Site icon Sanchika

వడదెబ్బ తగిలితే

[dropcap]ఎం[/dropcap]డాకాలం అంటే సెలవులు. సెలవుల్లో పిల్లలకు హద్దులు ఉండవు. పిల్లలు ఇంట్లో ఉంటే అల్లరే అల్లరి. వాళ్ళని పట్టుకోవడం అంటే తల్లిదండ్రులకు పెద్ద పని. వాళ్ళని బయట ఎండల్లో ఆటలు అడనివ్వకుండా చూడటం చాలా కష్టమైన విషయం. మధ్యాహ్నం పూట ఇంట్లో అందరూ నిద్రపోయే టైములో పిల్లలు బయటకు వెళ్లిపోతుంటారు. ఆకాశ్, అవని కూడా అమ్మ ఎప్పుడు నిద్రపోతుందా అని చూస్తున్నారు. అమ్మ, నానమ్మ నిద్రపోగానే ఇద్దరూ బయటపడ్డారు.

వీళ్ళిద్దరికీ తోడుగా ఆ వీధిలో పిల్లలందరి ముఠా ఒకటి తోడుగా ఉన్నది. అందరూ బ్యాట్లు పట్టుకొచ్చారు. రోడ్డు మీద ఆ సమయంలో ఎవరూ తిరగరు, కాబట్టి చక్కగా క్రికెట్ ఆడటం మొదలు పెట్టారు. క్రికెట్ అనగానే పిల్లలకు ఎక్కడలేని ఉత్సాహం వరదలా తన్ను కొచ్చేస్తుంది. రెండు గ్రూపులుగా మారి క్రికెట్ అడుతున్నారు. మండిపోయే ఎండా ఉన్నా ఎవరికీ నీరసం రావట్లేదు. బాల్ వేస్తూ బ్యాటింగ్ చేస్తూ వచ్చే పాయింట్ల లెక్కపెట్టుకుంటూ ఉత్సాహంతో ఉన్నారు. పెద్ద వాళ్ళెవరూ నిద్రలేవక పోవడంతో వాళ్ళ అట బ్రేకుల్లేకుండా సాగుతోంది.

ఉన్నట్టుండి ఆకాశ్ గభాల్న కింద పడిపోయాడు. పిల్లలందరూ గుమికూడారు. వాళ్ళకు ఒక్కసారిగా భయం వేసింది. వెంటనే ఆకాశ్ వాళ్ళ అమ్మకు చెప్పారు. ఆకాశ్ అమ్మ రాజిత గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఆకాశ్‌ను ఎత్తుకొని లోపలకు తీసుకొచ్చింది. పిల్లడు ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు.

వెంటనే దగ్గర్లో ఉన్న సృజన్ హాస్పిటల్‌కు తీసుకెళ్ళారు. డాక్టరుకు చూడగానే అర్థమయింది. పిల్లవాడు మన స్పృహలో లేడు. వెంటనే ఐస్ నీళ్ళు తెమ్మని కంపౌండర్‌కు చెప్పాడు. ఐస్ నీళ్ళు తెచ్చాక ఆ నీళ్ళతో వళ్ళంతా తుడవమని చెప్పారు. పిల్లవాడి వళ్ళు కాలిపోతూ ఉన్నది.

రాజిత ఒళ్ళు తుడుస్తూ డాక్టర్‌తో అన్నది “వీడికి ఫీవరేమీ లేదు సార్. ఏంటి ఇంత వళ్ళు కాలిపోతున్నది” అని.

“అది కూడా వడదెబ్బలో ఒక భాగమమ్మా” అని చెప్పాడు డాక్టరు. పిల్లవాడికి స్టెత్ పెట్టి పరీక్షించారు. కావాల్సిన మందులు తెచ్చుకోమని రాసిచ్చారు. పిల్లవాడికి సెలైన్ పెట్టమని కంపౌండర్‌కు చెప్పాడు.

ఇవన్ని అయ్యే సరికి ఆకాశ్ వాళ్ళ నాన్న కంగారుగా పరిగెత్తుకుంటూ ఆసుపత్రికి వచ్చాడు. “ఎలా ఉంది డాక్టర్” అని అడిగాడు.

“రెండు మూడు రోజులుంటే తగ్గిపోతుంది. హాస్పిటల్‌లో అడ్మిట్ అవండి. మేం మందులు వాడతాము” అని చెప్పాడు డాక్టర్.

హడావిడి అంత తగ్గాక డాక్టరు ఆకాశ్ వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిచి మాట్లాడాడు. “ఎండాకాలాలు పిల్లల్ని చాల జాగ్రత్తగా చూసుకోవాలి. ఎండల్లో ఆటలు అడనివ్వకూడదు. చూడటానికి వడదెబ్బ అనేది చిన్నదిగా అనిపిస్తుంది గానీ ప్రాణాలు పోయేంత ప్రమాదకరం. ఎండాకాలం సెలవులు ఉంటాయి కాబట్టి పిల్లల్ని పట్టుకోవడం కష్టమే. అయినప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కువగా ఇంట్లో ఉండి ఆడుకునే ఆటల్ని ప్రోత్సహించాలి. ఉదయం, సాయంకాలాలు ఆరుబయట ఆడుకున్నా పరవాలేదు. ముఖ్యంగా మే నెల ఎండలు చాలా ప్రమాదకరం. ఆ సమయంలో నీడ పట్టున ఆడుకునేలా వాళ్ళకు అవగాహన కలిగించాలి. ఎండాకాలంలో ఎక్కువగా మంచి నీళ్ళు తాగేలా చూడాలి. కొబ్బరి బొండాలు తెచ్చి తాగిస్తే ఇంకా మంచిది. ఎండకు శరీరం లోని నీటి శాతం తగ్గిపోయి ఇలా కళ్ళు తిరిగి పడిపోతారు. ఈ కాలంలో ఇంట్లో ORS పాకెట్లు ఉంచుకోవటం అవసరం. అవి లేకపోతే కొద్ది నీళ్ళలో ఉప్పు, పంచదార కలిపి ORS ద్రావణం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇలా ఎండాకాలం జాగ్రత్తలు తీసుకోవాలి” అంటూ డాక్టరు చెప్పడం ముగించాడు.

Exit mobile version