Site icon Sanchika

వారసత్వం

[dropcap]క[/dropcap]రోనా మహమ్మారి మన దేశంలోకి కూడా వచ్చేసిందట!

రోజువారీ పనులన్నీ ఇక ఉండవట!

దుకాణాలు తియ్యకూడదట! బస్సులూ రైళ్ళూ నడవ వట!

అందరూ ఇళ్లల్లోనే ఉండాలట!

మహమ్మారి సోకితే ఇక చావేనట!

ఎవరిని ఎవరూ ముట్టుకోకూడదట!

ముక్కూ మూతులకు ముసుగు తొడుక్కునే వుండాలంట!

ఈ రోగానికి మందులే లేవంట!

ఈ మాటలన్నీ గుడిసెలోంచే వింటున్న రత్నమ్మకి ఒక్కసారిగా భయం వేసింది. రోజూ బండిలో వీధి వీధీ తిరిగి కూరలు అమ్మాక డబ్బులు బాగానే వస్తున్నా వీరయ్య తాగి తందనాలాడి మిగిల్చిన దానితోనే తమ బతుకులు గడుస్తున్నాయి.

కొన్నాళ్లుగా తను పాచిపనులకు వెళ్లటం లేదు. నెలా నెలా బహిష్టు సమయంలో రక్తస్రావం చాలా అయిపోతోంది తనకు, ఏడు ఎనిమిది రోజులవరకూ ఆగటమే లేదు దానితో విపరీతంగా నీరసం వచ్చేస్తోంది. ఒకటి రెండు సార్లు పనికి వెళ్తూ కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి పోయి చూపించుకోక తప్పలేదు. డాక్టరు ఎవో గోళీలు ఇచ్చి కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోకపోతే ప్రాణాంతకం అవుతుందన్నాడు. తను పని మానెయ్యక తప్పలేదు.

***

వీరయ్యకు ఇంట్లో వున్న రత్నమ్మని చూస్తే కోపం వచ్చేస్తోంది. ఇన్నాళ్లు చిత్తుగా తాగి ఎంత డబ్బు మిగిలిందో అంతే యిచ్చినా ఎక్కువ సణుక్కోకుండా తీసుకునేది. ఇప్పుడు అలా ఊరుకోవటం లేదు. తను పని మానేసిన తర్వాత లెక్కలు అడగటం మొదలుపెట్టింది. ఇంటికి తను యిచ్చేది ఏ మాత్రం సరిపోదు పైగా ఆరో తరగతి నించి ఏడో తరగతిలోకి అడుగు పెడుతున్న కొడుకు కూడా ఏదో అవసరానికి తనని పైసలు అడుగుతున్నాడు. ఇవన్నీ తెలిసినా తను రోజూ తాగకుండా వుండలేకపోతున్నాడు. రోజంతా వీధుల్లో తిరిగి కూరలమ్మి చీకటి పడే సమయానికి అలసట ముంచుకొచ్చి నాలిక జివజివలాడ్డంతో కాళ్ళు తనంతటతానే సారా దుకాణంకేసి మళ్ళుతాయి.

***

కరోనా మహమ్మారి వలన పనులూ, దుకాణాలూ మూతబడతాయని విన్న దగ్గర నుంచి వీరయ్యకు భయం పట్టుకుంది. సారా దుకాణం కూడా మూసేస్తారని వినగానే ఎక్కడలేని చిరాకు కోపం వచ్చింది. ముందుగా సారా కొని యింట్లో పెట్టుకోనందుకు తనమీద తనకు కోపమే కాక రత్నమ్మ మీద కూడా కోపం వచ్చింది. “దొంగ ముండ పనిమానేసింది. సారాకి డబ్బులు ఎవర్నడగాల” అనుకున్నాడు. రోజూ రత్నమ్మకు ఎక్కువ డబ్బులు యిచ్చుంటే సారా కోసం అడగితీసుకోవడానికి వీలుండేది అని మొదటిసారి బాధ పడ్డాడు వీరయ్య. కానీ సాయంత్రం కల్లా అత్యవసర వస్తువులు అమ్మే తనలాంటి వాళ్ళని పనిచేసుకోనిస్తారని తెలిసి తను ఎప్పటిలా రోజూ కూరలమ్మి సంపాదించుకోవచ్చని తెలిసి కుదుట పడ్డాడు వీరయ్య.

***

రత్నమ్మ కూడా తన మొగుడిని ఎప్పటిలాగే కూరలమ్ముకోనిస్తారని తెలిసి మనసు కుదుటపరచుకుంది‌. సారా దుకాణాలు మాత్రం తియ్యనియ్యరని తెలిసి మనసులోనే ‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎగిరి గంతేసింది కానీ మొగుడు కోపగించుకుంటాడని ఆనందం లోపలే అణుచుకుంది.

***

మరునాడు రోజూలా కాక కూరలన్నీ అమ్ముడైపోయాయి. డబ్బులు ఎంతో ఎక్కువ వచ్చినా తాగేందుకు సారా దొరకలేదు వీరయ్య కి చేసేదిలేక రత్నమ్మకి డబ్బులన్నీ యిచ్చేశాడు. కొన్నాళ్ళు యిదే తంతు కొనసాగింది. చేతిలో మెల్లగా డబ్బులు ఆడసాగేయ్. రత్నమ్మ కరోనా మహమ్మారికి కాదు కాదు అమ్మవారికి రోజూ మనసులోనే దణ్ణం పెట్టుకుంటోంది. నోట్లోకి రెండు పూటలా నాలుగు వేళ్ళు వెళ్ళడమే కాక పిల్లోడి చదువుకోసం మంచి మొబైల్ కావాలని అన్నకోరిక కూడా తీరేలా మెల్లగా డబ్బులు కూడుతున్నాయి.

***

ప్రతీ రోజూ వందల సంఖ్యలో ప్రజలు ఆసుపత్రిలో భర్తీ అవుతున్నారు. ఎన్నో పధకాల్లో ధనం వ్యయం చేస్తోన్న ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యసంక్షేమం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన గత్యంతరం లేని పరిస్థితి వచ్చేసరికి మొట్టమొదట సారా దుకాణాలు తెరవాలని నిర్ణయించింది‌.

***

ఈ వార్త తెలియగానే వీరయ్య ఎగిరి గంతేశాడు.

ముందులా కాక యిన్నాళ్ళూ రత్నమ్మకు యిచ్చిన డబ్బులన్నీ తీసుకుని వీలైనన్ని సారా సీసాలు కొని వుంచుకోవాలి అనుకున్నాడు. తల్లి దగ్గరకు వెళ్ళిన రత్నమ్మకు మాత్రం ఈ వార్త తెలియగానే నీరసంగా కూలబడి పోయింది. కొద్దిసేపటికి కాస్త ఓపిక తెచ్చుకుని మిగిలిన డబ్బులు వీరయ్యకు దొరక్కుండా దాచేయాలని గుడిశెకేసి పరుగు లంకించుకుంది. డబ్బులు దాచుకున్న డబ్బా ఆత్రంగా తీసి చూసింది. ఖాళీ డబ్బా చూడగానే గుండెలు బాదుకుంది‌ మూడు నాలుగు గంటల తర్వాత చేతుల్లో అయిదారు సీసాలతో విజయ గర్వంతో వీరయ్య ప్రత్యక్షం అయ్యాడు. రత్నమ్మ డబ్బులన్నీ పోయాక యిక దెబ్బలాడితే మాత్రం ఏం ఉపయోగమని గుడిసెలో ఓ మూల కూలబడింది.

***

అర్ధరాత్రి దాకా తాగుతూ కూర్చున్న వీరయ్య మరునాడు ప్రతీ రోజూ ఎప్పటిలా చీకటితోనే కూరలమండీకి లేచి పరుగెత్తలేదు‌.‌ బారెడు పొద్దెక్కాక లేచేసరికి ఒళ్ళంతా తీపులుగా జ్వరం వచ్చినట్లు అనిపించింది. ఖాతరు చెయ్యకుండా ఆదరాబాదరాగా బండితో మండీకి బయలుదేరాడు‌. రత్నమ్మ పిలుస్తున్నా వినిపించుకోలేదు.

సగం దారిలోనే వీరయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు. కొద్దిసేపటికి అటుగా పోతూన్న పోలీసు జీపు రోడ్డు మధ్య నిలిచిపోయిన బండిని పక్కనే పడిపోయున్న వీరయ్యను చూసి ఆగింది. దగ్గరకి వెళ్లి చూసే ధైర్యం లేక యినస్పెక్టరు ఆసుపత్రికి ఫోను చేశాడు. ఓ రెండు గంటల తర్వాత ఆసుపత్రి వేను వచ్చి వీరయ్యను మోసుకెళ్ళిపోయింది‌.

అర్ధరాత్రి అయినా వీరయ్య జాడ లేదు. రత్నమ్మ కాస్త ధైర్యం చేసి పక్కనే వున్న గుడిశలో ఎల్లయ్యతో వీరయ్యను యివేళ ఎక్కడైనా చూశావా యింకా యింటికి రాలేదని అడిగితే నేను ఈ రోజు కూరలమండీలో వీరయ్యను చూడలేదు. ఏ వీధిలోనూ ఎదురు కూడా పడలేదు అన్నాడు. కానీ కొంచెం దూరంలో రోడ్డు పక్కన పడివున్న ఓ ఖాళీ కూరల బండి చూశాను అన్నాడు. రత్నమ్మ పరుగెత్తికెళ్ళి చూస్తే అది తన మొగుడు రోజూ కూరలమ్ముకునే బండేనని గుర్తు పట్టి ముందు దాన్ని గుడిసె దగ్గరకు చేర్చింది. తరువాత పిల్లాడిని నిద్రలేపి “మీ నాన్న యింకా రాలా. యెతుకుదాం” పదమని బయల్దేరదీసింది.

ఎంత తిరిగినా వీరయ్య కనిపించలేదు.

***

పొద్దున్నే పోలీసు జీపు గుడిశెల దగ్గరకు దూసుకొచ్చింది. మైకులోంచి యినస్పెక్టరు గొంతు మారు మ్రోగింది. “యిక్కడ వీరయ్య ఎవరు?” అని. మగతగా జోగుతున్న రత్నమ్మ వీరయ్య పేరు వినగానే ఉలిక్కిపడి లేచి పరుగెత్తి జీపు దగ్గరకు కంగారుగా వచ్చింది. వీరయ్య నీకేమవుతాడన్న యినస్పెక్టరు ప్రశ్నకు “నా పెనిమిటయ్య” అని జవాబు చెప్పింది.

“మీ ఆయన కరోనా వచ్చి సచ్చిపోయిండు. గాంధీనగరులో వున్న గవర్నమెంట్ ఆసుపత్రిలో శవం వుంది” అని చెప్పి జీపు దుమ్ము రేపుకుంటూ వెళ్లి పోయింది. రత్నమ్మకు ఏంజెయ్యాలో పాలుపోలేదు.

ఆసుపత్రికి ఒక్కర్తే బయలుదేరింది. కరోనా భయంతో ఎవరూ తోడురాము అనేశారు. తీరా ఆసుపత్రికి పోతే అక్కడ రత్నమ్మను ఎవరూ పట్టించుకోలేదు.అయిదారు గంటల తర్వాత పూర్తిగా పైనుంచి కింద దాకా ప్లాస్టిక్ తోడుక్కున్న ఓ ఆసుపత్రి మనిషి వచ్చి” శవాలు చూపించేది లేదు. మేమే దహనం చేసేస్తాం వెళ్లి పోండి” అని ఏం అడిగినా జవాబు చెప్పకుండా లోపలికి వెళ్ళి పోయాడు. ఆసుపత్రి నుంచి పిచ్చిదానిలా వెనక్కు వచ్చేసింది. పిల్లాడికి ఏడుస్తూనే విషయమంతా చెబుతూ సొమ్మసిల్లి పోయింది. ఏమీ తినకపోయినా రత్నమ్మా కొడుకూ ఆరోజు అలానే నిద్రపోయారు.

***

పొద్దున్నే లేచి చూసుకుంటే గుడిసెలో కొడుకు కనిపించలేదు.

రత్నమ్మ గాబరా పడుతూ బయటికి వచ్చి చూసే సరికి కొడుకు బండి శుభ్రం చేస్తూ కనిపించాడు.

Exit mobile version