Site icon Sanchika

వచనాల చేనేతల ఆద్యుడు జేడర దాసిమయ్య

[box type=’note’ fontsize=’16’] ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు రాజేశ్వరి దివాకర్ల. [/box]

[dropcap]మా[/dropcap]నవాళికి వస్త్రాన్ని అందించి నాగరికతను నేర్పింది చేనేత రంగం.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్రను పోషించింది చేనేత. స్వాతంత్య్ర సముపార్జనకు ఒక సాధనంగా నిలిచింది చేనేత. గాంధీజీ రాట్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.

చేనేత రంగం విశిష్టతను తెలియజేస్తూ చేనేత కార్మికుల గౌరవాన్ని ప్రతిబింబించేలా 2012 నుంచి ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత దినంగా ఎంచారు. చేనేత కార్మికులకు ‘సంత్ కబీరు’ అవార్డులను జాతీయ స్థాయిలో అందిస్తున్నారు.

వృత్తులు లేని సమాజం మనలేదు. చేతి వృత్తులు అన్నింటికీ మానవ జీవనంతో అవినాభావ సంబంధం ఉంది. చేతి వృత్తుల శ్రమలో తాత్వికత ఇమిడి పోయింది. జీవన అనుభవం ఉంది. అనంత భౌతిక చైతన్యం ఉంది. అది కవిత్వంగా జీవన దార్శనిక ప్రమాణంగా వచనంగా సాక్షాత్కరించింది ‘జేడర దాసిమయ్య’ గారికి. వచనాలు 12వ శతాబ్దం కన్నడ భాషలో సరికొత్త కావ్య ప్రక్రియగా వెలసాయి. భక్తి ప్రాతిపదికగా కాయకమే (శ్రమ) మూలంగా మానవుని బ్రతుకును ప్రగతి పథంలో నడిపాయి. ఉపనిషత్తులకు వలె ప్రాధాన్యం సంతరించుకున్న ‘వచన’ ఉద్యమ యుగకర్త బసవేశ్వరుడు.

వచనకారులలో జేడర దాసిమయ్య ఆద్యుడు. శ్రేష్ఠ వచనకర్తగా, అగ్రగణ్యునిగా గుర్తింపును పొందిన దాసిమయ్య వృత్తి బట్టలు నేయడం. సంసార విరక్తితో తపస్సును చేసిన దాసిమయ్యకు శివుడు ప్రత్యక్షం అయ్యాడు. మోక్షాన్ని కోరిన దాసిమయ్యకు శివుడు ఆతడు చేయవలసిన మహత్కార్యం ఉందని దేవతలకూ, మానవుకూ మాన సంరక్షణను కావించే వస్త్రాలను నేత చేయమని ఆదేశించాడు. అతడు ఆచరించే వృత్తిలోనే పరమాత్ముడు గోచరిస్తాడు అని పలికాడు. ఆ ఉపదేశాన్నే జనులకు తెలుపమని ఆదేశించాడు.

ఆనాటి నుంచి తాను చేసే పనిలో పూర్తిగా నిమగ్నమై తోటి వారికి జీవనోపాధిని కల్పించాడు దాసిమయ్య. వస్త్రాన్ని నేయడంలో నేతను సాలీడు అల్లికతో పోల్చినందులకు (కన్నడంలో జేడ అంటే సాలీడు) జేడర దాసిమయ్యగా పేరు పొందాడు. నేత వచన పరం గానూ వృత్తి పరం గాను దేవుని లో భాగమే కాబట్టి, దాసిమయ్య దేవాంగ జనానికి ఆరాధ్యుడయ్యాడు.

దాసిమయ్య గారికి ఆధి దైవతం రామనాథుడు. ఆయన రామనాథ ‘అంకిత ముద్ర’తో పలికిన 176 వచనాలు లభించాయి. స్త్రీ పురుష సమానత, మానవ స్వభావం లోని వైరుధ్యం, గురు శుశ్రూష, దాంపత్య ధర్మం, శరీర లోభం, మొదలైన అంశాలను దాసిమయ్య గారి వచనాలు సరళంగా వివరిస్తాయి. ఆ వచనాల లోని అత్మీయత భక్తినీ, జీవన చైతన్య శక్తినీ కలిగిస్తుంది.

దేవునికి వస్త్రాన్నిచ్చి తవనిధి (అక్షయ పాత్ర) ను పొందాను అని చెప్పిన ఆసు దేవల దాసిమయ్య గారి అహాన్ని మరొక శివ శరణుడు శంకర దాసిమయ్య తొలగించాడు.

సతితోడి పొందును, ఆకలికాహార సేవన,
పృథ్వీ పతి పూజను
తెలివుంటే ఇతరుల చేత
చేయించేవారుంటారా రామనాథా

అంటూ.. తన వృత్తి ధర్మాన్ని తానే నియమం తప్పక ఆచరించాడు దాసిమయ్య. పోగు పోగులుగా దారాలను అల్లుతూ వస్త్రాన్ని తయారుచేసే పనిని అవలంబించిన దాసిమయ్య కు చేనేత లో ఆడ, మగ, అన్న భేదం లేని శివ మయమైన ఆత్మ గోచరించింది.

చన్నులూ, జుట్టు పెరిగితే ఆడదంటారు
గడ్డాలు, మీసాలు వస్తే మగాడంటారు
మధ్యన తిరుగాడే ఆత్మ
ఆడకాదు మగకాదు కనుమా రామనాథ!..

అంటూ లింగ వివక్షతలకు అతీతమైన ఆత్మను గురించి మొదటి సారిగా సామాన్యులకు వివరించారు. ఆయన పలికిన వచనం వృత్తి నిమగ్నతలో కలిగిన ఆత్మావిష్కారాన్ని గురించి తెలుపుతుంది.

నిడుపాటి కర్రను విరిచి రెండుగా చేసి
అడుగును ఆడదిగా
పై భాగము మగ వానిగా
మధ్య రాజేస్తే వచ్చే నిప్పు
ఆడదా మగదా రామనాధా ..

అన్న వచనంలో దృష్టాంతం అనుభవ పూర్వకమైన అర్థాంతరాన్ని జోడిస్తుంది.

పతి పత్ను లొకటైన భక్తి హితమైనది దేవునికి
సతిపతులొకటికాని వారి భక్తి
అమృతంలో విషం కలిపినట్టు కనుమా రామనాథా!

అని చెప్పి, దాంపత్య ధర్మానికి సరికొత్త ఒరవడిని ఆచరించి నిరూపించాడు. ఈ వచనం లోని విషం అమృతం అన్న విరుద్ధ వస్తు ధర్మాల ఉపమానం అమేయంగా దాసిమయ్య సాహిత్య కళా నేతను నిరూపిస్తుంది.

జేడర దాసిమయ్య గారి భార్య దుగ్గల. వారిరువురి దాంపత్యం ఆదర్శవంతమైనది. ఆమె గురు జంగమ సేవలో జీవన సార్థక్యాన్ని పొందింది. నేతకారులైన మహిళా కవయిత్రులలో ఆమెను ప్రథమమని గుర్తించవచ్చు. దాసిమయ్య గారితో పాటు సాధ్వీమణిగా ఆమె కథ గూడ ప్రసిద్ధి కెక్కింది. దుగ్గల రచించిన రెండు వచనాలు లభించాయి. అంకితముద్ర ‘దాసయ్య ప్రియ రామనాథ’. వాటిలో బసవ, అల్లమ, చెన్నబసవ, మరుళ శంకరదేవ, సిద్ధరామ, అజగణ్ణలను గురువులుగా భావించింది. వారి కారుణ్య ప్రసాదం కావాలని కోరింది. బసవన్నగారి కాలంలోనూ ఆమె జీవించే వున్నదని తెలియవస్తున్నది.

దాసిమయ్య కాలం క్రీ.శ 1100. గుల్బర్గా జిల్లా ముదనూరు ఆతని జన్మస్థలం. అనేక దేవాలయాలున్న ముదనూరు గుడి లోని రామనాథుడు ఆరాధ్య దైవ దైవ. దాసిమయ్య తండ్రి రామయ్య. తల్లి శంకరి.

భక్తి ఉద్యమకారుడు, సామాజిక సంస్కర్త, సమతా ఉద్యమకారుడు సంత్ కబీరు దాసు. కాశీ కేంద్రంగా క్రీ.శ. 1455-1518 నడుమ కాలాన జీవించాడు.

తలిదండ్రులకు దూరమై అనాథగా ఉన్న శిశువును చేనేత వృత్తిలో ఉన్న ముస్లిం దంపతులు నీరు, నీమా, పెంచారు. చిన్ననాటినుంచి కబీరుకు ఆధ్యాత్మిక పిపాస కలిగింది. తెల్లవారు ఝామున చీకట్లో గంగా స్నానం చేసి వస్తున్న రామానందుని కాళ్ళకు కబీర్ దాసుని దేహం తగిలింది. ‘రామరామ’ అంటూ రామానందుల వారి నోటి నుండి వెలువడిన వాక్యాలే కబీరు దాసుకు మంత్రోపదేశ వాక్యాలయ్యాయి.

నారీ నరక న జానియె, సబ సంతన కీ ఖాన్
జామే హరిజన ఊపజె, సోయీ రతన కీ ఖాన్

‘నరకానికి మార్గాలంటూ మహిళను అవమానించ తగదు. అనేక మంది సాధువులకు ఆమె జన్మ నిచ్చింది. భగవంతుని భక్తుడనే అమూల్య రత్నాలను మనకు అందించింది ఆ మూతృమూర్తి’ అని మహిళల ఉన్నతిని చాటిన పరమ భక్తుడు కబీర్ దాసు. ఆతని పేరిట జాతీయ చేనేత దినాన పురస్కారాలను ఇవ్వడం ముదావహం.

Exit mobile version