమంతా ప్లాట్ ఫాంకు దూరంగా జరగడం మొదలుపెట్టారు. పెద్దగా శబ్దం చేస్తూ ఆ ట్రెయిను స్టేషన్ లోకి రాగానే అంతా మొహాలు తిప్పుకుని ముక్కూ, నోరు, మొహం అన్నీ చేత్తోనో, రుమాలుతోనూ కప్పేసుకున్నారు. ఈ సంఘటన గుర్తు వచ్చింది అత్తయ్యకి.

‘అప్పటి నుండి ప్రభుత్వం ఇలా పట్టణాలన్నీ శుభ్రంగా ఉండడం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది’ ఝపన్ అక్కయ్య అన్నది.

ఇలాంటి సంతాలీ మధ్యాహ్న భోజనాల సంభాషణల్లో ఒకరోజు పాన్ముని అత్త ఝపన్ అక్కయ్యతో “నేను ఎప్పుడూ భుబనేశ్వర్ లోని హోటెళ్ళలో తినడానికి సంకోచించేదాన్ని. ఎపుడైనా రొబి, హొపొన్ ఏదన్నా బయటి నుంచి తెచ్చిచ్చినా నాకు వెంటనే ఆరోగ్యం పాడయ్యేది. కడుపు నొప్పి. గ్యాసు. దీనితో ఇక బయట తినాలంటే భయంగా ఉండేది. ఎపుడన్నా మీ మామ బయట తిందాం అంటే మేఫెయిర్, స్వొస్తి లాంటి ఖరీదైన ప్రదేశాలకి తప్ప రాననేదాన్ని – అవైతే శుభ్రంగా ఉంటాయని. కానీ, ఇక్కడ బయటి ఆహారం కూడా బాగుంది ఝపన్” అన్నది.

“నేను చెప్పా కదా అత్తయ్యా, ఈ ఊరుకి నువ్వు తొందరగా అలవాటుపడిపోతావు అని.”

***

కానీ పాత అలవాట్లు అంత తేలిగ్గా పోవు. వీళ్ళు చికెన్, చేపలు, మటన్ ఇవన్నీ దాదాపు మానేశారు కానీ, ఒక్కోసారి గుడ్డు అన్న చిన్న సైజు పాపంకోసం నాలుక ఉవ్విళ్ళూరేది. సుభాన్ పురా కాలనీకి దగ్గర్లో ఉన్న మార్కెట్లో ఒక మూలకి ఒక బీహారీ నడిపే చిన్నకొట్టు ఉండేది. ఆ మొత్తం మార్కెట్‌లో గుడ్లు దొరికే షాపు అదొక్కటే. దాని ముందు ఎప్పుడూ బోలెడంత మంది లైనులో ఉండేవారు. బిరం మామో, హొపొనో ఎవరో ఒకరు ఎపుడన్నా అక్కడికెళ్ళి, చుట్టుపక్కల తెలిసిన వారెవరూ తమని గమనించడంలేదని రూఢి చేసుకున్నాక ఒక రెండు గుడ్లు కొని వాటిని జాగ్రత్తగా పొట్లం కట్టి, గుడ్డ సంచీలో వేసి ఇంటికొచ్చేవారు.

గుడ్లు కొనడమే ఇంత కష్టమైన పనిలా ఉంటే, ఇంక వాటిని వండటం విషయం చెప్పక్కర్లేదు. ఒకసారి ఒక గుడ్డుకంటే ఎక్కువ వాడితే ఇక దొరికిపోయినట్లే. హొపొన్ ఇవాళ ఒక గుడ్డు తిన్నాడంటే ఇంకోటి తరువాతి వారమే. పాన్ముని అత్తయ్య తాను వండిన గుడ్డు వాసన ఇంటి ప్రాంగణం నుంచే కాదు… సుభాన్ పురా కాలనీ దాటి కూడా వెళ్ళిపోయిందని తీర్మానించుకున్నాక గానీ ఇంకో గుడ్డు వండేది కాదు.

పైగా ఈ వాడేసిన గుడ్డు పెంకుల్ని పారవేయడం ఇంకో సమస్య.

ప్రతి ఉదయం వీళ్ళు చెత్తబుట్టలకి వేసిన పాలిథీన్ కవర్లలో అప్పటిదాకా పోగేసిన కూరగాయల తొక్కలు, చిత్తు కాగితాలు, పొట్లాలు, టీ ఆకులు ఇలాంటివన్నీ తీసుకుని బిరం మామో హొపొనో ఎవరో ఒకరు వెళ్ళి కాలనీ బయట ఉన్న మునిసిపాలిటీ చెత్తకుండీల్లో పడేసి వచ్చేవారు. గుడ్డు పెంకులు ఉన్న రోజులు మాత్రం ఇంకా దూరంగా వెళ్ళి పడేసి వచ్చేవాళ్ళు. అలా వెళ్ళడం వీలు పడకపోతే ఇంటి వెనకాల తోటలో పాతిపెట్టేసేవారు.

ఇలాంటి రోజుల్లో పాన్ముని అత్తయ్యకి భుబనేశ్వర్‌లో ఉన్న స్వేచ్ఛ, కాస్త దూరాన ఉన్నా, అందరినీ ఒక్కలాగ తాకే బంగాళాఘాతపు గాలీ గుర్తు వచ్చేవి. భుబనేశ్వర్ లో ఉండే రోజుల్లో రొబి-హొపొన్ ల కోసం తరుచుగా రెండు గుడ్లతో ఆమ్లెట్ చేయడం గుర్తు తెచ్చుకుంది. తను చేసే కత్లా మచ్ (ఒక విధమైన చేపలకూర) ని అక్కడ ఉండే ఇతర సంతాలీ గృహిణులు కూడా ఎంతో ఇష్టపడేవారు. చికెన్, మటన్ ఉన్న వంటకాలు కూడా తరుచుగా చేసేది. అసలు గుడ్లు, చికెన్, చేపలు, మటన్ ఇలా తను చేసే వంటకాల గుబాళింపు అలా తమ ఇంటిని దాటి ఆ హెచ్.ఐ.జీ. హౌజింగ్ బోర్డు కాలనీ అంతా వ్యాపించేది. ఎవ్వరూ ఏమీ అనేవాళ్ళు కాదు. ఎవ్వరూ బిరం చొక్కా పట్టుకుని ‘సోరెన్, నీకు మాంసం వండొద్దని చెప్పలేదా?’ అని అడుగుతారన్న భయం లేదు. అయితే గియితే వచ్చి “వదినా, ఈ కూరెలా చేశావు?” అని అడిగేవారంతే. అప్పుడు తను ఆనందంగా ఎలా చేయాలో వివరించేది.

ఒడిశాలో పాన్ముని అత్తయ్య సంతాలీగా, ఒడియా వనితగా, బెంగాలీ గా..ఎలాగైనా ఉండగలిగేది. కానీ గుజరాత్ లో గుజరాతీ లా ఉండాలంతే. భుబనేశ్వర్‌లో సంతాలీలు అంతా కలిసి బాహా, సొరై, సక్రత్ లాంటి సంతాలీ పండలన్నీ కలిసి చేసుకునేవారు. ఏటేటా అంతా కలిసి నందన్ కనన్ జూ కి పిక్నిక్ వెళ్ళేవారు. అతిథులందరికీ జిల్-లైటో (మాంసం, బియ్యప్పిండి కలిపి వండే సంతాలీ ఆహార పదార్థం) వండేవారు. కటక్, పారాదీప్, రూర్కెలా, బారిపదా, కోరాపుట్ ఇలా ఒడిశా లోని ఇతర ప్రాంతాల్లో ఉండే సంతాలీలని కూడా ఆహ్వానించేవారు. అంతా సందడిగా ఉండేది. గుజరాత్ లో కూడా ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న సంతాలీలు ఉన్నారని ఝపన్ అక్కయ్య చెప్పింది పాన్ముని అత్తయ్యకి. ఇక్కడ కూడా అక్కడిలా సంతాలీలంతా పిక్నిక్‌కి పోయి బహిరంగంగా జిల్-లైటో చేసుకోవడం సాధ్యమా? అనిపించేది పాన్ముని అత్తయ్యకి. కానీ అక్కడి సమాజ నియమాలకి తగ్గట్లు ఉండాల్సి రావడం ఆమెని నిలువరించేది.

అయినా కూడా, వదోదరలో జీవితం అత్తయ్యకి నచ్చింది. 2002లో హొపొన్ బోర్డు పరీక్షలకి ముందు ఒకసారి జార్ఖండ్ వెళ్ళినపుడు పాన్ముని అత్త తన మూడేళ్ళ మేనకోడలి కోసం గుజరాతీ లేసు అల్లిక, అద్దాలు ఉన్న ఒక లెహెంగా-ఛోళీ కొన్నది. అలాగే వదోదరాలో స్థానిక సంప్రదాయాన్ని అనుసరించి చెక్కపనిచేసే వారి నుంచి మంచి సోఫా ఒకటి చేయించుకుంది తమ ఇంటికోసం. అసలు అది చెక్కిన విధానం, దానిమీద లక్క పూత, రెండూ అద్భుతంగా ఉండి మెరుస్తూ ఉండేది. పాత సోఫాని ఇంటివెనకాల వరండాలో వేసి, ఈ కొత గుజరాతీ సోఫాని హాలులో పెట్టారు. గోడల మీద భిటియా (గుజరాతీ సంప్రదాయ పద్ధతిలో చేసే ఎంబ్రాయిడరీ) అలంకారాలు, వివిధ రకాల పూసల దండలు, కప్పులు ఇలాంటివి ఇంటి నిండా పోగుచేసింది.

సంవత్సరం తిరక్కుండా ఈ కొత్త నగరంలో సోరెన్ కుటుంబం బాగా సర్దుకుంది. బిరం మామ ఆఫీసులోనూ, ఇంటి చుట్టుపక్కలా కొందరు స్నేహితులు ఏర్పడ్డారు. ఈపాటికి అందరికీ వీళ్ళు ఆదివాసీలని తెలిసినా, వీళ్ళు అక్కడి సమాజంలోకి కలిసిపోయేందుకు ప్రయత్నించారు. గుళ్ళకి గోపురాలకీ వెళ్ళడం, పండగలు చేసుకోడం, ఉపవాసాలుండటం, ఇంట్లో దేవుడి ముందు దీపం వెలిగించడం – ఇలాంటివన్నీ చేస్తున్నందువల్ల స్థానికులు వీళ్ళని తమలో ఒకరిగా స్వీకరించారు.

రావు గారికి కూడా వీళ్ళు ఇలా వదోదర లోని జీవన శైలికి తేలికగా అలవాటు పడడం నచ్చింది. బిరం మామతో గేటు దగ్గర జరిపే సంభాషణలు రోజు రోజుకీ స్నేహపూర్వకంగా మారాయి. పాన్ముని అత్తకి, రావు గారి భార్యకీ కూడా స్నేహం కుదిరింది.

ఒకరోజు బిరం మామ ఆఫీసుకి వెళ్ళాక రావు గారి భార్య ఇంటికొచ్చి పాన్ముని అత్తని ఆశ్చర్యపరిచింది. ఆమె సాధారణంగా ఇల్లొదిలి బయటకి రాదు. కాసేపు అదీ ఇదీ మాట్లాడాక ఆమె ఉన్నట్లుండి “ఏమండీ, కొంచెం మీ వంటగదిలో నేను గుడ్డు వండుకోవచ్చా? రావు గారు నన్ను మా ఇంట్లో చేయనివ్వరు” అన్నది. పాన్ముని అత్తయ్యకి ఆశ్చర్యం నుండి తేరుకోడానికి ఓ నిముషం పట్టింది. అసలేం చెప్పాలో అర్థం కాలేదు. ఇలా ఎవరన్నా అడుగుతారా ఉన్నట్లుండి? ఈమధ్యనే కదా పరిచయం అయింది అసలు ఈమెతో? ఏమన్నా పరీక్షించేందుకు అడుగుతోందా? హొపొన్ గుడ్డు పెంకులు తోటలో పాతిపెడుతూంటే ఎపుడన్నా చూసిందా? ఇప్పుడేమిటి చేయడం? ఇలా ఆలోచిస్తూ,

“అదీ… “ ఏదో అనబోయి ఆగింది పాన్ముని అత్త.

రావు గారి భార్యకి అర్థమైనట్లు ఉంది. “అపార్థం చేసుకోకండి… మీకంటే ముందు ఇక్కడ అద్దెకున్న వాళ్ళని… మా ఆయన ఖాళీ చేయించి పంపేశాడు. నేను మాంసాహారం తిని చాలా నెలలైపోయింది. ఆయన నన్ను తిననివ్వడు”

ఆరోజు పొద్దున పాన్ముని అత్తయ్య మంచి కారం దట్టించి ఆంధ్రా పద్ధతిలో గుడ్డు కూర చేయడం నేర్చుకుంది. తినడం అయ్యాక రావు గారి భార్య బాత్రూం లోకి వెళ్ళి బాగా నోరు పుక్కిలించడం వినిపించింది. ఆమె బయటకొచ్చాక వాసన తెలీకుండా ఉండడానికి రెండు ఏలకులు ఇచ్చి పంపింది.

తరువాతి నెలల్లో పాన్ముని అత్తయ్య, రావు గారి భార్య ఇద్దరూ కలిసి తమకి కావాల్సిన మాంసాహారం వండుకునేందుకు సి.ఐ.ఎస్.ఎఫ్ కాంపస్ లో ఉన్న ఝపన్ అక్కయ్య ఇంటికెళ్లేవాళ్ళు. ఒకోసారి హొపొన్ కూడా స్కూలు ముగిసాక వాళ్ళతో వెళ్ళి ఎవరి వంట బాగుందో తీర్పులు చెప్పేవాడు.

***

ఫిబ్రవరి 27, 2002 – బుధవారం. హొపొన్ పరీక్షలయ్యాక ఘాట్శిల వెళ్ళడానికి ట్రెయిన్ టికెట్లు రిజర్వు చేసుకోడానికి బిరం మామ, హొపొన్ ఇద్దరూ వదోదర రైల్వే స్టేషన్‌కి వెళ్ళారు. దాదాపు ఉదయం పదకొండు ప్రాంతంలో బిరం మామ టికెట్లు తీసుకుని బయటకి వస్తూ ఉండగా ఉన్నట్లుండి ఏదో‌ కలకలం మొదలైంది. హొపొన్ అప్పటికే గేటు దగ్గరికెళ్ళిపోయి తండ్రి కోసం ఎదురుచూస్తున్నాడు.

ఒక ట్రెయిన్ ని తగలబెట్టేశారని ఎవరో అరిచారు.

కన్ను మూసి తెరిచేంతలో రిజర్వేషన్ కౌంటర్ వద్ద అలజడి. బిరం మామ ఇంకా హొపొన్ ని కలుసుకోలేదు.

“ట్రైన్ తగలబెట్టారా? ఎక్కడ?”

“ఇక్కడ కాదా? మరెక్కడ? ఏమైంది?”

“ఎవరు చనిపోయారు?”

“ఎప్పుడు?”

“గొడవలా? ఎక్కడ?”

టిక్కెట్లని మరిచిపోయి… ఫారాలు, ట్రైన్ టైం టేబుళ్ళూ ఇలాంటివన్నీ అక్కడే వదిలేసి అంతా రిజర్వేషన్ కౌంటర్ నుండి దూరంగా వచ్చేయడం మొదలుపెట్టారు.

హొపొన్ ఇదంతా గమనించి, చుట్టుపక్కల పరికించి చూసి, గేటు వైపు వస్తున్న తండ్రిని కనిపెట్టి ఆ వైపు చెయ్యి ఊపుతూ “బాబా” అని కేక పెట్టాడు.

“పో పో… వెంటనే కారులోకెళ్ళి కూర్చో” అక్కడ్నుంచే బిరం మామ అరిచాడు.

మళ్ళీ చెప్పక్కర్లేకుండా హొపొన్ గబగబా అక్కడి మెట్లు దిగుతూ పార్కింగ్ లాట్ వైపుకి పరుగుతీశాడు. కారు దగ్గరికి చేరాక ఒకసారి వెనక్కి తిరిగి తన వెనకాల జరుగుతున్న హడావుడి చూశాడు. జనం తన సామాన్లని, పిల్లల్ని గట్టిగా పట్టుకుని స్టేషన్ నుండి బయటకి వెళ్ళిపోతున్నారు. అవతలి వైపు చూస్తే నగరం కాస్త ప్రశాంతంగా ఉంది. పార్కింగ్ లాట్లో అందరూ తమ తమ బళ్ళు బైటకి తీయడంలో మునిగి ఉన్నారు. ఇంత హడావుడిలోనూ కార్లు రివర్స్ చేసేందుకు, ముందుకు వెళ్ళేందుకు ఒకరికొకరు సహకరించుకుంటున్నా అందరి మొహాల్లోనూ ఒక ఆందోళన కనిపిస్తోంది.

బిరం మామ తన ఆమ్నీ బండి వైపుకి పరిగెత్తి వచ్చి, తాళం తీసి, హొపొన్ వైపు తలుపు తీస్తూ, “గబగబా ఎక్కేసేయ్” అని అరిచాడు.

“బాబా, ముందు కారు రివర్స్ చేయి, నేను దాని సంగతి చూస్తాను” హొపోన్ అన్నాడు.

“నువ్వు లోపలికి రా ముందు” బిరం మామ కోపంగా అరిచాడు.

హొపొన్ కారు ఎక్కేసి గబాలున తలుపేశాడు. బిరం మామ కారు రివర్సు చేస్తూ ఉండగా వెనకాల ఉన్న బండి మీద చిన్న గీత పడింది. హొపొన్ కి కొంచెం భయమేసింది – అతనెప్పుడూ తండ్రిని ఇలాంటి స్థితిలో చూడలేదు. నెమ్మదిగా పార్కింగ్ లాట్, స్టేషన్ దాటుకుని ఊళ్ళోకి ప్రవేశించారు.

ఇక్కడికొచ్చేసరికి పరిస్థితి కొంచెం చల్లబడింది. స్టేషన్ చుట్టుపక్కల వీథుల్లో షాపులు మూసేశారు. “ఎక్కడో రయట్ మొదలైంది” హొపొన్‌కి వివరించాడు బిరం మామ, రోడ్డువైపుకి చూస్తూనే. ఆయన మొహం మీద ఇంకా ఆ ఖంగారు కనిపిస్తూనే ఉంది.

“ఏమిటది..” హొపొన్ అడిగాడు.

దంగా (అల్లర్లు)… బహుశా చాలా మంది చనిపోయారేమో కూడా”

“చనిపోయారా? ఎక్కడా?”

“నాకు తెలీదు”

హొపొన్ మరింకేం‌ అడగలేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇంటికెళ్ళిపోవాలన్న ఆరాటం మొదలైంది. అమ్మ ని తల్చుకున్నాడు. ఏం చేస్తోందో! ఎక్కడో అల్లర్లు అవుతున్నాయంటే టీవీలో వస్తూ ఉండొచ్చు ఆ వార్త. కానీ అమ్మకి పొద్దున టీవీ చూసే అలవాటు లేదు. అయితే, ఇపుడు అమ్మ టీవీ చూస్తూ ఉంటే‌ బాగుండు. అల్లర్ల గురించి తెలుసుకుని తలుపులు కిటికీలు అంతా గొళ్ళేలు పెట్టి ఇంట్లోనే ఉండి జాగ్రత్త పడుతుంది అనుకున్నాడు. నాన్నని టికెట్ల విషయం అడగాలనుకున్నాడు. వాళ్ళు స్టేషన్ నుంచి పరుగెత్తుకొచ్చిన హడావుడిలో ఆ టికెట్లు ఉన్నాయో పడిపోయాయో! కానీ నాన్న షర్టు జేబులోంచి బయటికొస్తున్న టికెట్లని చూశాడు తరువాత.

సుభాన్ పురా కాలనీ రైల్వేస్టేషన్ నుండి పది కిలోమీటర్ల దూరం. మధ్యలో నిత్యం రద్దీగా ఉండే హెచ్.టీ రోడ్డు కూడా ఉంది. దారిలో వాహనాలు మామూలుగా తిరుగుతూ ఉండడం, జనం నడుస్తూ ఉండడం, జీవితం యధావిధిగా సాగుతున్నట్లు ఉండటం చూసి ఇదెంత సేపు ఉంటుందో అనుకున్నారు హొపొన్, బిరం మామా.

ఇల్లు చేరగానే హొపొన్ కారు నుండి బయటకి దూకి గేటు తెరిచాడు. బిరం మామ కారు షెడ్డులో పెట్టేసి వెంటనే ఇంట్లోకొచ్చి కిటికీలు మూసేసి గొళ్ళేలు పెట్టడం మొదలుపెట్టాడు.

“ఏమైంది” పాన్ముని అత్త ఖంగారుగా వచ్చింది బిరం మామని చూసి. ఆమె ఇంట్లో ఒక్కత్తే ఉంది. అప్పటికే పనిమనిషి వచ్చి అంట్లు తోమి, ఇల్లు ఊడ్చి వెళ్ళిపోయింది. “ఇంట్లో బియ్యం, కూరగాయలు, గోధుమపిండి, బిస్కట్లు, సోపు ఇలాంటివన్నీ ఉన్నాయా? ఏమన్నా కావాలా?” అనడిగాడు బిరం మామ.

“ఉన్నాయి.. కానీ ఎందుకు? అంతా బాగే కదా?” పాన్ముని అత్తకి ఏం అర్థం కావడం లేదు.

“లేదు… బయట పరిస్థితి బాలేదు” బిరం మామ కిటికీ లోంచి బయటకి తొంగి చూస్తూ అన్నాడు. “కర్ఫ్యూ విధిస్తారేమో. గుజరాత్‌లోనే ఎక్కడో ఒక ట్రెయిన్ తగలబెట్టేశారని అంతా అంటున్నారు. ఇంట్లో అన్నీ ఉన్నాయో లేదో చూసి చెప్పు. ఏదన్నా కావాలంటే గబగబా వెళ్ళి తీసుకొస్తా” అన్నాడు మళ్ళీ.

“అయ్యో, వద్దు, ఎక్కడికీ వెళ్ళకండి. అన్నీ ఉన్నాయి. హొపొన్, నువ్వు కూడా ఎక్కడికీ వెళ్ళకు” పాన్ముని అత్తయ్య అన్నది.

మధ్యాహ్నం అయ్యేసరికి వదోదర నగరమంతా మౌనం అలుముకుంది. అంత సందడిగా ఉన్న నగరం స్థంబించిపోవడానికి ఓ గంట పట్టిందేమో…అంతే. అందరూ ఇళ్ళ తలుపులు, కిటికీలు బిగించుకుని లోపల ఉండిపోయారు. బిరం మామ, హొపొన్ ఇల్లు చేరిన పదినిముషాలకి రావు గారు కిందకొచ్చారు వీళ్ళ గురించి ఆరా తీస్తూ. అందరూ ఇంట్లో ఉన్నారని తెలుసుకుని మెయిన్ గేటుకి తాళం వేసి పైకి వెళ్ళి వాళ్ళింటి తలుపులేసుకున్నారు.

బిరం మామ టీవీ పెట్టాడు. అన్ని ఛానెళ్ళ లోనూ ఈ తగలబెట్టిన ట్రెయిను వార్తలే. సబర్మతి ఎక్స్‌ప్రెస్ ట్రెయినులో అయోధ్య నుండి కొందరు యాత్రికులు వస్తున్నారనీ, ట్రెయిను వదోదరకి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న గోద్రా స్టేషన్‌లో ఆగగానే ఎవరో దానికి నిప్పంటించారనీ చెబుతున్నారు. కంపార్ట్మెంట్ల తలుపులకి బయట నుంచి తాళమేసి తగలబెట్టారంట. లోపల ఉన్న యాభై ఎనిమిది మందీ మాడి మసై పోయారు. తగలబెట్టింది ముస్లిములంట. దానితో ఇప్పుడు హిందువులు ప్రతీకారం తీసుకుంటున్నారు.

అహమ్మదాబాదులో హిందువులు వీథుల్లోకొచ్చి ముస్లిముల ఆస్తులని ధ్వంసం చేస్తూ వాళ్ళని చంపడం దాకా పోతున్నారు. వార్తల్లో వదోదరలో కూడా హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని రాశారు కానీ వీళ్ళ వీథిలో మాత్రం ఇంకా ప్రశాంతంగా ఉంది. బహుశా వేరే చోట్ల.. ముఖ్యంగా ఆ మాంసం అమ్మే ప్రాంతాలలో అవుతోందేమో.

టీవీలో వార్త చూడగానే పాన్ముని అత్త ఝపన్ అక్కయ్యకి ఫోను చేసింది. అక్కకి కూడా ఈ విషయం అప్పటిదాకా తెలియదు.

“మేము బానే ఉన్నాము అత్తయ్యా. మా గురించి ఖంగారు పడకండి. మీరెలా ఉన్నారు” – సీఐఎసెఫ్ వారి భారీ బందోబస్తు మధ్య ఉన్న తన ఇంటినుండి ఝపన్ అక్క మాట్లాడింది.

“బానే ఉన్నాము. కిటికీలు తలుపులు బిగించి ఇంట్లో కూర్చున్నాము”

“అంతే అత్తయ్యా. ఇంట్లోనే ఉండండి. బయటకి పోకండి”

పాన్ముని అత్తయ్య రొబి కోసం ఫోను చేసింది కానీ అతనప్పుడు హాస్టల్లో లేడు. కాసేపయ్యాక సాయంతం నాలుగు ప్రాంతాల్లో రొబి ఫోన్ చేశాడు. “మీరంతా ఇంట్లోనే ఉన్నారా?” అడిగాడు.

“ఉన్నాము గానీ నువ్వెక్కడున్నావు? ఇందాక ఫోను చేసినపుడు లేవు” అత్తయ్య అన్నది.

“నేను అప్పుడు హాస్పిటల్ లో వార్డు డ్యూటీ మీద ఉన్నాను. అల్లర్ల గురించి విన్నాను. వార్తల నిండా అదే. అన్ని ఛానెళ్ళలోనూ అదే వార్త. టెలిఫోన్ బూతుకి పరిగెత్తుకొచ్చి కాల్ చేస్తున్నా మీకు. చాలాసార్లు ప్రయత్నించా కానీ లైన్ బిజీ అని వచ్చింది.”

“మేము బానే ఉన్నాము. కటక్‌లో పరిస్థితి ఏమిటి?”

“కటక్ ప్రశాంతంగా‌ ఉంది. మీరు ఖంగారు పడకండి”

“వెంటనే హాస్టల్‌కి వెళ్ళిపో. ఒక్కడివే బయట తిరగకు. రాత్రుళ్ళు అసలు బైటకి వెళ్ళకు. అక్కడ అల్లర్లయితే, నీకు హాస్టల్‌లో ఉండడం ప్రమాదం అనిపిస్తే ఏ స్నేహితుల ఇళ్లకో, లేకపోతే కటక్ దాటి బయటకు వెళ్ళు. కావాలంటే ఘాట్శిల వెళ్ళిపోయి పరిస్థితులు చక్కబడ్డాక తిరిగి కటక్ వెళ్ళు.”

“బో, నేను చూసుకుంటాలే, కంగారు పడకు. ఇక్కడ పరిస్థితి బానే ఉంది.”

వాళ్ళు రోజంతా ఇంట్లోనే ఉన్నారు. తగలబడిన ట్రెయిను రోజంతా ఆగకుండా వార్తల్లో కనబడుతూనే ఉండింది. వీథులలో పోలీసు వాహనాలు గస్తీ తిరిగాయి. రోజంతా తలుపులు బిడాయించుకుని ఉన్నందువల్ల సొరేన్ కుటుంబానికి బయటి విషయాలేం కనబడలేదు, వినబడలేదు. రోజంతా అలా కర్టెన్‌లు వేసి ఉంచారు. రాత్రి లైట్లు ఆపి పడుకుంటున్నపుడు కూడా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండింది అందరికీ.

తరువాతి రోజు అందరూ పొద్దునే లేచారు. టీవీలో నిన్నటి లాగే అదే వార్త. బిరం మామ కొంచెం కిటికీ కర్టెన్ తొలగించి బయటకు తొంగి చూసాడు. కొంతమంది పోలీసులు తప్ప రోడ్డు మీద ఎవరూ కనబడలేదు. అందరి ఇళ్ల తలుపులు, కిటికీలు మూసి ఉన్నాయి. ‘మనమంతా ఖైదీలం’ అన్నాడు బిరం మామ.

ఆ రోజు రాత్రి అల్లరి మూక ఒకటి వచ్చింది.

***

అందరికీ తెలిసినవరకు మహమ్మద్ గారు వేరే ఊర్లో ఎక్కడో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళింట్లో ఆయన భార్య, విధవరాలైన ముసలి తల్లి, ఇద్దరు టీనేజీ కూతుళ్లు – ఈ నలుగురు ఆడవాళ్లు మాత్రం ఉంటారు. సుభాన్ పురా కాలనీ మొత్తానికి ఏకైక ముస్లిం కుటుంబం అది.

కిటికీల చాటునుంచి, చీకటి మాటు నుంచి సొరేన్ కుటుంబం, ఆ కాలనీ లోని ఇతరులు రెండు లారీలు రావడం గమనించారు. ఒక్కో దానిలో ఇరవై మంది జనం. కత్తులు, కాగడాలు, కర్రలతో, “జై శ్రీరాం, ముసల్మాన్ భారత్ చోడో” అంటూ వచ్చారు.

కొంతమంది లారీ నుంచి దూకి, మహమ్మద్ వాళ్ళ ఇంటి గేటుని తన్ని, తెరిచి, కాంపౌండ్ లోకి ప్రవేశించారు. తోటలో కనబడ్డ రాళ్లు, ఇటుకలు కిటికీల పైకి విసిరారు. తరువాత ముందు తలుపు దబదబా కొట్టారు.

“మాదర్ చోద్, బైటకిరా”

అంతా కలిసి తలుపులు బాదడం మొదలుపెట్టారు. కాసేపుంటే ఆ తలుపు ఊడి పడేలా ఉంది.

“ముసల్మాన్ నా కొడకా, మీ అమ్మ చాటున దాక్కున్నావా? బైటకి రా”

సుభాన్ పురా కాలనీ లోని గోడలన్నీ హిందూ మూక అరుపులకి కంపించాయి.

“బెహెన్ చోద్, మీరు మా వాళ్ళని తగలబెట్టారు. మేము మిమ్మల్ని తగలబెడతాము”

కాసేపటికి ఆ తలుపు వీళ్ళ తాకిడికి ఊడి వచ్చింది. మహమ్మద్ వాళ్ళ హాల్లోకి వెలిగించిన పెట్రోల్ బాంబు ఒకదాన్ని ఎవరో విసిరేశారు. ఆ గాజు బాటిల్ వెంటనే పగిలి ఇంట్లోని కర్టెన్లకి నిప్పంటుకుంది. అదొక నిశబ్ద విస్ఫోటనం లా ఉండింది.

ఇంట్లోని ఆడవాళ్ళు పైకి పరుగెత్తారు. లోపల పొగని తట్టుకోలేక కిటికీలు తీశారు. పై అంతస్తు కిటికీల నుంచి ఏడుస్తూ, సహాయం అర్థిస్తూ బైటకి చూస్తున్నారు. కింద ఉన్న మూక బూతులు తిడుతూ, వాళ్ళ మీద ఉమ్మి వేస్తూ, ఆనందంతో గంతులు వేస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఊహించనిది ఒకటి జరిగింది.

టాంగ్!

ఈ మూక లో వెనుక వైపుకి నిలబడ్డ వారి కాళ్ళ దగ్గరికి ఒక స్టీలు డేగిశా వచ్చి పడింది.

ఆశ్చర్యంతో, అప్రమత్తమవుతూ పైకి చూసారు వాళ్ళు.

“ఎవర్రా అది? నరికి పోగులు పెడతాము” మూక లోంచి ఎవరో అరిచారు.

“ధన్”

బాగా గురి చూసి విసిరిన స్టీలు గరిట ఒకటి సరాసరి ఒకడి కంటికి తగిలింది.

“అమ్మ!” కంటిని పట్టుకుని నేలకూలాడు వాడు.

ఈ గందరగోళం లో ఆ మూక కొంచెం చల్లబడింది.

 “ఎవరు?” బిరం మామ రహస్యం అడిగినట్లు అడిగాడు.

ఈ గిన్నెలన్నీ వాళ్ళ ఇంటి పైన్నుంచే వస్తున్నట్లు అనిపించింది.

పాన్ముని అత్తయ్య ఏం మాట్లాడలేదు. ఇది ఎవరు చేశారో ఆమెకి అర్థమైంది.

బిరం మామా, హొపొన్ మళ్ళీ కిటికీ వైపుకి తిరగ్గానే పాన్ముని అత్త వంటింటి వైపు వెళ్ళింది. నెమ్మదిగా కొన్ని వంటగిన్నెలని తీసుకుని, ఇంట్లోంచి వెళ్ళి తన స్నేహితురాలిని చేరుకుంది. బిరం మామ, హొపొన్ చూస్తూ ఉండగా మూడు స్టీలు గ్లాసులు, ఒక ప్రెజర్ కుక్కర్, ఒక డిన్నర్ సెట్టు ఒకదాని వెంట ఒకటి పడ్డాయి ఆ మూక మీద.

కాసేపట్లో అన్ని ఇళ్ళ వైపు నుండీ ఇలా గిన్నెలు, కర్రలు, ఇతర ఇంటి సామాన్ల వర్షం కురిసింది.

ఒక పక్క మహమ్మద్ వాళ్ళింట్లో మంటలు వ్యాపిస్తూ ఉంటే, బయట ఉన్న అల్లరి మూకలోని దాదాపు యాభై మగవాళ్ళ పైన ఇనుము, స్టీలు, అల్యూమినియం, తగరం, చెక్క ఇలా ఒకటని లేకుండా అన్ని రకాల వస్తువులతో దాడి జరిగింది. సుభాన్ పురా లోని ఆడవాళ్ళంతా ఒక పెద్ద శక్తిగా మారారు. తట్టలు, కర్రలతో కొందరు, డేగిశాలు, బాణలీలతో మరి కొందరు – దొరికినవన్నీ విసిరారు. కొంతమంది పాతకాలపు బరువైన ఇస్త్రీ పెట్టెలను కూడా విసిరారు. కర్రలూ చీపుళ్ళూ విసిరారు. ఇలా విసరడానికి పెద్ద పెద్ద వస్తువులు లేని వాళ్ళు కూరగాయలు, జ్యూసు పేకెట్లు, నెయ్యి, నూనె, కెచప్ డబ్బాలు కూడా విసిరారు.

ఆ మందలో చాలామందికి దెబ్బలు తగిలాయి. ఇస్త్రీ పెట్టెలు తలల మీద పడ్డాయి. గాజు బాటిళ్ళు కాళ్ళకి గుచ్చుకున్నాయి. బాణలీలు కళ్ళని, ముక్కులని, మెడలని ఢీకొన్నాయి.

“పిరికిపందల్లారా!” వాళ్ళు కోపంతో అరిచారు.

“అవును. మేము పిరికిపందలమే. కానీ మీరు మీ నాన్నకి పుట్టి ఉంటే మగవాళ్ళతో చూసుకోవాలి. ఇళ్ళలో ఉన్న ఆడవాళ్ళతో కాదు.” దాడి చేస్తున్న మహిళలంతా తిరిగి జవాబిచ్చారు.

“వాళ్ళు మా వాళ్ళని చంపేశారు” ఎవరో అరిచారు.

“వీళ్ళొచ్చి మీ అమ్మని చంపారా? ఆ ఇంట్లో ఉండే పెద్దావిడది మీ అమ్మ వయసే ఉంటుంది. ఆ ఆడవాళ్ళకి హాని తలపెట్టేముందు మీ అమ్మని తల్చుకోండి” కాలనీ మహిళలు స్పందించారు.

“వాళ్ళు ముస్లిములు. వాళ్ళని చంపేయాలి.”

“మమ్మల్ని చంపండి ముందు. అందరం కిందకి దిగుతున్నాము. మొదట మమ్మల్ని చంపి, ఆ తర్వాత ఆ ఇంటి ఆడవాళ్ళ జోలికి వెళ్దురు గానీ”

ఈ దాడి ఆ అల్లరి మూకని కొంచెం అయోమయానికి గురిచేసింది. ఇపుడు కాలనీలోని మగవాళ్ళు కూడా వీథిలోకి వచ్చేశారు. సైన్యం నుండి రిటైరైన ఒక పెద్దాయన వాళ్ళని ముందుండి నడిపిస్తున్నాడు. “ముందు మమ్మల్ని చంపండి. తరువాత ఆ ఆడవాళ్ళ జోలికి వెళ్ళండి” అధికారం ధ్వనిస్తున్న స్వరంతో అన్నాడాయన.

ఆయన వెనుక దాదాపు అరవై డెబ్భై మంది ఆడా మగా జనం పోగయ్యారు. ఆ వచ్చిన అల్లరి మూకకంటే వీళ్ళే ఎక్కువమంది ఉన్నారు. సుభాన్ పురా కాలనీ వాసులంతా మహమ్మద్ వాళ్ళింటి ముందుకు చేరుతూండటంతో బిరం, రావు కూడా ఇంట్లోంచి బయటకొచ్చి వాళ్ళలో చేరారు.

“దయచేసి వాళ్ళనేం చేయకండి” పెద్దాయన చేతులు జోడించి అర్థిస్తున్నట్లు అనిపించినా గట్టిగా, ధృఢంగా అన్నాడు. ఇంతమందిని చూసి ఆ అల్లరి మూక వెనక్కి తిరిగి, తమ లారీలెక్కి, వెళ్ళిపోయారు.

మహమ్మద్ వాళ్ళ ఇంట్లో రేగిన మంటలు అట్నుంచి బయటికి కూడా రాబోతే కాలనీ మగవారంతా కలిసి మానవహారంలా ఏర్పడి, నీళ్ళు, మట్టి పోసి మొత్తానికి మంటల్ని నిలువరించారు. ఆ విధంగా ఆ ఇంటి ఆడవాళ్ళు బయటపడ్డారు. పెద్దావిడకి ఆ పొగ వల్ల ఊపిరాడనట్లు అయిపోయింది కానీ ఓ గంట సేపు బయట గాల్లో కూర్చున్నాక కుదుటపడింది. ఆవిడ కోడలు, మనవరాళ్ళూ భయంతో బిగుసుకుపోయారు. అసలు కోడలికి ఏడుపు ఆగట్లేదు. ఆ పిల్లలకి నోరు పెగలట్లేదు. ఆర్మీ పెద్దాయన వాళ్ళని తన ఇంటికి తీసుకుపోయాడు.

అప్పట్నుంచీ సుభాన్ పురా కాలనీలో గస్తీలు తిరగడం మొదలయింది. కాలనీలోని మగవాళ్ళంతా రాత్రిపూట కాలనీకి కాపలా కాయాలని నిర్ణయించుకున్నారు. అహ్మదాబాదులో మామూలుగా శాంతియుతంగా ఉండే కాలనీల్లోనూ, కొంత నాశనమైన కాలనీలలోనూ దొమ్మీలు జరగడం గురించి విని ఉన్నారు అంతా. సుభాన్ పురాలో ఇది జరగకూడదు అని అంతా అనుకున్నారు. పైగా ఇపుడు మహమ్మద్ వాళ్ళ ఇల్లు ఇలాంటి దొమ్మీ ముఠాలకి బాగా సులువుగా దాడిచేయగల చోటు.

ప్రతిరోజూ చీకటి పడగానే యువకులంతా కర్రలు, విజిళ్ళు తీసుకుని తమతమ ఇళ్ళ బయట కాపలా కాసేవారు. ఏదన్నా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే మిగితావాళ్ళకి విషయం చేరవేసేవారు. హొపొన్, బిరం మామ కూడా ఈ పహరా కాసే వారిలో ఉన్నారు. రోజులు గడిచే కొద్దీ జనం రోజూవారీ పనులలో పడ్డారు కానీ రాత్రి అయితే మళ్ళీ కర్ఫ్యూ ఉండేది. గుజారాతులో బోర్డు పరీక్షలు పదిహేను రోజులు వాయిదా వేశారు. తరవాత కూడా అంత శాంతియుతమైన వాతావరణం లేదు. హొపొన్ సహా విద్యార్థులంతా పోలీసుల నీడలో పరీక్షలు రాశారు. బిరం మామ స్వయంగా వెళ్ళి రోజూ హొపొన్‌ని స్కూల్లో దింపి తీసుకొచ్చేవాడు. ఏదన్నా షాపింగ్ ఉంటే అంతా పొద్దున్నే చేసుకునేవారు. చీకటి పడగానే అంతా ఇళ్ళలోకి వెళ్ళి తలుపులేసుకునేవారు. పోలీసు వాహనాలు నగరమంతా గస్తీ తిరిగేవి. ఇలా కాలనీల వాసులంతా కర్రలు, విజిళ్ళు తీసుకుని తమ ఇళ్ళకీ, కాలనీలకి కాపలా కాసేవారు. ఇది ఇలా నెలపైన కొనసాగింది.

***

అల్లరులు జరిగిన తరువాత బిరం మామ గుజరాత్లో మరో రెండేళ్లు ఉన్నాడు. 2004లో రాంచీకి బదిలీ అయ్యింది. కానీ హొపొన్, పాన్ముని అత్త మట్టుకు ముందే తిరిగి వచ్చేశారు అక్కడినుంచి.

హొపొన్ బోర్డు పరీక్షలు పాసు అయ్యాక సర్టిఫికెట్లు తీసుకుని వాళ్ళమ్మతో సహా భుబనేశ్వర్ కి వచ్చేసి అక్కడ ఒక కాలేజీ లో చేరాడు. వాళ్ళు ఒక ఇల్లు అద్దెకి తీసుకున్నారు. వడోదర నుండి సామాన్లు అన్నీ ఇక్కడికి తెచ్చేసుకున్నారు. మంచి చెక్కతో చేసిన సోఫా, గాజు బల్లా, గుజరాత్ లోని హాండీక్రాఫ్ట్ ఎంపోరియం లలో కొన్న అలంకరణ వస్తువులు, అన్నీ తెచ్చేసుకున్నారు. బిరం మామ రావు గారి ఇంట్లోనే అద్దెకుంటూ సెలవులకి ఇక్కడికి వస్తూ, ఇంటికి దగ్గరగా ఉండే ఊరికి బదిలీ కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు. రాంచీ బదిలీ విషయం తెలిసాక వాళ్ళ ఆనందానికి హద్దుల్లేవు. డొరండా ప్రాంతంలో ఒక పెద్ద త్రీ బెడ్రూం అపార్ట్మెంట్ చూసుకున్నారు. రొబి, హొపొన్ సామాన్లని భుబనేశ్వర్ నుండి రాంచీ చేర్చడానికి సహాయం చేశారు. తరువాత పాన్ముని అత్తయ్య, హొపొన్ బిరం మామ ని రాంచీ తీసుకురావడం కోసం వదోదర చివరిసారి వెళ్ళొచ్చారు.

పాన్ముని అత్త కి రాంచీ నచ్చింది. “ఇది మన ఊరు” అనేది.

“మనం ఏం తింటాము అన్నది ఇక్కడ ఎవరూ గమనించరు. వేరేవాళ్లు ఏం తింటున్నారు అన్నది మనకి అనవసరం.” అంటూ ఉండేది గండుచేపని ఊరవేసి ఉప్పూ పసుపూ దట్టిస్తూ, ఇంకోళ్ళ గురించి పట్టించుకోకుండా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here