[dropcap]ఆ[/dropcap]కాశానికి ఆవేదన తోడైతే
మబ్బులు చేసే అచ్చిక బుచ్చిక – వాన
మబ్బులకు మసి ఎదురైతే
సంద్రం చేసే మచ్చిక – వాన
స్వర్గానికి, త్రిశంకు స్వర్గానికి మధ్య నిచ్చెన వేస్తె
పాతాళం చేసే ఆర్తనాదం – వాన
పర్వతాల కొనలు, వాటి పాదాల చెంత ఉన్న నదులు
చేసే ఊసులాట – వాన
సూర్యుని తాపం, చంద్రుని వెన్నెల కాంతి
కాచి వడబోస్తే – వాన
గగనాన ప్రారంభమైన నీటి చుక్క
భువి చేరేంత వరకు ఆసక్తికరమే
మొదటి మెట్టు మబ్బుల్ని వదలడం
తన మనస్సుని విసర్జించడం
రెండవ మెట్టు గాలిని నమ్మడం
తన శరీరాన్ని రాయి చేసుకోవడం
మూడవ మెట్టు వడి వడిగా కిందకి పడడం
వాడిన ఆశల్ని చిగురింపజేయడం
నాల్గవ మెట్టు ప్రతి రెక్కల జీవిని చుంబించడం
రాయి రత్నంలా మారే సమయం ఆసన్నమవడం
ఐదవ మెట్టు గంపెడాశతో ఎదురుచూస్తున్న
చెట్లు మొక్కలను చిలిపిగా పలకరించడం
ఆరవ మెట్టు పయన కాలాన్ని పక్కకి నెట్టి
జీవితాన్ని పణంగా పెట్టడం
ఏడవ మెట్టు సీదాగా మట్టిని తడిమి
గర్వంగా తలెత్తి ఆకాశాన్ని చూడటం
స్ఫూర్తితో ఎన్నింటికో మరుజీవితాన్నివ్వడం!