Site icon Sanchika

వారాంతపు వెలుగు

[మాయా ఏంజిలో రచించిన ‘Weekend Glory’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(తన జీవితం ఎవరీ అందనంత ఎత్తులో ఏమీ లేదని, అయినప్పటికి తనకి ఉన్నంతలో తన స్వేచ్చామయ జీవితం ఎంతో బాగున్నట్టుగా చెప్పే స్వరం ఈ కవితలో వినిపిస్తుంది. సంతృప్తి లోనే స్వర్గమున్నది అని సాధికారంగా చెప్పిన కవిత!!)

~

[dropcap]ఎం[/dropcap]దుకూ పనికి రాని జనాలు కొందరు
నిజానిజాలేమీ తెలియకుండా
నా గురించి
వారి నోటికొచ్చినట్టుగా పేలుతుంటారు
మెడలన్నీ సాగదీసి
నడుములు వంగదీసి
నా జీవితంలోకి తొంగి చూస్తారు

వారి స్థాయిని బట్టి
కులీనులుండే
నివాసగృహాల్లోకి తరలిపోతారు
స్థానిక బ్యాంకుల్లో
వాళ్ళ ఆత్మలను కుదువబెట్టి
కొనే తాహతు లేకున్నా
పెద్ద పెద్ద కార్లు కొని
విసుగుతో ఏమీ తోచక
నగరమంతా వూరికే
తిరుగుతున్నట్టు నటిస్తారు
నిజానికి వాళ్ళు
జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకుంటే
నా వారాంతపు రాత్రిని
తప్పక
అధ్యయనం చేయాల్సిందే

ఓ కర్మాగారంలో నా ఉద్యోగం
పెద్ద వేతనమేమీ కాదు
అయినా
నా బిల్లులన్నీ ఖచ్చితంగా చెల్లిస్తాను
అప్పులకి ఎంతో దూరంగా ఉంటాను
నా సంతోషం కోసం
నా శిరోజాలను
చక్కగా అలంకరించుకుంటాను

గల్లగురిగిలో దాచుకున్న డబ్బును బయటకు తీయడం
సాయంత్రం పట్టణం దాటి
నా స్నేహితురాలి ఇంటిదారి పట్టడం
ముందుగా అనుకున్నట్టు
మా స్నేహితులను కలుసుకొని
లయబద్దమైన నాట్యాలు
కథనాలతో కూర్చిన పాటలు
కార్మిక గీతాలు పాడుకోవడం
కేకలు కేరింతలతో
విందువినోదాలతో
హాయిగా గడపడం

జనాలు ఏవేవో రాస్తారు నా గురించి
వారమంతా నేనెంతగా
కష్టించి పని చేస్తానో
వాళ్ళేమీ తరచి చూడలేరు

నేను ఆకర్షణీయంగా ముస్తాబవడం
నవ్వుతు తుళ్ళుతు నాట్యం చేయడం
నా నిర్లక్ష్యపు చూపులు – అన్నీ
నా బాధలు అలోచనల నుంచి
ఆటవిడుపుగానే..
నా జీవన సరళిని వాళ్ళు తప్పు పడతారు
రోజు రోజుకీ వాళ్ళు నన్ను బద్నాం చేస్తారు
వాళ్ళెవరిని తమాషా చేస్తున్నారో
వారికేమైనా అర్థం అవుతుందా

నా జీవితం స్వర్గమేమీ కాదు
అలాగని నరకమూ కాదు
నేనేం అంత ఎత్తులో లేను
అదంతా వాపు అంటాన్నేను
నల్లజాతి దాన్నవడం నా అదృష్టం
మళ్ళీ శనివారం రాత్రి దాకా
నేను కష్టించి పని చేయగలిగితే
దానికి తగిన వేతనం దొరికితే
అంతే చాలు నాకు!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


1969లో తన మొట్టమొదటి పుస్తకంగా ‘I know why the caged bird sings’ అన్న ఆత్మకథని వెలువరించింది మాయా. ఆ పుస్తకానికి ఉద్యమ రచయిత, తాను అన్నగా భావించే James Baldwin ప్రోత్సాహం, తోడ్పాటు పూర్తిగా లభించింది. బాల్యంలో తాను అనుభవించిన వేదన, ఎదుర్కున్న వర్ణవివక్ష, తనపై జరిగిన అత్యాచారం, తన జీవితపు తొలినాళ్ళ సవాళ్ళు, మొత్తంగా తన 3 సంవత్సరాల వయసు నుంచి 16వ యేడు వరకు తన జీవితాన పరచుకున్న వేదన, ఘర్షణ అంతా ఆ రచనలో కూర్చింది. బాల్యంలో ఆమె ఎదుర్కొన్న తిరస్కరణలు, కౌమారంలో లభించిన హద్దుల్లేని స్వేచ్ఛ, తత్పరిణామాలు, క్రమంగా తాను ధృఢంగా తయారైన తీరు మొదలైన అంశాలని అందులో  చర్చించింది మాయా. ఆనాటి పాఠకుల హృదయాలలో ఆమె వ్యథ ప్రతిధ్వనించింది. ఆ పుస్తకానికి ఎంతో ఆదరణ లభించింది. తరువాతి కాలంలో ప్రతిష్ఠాత్మక National Book Award కి గాను nominate అయ్యింది.

మాయా కవితలు ఎక్కువగా – ప్రేమ, ఒంటరితనం, వర్ణవివక్ష, యుద్ధ అనుభవాలు, మనుషులని కోల్పోవడాలకు చెందినవై ఉంటాయి. తన స్వీయానుభవాలే కాకుండా నాటి ఆఫ్రికన్ అమెరికన్ మహిళల  జీవితానుభవాలను కూడా అక్షరీకరించింది మాయా.

ఎదుటి మనుషులని లోతుగా అర్థం చేసుకోవడం మాయాకి ఉన్న బలం, సంస్కారం. దాన్ని ప్రతిభావంతంగా  communicate చేయడం, సహానుభూతితో ప్రవర్తించడం వలన ఆమె ఎందరి హృదయాలకో చేరువ కాగలిగింది. తన మాటలతో, పిలుపుతో నాటి ఆఫ్రికన్ అమెరికన్ సమాజాన్ని ఎంతో ఆకట్టుకునేది మాయా.

  1. ఆత్మవిశ్వాసంతో, శక్తివంతంగా మాట్లాడండి.
  2. మీ దయనీయమైన కథని ఇతరులకు చెప్పడానికి భయపడకండి.
  3. కఠినజీవన సమయాలు మీ అభివృద్ధికి అవకాశాలుగా భావించండి.
  4. మీ ధైర్య స్థైర్యాలను పెంపొందించుకోండి.
  5. భవిష్యత్తుపై ఆశావహ దృక్పథంతో ముందుకు సాగండి.

ఇలా ఉండే మాయా సానుకూల వైఖరి, ఆమె మాటలతీరు నాటి ఆఫ్రికన్ అమెరికన్ సమాజాన్ని ఎంతో  ఉత్తేజితులను చేసాయి.

Exit mobile version