కాజాల్లాంటి బాజాలు-119: వామ్మో వదినో..

1
2

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ఎ[/dropcap]ప్పట్లాగే పొద్దున్నే వదిన ఫోన్. అంత పొద్దున్నే చెయ్యకమ్మా, కాస్త పది దాటేక చెయ్యీ.. అని ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఏదో కొంపలంటుకుపోతున్నట్టు పొద్దున్నే ఎనిమిదవకుండానే నేను వంటింట్లో అష్టావధానం చేస్తున్నప్పుడు ఫోన్ వచ్చేస్తుంది వదిన దగ్గర్నుంచి. పోనీ తియ్యడం మానేద్దామా అనుకుందామనుకుంటే ఎంత అత్యవసరం కాకపోతే అంతగా చెప్పినా పొద్దున్నే చేసిందీ.. అనుకుంటూ తీస్తాను. ఇవాళ కూడా అలాగే అనుకుంటూఫోన్ తీసేను.

“స్వర్ణా, నీ దగ్గర ఎన్ని డజన్ల పట్టుచీరలున్నాయీ!”

వదిన అడిగిన ప్రశ్న మింగుడు పడలేదు సరికదా పీకల్దాకా కోపం కూడా వచ్చేసింది నాకు.

“ఓ పది బీరువాలనిండా పట్టుచీరలే వదినా, నీకేమైనా అరువిమ్మంటావా!” కసిగా అడిగేను.

గబుక్కున నేనన్న మాటలకి వదినకి ఖోపం వచ్చేస్తుందేమో అనుకుంటూంటే అట్నించి ఫక్కున నవ్వు వినిపించింది. నా బాధ అర్థమైందనుకుంటాను.. “సరి.. సర్లే.. కాసేపున్నాక ఫోన్ చేస్తాను.” అని పెట్టేసింది.

నా పనంతా అయి ఇంక వదినకి ఫోన్ చేద్దామా అనుకుంటూంటే మళ్ళీ తనే చేసింది. ఫోన్ తీయగానే మళ్ళీ అదే ప్రశ్న.

ఈసారి కాస్త శాంతంగానే అడిగేను..

“ఎందుకు వదినా! లేకపోతే ఏమైనా కొనిపెడతావా!”

“కొందామనే.. నేను ఆన్‌లైన్‌లో కంచీ, ధర్మవరం, బెనారస్, వెంకటగిరీ, గద్వాల్, పోచంపల్లీ, ఉప్పాడ లాంటి పట్టుచీరలమ్మే ఊళ్ళనించి డైరెక్ట్‌గా ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటున్నాను.. నీకు కూడా తెప్పిద్దామనీ..” అంది ఏదో మామూలు విషయం చెపుతున్నట్టు.

నాకు విషయం అర్థం కాలేదు. “అన్నిపట్టు చీరలెందుకూ! ఎవరిదైనా పెళ్ళా!”

“ఆహా.. మనదే పెళ్ళి.. అంటే పెళ్ళంత హడావిడి.. మనిద్దరి జాతకం మారిపోతోంది స్వర్ణా.. మనం తెలుగుతెరకే వేల్పులం కాబోతున్నాం.”

“ఏంటీ.. సినిమాల్లో వేషాలా!”

“కానేకాదు.. చెప్పుకో చూద్దాం..”

అసలే అయోమయంలో ఉంటే ఈ పొడుపుకథల ప్రహసనమేంటీ!

“అంటే.. టీవీలోనా.. నీలో నాలో ఏ టాలెంట్ ఉందని ఎవరైనా చానల్లో ప్రొగ్రామ్స్‌కి తీసుకుంటారు వదినా!” అడిగేను.

“ఒకళ్ళు తీసుకునే ఖర్మ మనకేంటీ! మనవే ఒక చానల్ పెట్టేస్తుంటే..”

“హేవిటీ.. నువ్వు టీవీ చానల్ పెడుతున్నావా!” నాకు ఆశ్చర్యంతో నోట మాట రాలేదు.

“అదేవంత పెద్ద విషయమని అంతలా ఆశ్చర్యపోతున్నావ్.. యూ ట్యూబ్‌లో వీడియోలు అప్లోడ్ చేసేసి, దానికో పేరు పెట్టేసుకుంటే సరీ.. అదే మన చానల్..”

గొప్పగా చెప్తున్న వదిన మాటలకి ఫక్కున రాబోయిన నవ్వుని బలవంతాన ఆపుకున్నాను.

“యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేసే వీడియోలకా ఇంత బిల్డప్పూ ఇచ్చేవ్!” అన్నాను ఎగతాళిగా.

“ఏం.. తప్పేవుందీ! సరిగమలు రానివాళ్ళు ఆన్‌లైన్‌లో సంగీతం పాఠాలు చెప్పేస్తున్నారు. జ్యోతిష్యం పుస్తకం ఒకటి పదిరోజుల్లో చదివేసి, స్క్రీన్ మీద జాతకాలు చెప్పేస్తున్నారు. న్యూమరాలజీ స్పెల్లింగ్ నేర్చేసుకుని దాని గురించి మాట్లాడేస్తున్నారు. వాళ్లకన్న మనమేం తీసిపోయేం? ఆ మాత్రం జాతకాలు చెప్పలేమా! అసలు మనం పుట్టిందే పండితులు పుట్టిన వంశాల్లో నాయె.. ఇంగువ కట్టినగుడ్డ వాసన ఎక్కడికి పోతుందీ! ఒక్కసారి ఆ పుస్తకాలు తిరగేసామంటే మన వెనకాల జనం బ్రహ్మరథం పడతారు.”

“మా తాతలు నేతులు తాగేరూ.. మా మూతులు వాసన చూడండీ.. అందామా!” అన్నాను వెటకారంగా..

“నీ కసలు విషయం అర్థం అవడం లేదు. ప్రతి ఎపిసోడ్‌కీ ఒక కొత్త పట్టుచీర, ఇమిటేషన్ నగలూ పెట్టుకుని, వీడియోల మీద వీడియోలు తీయించుకుంటుంటే ఎంత బాగుంటుందీ!” తన్మయత్వంతో అంది వదిన.

నాకు వదిన మీద జాలేసింది. పాపం.. తనని తను ప్రపంచానికి చూపించుకుందుకు ఎన్ని పాట్లు పడుతోందో అనిపించి, వదినకి కాస్త సాయం చెయ్యాలనిపించింది.

“అది సరేననుకో.. ఇంతకీ దానికోసం నేనేం చెయ్యాలి వదినా!” అనడిగేను.

“ఏం లేదు.. నువ్వు యాంకరింగ్ చేస్తూ, ప్రేక్షకులు పంపిన ప్రశ్నలు అడుగుతుండాలి. నేను జవాబులు ఇస్తుంటాను. అంతే..” అంటూ సింపుల్‌గా తేల్చేసింది వదిన.

“మనల్ని ప్రశ్నలడిగే ప్రేక్షకులు ఎవరూ!” మళ్ళీ నా సందేహం.

“మనవే కొన్ని ప్రశ్నలు తయారు చేసుకుంటాం.. దానిని ఆ ఊర్నించి వాళ్లడిగేరూ, ఈ ఊర్నించి వీళ్ళడిగేరూ అని నువ్వు అడుగుతుంటావన్న మాట.”

హమ్మ వదినా.. ఎంతైనా తెలివైందే.. అనుకుంటూ,

“అది సరే వదినా, కానీ మనం దేని గురించి మాట్లాడతాం. ఆధ్యాత్మికమా, పెర్సనాలిటీ డెవలప్‌మెంటు గురించా, మానసిక వైద్య సలహాలా, న్యాయ సలహాలా..”

“దేని గురించైనా అడగొచ్చు.. నేను అన్నీ చెప్పేస్తాను.” అంది వదిన కాన్ఫిడెంట్‌గా.

నేను వదినని వదలదలచుకోలేదు. “సరే.. ఇప్పుడు నాకో కష్టం వచ్చి ఏ పరిహారం చేస్తే నా కష్టం తీరుతుందని నిన్ను అడిగేననుకో.. నువ్వేం చెపుతావూ!”

“అలా కాదు.. నువ్వు యాంకర్‌గా అడుగు.. నేను ప్రొఫెషనల్‌గా చెప్తాను.” అంది.

నేనా వదిన దగ్గర తగ్గేదీ.. గొంతు సవరించుకున్నాను.

నేను – అమ్మా, నాకు ఈమధ్య చాలా ఇబ్బందులు వస్తున్నాయమ్మా. ఏ పనీ అనుకున్నట్టు అవటం లేదు. ఈ చిక్కులు తొలిగే మార్గం ఏదైనా ఉందా అమ్మా..”

వెంటనే వదిన గొంతు సవరించుకుంది. గొంతులోకి ఎక్కడలేని గాంభీర్యమూ తెచ్చిపెట్టుకుంది.

వదిన – మీరు మంచి ప్రశ్న వేసేరు. ఇదే ప్రశ్న ఇదివరకు ఎవరినైనా అడిగితే ‘కష్టాలనేవి మనుషులకు కాపోతే మానుల కొస్తాయా!.. తట్టుకోవాలి. ఎప్పుడూ చీకటే ఉండదు కదా.. తెల్లార్తుంది.. అలాగే నీ కష్టమూ తీర్తుంది’ అనేవారు. కానీ ఈ రోజుల్లో అలా అనుకోకుండా దానిని తొలగించుకోడానికి పరిహారం చేసుకోవడం మీలాంటి ధీరోదాత్తుల పని. మీరు సరైన చోటుకే సలహా అడగడానికి వచ్చేరు. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యండీ, మీ కష్టాలు దూదిపింజల్లా తేలిపోతాయి.”

నేను – (ఆత్రంగా) ఏం చెయ్యాలమ్మా.. చెప్పండి.. తూచా తప్పకుండా పాటిస్తాను.

వదిన – మీరు శుక్రవారం సరిగ్గా పన్నెండు గంటలకి, మిడసరి లగ్గం వేళ బజారుకి వెళ్ళి ఒక స్టీలు తాళంకప్ప కొనాలి.

నేను – ఏ సైజుదండీ!

వదిన – ఏ సైజుదైనా పరవాలేదు కానీ కాస్త పెద్దగానే ఉండాలి. ఎంత పెద్దగా ఉంటే మీ సమస్యలు అంత తొందరగా తీరిపోతాయి. ఆ తాళంకప్పని మీరు పడుకునే మంచానికి నైరుతీదిశగా పెట్టాలి. ఇంకోమాట. బాగా గుర్తు పెట్టుకోండి. రాత్రి చీకటి పడకుండానే ఫలహారం చేసెయ్యాలి. గుర్తు పెట్టుకోండి. ఫలహారం మాత్రమే చెయ్యాలి. అన్నం తినకూడదు.

ఇంక రాత్రంతా గంటకొకసారి దాని మీద ఒక్కొక్క ఎర్రపూవూ వెయ్యాలి. శనివారం తెల్లారగట్లే లేచి, తలారా స్నానం చేసి, ఎర్రచీర కట్టుకుని, ఎర్రపూలు తలలో పెట్టుకుని, ఆ తాళంకప్పని తీసుకుని ఆంజనేయస్వామి గుడికి వెళ్ళాలి.

నేను – ఆంజనేయస్వామిగుడికే వెళ్ళాలాండీ.. రాముని గుడికి వెళ్ళకూడదాండీ..

వదిన – ఆంజనేయస్వామేకదా రాముని సమస్య తీర్చిందీ.. అందుకే రాముడికన్న ఆంజనేయస్వామే గొప్పవాడు. అక్కడికి వెడితేనే మీ ప్రయత్నం ఫలిస్తుంది.

రాముడికన్న రామభక్తుడు గొప్పవాడనడం వదిన నోటే విన్నాను. విభ్రాంతిలోంచి తేరుకుని,

నేను – అలా పట్టికెళ్ళిన ఆ తాళంకప్పని గుళ్ళో హుండీలో వెయ్యాలాండీ.. అందులో పడుతుందా!

వదిన – అబ్బెబ్బే.. కాదు.. నే చెప్పేది సరిగ్గా వినండి. ఆ తాళంకప్పని గుడి ఆవరణలో ఎక్కడైనా కాస్త నలుగురికీ కనపడేలా వదిలేసి వచ్చేయాలి.. ఆ తర్వాత ఎవరైనా వచ్చి, ఆ తాళంకప్పని తీసుకుని, తాళం తీస్తే మీ సమస్యలన్నీ తాళం తీసేసినట్టు తీరిపోయినట్టే..

నేను – ఒకవేళ ఎన్నాళ్ళైనా ఎవరూ దాన్ని తియ్యకపోతే…

వదిన – దానికీ ఒక పరిష్కారం ఉంది. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా ఏవో సమస్యల్లాంటివి ఉండొచ్చుకదా! అలాంటివాళ్లని పట్టుకుని మీ తాళంకప్ప ఆవిడ, ఆవిడ తాళంకప్ప మీరూతీసేస్తే సరీ.. ప్రాబ్లమ్ సాల్వడ్..

చాలా ఈజీగా చెప్పేసింది వదిన

నా వీపు నువ్వు గోకూ, నీ వీపు నేను గోకుతానూ అన్నట్టుంది అనబోయి బలవంతంగా ఆపుకున్నాను. కానీ వదినని ఏమీ అనలేక…మరో ప్రశ్న సంధించేను.

నేను – ఈమధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువవుతున్నాయి కదండీ. అలా భార్యాభర్తలు విడిపోకుండా పదికాలాలపాటు తియ్యగా సంసారం చేసుకుందుకు మీ దగ్గర పరిహారం ఏదైనా ఉందాండీ!”

వదిన- (హుందాగా నవ్వుతూ..) హూ.. ఈ కాలంలో భార్యాభర్తల మధ్య బంధం తియ్యగా ఉంటే సరిపోదు… హాట్‌గా కూడా ఉండాలి.. అలా ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ విడిపోకుండా ఉంటారు. అలాంటివారికోసం నేనో పరిహారం చెప్తానూ… అది కనక చేస్తే ఏ భార్యాభర్తలూ ఎప్పటికీ విడిపోరు..

నేను – (ఆత్రంగా) ఏంటండీ అదీ..!

వదిన – భార్యాభర్తలిద్దరి పెళ్ళి ఫొటో ఆల్బమ్‌ని పట్టికెళ్ళి ఆవకాయజాడీలో కుక్కేసి, దానికి గట్టిగా మూత పెట్టేసి, వాసెన కట్టేసి, అటక మీదపెట్టెయ్యమనండి.. ఇంక వాళ్ళిద్దరి మధ్యా అంతా హాటే హాటు..

అది విన్న నాకు మండిపోయింది.

ఆవకాయజాడీలో పెళ్ళి ఫొటో ఆల్బమ్ కుక్కేసి అటకెక్కించేస్తే ఇంక వాళ్ళు విడిపోరా! ఎదుటివాళ్ళు అంత వెర్రివాళ్ళనుకుంటోందా ఈ వదిన.. ఎలా ఈ వదినని వదిలించుకోవడం అనుకుంటూ, ఆ మాట కూడా వదిననే అడిగేద్దాం అనుకున్నాను.

నేను – నాకు నా ఫ్రెండ్ ఒకరి మీద విపరీతమైన కోపమండీ.. వాళ్ళని వదిలించుకునే పరిహారం ఏదైనా ఉందా!

అని అడిగేసేను.

వదిన- (సంతోషం అంతా గొంతులోకి తెచ్చుకుంటూ) లేకేం.. బ్రహ్మాండమైన పరిహారం ఉంది. జాగ్రత్తగా విని, సరిగ్గా అలాగే ఆచరించండి. మీకు ఎవరిమీదైతే కోపముందో వాళ్ళు మళ్ళీ జన్మలో మీ దగ్గరికి రారు.

నేను ఫోన్‌కి చెవి అంటించేసేను.

వదిన – మీ ఫ్రెండ్ ఫొటో ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఒక మూడంగుళాల దురదగుండాకు కొమ్మ తెచ్చుకోండి.

ఆ మాటకి హడిలిపోయేను.

వదిన – ఆ రెండింటినీఒక ఇనపడబ్బాలో పెట్టండి..

నేను – ఇనపడబ్బానా.. ఈ రోజుల్లో ఎవరిళ్ళలో చూసినా స్టీలూ, పింగాణీ, గాజు, ప్లాస్టిక్ డబ్బాలే ఉంటున్నాయి.. ఇనపడబ్బాలు ఎక్కడుంటాయీ..

వదిన – ఇంట్లో లేకపోతే బజార్లో కొని తెచ్చుకోండి.. ఎందుకంటే ఇనుములో శని ఉంటాడు. శనిలా బాధపెడుతున్న మీ ఫ్రెండ్‌ని వదిలించుకోడానికి ఇనపడబ్బాలోనే ఆ దురదగుండాకు పెట్టి, దానితోపాటు మీ ఫ్రెండ్ ఫొటో కూడా పెట్టాలి..

నేను వెంటనే బజారెళ్ళి ఓ ఫదైనా ఇనపడబ్బాలు కొని తెచ్చేసుకుందుకు మనసులో రెడీ అయిపోతున్నాను.. ఏమో ఈ పరిహారం మిగిలిన వాళ్ళెవరైనా వింటే బజార్లో ఇనపడబ్బాల కొరత వచ్చేస్తుంది మరి..

వదిన ఆపకుండా చెప్పుకుపోతోంది.

వదిన – అలా దురదగుండాకు, మీఫ్రెండ్ ఫొటో పెట్టిన ఇనపడబ్బాని మీ ఇంట్లో ఆగ్నేయమూల పెట్టండి.

నేను – ( కాస్త తేరుకుంటూ) ఆగ్నేయమూలా..!

వదిన – అవును.. ఆగ్నేయమూల అగ్నిస్థానం. ఆ డబ్బా అక్కడ పెట్టిన రెండోరోజునుంచే మీ ఫ్రెండ్ మీ నుంచి దూరంగా జరగడం మొదలెడతాడు.

నేను –(ఆశ్చర్యంగా) నిజంగానా!

వదిన- (ఎంతో కాన్ఫిడెంట్‌గా) నిస్సందేహంగా.. ఎందుకంటే ఆ డబ్బాలో పెట్టిన దురదగుండాకు ఫొటో మీద దాని ప్రభావం చూపించడం మొదలుపెడుతుంది. అప్పట్నించీ మీ ఫ్రెండ్‌కి ఒళ్ళంతా దురదలు మొదలవుతాయి. అలా గోక్కుంటూ గోక్కుంటూ, గోక్కున్నకొద్దీ దురదలు ఎక్కువవుతుంటే మీనుంచి దూరం జరగడం మొదలెడతాడు. చాలా తొందరగా మీకు ఆ ఫ్రెండ్ నుంచి విముక్తి లభిస్తుంది..

నేను- (కాస్త తేరుకుంటూ) అమ్మా, చాలా ఉపయోగకరమైన పరిహారాలు చెప్పారమ్మా.. మీ మేలు మరవలేను. మళ్ళీ ఏదైనా సమస్య వస్తే తప్పకుండా మిమ్మల్ని సంప్రదిస్తాను.

వదిన – చాలా సంతోషం.. ఎలాంటి సమస్యకైనా నా దగ్గర ఇటువంటి పరిష్కారాలు చాలా ఉన్నాయి. మీకు సాయపడ్డమే నా జీవితధ్యేయం.

లోపల్నించి ఉబికివస్తున్న చిరాకు, విసుగు, కోపం, వెలపరం.. ఇంకా ఏవేవో తెలీని భావాలని బలవంతంగా అణుచుకుంటూ..

నేను – ఉంటానమ్మా.. నమస్కారం

అంటూ ఫోన్ పెట్టేసేను.

ఫోన్ పెట్టినప్పట్నించీ నాకు ఒకటే ఆలోచన.. ఈ వదినని వదిలించుకోడానికి వదిన ఫొటో ఎలాగోలాగ సంపాదించగలను.. కానీ, ఈ దురదగుండాకు, ఇనపడబ్బా ఎక్కణ్ణించి తేను..

ఒక్కసారి ఒళ్ళు జలదరించినట్టయింది. ఛీ.. ఛీ.. ఏం ఆలోచిస్తున్నాను నేను. నిజంగా అదంతా జరిగిపోతుందనే అనుకుంటున్నానా.. ఈ మాటల మత్తులో నేనూ పడిపోయానా!

వదినలాంటి ఇలాంటి తెలిసీ తెలీని పరిహారాలు చెప్పేవాళ్ళు ఈ రోజుల్లో ఎంతమందో పుట్టుకొస్తున్నారు. సమస్యలలో చిక్కుకుపోయి కాస్త బలహీనంగా మనసున్నవాళ్ల బుర్రలని విషతుల్యం చేసేస్తున్నారు.. ధైర్యం చెప్పడం మానేసి వాళ్ళని మరింత బలహీనుల్ని చేసేసి, మాటల్లో మభ్యపెడుతున్నారు. ఇలాంటి వాళ్లకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

వామ్మో.. వదినో.. ఈ దురదగుండాకు పరిహారం నా బుర్రలోంచి తీసెయి తల్లీ.. అని అనుకోకుండా ఉండలేకపోయేను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here