[dropcap]నే[/dropcap]ను నీ కవిత్వపు విషయం కావాలని
కోరుకోవటం లేదు..
నీ కవిత్వ పుటల మధ్య –
బుక్‌మార్క్‌ని అవ్వాలని వుంది..!
ఒకే భావంలో కుదించుకుని
ఓ పేజీలో నిక్షిప్తమై పోవాలని లేదు..
నీ వేళ్ళ నులి వెచ్చని స్పర్శతో
ప్రతీ పేజీని పరామర్శించాలని వుంది..!
ఒకే సందర్భానికి శీర్షికనై మెరవాలని లేదు..
అన్ని రసాలతో నీ హృదయాన్ని
మురిపించాలని వుంది..!
కళ్ళను పరిగెట్టిస్తూ చదివించాలని లేదు..
అనుభూతిస్తూ ఆస్వాదించేందుకు
విరామం అవ్వాలని వుంది..!
తామరాకుపై నీటి బొట్టుని అవ్వాలని లేదు..
చదివేసిన గతానికి చదవాల్సిన భవితకీ మధ్య వారధిని అవ్వాలని వుంది..!