Site icon Sanchika

వాన

[dropcap]చ[/dropcap]దువులందు రాజ్యపదవులందు… ఆశలుడిగినట్టి అయ్యలు లేరయా అన్నాడు తత్త్వవేత్త. పెద్ద చదువులు – పెద్ద పదవులు – పెద్ద జీతాలు… క్రింది నుండి పైకి, లోయ నుండి శిఖరాగ్రానికి పాకడానికి ఉపాయం ఆలోచించాలన్నది మనిషికి వుండాలిగదా! వేళ్ళ తాళ్ళు పట్టుకుని, ఆకులదాకా ఎదగాలి… పరము కొరకు యోగిపాటించు దేహంబు అన్నారు – వృద్ధి కొరకే గదా మనిషి వున్నది. అబ్బయున్న వానికన్నయున్నట్టులే అన్నట్టుగా పెద్ద చదువుల గురించి ఆలోచించాలి.

నాకు యిప్పటికి వున్న చదువు కర్మాగారంలోని కార్మికుల మీద అజమాయిషీ చేసేంతటిది. సాంకేతిక విద్యలో ఉన్నత విద్యార్హతల్ని సంపాదిస్తే ఆఫీసరునౌతాను. తాళపుచెవి లేక తలుపెట్టులూడును? ఉన్నత విద్యలేక ఉన్నత పదవి ఎలా వస్తుంది? ఫలితమొనరుటెట్లు పని జొరిమిని? చిన్న చదువులకు మిన్న జ్ఞానం రాదు. ఎరుకలోని ఎరుక ఎరుగుటే తత్త్వంబు. సర్టిఫికేట్లు, డిప్లోమాలు డిగ్రీతో సమానమవుతాయా? యిత్తడిలను పసిడి కీడనవచ్చునా?… చెట్టుబెట్ట ఫలము చేకూరకుండునా? పెద్దచదువులు చదివితే పెద్ద పదవులు రాకుండునా? సాంకేతిక విద్య డిగ్రీలో ప్రవేశం పొందాలంటే ప్రవేశపరీక్ష రాయాలిగదా! మనదేశంలో విద్య పెద్ద వ్యాపారం – పెట్టుబడులు. సప్లై తగ్గితే డిమాండు పెరుగుతుంది. సప్లై పెరిగితే డిమాండు పెరుగుతుంది. కాలేజీల సంఖ్య తక్కువగా వుండి, సీట్ల సంఖ్య తక్కువగా వుంటే డిమాండు ఎక్కువగా వుంటుంది. దాంతో అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉత్తీర్ణులు కావాలి. అంచేత ప్రవేశపరీక్షల్ని చాలా కఠినంగా నిర్వహించాలి. అంటే పరీక్షపత్రాల్ని చాలా హార్డ్‌గా తయారుచేయాలి. అప్పుడు పరీక్ష విధానం వేరుగా వుంటుంది. విద్యార్థికి ఏమేం తెలుసునో అనుకుంటున్న విషయాల్ని అసలే పరీక్షించరు. ఏమేం తెలియదని వాళ్ళు ఊహించగలుగుతారో, ఆయా విషయాల్ని పరీక్షిస్తారు. అంటే చాలా తక్కువమంది అభ్యర్థులే ‘పాస్’ కావాలి. ఇంకా చెప్పాలంటే కార్పోరేట్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదవని మరియు కార్పోరేట్స్ కోచింగ్ సెంటర్స్‌లో కోచింగ్ తీసుకోని విద్యార్థులు కనిష్ట మార్కులకు దరిదాపుల్లోకి రాకూడదు. ప్రవేశపరీక్ష అంటే భయం కొల్పాలి. పరీక్షల జోలికే వెళ్ళకుండా చేయాలి! అంచేత గరిష్ట సంఖ్యలో విధ్యార్థులు పరీక్షలు రాయకుండా విరమించుకుంటారు. పరీక్షలకు హాజరైన విధ్యార్థుల్లో కూడా తమ తమ అభ్యర్థులకు సీట్లు తప్పకుండా రావాలి. అలా రావాలంటే అనేక దొడ్డిమార్గాలు. ఓయంఆర్ జవాబు పత్రాన్ని పెన్సిల్‍తో గాక, పెన్నుతో నింపితే, మాన్యువల్ వాల్యూయేషన్‍కు వెళ్తుంది. దాంతో ఆ అభ్యర్దికి తాము అనుకున్న మార్కులు వేసుకోవచ్చు. సీటు సంపాదింపవచ్చు. అసలు జవాబుపత్రాన్ని పెన్సిల్‍తో గాక పెన్నుతో నింపడానికి ఎందుకు అనుమతించాలి? పెన్ను సంపాదింపగలిగిన వాడికి పెన్సిల్  సంపాదించడం కష్టమా? సప్లై తక్కువై, డిమాండూ ఎక్కువగా వున్నప్పుడు సాంకేతిక విద్యాలయాల్లో అనుసరించే విధానం ఈ విధంగా వుంటుంది!

ఇక సప్లై ఎక్కువయితే డిమాండ్ తగ్గుతుంది. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కువై, సీట్లు ఎక్కువైతే, అంటే కాలేజీలు సీట్లు ఎక్కువై విద్యార్థుల సంఖ్య తగ్గితే, అప్పటి పరీక్ష విధానం వేరే విధంగా వుంటుంది. అప్పుడూ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులంతా కూడా పరీక్షల్లో వుత్తీర్ణులై తీరాలి. దాంతో ఉత్తీర్ణత పొందడానికి వున్న కనీస మార్కుల్ని తగ్గింపవచ్చు. అభ్యర్థులు అందరూ కూడా పాస్ కావాలి కాబట్టి పరీక్ష పత్రం చాలా సులభంగా వుంటుంది. అంతేకాదు అభ్యర్థి ఏ ఆప్షన్‍ను ఎంచుకున్నా కూడా కనీస మార్కులు సంపాదించి తీరే విధంగా వుంటుంది ప్రశ్నాపత్రం! ఈ పరీక్షా విధానం విద్యార్థులకు ఏమేం వస్తాయని భావిస్తారో వాటిలో పరీక్షించే విధంగా ఉంటుంది. ఏమీ తెలియకున్నా కూడా పాస్ అయ్యే విధంగా వుంటుంది! కోళ్ళ ఫారాలను ఇంజనీరింగ్ కాలేజీ భవనాలుగా మార్చిన సరస్వతీ సేవకులకు విద్యాదానం వల్ల ఫలితంగా లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఫీజు రీయింబర్స్‌మెంటు వల్ల అటు విద్యాదాతలకు ఖజానా నిండుతుంది. యిటు విద్యార్థులకు పెద్దగా ఖర్చులేం ఉండవు. అటు పాలకులకు, యిటు పాలితులకు ఉభయజూదకం. ఫలితంగా విద్యలో సామర్థ్యం సంపాదించగలిగిన వారి సంఖ్య నూటికి యిరవై లోపే. నూటికి ఎనభై పైబడిన విద్యార్థులు అసమర్థులే. పొల్లు విద్య, విద్యావిధానాలే. రెండంకెల సంఖ్యలేని కాలేజీల సంఖ్య నాలుగంకెల సంఖ్యకు దరిదాపులకు చేరగలిగిన అభివృద్ది ఫలితం యిది! ప్రమాణాలు లేని విద్య, విద్యార్థులు…

నేను ఉన్నత సాంకేతిక విద్యనభ్యసించాలనుకుంటున్న కాలం సప్లై తక్కువ, డిమాండు ఎక్కువ కాలం నాటిది. ఆ కాలంలో మన రాష్ట్రంలో వున్న ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య పది లోపే. సీట్ల సంఖ్య కొన్నివేలే. పోటీ ఒక్క సీటుకు పదుల సంఖ్యలో అభ్యర్థులు. ప్రవేశ పరీక్షలో వుండే సబ్జెక్టులకన్నింటి కూడా సమాన విలువ ఇవ్వకుండా ఒక సబ్జెక్టుకు ఎక్కువవిలువ ఇచ్చి మరో సబ్జెక్టుకు తక్కువ విలువ నిచ్చేవారు. ఫలానా సబ్జెక్టులో అధికమార్కులు పొందినవాడికే మొదటి ప్రాధాన్యత. మరో సబ్జెక్టులో అత్యధిక మార్కులు సంపాదించినా కూడా వారు నిర్ణయించిన సబ్జెక్టులో తక్కువ మార్కులు సంపాదిస్తే ప్రాధాన్యత లేదు. అన్ని సబ్జెక్టుల్లో కలిపి అధికమార్కులు సంపాదించినా కూడా, నాకు సీటు రాలేదు. యిక ముందు కూడా వాళ్ళు నిర్ణయించిన సబ్జెక్టులోనే నేను ఎక్కువమార్కులు సంపాదిస్తానన్న నమ్మకం నాకు లేక, అందని ద్రాక్షపళ్ళు పుల్లన అనుకుని, నేను భవిష్యత్తులో యింక ఆ పరీక్షలు రాయకూడదని నిర్ణయించుకున్నాను. నాకు ఉన్నత విద్యల నభ్యసించే భాగ్యం లేదనుకుని సరిపుచ్చుకున్నాను. ఏదో పద్ధతుల్లో సీటు సంపాదించినవాళ్ళను చూసి ఏడువకూడదు గదా! ఎదుటి వారికి గలుగు నెనయుసంపద జూసి తమకు లేదటన్న ధర్మమేమి? బంటు తనము రాదు ప్రతిభలేమి! నాకు యితర సబ్జెక్టుల్లో ఎంత ప్రావీణ్యత ఉన్నా వాళ్ళు నిర్ణయించిన సబ్జెక్టులో లేకపోతే అది వాళ్ళ తప్పా? నాకు ప్రతిభ లేదు కాబట్టి నాకు సీటు రాదు. ఆ కారణంగా యింక ఆ ప్రవేశపరీక్షలు విషయాలే నా మస్తిష్కపు దొంతరల్లో, పొరల్లో అట్టడుగున అగుపడకుండా పోయాయి… ఆశ తప్పినపుడే, అతడే పో ఘన యోగి! అని సరిపుచ్చుకున్నాను…

ఆ ఏడు గడిచిపోయింది…

ఆ రోజు ప్రొద్దున్నే వాన. వాన… వానలతో ఒకరికి మోదం, ఒకరికి భేదం. రెక్కాడితే కాని డోక్కాడని జీవులకు వానలతో ఖేదం. అన్నీ నిండుగా వున్న జీవులకు మోదం… వర్షాకాలం… సుగ్రీవునికి అంగనల కౌగిళ్ళు, రాముడికి అంగలార్పుల్లు! నేను డ్యూటీకి వెళ్ళాల్సివున్న వేళకే వాన మొదలైంది. అప్పుడు నాకు డ్యూటీకి వెళ్ళాలంటే అయిష్టమే – సతినొల్లని పతిలాగా! ఇష్టంగాని దాన్ని ఎలా దూరం పెట్టాలన్న నెపాలను వెదకడమే. వాన! నేను డ్యూటీకి వెళ్ళడం తప్పాలంటే కుంభవృష్టి కురవాలే. ఆ కారణం బలంగా వుంటుంది కాబట్టి సరిగ్గా అతుకుతుంది. ఉరుములు, మెరుపులు… మెరుపుతీవెలను కారణంగా చూపవచ్చు. ఉరుములను కారణంగా చెప్పవచ్చు. కానీ వాన – నేను కోరుతున్న విధంగా పెద్దగా ఏమీలేదు. అనుకుంటే వెళ్ళవచ్చు. కానీ యిష్టంగాలేదు, అయిష్టం… వర్షధారలు అవరోహణ క్రమానికి జారి, జారి, ఆగిపోయాయి.

వాన పేరు మీద డ్యూటీ పోయింది, వానా పోయింది! డ్యూటీ – డూమ్మా అయినందుకు, ఒక లీవు వ్యర్థం అయినందుకుగానూ, ఆ నష్టాన్ని ఎలా పూరించుకోవాలి? కులం చెడినా… అన్నారు. లీవు నష్టం జరిగినా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పనిచేసే గుర్రం వూరుకే వుంటుందా? ఊర చచ్చుకంటే వూరూర దిరుగరా అన్నాడు తత్త్వవేత్త…

ఈ ఆలోచనల్లో నాకో విషయం స్ఫురణకు వచ్చింది. అకస్మాత్తుగా – కొద్దిరోజుల క్రితం యూనివర్శిటి యిచ్చిన పత్రికా ప్రకటన. ఆఁ ఏం వుంటుందిలే, పాత పాటలేగదా అని పేపర్‍ను మూలకు పడేశాను – వివరాలు చూడకుండానే. యిప్పుడు పనిలేనందున ఆ పేపరును బయటకు లాగాను… యింజనీరింగు ప్రవేశపరీక్ష ప్రకటన. ప్రకటనను చదివాక నేను ఎగిరి గంతేశాను! ప్రకటన పోయిన ఏడాది కన్న భిన్నంగా వుంది. ఆప్పుడు ఒక సబ్జెక్టు ఎక్కువ వెయిటేజీ, మరో సబ్జెక్టుకు తక్కువ వెయిటేజీ వుండేది. యిప్పుడు దానికి భిన్నంగా వుంది. అన్ని సబ్జెక్టులు సమానమే. అన్ని సబ్జెక్టులను కలిపిన మార్కులను లెక్కలోకి తీసుకుంటారు తప్ప ఒక్కో సబ్జెక్టును కాదు. ఏ ఒక్క సబ్జెక్టుకు ప్రత్యేకంగా ఉత్తీర్ణతకు కనీస మార్కులు నిర్ణయించలేదు. అన్ని సబ్జెక్టులకు కలిపి ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించారు…

పోయిన ఏడు పరీక్షా విధి విధానాల వల్ల అభ్యర్థులు సీట్లకు సరిపడా ఉత్తీర్ణులు కాలేదట. సీట్లు మిగిలిపోయాయి. యూనివర్శిటీకి ఆర్థికంగా నష్టం జరిగింది. అందువల్ల ఉన్న సీట్లన్నీ నిండడానికి ఎక్కువమంది అభ్యర్థులు వుత్తీర్ణులయ్యే విధంగా విధానాలను సవరించారు. ఒక విధంగా విధానాలను సరళీకరించారు. నేనింక ప్రవేశ పరీక్ష పాసైపోయినంత  ఆనందం కలిగింది. ఇంజనీరింగులో సీటు వచ్చినంత ఆనందం కలిగింది. ఇంక ఆలస్యం చేయలేదు. అప్లికేషన్ పెట్టడానికి యింకా గడువు మిగిలే వుంది. వెంటనే యూనివర్శిటీకి వెళ్ళాను. అప్లికేషన్ తీసుకున్నాను. ఆ తర్వాత అప్లికేషన్‍ను పూరించాను. అప్లికేషన్‍ను సబ్‍మిట్ చేశాను…

ఆ తరువాత ప్రవేశ పరీక్ష రాశాను… పాసయ్యాను. సీటు వచ్చింది. దేశంలో ఒక విలువైన వ్యక్తినయ్యానన్న ఆనందోత్సాహాలు.. చెట్టు చెట్టునన్ గలుగనేర్చునే గొడుగుకాయలు!

ఇంజనీరింగ్ కోర్సులో చేరాను… కోర్సు కాలపరిమితి పూర్తయిం తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీలో పాస్ అయ్యాను.

ఈ సంఘటన స్మృతిపధంలో మెదిలినపుడు… నేను ఇంజనీరింగ్ డిగ్రీ పొందడానికి కారణభూతం ఆరోజు కురిసి, వెలసిన వానే అని అనిపిస్తుంది! ఆరోజు వాన రాకుండా వుంటే నేను మామూలుగానే ఆఫీసుకు వెళ్ళేవాడ్ని యూనివర్శిటీ ప్రకటన గుర్తుకు వచ్చేదే కాదు. వచ్చిన వాన వెలవకుండా, అలాగే కురుస్తూంటే కూడా బయటకు వెళ్ళాలన్న ఆలోచనే వచ్చి వుండేది కాదు. పేపర్ ప్రకటన చూడాలన్న ఆలోచన వచ్చేది కాదు… అనుకోలేదని ఆగవు కొన్ని… నాకు ఇంజనీరింగ్ డిగ్రీ పొందే భాగ్యం, అదృష్టం వున్నందు వల్లనే కాబోలు ఆ రోజు వాన కురిసి, వెలసిన వాన… ప్రతిభతోనే కాదు, అదృష్టం కూడా వుండాలేమో… అవును, అంతా అంటారు – ప్రతిభ ఎందరికో వుంటుంది. కానీ, అదృష్టం కూడా వుండాలి అని!….

Exit mobile version