[dropcap]సం[/dropcap]దేహపు సంద్రానికి
ఆ తీరం వైపు నీవూ
ఈ తీరం వైపు నేనూ
ఎదురెదురుగా నిలబడుంటాము
వాదనల వారధిని
మాటలతో, ఋజువులతో, ఉదాహరణలతో
నీవైపు నుంచి నీవూ
నావైపు నుంచి నేనూ
కూలిపోకుండా
కలకాలం నిలబడేట్టు
గట్టిగా కట్టుకొస్తుంటాము
ఎక్కడో ఒకచోట
ఇద్దరం కలిసిన చోట
ఏకీభవించాల్సిన మాట అగుపడ్డ చోట
వారధి పూర్తవుతుంది
గెలుపోటముల కాంక్ష
మంచులా మాయం అవుతూంటే
వాదన హఠాత్తుగా ముగుస్తుంది
సందేహానికి సమాధానం లభిస్తుంది
వారధిపై సంచారం మొదలవుతుంది