Site icon Sanchika

వాన చెట్టు

[dropcap]వా[/dropcap]నెప్పుడూ చెట్టునే కౌగిలిస్తుంది.
దానికి అభ్యంగన స్నానం చేయించి,
పచ్చని ఆకు దుస్తులు తొడిగి,

వెచ్చని ఎండలో అవి చలికాచుకుంటుంటే,
రంగు రంగుల పూలు సిగలో తురుముతుంది,
పుప్పొడి పౌడరు అద్ది,
మధుపాలకు విందునీయమని
మకరందపు రసాలను దాని కందిస్తుంది,

పరవశించిన పూలకు,
ఫలాల భోజనం అమరుస్తుంది,
ఆనక,
అమ్మమ్మలా,

నిదురించే విత్తనాలను
లాలించి, పెంచి, పెద్దచేసి,
చెట్టంత వాళ్ళను చేస్తుంది,

పెంచిన మమకారం కదా
అందుకే
వానెప్పుడూ చెట్టునే తన వాత్సల్యపు కౌగిలితో ఉక్కిరి బిక్కిరి చేస్తుంది.

Exit mobile version