వారాల వాదాలు

0
1

[డా. కందేపి రాణీప్రసాద్ రచించిన ‘వారాల వాదాలు’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]కా[/dropcap]లెండర్ గోడకు వేలాడుతోంది. ఆ ఇంటి యజమాని కాలెండర్ వంక చూసి ‘అబ్బా రేపు ఆదివారం, హాయిగా ఇంట్లో ఉండవచ్చు’ అని సంతోషంగా అనుకున్నాడు. ఆ ఇంటి పిల్లలు కూడా “అమ్మా రేపు ఆదివారం. మాకు స్కూల్లేదు, శలవు” అంటూ అరుస్తూ చెప్పారు. అమ్మ వంటింట్లో నుంచి ‘సరే సరే’ అని విసుగ్గా అన్నది.

గోడ మీదున్న కాలెండర్ లోని ఆదివారం, సోమవారం వంటి వారాలన్నీ ఒకదాన్నొకటి పలకరించు    కుంటున్నాయి. “అబ్బ! ఆదివారం నీ పని హాయి! అన్ని శలవు. ఏ పనీ ఉండదు నీకెంత అదృష్టం” అంటూ శనివారం నిష్ఠూరంగా అన్నది. “నాకయితే విపరీతమైన పని ఉంటుంది. ఇంటి వాళ్ళు శుభకరమని ఇళ్ళు కడుక్కోవడం, ఆడవాళ్ళంతా తలస్నానాలు చేయడం, దేవుడికి పూజలు చేయడం వంటి వన్నీ చేస్తుంటారు. నాకైతే అసలు తీరికే ఉండదు” అంటూ శుక్రవారం తెగ బాధపడుతూ అన్నది.

‘ఊరుకో నీవున్న రోజేనా పూజలు చేసేది. మరినేనా, వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రోజును నేను. మగవాళ్ళందరూ నా వారం నాడే గుళ్ళకు వెళతారు. ప్రసాదాలు చేసుకుంటారు. చాలా మంది ఉపవాసాలు చేస్తూ పూజలు చేసుకుంటూ సుప్రభాతం చదువుకుంటారు” అంటూ శనివారం తన గొప్పను చెప్పింది శుక్రవారాన్ని ఎద్దేవా చేసింది.

అప్పుడు సోమవారం ముందుకోచ్చి ఇలా అన్నది “ ఏమిటి ఇందాకట్నుంచి మీ గొప్పలు చెప్పుకుంటున్నారు మీ గొప్పలు ఆపండి. సోమవారం అంటే ఆఫీసులు, స్కూళ్ళు అన్ని పనిచేసే రోజు. ఏ పని కావాలన్నా ఈ రోజే వస్తారు. వారాలలో మొదటి దాన్ని. ఇంత ప్రాధాన్యం గల నన్ను వదిలి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. నాకున్న ప్రాముఖ్యం గురించి చెప్పడం లేదు. లయకారుడైన శివుడికి ఇష్టమైన రోజును నేను తెలుసా?” అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ అడిగింది. మిగతా వారాలన్నీ భయపడి వెనక్కు తగ్గాయి.

కానీ శుక్రవారం మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి “నేను ఎవరో తెలుసా? నా షేరేమిటో తెలుసా? నేను లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీ దేవి ఆశీస్సులు, అండ ఉంటేనే ఏ పనైనా జరిగేది. ఏమిటి, హెచ్చుగా మాట్లాడుతున్నావు” అంటూ కోపంగా అన్నది.

“ఆగండాగండి! అందరూ ఎవరి గురించి వారే చెప్పుకుంటే ఎలా? మిగతా వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా! నా గురించి కూడా తెలుసుకో! నేను కూడా గొప్పనే, నేనేమీ అశుభాల మంగళవారాన్ని కాను. సాయిబాబాకు ఇష్టమైన వారాన్ని సాయంత్రమైతే ఎన్నో భజనలు చేస్తారు” అంటూ గురువారం ముందుకొచ్చి పరుషంగా మాట్లాడింది.

మంగళవారం ముక్కుపుటాలు అదురుతుండగా కోపంతో అన్నది “నేను మిమ్మలి ఎవరినన్నా ఏమన్నా అన్నానా? నన్ను అశుభం అంటారా. నా పేరేమిటి మర్చిపోయారా. నా పేరు మంగళవారం. నేను మంగళకరమైన దాన్నని. నాకా పేరు పెట్టారు. నేను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదు. మీరు నన్నెందుకు తక్కువగా చూస్తున్నారు?” ఏడుపు గొంతుతో మాట్లాడింది. ఇక మాటలు మాట్లాడలేక గొంతు మూగబోయి ఆగింది.

“ఆపండి మాటలన్నీ! ఎవరూ ఎవర్ని అనలేదు. అసలు విషయం ఏమంటే ఆదివారానికి పనేమీ లేదని అందరూ అనాలనుకున్నాయి. మిగతా వారాలన్నీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాయి. ఆఫీసులు స్కూళ్ళు అంటూ చాలా పనుంటుంది కానీ, ఆదివారానికే ఏమీ పనిలేదు. ఆ విషయం చెప్పాలనుకుని చివరకు మీలో మీరు వాదులాడుకుంటున్నారు. అంతే” అంటూ బుధవారం అసలు విషయాన్ని తేల్చి చెప్పేసింది.

“అవునవును నువ్వు చెప్పింది నిజం. ఆదివారానికి అసలు పనేమీ లేదు. కష్టపడేదంతా మనమే. ఆదివారం అన్నీ సెలవే, ఏ పనీ ఉండదు” అంటూ అన్ని వారాలూ మూకుమ్మడిగా అన్నాయి.

అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న ఆదివారం నింపాదిగా ముందుకొచ్చి అన్నది “ఏమిటీ ఆదివారం సెలవా! నాకేమీ పనుండదా!  మరి వారం రోజులూ పేరబెట్టిన పనులన్నీ ఏ వారం నాడు చేస్తారు. ఇల్లు బూజులూ దులపడం, ఇల్లు సర్దుకోవడం, బట్టలు ఉతకడం వంటివన్నీ ఎప్పుడు చేస్తారు. బంధువులింటికి వెళ్ళాలన్నా, సినిమాలు, షికార్లకు వెళ్ళాలన్నా ఏ వారం నాడు వెళతారు? మీరంతా పనులు చేసే వాడావిడి తప్ప అందులో ఆనందం ఉండదు. అదే ఆదివారం నాడు ఎంత పని చేసినా సంతోషంగా ఉంటారు. నాకు పని లేదని మీరెట్లా అంటారు. చెప్పండి!” అంటూ ఆదివారం ప్రశాంతంగా అన్ని విషయాలూ చెప్పింది.

ఆదివారం చెప్పిన మాటలన్నీ విని మిగతా వారాలన్నీ తల ఆడించాయి. తన మాటలు నిజమని ఒప్పుకున్నాయి. ఆదివారాన్ని అభినందించాయి. సోమవారం నుంచి శనివారం దాకా అందరూ చేయి చేయి పట్టుకుని కలిసి ముందుకొచ్చాయి. “అసలు మనలో మనకు తగాదాలు ఎందుకుని మనందరం కలసి ఉంటేనే మనుష్యులు మనల్ని గుర్తిస్తారు. అందరం కలిసిమెలిసి ఉంటేనే వారాలు నెలలు అంటూ గుర్తింపు లభిస్తుంది. ఇంక ఎప్పుడూ మనలో మనకు అభిప్రాయ భేదాలొద్దు” అంటూ అన్నీ కలిసి చెట్టాపట్టాలేసుకుని ముందుకు నడిచాయి. ఆదివారం నుండి శనివారం దాకా అన్నీ కలసికట్టుగా ‘వారాలు’ గా ఉంటున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here